మెయిన్ ఫీచర్

పెద్దదైన చిన్నగీత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లఘు చిత్రం అంటే
చిన్న చూపున్న దశనుంచి -స్టార్ డైరెక్టర్లు సైతం ఒక్కోసారి పనితనాన్ని
చూపించడానికి షార్ట్ఫిల్మ్ అడ్డాకు వస్తున్నారంటే -వీటి గ్రోత్ అర్థం
చేసుకోవచ్చు. లఘు చిత్రం తీయడం
-ఇప్పుడొక ఫ్యాషన్. ఓ స్టయిల్.
ఓ కెరీర్ ఆపర్ట్యునిటీ. అంతకుమించి.. చెప్పలేని అనుభూతి.
**
న్యూజనరేషన్ డైరెక్టర్స్ మేర్లపాక గాంధి, రామ్‌భీమన, రాహుల్, శ్రీరామ్ ఆదిత్య, సంజనలాంటి
దర్శకులు ఇప్పుడు న్యూవేవ్ చిత్రాలతో సంచలనాలు సృష్టిస్తున్నారు.
వీరందరికీ తొలి వేదిక లఘు చిత్రాలే -అంటే వినేవారికి ఆశ్చర్యం కలగొచ్చు. నిజమే, వీళ్లంతా మొదట లఘు
చిత్రాలను రూపొందించినోళ్లే. షార్ట్ ఫిల్మ్‌తో షార్ప్‌నెస్ ప్రూవ్ చేసుకున్న తరువాతే -మెయిన్‌స్ట్రీమ్‌కి వచ్చారు. అంటే, డైరెక్టర్ కావాలనుకునే వాళ్లకు కొత్త పాత్ -షార్ట్ ఫిలిమ్సే.
గతంలో సినిమాకు ముందు జాతీయ వార్తలంటూ ఎప్పటిదో ఓ రీల్ చూపించేవారు. అది కేవలం నాలుగైదు నిమిషాల్లోనే పూర్తయ్యేది. సినిమా చూసే ప్రేక్షకుడికి దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలు అర్థమయ్యేవి. అలా లఘు చిత్రాల ఉపయోగం ఆనాటినుంచే మొదలైంది. చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం, సంక్షిప్తంగా దృశ్య మాథ్యమంలో చూపడం షార్ట్ఫిల్మ్ స్టామినా.
ఇప్పుడు అంతటా..
దృశ్యప్రధానంగా రూపొందించే చిత్రాన్ని చూడాలంటే ఖచ్చితంగా థియేటర్‌కు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. సాంకేతికత సాధించిన విప్లవంతో -అరచెయ్యే 60 అడుగుల క్వాలిటీ స్క్రీన్ అవుతుంది. అరచేతిలో ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌కు తోడు చేతి బ్యాగులో వి-గ్లాసెస్ ఉన్నాయంటే మల్టీప్లెక్స్‌లు మనముందు దిగదుడుపే. అదీ ఈ-కాలం. అందుకే -2 నుంచి 20 నిమిషాల నిడివిలో సినిమా చూపించేస్తే రొటీన్ బిజీలో దొరికే ఖాళీ టైంలో వాటిని టపటపా లాగించేస్తున్నారు. కావాల్సిందల్లా క్వాలిటీ ప్రొడక్షన్ + క్లారిటీగా విషయాన్ని చూపించేయడం. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, లాప్‌టాప్‌ల్లోనే కాదు.. రైల్వే స్టేషన్లలో ప్రదర్శించే రైళ్ళ రాకపోకల వార్తల మధ్య ప్రదర్శించే చిన్న చిన్న స్కిట్లు, రైల్వే భద్రతను చూపించే షార్ట్ సినిమాలను కూడా ప్రేక్షకుడు రిసీవ్ చేసుకుంటున్నాడు. యువత కాఫీ షాపుల్లో, కల్చరల్ సెంటర్లలో కూర్చుని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ, మధ్యమధ్యలో రెండు మూడు నిమిషాల నిడివితో వస్తున్న లఘు చిత్రాలను చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.
