మెయిన్ ఫీచర్

ప్రశాంతచిత్తంతో సమ్యక్ జ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
యావత్ప్రపంచము మిథ్య అనే యథార్థ జ్ఞాన ప్రాప్తియే భవబంధ విముక్తికి హేతువు. ఏ సర్వ సంగ పరిత్యాగి అట్టి జ్ఞానము పొందునో అతడే జీవన్ముక్తుడుగా అంగీకరించబడును.
440 జీవేశోభయ సంసార రూప దుర్వాస నోజితా
సా సర్వదా భవేద్యస్య స జీవన్ముక్త ఉచ్యతే
ఎవనికి ద్వైత భావనతో ఏర్పడిన సంసార బంధము శాశ్వతము గా అంతమగునో అతడే జీవన్ముక్తుడౌను. అనగా జీవేశ్వరుల అభిన్నతను తెలిసికొని ఎవరు బ్రహ్మాత్మభావనతో అహర్నిశలు ఆత్మ దర్శనముకై చిత్తశుద్ధితో యత్నము చేయుదురో వారే జీవన్ముక్తులై జననమరణములను అధిగమింతురు. లేనిచో పునర్జన్మ తప్పదని స్పష్టవౌతున్నది.
441 న ప్రత్యగ్ బ్రహ్మణోర్బేదం కదాపి బ్రస్మసర్గయోః
ప్రజ్ఞయా యో విజానాతి స జీవన్ముక్త ఇష్యతే
‘‘జీవో బ్రహ్మైవ నాపరః’’ అనే తత్త్వజ్ఞానమును పొందిన ప్రాజ్ఖుడు, జీవపరమాత్మలయందు భిన్నత్వమును చూడదు. ప్రాజ్ఞుడు వివేక హీనుడే ద్వైత భావనతో స్వస్వరూపము వేరు, పరబ్రహ్మము వేరనే భావన పెంచుకొనును. అద్వితీయ పరబ్రహ్మమే జగత్స్వరూపములో ప్రకాశిస్తున్నదని తెలిసికొనే జ్ఞానము లేకపోవుటయే సంసార బంధము ఏర్పడుటకు మూలకారణము.
ప్రాజ్ఞుడు సమూలముగా అజ్ఞామును, జ్ఞానాగ్నిలో దగ్ధము చేసికొని ఖల్విదం బ్రహ్మ, బ్రహ్మాభిన్నమైనది ఈ జగత్తులో లేదు అనే సమ్యక్ జ్ఞానమును పొందును. పరిపూర్ణ జ్ఞానవంతుడే అంతర్ముఖుడై ఛిన్న సంశయుడౌను. అతడు ప్రయత్నపూర్వకముగా మనస్సును ఆత్మలో లయముగావించి ఆత్మదర్శి అగుట తథ్యము. అందువలన, ఆత్మదర్శి జీవన్ముక్తుడై భవబంధవిముక్తిని పొందునని పునుద్ఘాటింపబడుచున్నది.ఎవడు రాగద్వేషాది ద్వంద్వములకు అతీతుడో, ఎవనికి ఏ కోరిక ఆకాంక్ష లేదో అతడు నిత్యసన్న్యాసి, సునాయాసముగా వానికి భవబంధమునుండి విముక్తి లభించునని స్మృతి తార్కాణము ఇలా ఉన్నది.
జ్ఞేయ స్సనిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి
నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే
442. సాధుభిః పూజ్యమానే‚ స్మిన్ పీడ్యమానే‚ పి దుర్జనైః
సమభావో భవేద్యస్య స జీవన్ముక్త ఇష్యతే॥
ఈ శరీరము సద్బుద్ధిగల వారిచే సేవించబడుతున్ననూ దుర్జనులచే అది పీడింపబడుతున్ననూ, ఎవనికి ప్రియాప్రియము, హర్షశోకాది ద్వంద్వభావనలు పూర్తిగా అంతమై, సమబుద్ధి కలుగునో అతడే జీవన్ముక్తుడుగా అంగీరింపబడును.
బ్రహ్మాత్మభావన సర్వాత్మకతాభావమును పెంపొందించును. సమత్వదృష్టిగల ఆత్మవేత్త, స్వస్వరూపమును తప్ప మరి దేనిని ప్రపంచములో చూడజాలడు. ‘‘బ్రహ్మైవేద విశ్వమిదం వరిష్ఠమ్’’ (ఈ విశ్వములో బ్రహ్మముకంటె భిన్నమైన మరియొక వస్తువు లేదు- ము.ఉ.2-2-11). అందువలన, ఆత్మవేత్తకు ప్రపంచములో ఎటుచూసినా బ్రహ్మాభిన్నమైనదేదీ కన్పించదు.
443. యత్ర ప్రవిష్టా విషయాః పరేరితాః
నదీ ప్రవాహా ఇవ వారిరాశౌ
లినన్తి సన్మాత్రతయా న విక్రియామ్
ఉత్పాదయనే్త్యష యతి ర్విముక్తః॥
ప్రవహించే నదులు సముద్ర సంగమముకాగా, ఎట్లు వాటి నామరూపములను కోల్పోవునో, అట్లే అన్యప్రేరితమైన సమస్త విషయములు, బ్రహ్వస్వరూపుడైన జీవన్ముక్తునిచేరి, వానియందు ఎట్టి వికారములను ఉత్పన్నము చేయలేవు. బాహ్యదృష్టి శూన్యమై అంతర్ముఖుడైన ముని జ్ఞానాగ్నిలో సకల వికారములు దగ్ధమై నశించిపోవును. మనస్సు విచలితము కాని కారణముగా బ్రహ్మభూతుడైన యతి, భవబంధ విముక్తిని పొందుతున్నాడు.
444. విజ్ఞాతబ్రహ్మతత్త్వస్య యథాపూర్వం న సంసృతిః
అస్తి చేన్న స విజ్ఞాతబ్రహ్మభావో బహిర్ముఖః॥
బ్రహ్మతత్త్వమును పూర్తిగా ఆకళించికొనిన వ్యక్తికి, గతములో ఉన్నట్లు ఇకపైన సంసారబంధము ఉండదు. అట్లు కానిచో ఆతడు బ్రహ్మతత్త్వమును తెలిసికొనిన ఆత్మజ్ఞాని కాదనే చెప్పవలసి వచ్చును. శరీరపతానానంతరము ప్రాజ్ఞుడైన తత్త్వవేత్త భవబంధ విముక్తి పొందుట తథ్యము. బహిర్ముఖుడైన వానికే అపోహ, అశాంతి, మరల జన్మ వచ్చునేమో అనే భీతి వెంటాడును. భయభ్రాంతులకులోనై ఎవరు వ్యధ చెందుచున్నారో, ఎవరికి సంశయ నివృత్తికాలేదో, ఎవరు ద్వంద్వాతీతులు కాలేదో, సమచిత్తత్వము లేక అఖండానంద రసానుభూతిని పొందజాలక ఎవరు ప్రశాంత మనస్కులు కారో, అట్టి సాధకులకు సమ్యక్ జ్ఞానము కలుగలేదని స్పష్టవౌతున్నదని దీని తాత్పర్యము.
ఇంకా ఉంది