మెయిన్ ఫీచర్

కళాకౌముదాలను వెదజల్లే కుసుమం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుతువులోని తొలకరిని పలకరించే నీలి నయనాలతో..
మంచు ముసుగులోని వసంతాన్ని కదిలించే అభినయం ఆమెది.
అందం.. అభినయం.. ‘కళ’బోసిన కళాకౌస్త్భుం ఆమెది.
తన అందానికి అగ్రస్థాన ప్రశంసలు అందినా...
తన నాట్యానికి ‘శ్రీకళ’ బిరుదు సొంతమైనా...
చూపరులను మంత్రముగ్ధులను చేసే తన హావ భావాలకు సినిమా అవకాశాలు వచ్చినా..
అహాన్ని చెంతకు చేరనీకుండా తానింకా నిత్య విద్యార్థినే అంటూ ‘నేర్చుకున్నది గోరంత, నేర్చుకోవాల్సింది కొండంత’ అని చిరునవ్వుతో ఆమె ఇచ్చే సమాధానం ఆమె స్వచ్ఛమైన వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తుంది.
ఈ ఏడాది (2020) జనవరిలో కేరళలోని కణ్ణూర్‌లో సెగసస్ అనే సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో మిస్ క్వీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ని సొంతం చేసుకుంది సుగమ్య. ‘అందం, నాట్యం రెండూ సుగమ్యకు అమ్మానాన్నల నుంచి అందినవే.. వారి బోధన, వారి ప్రోత్సాహం లేకపోతే నాకు గుర్తింపే వుండేది కాదు. మనిషికి కలిగిన మనోగాయాలను మాన్పించేది కళ.. మనసులోని మనో వేదనను తీర్చేది కళ.. కళ కొలువై వున్న స్థానం ఆనంద నిలయం.. ఈ కళ నాకొక్కదానికే సొంతం కాదు. ఇది ప్రతి మూలకూ చేరాలి. ప్రతి హృదయాన్నీ తాకేలా చేయాలి.. ఇది నా తల్లిదండ్రుల కల. దానిని నెరవేర్చడమే నాలక్ష్యం’ అంటోంది సుగమ్యాశంకర్. వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా పెనుకొండలో ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యోగా గురు రవిశంకర్, గాయత్రి దంపతుల మొదటి సంతానం సునాగ్ శంకర్ కాగా రెండవ సంతానం సుగమ్య శంకర్. 22 సంవత్సరాల క్రితం జన్మించిన సుగమ్య పుట్టిన పది నిమిషాలకే బోర్లాపడి, ముందుకు పాకి తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేసిందట. రవిశంకర్ పలు టీవీ ఛానెళ్ళలో యోగా తరగతులు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ ద్వారా యోగా తరగతులు నిర్వహించడంతో పాటు ప్రస్తుత జీవనవిధానంలో అంతరించిపోతున్న నైతిక విలువలపై అవగాహన కార్యక్రమాలను చేపడుతుంటారు. అదేవిధంగా యునైటెడ్ నేషన్ ఎకోసాక్ విభాగానికి గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. సుగమ్య తల్లి గాయత్రి శంకర్ యోగాతో పాటు శాస్ర్తియ సంగీతం, భరతనాట్యంలలో ప్రావీణ్యం పొందారు. ఈమె పలు తెలుగు, కన్నడ సినిమాల్లో ప్రాధాన్యత వున్న పాత్రల్లో సహాయ నటిగా నటించారు. తమ కుమార్తెను మంచి కళాకారిణిగా తీర్చిదిద్దాలన్నదే ఈ దంపతుల సంకల్పం.. సుగమ్యకు ప్రాథమిక స్థాయిలో నాట్యంలో తర్ఫీదుకు, భరత నాట్యంలో పూర్తీ స్థాయి కళాకారిణిగా ఎదిగేందుకు ఎనలేని ప్రోత్సాహంగా మారింది. సుగమ్య గురించి రవిశంకర్ దంపతులు మాట్లాడుతూ.. ‘తమ బిడ్డలను ఎందులోనైనా ప్రావీణ్యులుగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రధానమైనది. పిల్లల్లో దాగి వున్న కళ, ఆసక్తిని ముందుగా గుర్తించగలిగేది తల్లిదండ్రులే.. అలా ఏ విభాగంలో అయినా పిల్లలకున్న ఆసక్తిని గుర్తించాక.. వాటి గొప్పదనాన్ని పిల్లలకు తెలియజేసి అందులో రాణించే విధంగా పిల్లల్ని ప్రోత్సహించినప్పుడు, వారు చాలా సులువుగా అభివృద్ధి చెందగలుగుతారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న చందంగా ముందుగా మా కుమార్తె ద్వారా మా సొంతూరైన పెనుకొండలో జరిగే అనేక కార్యక్రమాల్లో సుగమ్య నాట్య కళ ప్రదర్శనలను ఇస్తుంది. పెనుకొండలో ప్రస్తుతం.. పండుగల సమయాలు, దేవతామూర్తుల కళ్యాణోత్సవాల సమయంలో ఆలయాల్లో సుగమ్య భరతనాట్య ప్రదర్శన కచ్చితంగా వుంటుంది’ అని ఆ తల్లిదండ్రులు ఆనందంతో తెలియజేశారు.
