మెయిన్ ఫీచర్

వినోదానికీ వైరస్.. వైరస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కరోనా వైరస్ నిరోధక చర్యలు మొదలయ్యాయి. ప్రాథమిక పాఠశాలలకు మార్చి 31వరకూ సెలవులిచ్చేశారు. తాజాగా అన్ని థియేటర్లు మూసేయాలంటూ కేజ్రీ, కేసీఆర్ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయ. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలకు ప్రజలూ సహకరించాలంటూ ప్రచారం మోతెక్కిస్తున్నారు. -నిత్యం జనం గుమిగూడేది స్కూళ్లు, థియేటర్లు, మార్కెట్ ప్రాంతాలే కనుక.. ఆ కోణంలో వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
*
కరోనా దెబ్బకు చైనా అల్లాడుతున్నపుడు -భారత్‌లో బోల్డన్ని జోకులు పేలాయి. సోషల్ మీడియాలో మీమ్స్ కితకితలు పెట్టాయి. చైనాలో ప్రబలిన వైరస్‌ను చూసి ప్రపంచ దేశాలు వణుకుతుంటే, పక్క దేశంలోవున్న మనం కామెడీ చేసుకున్నాం. ఆ కామెడీయే -ఇప్పుడు ట్రాజెడీగా మారుతోంది. ప్రపంచంలోని అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతోన్న కరోనా కర్కసి -ఇప్పుడు భారత్‌నూ అల్లాడిస్తోంది. దేశంలో వేగంగా విస్తరిస్తోన్న కరోనా పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనన్న కంగారు మొదలైంది. అందుకే అంటారు -ఏదైనా మనదాకా వస్తేగానీ తెలీదని.
*
కరోనా ప్రభావం ఇంకెన్నాళ్లు ఉంటుందో తెలీక సినీ జనాలు కంగారు పడుతున్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే, సమ్మర్‌లో విడుదల చేయాలని షెడ్యూల్ చేసుకున్న సినిమాలు
వాయిదా పడే అవకాశం లేకపోలేదు. దీని కారణంగా పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాల నిర్మాతలు
భారీగా నష్టపోయే ప్రమాదముంది.
*
మిడ్ సమ్మర్ నుంచి తప్పించుకునేందుకు -శీతల ప్రాంతాలకు ఎగిరిపోదామనుకున్న సినీ పక్షుల ఆలోచనలకు కరోనా చెక్ పెడుతోంది. హాయిగా ఫారిన్‌లో సేద తీరాలనుకున్న హీరోలు, హీరోయిన్లు కరోనా దెబ్బకు ప్రణాళికలు పక్కన పెట్టేస్తున్నారట. ఉన్నచోటే ఉండాలని ఫిక్సైనట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ల కోసం ఫారిన్ లోకేషన్స్‌లో ఉన్నా చిత్రబృందాలు మూటాముల్లె సర్దుకుని వచ్చేస్తున్నాయి. కదలడానికి వీల్లేని వాళ్లు అక్కడే స్ట్రక్ అయినట్టూ తెలుస్తోంది.
*
కథనాలుగా వస్తోన్న సమాచారం ప్రకారం -దేశంలో అత్యధికంగా కేరళలో 17 కేసులు నమోదయ్యాయి. హరియాణాలో 14, యూపీలో, మహారాష్టల్రో చెరి 11 కేసులు నిర్థారించారు. కర్నాటకలో 4, రాజస్థాన్, లద్దాక్‌లో చెరి 3, కాశ్మీర్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణలో ఒక్కో కేసు నమోదైంది. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో మరో పాజిటివ్, ఐదు అనుమానిక కేసులు తేలడంతో -శనివారం సాయంత్రం క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
*
భీష్మ ఇచ్చిన హిట్టోత్సాహంతో పెళ్లికి రెడీ అయిన నితిన్ -కరోనా భయంతో ప్రణాళిక మార్చుకున్నాడట. ట్రెండ్‌ను ఫాలో అవుతూ దుబాయ్‌లో గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకున్నాడు నితిన్. వివిధ దేశాలు, ప్రాంతాల్లో కరోనా పడగ విప్పడంతో -హైదరాబాద్ దాటకూడదని నిర్ణయించుకున్నాడట. హైదరాబాద్‌లోనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ప్రపంచంలోని అన్ని రంగాలపైనా కరోనా కర్కసి పంజా విసుర్తోంది. చైనాలో పుట్టిన వైరస్ -120 దేశాలకు విస్తరిస్తే, భారత్‌లోనూ బలంగానే వేళ్లూనుతోంది. ‘కరోనా ఒక మహమ్మారి’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన రోజునే -భారత్‌లో తొలి మరణం చోటుచేసుకోవడం యాధృచ్చికమే కావచ్చు. మరుసటి రోజులోనే -హైదరాబాద్‌లో ఒక పాజిటివ్, రెండు అనుమానిత కేసులు నమోదవ్వడం దురదృష్టం అనుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీ సహా.. ముంబై, బెంగళూరులాంటి మెట్రో పట్టణాలు ‘బంద్’అవుతోన్న పరిస్థితి భయమేకావొచ్చు. చైనాలోనూ -ఒక్కరి మరణంతో మొదలైనట్టే.. భారత్‌లోనూ సంభవించిన తొలి మరణం ఎలాంటి పరిణామాలకు దారితీయనుందోనన్న ఆందోళనను తక్కువ చేసి చూడలేం.