టైమ్ తగ్గింది..
గతంలో ఒక్క సినిమా మూడు గంటలపాటు ప్రదర్శించేవారు. పెద్ద సినిమా అయితే రెండు భాగాలుగా చిత్రీకరించి ప్రదర్శించిన చరిత్రా ఉంది. ఇప్పుడంత సమయాన్ని వెచ్చించి సినిమా చూసే తీరిక లేదు. ప్రేక్షకుడు సినిమా చూసే టైమ్ తగ్గిపోతోంది. ఫేస్‌బుక్కుల్లో, వాట్సాప్‌లలో రెండు నిమిషాల లఘు చిత్రాన్ని చూసీ ఆనందించేస్తున్నారు. దీంతో ఫీచర్ ఫిల్మ్స్ మెయిన్‌స్ట్రీమ్‌లో చిత్రీకరించే విధానానికి గట్టి పోటీ ఏర్పడింది. ప్రేక్షకుడు కనీసం రెండు గంటలపాటైనా కుర్చీలో కూర్చుని థియేటర్‌లో సినిమాను చూడగలగాలి. ఇలాంటి నేపథ్యంలోనే ఇటీవల వచ్చిన క్షణం, పెళ్లిచూపులు లాంటివి తక్కువ నిడివితోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అంటే, ఓ సినిమా హిట్ కావడానికి నిడివితో పనిలేదు. ఆ చిత్రంలో విషయం ప్రేక్షకుడికి కచ్చితంగా చేరే సూటిదనం కావాలి. అందుకే, బుల్లి దర్శకులు మెరుపులాంటి ఆలోచనతో లఘు చిత్రాలను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు.
ప్రయాణాల్లో..
సెల్‌ఫోన్‌లో నెట్ బ్యాలెన్స్ వేసుకొని యూ-ట్యూబ్‌లోకి అప్‌లోడ్ అవుతోన్న అనేక షార్ట్ఫిల్మ్స్ చూసేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీలాంటి ప్రభుత్వ కార్పొరేషన్ సంస్థలు సైతం బస్సుల్లో చిన్న టీవీ ఏర్పాటుచేసి లఘు చిత్రాలను ప్రదర్శిస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. రాత్రి మొత్తం ప్రయాణముంటే ఓ మెయిన్‌స్ట్రీమ్ సినిమాను కూడా ప్రదర్శించడం అక్కడక్కడా గమనించొచ్చు. విమానాల్లో కనీసం రెండు మూడు గంటల ప్రయాణంవుంటే అక్కడా లఘు చిత్రాలను మినిమమ్ ఐదు నుంచి పది వరకూ ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ ప్రేక్షకుడికి థియేటర్ ఆనందాన్ని తెచ్చిపెడుతున్నాయి.
పోటీ ఖచ్చితం..
లఘు చిత్రాలంటే చిన్నచూపున్న దర్శక నిర్మాతలు నిజాన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఇన్నాళ్లకు కనిపిస్తోంది. భవిష్యత్‌లో మెయిన్‌స్ట్రీమ్ చిత్రాలకు ఖచ్చితంగా షార్ట్ఫిలింస్ పోటీ ఇస్తాయనే విషయం ఇప్పుడు తెరలు తెరలుగా నిజమని అర్థమవుతోంది. బాగా గమనిస్తే, ఇప్పుడొస్తున్న దర్శక నిర్మాతలంతా లఘు చిత్రాలవైపు మొగ్గడం ఓ కారణం. 15-20 నిమిషాల్లో ఓ లైఫ్‌ను చూపించే ప్రయత్నం షార్ట్ఫిల్మ్‌లో చూడొచ్చు. రెండు గంటలపాటు కూర్చుని చూసే సినిమాకన్నా పది నిమిషాల్లో ముగించే లఘు చిత్రాలకు అభిమానులు పెరుగుతున్నారు.