విద్య, కళా ప్రస్థానం...
పెనుకొండలో ఇంటర్ వరకు చదివిన సుగమ్య, అనంతరం మద్రాస్ యూనివర్సిటీలో బీయస్సీ (సైకాలజీ)ని పూర్తీ చేశారు. వందేళ్ళ క్రితం రుక్మిణి అరుండేళ్ అనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కళాకారిణి (రాష్టప్రతి అవకాశం వచ్చినా తన జీవితం నాట్యానికే అంకితం అని సున్నితంగా రాష్టప్రతి పదవిని తిరస్కరించిన గొప్ప కళాకారిణి రుక్మిణి అరుండేళ్) చెన్నైలో స్థాపించిన కళాక్షేత్రంలో నాలుగేళ్ళ (2014-18)పాటు భరతనాట్యంలో శిక్షణ పొందింది సుగమ్య. శిక్షణ పూర్తయిన వెంటనే అదే ఏడాదిలో విజయనగరం జిల్లా పార్వతీపురంలోని శ్రీరజనీరాజా కళాక్షేత్రంలో ప్రపంచ స్థాయి నాట్యోత్సవాలు జరగగా అక్కడ నాట్య ప్రదర్శన ఇచ్చినందుకు సగమ్యకు ‘శ్రీకళ’ బిరుదుని ప్రదానం చేసి సత్కరించారు.
2019లో గుంటూరులోని శ్రీసాయి మంజీరా కూచిపూడి ఆర్ట్ అకాడమీ వారు అంతర్జాతీయ నృత్యదినోత్సవం రోజున నాట్యకళను ప్రదర్శించినందుకు ‘యువకళారత్న’ బిరుదుతో సత్కరించారు. అనంతపురంలోని త్యాగరాజ సంగీత సభ 75వ వార్షికోత్సవం రోజున, కేరళలోని సూర్య ఫెస్టివల్‌లో ప్రదర్శన, పెనుకొండలోని శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాల్లో ప్రదర్శనలు.. ఇలా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గొప్ప పండితులచే సత్కారాలు, పురస్కారాలను సొంతం చేసుకుంది సుగమ్య. 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో డాబర్ వాటికా వారు నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానంలో విజేతగా నిలిచి అనేక ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మహారాష్టల్రోని పండరీపురంలో వున్న యం.ఐ.టి. వారు నిర్వహిస్తున్న విశ్వశాంతి గురుకులంలో నాట్యాచార్యురాలిగా ఉద్యోగం చేస్తోంది. అదేవిధంగా మద్రాస్ యూనివర్సిటీలో భరతనాట్యవిద్యలో యం.ఏ. ఫైనల్ ఇయర్ విద్యని కొనసాగిస్తోంది. ఆమె నాట్య విద్యలో రాణిస్తూనే కేరళలోని త్రివేండ్రంలో తన గురువు శిబిశుదర్శన్‌తో కలిసి ‘ఆర్ట్ ఇన్‌సైనైట్’ అనే సంస్థను స్థాపించి కళాకారుల అభివృద్ధికి పాటు పడుతోంది. అంతేకాదు.. సుగమ్యకు తెలుగు, కన్నడ భాషల్లో సినిమా అవకాశాలు వచ్చాయ. చదువు పూర్తయన తరువాతనే సినిమాలపై దృష్టి పెట్టాలనే నిర్ణయాన్ని తీసుకొందట సుగమ్య.