అన్ని రంగాలపైనా పంజా విసురుతున్నట్టే -వినోద రంగంపైనా కరోనా ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. రోగులు, మరణాల మాటెలావున్నా -ఆర్థికంగా కుంగదీసి, ఆధారితుల బతుకులను అప్పుల బుగ్గిలోకి నెట్టేలానే కనిపిస్తోంది. కరోనా భయంతో ఇప్పటికే కేరళలో థియేటర్లు నెలాఖరు వరకూ మూతబడ్డాయి. ఢిల్లీలో ప్రాథమిక స్కూళ్లు, సినిమా థియేటర్లు, మాల్స్‌ని తాత్కాలికంగా మూసెయ్యాలంటూ ఆప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముంబై, బెంగళూరులాంటి మహానగరాల్లో థియేటర్లు స్వచ్ఛందంగానే షోలు తగ్గించేస్తున్నాయి. నమోదవుతోన్న కేసులను బట్టి చూస్తే -హైదరాబాద్ మెట్రో సిటీలోనూ కరోనా వ్యాప్తి వేగమవ్వడంతో ‘హై అలర్ట్’ ప్రకటించారు. శనివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమవుతోన్న కేబినెట్ -స్కూళ్లు, థియేటర్లు, మాల్స్‌ని బంద్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో థియేటర్లు నడుస్తున్నా -కరోనా భయంతో థియేటర్‌కొచ్చే ప్రేక్షకుడే కరవయ్యాడు.
కరోనా ఇంపాక్ట్ అంచనాలకు అందని
రీతిలో ఉండటంతో -రాబోయే పెద్ద సినిమాలన్నీ విడుదల తేదీలను వాయిదా వేసుకోడానికి రెడీ అవుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న పెద్ద చిత్రాలను గత్యంతరం లేని పరిస్థితుల్లో వాయిదా వేయడానికే మేకర్లు చూస్తున్నారు. మార్చి నెల పరీక్షల సీజన్ కనుక -మామూలుగానే సినిమాలుండవు. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ పెద్ద చిత్రాలు విడుదలకు ప్రణాళికలు సిద్ధమై ఉన్నాయి. ఈసారి వేసవి వినోదంపై కరోనా ఇంపాక్ట్ తీవ్రంగానే ఉంటుందని అర్థమవుతోంది. థియేటర్ల బంద్, ఆడియన్స్‌లో కరోనా భయంలాంటి పరిస్థితుల నేపథ్యంలో -సినిమాలకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఎవ్వరికీ అర్థంకాని విషయంగా మారింది. ఇప్పటికే బాలీవుడ్ మోస్డ్ అవైటెడ్ మూవీ సూర్యవంశీ విడుదల వాయిదా వేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జోడీగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన పోలీస్ స్టోరీని ముందు మార్చి 27న విడుదల చేయాలనుకున్నారు. కొన్ని కారణాలతో మార్చి 24కు ప్రీపోన్ చేశారు. అధికారికంగా ప్రకటించకున్నా -ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌తో జూన్ వరకూ పోస్ట్‌పోన్ చేసే అవకాశం ఉందంటున్నారు. కొత్త విడుదల తేదీని మేకర్లు ప్రకటించాల్సి ఉంది. అటు బాలీవుడ్, ఇటు సౌత్‌లో వేసవిని టార్గెట్ చేస్తూ థియేటర్లకు రావాల్సిన చిత్రాలు చాలానే ఉన్నాయి. వీటి విడుదల పరిస్థితిపై -మేకర్లు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కేసుల తీవ్రత, ప్రభుత్వ నిర్ణయాలులాంటి పరిణామాలను చూసి -విడుదల తేదీలపై నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. ఒకటి రెండూ కాదు, చిన్నా పెద్దా చాలా సినిమాలే ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఒక్క పెద్ద సినిమా విడుదల షెడ్యూల్ మారినా -దాని ప్రభావం మిగతా సినిమాలపై ఉంటుంది కనుక -వేసవి సినిమాల విడుదల విషయంలో సందిగ్ధత నెలకొన్నట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌నూ కరోనా ఎక్కువ టెన్షన్ పెడుతోంది. టాలీవుడ్‌కు వేసవి సీజన్ చాలా ముఖ్యం. మీడియం రేంజ్ హీరోలు సినిమాలు థియేటర్లకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు వాటి పరిస్థితి అగమ్యగోచరమైంది.