కొత్త దర్శకులు
కేవలం లఘు చిత్రాలపైనే అంతర్జాతీయ స్థాయిలో కృషి చేసి పేరు తెచ్చుకున్న కొత్తతరం దర్శకులు ప్రస్తుతం అన్ని భాషల్లోనూ కన్పిస్తున్నారు. పంజాబ్‌లో షార్ట్ఫిల్మ్ మేకర్‌గా పేరున్న గుర్విందర్‌సింగ్ అంతర్జాతీయస్థాయిలో కీర్తి గడించాడు. ఆయన తీసిన లఘు చిత్రాలకు అనేక నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు దక్కాయి. దీనికితోడు మల్టీ నేషనల్ కంపెనీలు కూడా లఘు చిత్రాలను ప్రోత్సహిస్తున్నాయి. ఓ సమస్యను తీసుకుని సత్తావున్న దర్శకులను ఎంచుకుని చిత్రాలను తీసే ప్రయత్నం చేస్తున్నాయి. అనేక దేశాల్లో వున్న సంస్కృతి సంప్రదాయాల నేపథ్యాలలో కొత్త దర్శకులు చిత్రాలను రూపొందిస్తున్నారు. దీంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయిందన్న విషయం లఘు చిత్రాలతోనూ నిజవౌతుంది. భవిష్యత్ అంతా లఘు చిత్రాలమయంగా మారే సమయం ఎక్కువ దూరంలో లేదని సినీప్రియులు భావిస్తున్నారు.
మంచి మార్కెట్..
చిత్రం చిన్నదైనా, మంచి స్పార్క్‌వుంటే అది అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందుతోంది. చిత్ర నిర్మాతలు కూడా అంతర్జాతీయ స్థాయిలోనే రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఉన్నట్టుగా అమెచ్యూర్ ఫిలిం మేకర్స్ ఫేస్‌బుక్‌లో తమ చిత్రాలకు లైక్స్‌ను కోరుకోవడంలేదు.
యూ-ట్యూబ్ ప్రధానమైన వేదికగా మారడంతో బిగ్ ప్లాట్‌ఫాం ఏర్పడింది. తాము తీసిన లఘు చిత్రాన్ని అప్‌లోడ్ చేయడంతో సంపాదన కూడా సాధ్యమవుతోంది. అందరూ తమ ఫొటోలు, వీడియోలు చూసేవారికి ప్రదర్శిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించే షార్ట్ఫిలింస్‌తో మార్కెట్ అభివృద్ధి చెందుతోంది. దీంతో చాలామంది సినిమా ప్రియులు ఆ దిశగా అడుగులేస్తున్నారు.
24 క్రాఫ్ట్స్..
దృశ్య మాథ్యమంలో విషయం చెప్పాలంటే -అన్ని క్రాఫ్ట్స్‌ను వాడక తప్పని పరిస్థితి. లఘు చిత్రమే కదాని కొన్ని సాంకేతిక విలువలను వదిలేస్తే అది ప్రమాణాలకు ధీటుగా ఉండటం లేదు. దీంతో అన్నింటినీ వాడుకుంటేనే ప్రేక్షకుడికి ఆ సినిమా నచ్చుతోంది. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్, కార్టూన్స్‌లాంటి చిత్రాల్లో ఇవి అవసరం అవుతున్నాయి. మేకప్ కూడా కళాకారులకు అవసరం. మేకప్ లేకుండా చేద్దామని అనుకుంటే అది డి-గ్రేడ్ కిందకే వెళ్తుంది. 24 క్రాఫ్ట్స్‌ను ఉపయోగించుకొని మంచి కంటెంట్‌తో సరైన పాయింట్లతో చెప్పగలిగిన విధానం ఇప్పుడు సర్వత్రా ఆమోదయోగ్యమవుతోంది.
స్టార్‌డమ్?