మారుమూల గ్రామాల స్థాయి నుంచి పట్టణాల వరకు వున్న మధ్యతరగతి అమ్మాయలు, వారిలో దాగివున్న కళను గుర్తించి ప్రోత్సహించి మట్టిలో మాణిక్యాలకు గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేయాలనేది సుగమ్య కోరికట. శ్రీకృష్ణ దేవరాయలు.. అష్టదిగ్గజ కవులతో కళలకు ప్రాణం పోశాడు కదా.. ఆ రాజు పరిపాలన కొనసాగించిన పెనుకొండ ప్రాంతంలో.. ఆసక్తి వున్న ప్రతి చిన్నారికి నాట్య కళను పరిచయం చేసి ప్రోత్సహిస్తానంటోంది సుగమ్యశంకర్. ఆమె ఆశయం సిద్ధించాలని కోరుకుందాం... ఆశీర్వదిద్దాం...
ప్రతిభను గుర్తించాలి, ప్రోత్సహించాలి..
ప్రతి అమ్మాయిలో ఏదో ఒక ప్రతిభ వుంటుంది. దాన్ని తల్లిదండ్రులే గుర్తించి.. ప్రోత్సహిస్తే పిల్లల భవిష్యత్తు బంగారు మయమవుతుంది. ఎంతసేపూ అమ్మాయిలు సమాజంలో అలా తిరిగితే, ఇలాంటి పనులు చేస్తే ఎవరేమనుకుంటారోనన్న ఆలోచన నుంచి ముందుగా తల్లిదండ్రులు బయటికి రావాలి. సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించడం వల్ల ఎంతోమంది కళాకారిణులైన యువతులు, మహిళలు వంటింటి కుందేళ్ళుగా మారుతున్నారు. మహిళల్లో దాగివున్న కళను సక్రమమైన పద్ధతిలో బహిర్గతం చేయడం తప్పు కాదు. సంగీతం, నాట్యం ఎక్కడ వుంటాయో అక్కడ ఆనందం వుంటుంది. ఇందులో ప్రావీణ్యం పొందినవారు అన్ని రంగాల్లో సులువుగా రాణిస్తారు. ఎవరెన్ని విమర్శలు చేసినా నా కూతురు సుగమ్యలో వున్న ప్రతిభను గుర్తించి మంచి కళాకారిణిగా తీర్చిదిద్దాం. అదేవిధంగా ప్రతి ఇంట్లో ఓ సుగమ్య వుంటుంది. తల్లిదండ్రులు వారిని గుర్తించి ప్రోత్సహించాలి, బోధన చేయించాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రతి ఉన్నత పాఠశాలలో సంగీతం, నాట్యాలను ప్రవేశపెట్టి, అందుకు సంబంధించిన ఉపాధ్యాయులను నియమించి, వీటిని కూడా సబ్జెక్ట్‌లా బోధన చేయించాలి. దీనివల్ల పిల్లలకు వాటిపై అవగాహన కలుగుతుంది. ఫలితంగా ఆయా కళల దిశగా వారి దృష్టి మళ్లుతుంది. దాంతో పిల్లలు చెడు మార్గాల వైపు దృష్టి సారించరు. పాఠశాలల్లో పగలంతా నిరంతరంగా విద్యాబోధన జరుగుతుండటం వల్ల చిన్న పిల్లలకే కళ్ళు సరిగా కనిపించక కళ్ళద్దాలు రావడం, ఇతర మెదడు సంబంధిత వ్యాధులు రావడం, నీరసించిపోవడం మనం చూస్తూనే వుంటాం. అదే పాఠశాలల్లో పగలంతా విద్యాబోధన జరిగినా ఓ గంట పాటు సంగీతం, నాట్యం పాఠాల బోధనతో విద్యార్థులు అలసత్వానికి దూరమై ఉత్సాహంగా తయారవుతారు. పిల్లలను కేవలం చదువు, చదువు.. అని ఒత్తిడి పెంచి అనారోగ్యంతో కూడిన యాంత్రిక జీవనాన్ని అలవాటు చేయకుండా సంగీతం, నాట్యం, ఆసక్తి వున్న మరిన్నికళల్లో తర్ఫీదునిప్పించి ఆరోగ్యకర, ఆనందకరమైన జీవితం పిల్లలకు అందజేసే బాధ్యత తల్లిదండ్రులదే..

- నల్లమాడ బాబ్‌జాన్ 85000 83799