ఇక -వైరస్ భయంతో విదేశాల్లో షూటింగ్‌లు జరుపుకోవాల్సిన పలు సినిమాలు షెడ్యూల్స్‌ని మార్చుకుంటున్నాయి. సుకుమార్ -అల్లు అర్జున్ కాంబోలో రావాల్సిన హ్యాట్రిక్ సినిమా షూటింగ్‌ను వాయిదా వేసుకుంది. బ్యాకాంక్‌లో ప్లాన్ చేసిన షెడ్యూల్‌ను కరోనా కారణంగా వాయిదా వేసి -కేరళ ఫారెస్ట్‌లో షూట్ చేయాలనుకున్నారు. కేరళలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోవడంతో అదీ రద్దు చేసినట్టు కనిపిస్తోంది. ఏపీ ఫారెస్ట్ ఏరియాలో మరో షెడ్యూల్ మొదలు పెడదామన్న ఆలోచనలూ ఆపేసినట్టే కనిపిస్తోంది. ఫైనల్‌గా -కొద్దిరోజుల పాటు షూటింగ్ వాయిదా వేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇదొక్కటే కాదు, టాలీవుడ్‌లో చాలా సినిమాలే ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. లోకల్‌గానో, సమీప ప్రాంతాల్లో నిర్వహించాల్సిన సినిమా షెడ్యూల్లూ మందకొడిగా సాగుతున్నాయి. ఈ పరిణామాల ఫలితంగా సినిమాల విడుదల వెనక్కి వెళ్లడం ఖాయం. ఇవి చాలవన్నట్టు థియేటర్లు మూసేయమని ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలిస్తుందో అర్థంకాని పరిస్థితి. కొద్దిరోజుల క్రితం ఇటలీ నుంచి నెల్లూరుకు చేరిన ఓ విద్యార్థిలో కరోనా లక్షణాలు బయటపడటం తెలిసిందే. వైద్యబృందాలు ఆ కేసును పాజిటివ్‌గా తేల్చటంతో -నగరంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి చకచకా ముందు జాగ్రత్తలు ప్రకటించారు. సినిమా థియేటర్లు తాత్కాలికంగా మూసేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిణామంతో విడుదలైన సినిమాలు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ల, థియేటర్ యాజమాన్యాలు ఇరుకునపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ భయంతో ఆడియన్సూ థియేటర్లకు రావడం లేదు. కలెక్షన్లు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. వినోద పరిశ్రమతో కరోనా చూపిస్తోన్న ప్రభావంతో -ఇండస్ట్రీ మొత్తం నీరసించింది.
కరోనా ఎఫెక్ట్‌తో థియేటర్లలో 30 నుంచి 40 శాతం కలెక్షన్లు పడిపోయినట్టు చెబుతున్నారు. ఒక్క టాలీవుడ్‌లోనే కాదు, సౌత్ స్టేట్స్‌లోనే ఈ పరిస్థితి లేకపోలేదు. విడుదలైన సినిమాలకు కలెక్షన్లు లేవు. విడుదల కావాల్సినవి రాలేని పరిస్థితి. నిర్మాణ దశలో ఉన్నవి వాయిదా పడుతున్నాయి. మొత్తంగా -నిర్మాతలు, దర్శకులు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కరోనా బారిన పడ్డట్టే. చిన్న నిర్మాతల సినిమాలకు ఫైనాన్స్ సమస్యలు తప్పవు కనుక, సమయానికి సినిమా విడుదల కాక అప్పుల ఊబిలో కూరుకునే ప్రమాదం లేకపోలేదు. ఇక సినిమాలు విడుదల కాకుంటే థియేటర్లు నడవవు. లక్షల్లో ఆదాయం లేకున్నా, రోజూ సినిమా పడితే మెయింటెనెన్స్ అయినా వెళ్తుంది. ఇప్పుడు కరోనాతో సినిమా ఆగిపోతే, థియేటర్ యాజమాన్యానికి భారీ నష్టాలు తప్పవు. థియేటర్ ఆసరాగా జీవితాలు సాగే స్టాండ్లు, తినుబండారాలు అమ్ముకునే వాళ్లు అంతా రోడ్డున పడ్డట్టే.

-విజయ్‌ప్రసాద్