ఇప్పుడు లఘు చిత్రాల్లో పెద్ద స్టార్లు కూడా నటించడానికి ముందుకొస్తున్నారు. అమితాబ్‌బచ్చన్, మోహన్‌లాల్ లాంటి మంచి మంచి నటులు కూడా క్రిస్ప్‌గా చెప్పే కథనాలకు ఆకర్షితులౌతున్నారు. అయితే పెద్ద స్టార్లు ఉన్నప్పుడు కథను మార్చాలా లేక కథకు తగ్గట్టు స్టార్ మారాలా అనే దానిపై చర్చ జరుగుతోంది. స్టార్‌కోసం కథను మారిస్తే, లఘు చిత్రానికి వున్న విలువే పోతుంది. అందుకే 10-15 నిమిషాల్లో సాగే కథలో స్టార్ నటుడిగా ఒదిగిపోవాల్సి వస్తుంది. ఆయనకు ఉండాల్సిన పంచ్ డైలాగులు, డ్యూయెట్లు ఇక్కడ మచ్చుకైనా కనపడవు. అమితాబ్‌బచ్చన్, ఇర్ఫాన్‌ఖాన్, మనోజ్‌బాజ్‌పాయ్, రాధికా ఆప్టే తదితరులు చేసిన షార్ట్ ఫిలింస్ చూస్తే ఇవన్నీ తెలుస్తాయి. ఇక్కడ కథకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. స్టార్లు నటించడంవల్ల షార్ట్ఫిలింస్ ఎక్కువమందికి తెలిసే అవకాశమూ వుంది. అలా షార్ట్ఫిలింస్ స్టార్ ఇమేజ్‌ను కూడా దెబ్బకొట్టేస్తున్నాయి.
భవిష్యత్తులో
మెయిన్‌స్ట్రీమ్ సినిమాల స్థానంలో షార్ట్ఫిలింస్ చేరే రోజు త్వరలో రానుందని దర్శక నిర్మాతలు ఒప్పుకుంటున్న సత్యం. తోలుబొమ్మలాటలనుండి నాటకాలు, అక్కడినుండి సినిమాలు, అక్కడినుండి టీవీలు, సెల్‌ఫోన్స్, వాటినుండే షార్ట్ఫిలింస్ ఒక్కొక్కటిగా తమ రూపాలను మార్చుకుంటూ వస్తోంది. ఏదేమైనా ప్రేక్షకుడు ప్రస్తుతం వున్న తీరికలేని పనుల్లో రెండు మూడు నిమిషాలు ఖాళీ దొరికినా ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ఖచ్చితమైన సమాధానం లఘుచిత్రం. ఆ చిత్రమే ఇప్పుడు విశ్వవ్యాప్తంగా వామనుడిలాగా ఎదిగిపోతోందనేది నిజం. కథలు ఎప్పటికైనా ఎవర్‌గ్రీనే! చిన్నప్పటి నానమ్మ, తాతయ్యల జానపదలనుండి ఇప్పుడు అంతరిక్ష రహస్యాలను ఛేదించే కథనాలదాకా అందరికీ అందమైన కథే కావాలి! కానీ మాథ్యమాలు మాత్రమే మారాయి. రైలు కోసం ఎదురుచూస్తూ ప్లాట్‌ఫారమ్‌పై, ప్రియురాలికోసం ఎదురుచూస్తూ పార్క్‌లో, రిజర్వేషన్ క్యూలలో నిలబడి సెల్‌ఫోన్లో, క్యాంప్‌లలో ఎక్కడైనా సరే ఓ నాలుగైదు నిమిషాలు తీరిక దొరికితే రెండు మూడు షార్ట్ఫిలింస్ చూసేస్తున్నారు. ఇంతకన్నా షార్ట్ఫిలింస్‌కు దొరుకుతున్న ఆదరణ ఎంతైనా చెప్పొచ్చు?!
**

-రాజశేఖర్