మెయిన్ ఫీచర్

చెరిగిపోని జ్ఞాపకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాట రాజకీయాల్లో అసలు సిసలు
నాయకిగా మన్ననలు అందుకున్న అలనాటి అందాల తార జయలలిత. రాజకీయాల్లోకి
రాకముందు వెండితెరపై నాయకిగా
ఓ వెలుగు వెలిగింది. విద్య, సంగీత, నృత్య, సాహిత్య, రాజకీయ రంగాల్లో
తనదైన ముద్ర వేసిన ఆమె
ఆదర్శనాయిక అనిపించుకుంది.
**
కొన్ని పరిచయాలు -ఎప్పటికీ పరిచయాల్లాగే ఉంటాయి. కొన్ని పరిచయాలు స్నేహంగా పరిమళించి -కొంతకాలం మనతో ప్రయాణిస్తాయి. కొన్ని పరిచయాలో.. ఇంకొన్ని స్నేహాలో మాత్రం -చెరిగిపోని జ్ఞాపకంగా హృదయాంతరాళాలలో ఉండిపోతాయి. అలాంటి జ్ఞాపకమే -పురచ్చితలైవి జయలలిత అంటున్నారు సినీ ప్రయాణంలో ఆమెకు దగ్గరగా మసిలిన తోటి నటీమణులు. ‘మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని అందరూ అంటూంటే ఆసక్తిగా కలిశాను. జయను చూసిన తరువాత టాలెంట్‌కు భౌతికరూపం ఇంత అందంగా ఉంటుందా అనిపించింది’ అంటూ తన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు నటి కాంచన. ‘మా ఇంట్లో పెరిగిన పిల్ల కనుక జయలలిత అని ఏకవచనంతో పిలిచే నేను, ఆమె ఉన్నతస్థాయికి ఎదిగిన తరువాత జయలలితాజీ అని పిలిచేదాన్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు షావుకారు జానకి. ‘విలక్షణమైన వ్యక్తిత్వానికి ఆమె నిలువుటద్దం’ అంటూ సీనియర్ నటి వాణిశ్రీ జ్ఞాపకం చేసుకుంటే, ‘అమ్మగా ఆమె స్థానం ఏమిటో, వెన్నంటి నడిచిన జనాన్ని చూసి చెప్పొచ్చు’ అంటూ కృష్ణకుమారి గుర్తు చేసుకున్నారు.
**
అమ్మంటే అమ్మే
-కాంచన
అమ్మను -మనసుతో చూడాలేగానీ మాటల్లో చెప్పలేం. చిన్నా పెద్దా తేడాలేకుండా ఎవరికైనా ఆమె అమ్మ! అంతే. కాకపోతే నివాళిగా కొన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటా.
**
కానె్వంట్ నుంచీ -జయలలిత, నేనూ ఒకే స్కూల్. నేను భరతనాట్యం నేర్చుకుంటూ చిత్తూరు నాగయ్యగారితో పరిచయం కలిగిన దగ్గర్నుంచీ ఆమెను చూస్తున్నా. అప్పుడు జయతోపాటు అమ్మ సంధ్య, తండ్రి, పిన్నమ్మ అంబుజమ్మ ఉండేవారు. జమున, సావిత్రిలాంటి పెద్ద తారల పిలుపుతో పేరంటాళ్లు, నోములు, వ్రతాలు, కుటుంబ వేడుకలకు వెళ్లినపుడు జయను చూసేదాన్ని. తర్వాత నేను ఎయిర్ హోస్టెస్‌గా వెళ్లడం, మళ్లీ పరిశ్రమకు రావడం జరిగింది. నా తొలి సినిమా సమయానికే, టాలెంట్‌వున్న ఆర్టిస్ట్‌గా జయ పేరు వినిపించేది. ఎవరా? అనుకుంటున్న తరుణంలో నాకు తెలిసిన జయ కలిసింది. ఆశ్చర్యపోయాను. జెమినీవారి ఓ సినిమాలో నేను కుటుంబంలో పెద్ద కూతురు, తనేమో ముద్దుల కూతురు. తరువాత అనేకసార్లు షూటింగ్‌ల కోసం హైదరాబాద్, చెన్నయ్‌కి విమానాల్లో తిరిగేవాళ్లం. సహజంగా, స్వతంత్రంగా మాట్లాడుకున్న సందర్భాలు ఎక్కువ. ఏ సందర్భంలోనైనా జయ ఇంటికెళ్తే -ఆదరంగా ఆహ్వానించేది. వాళ్ల గృహప్రవేశానికి నేనో స్పెషల్ గెస్ట్‌గా వెళ్లా. స్పెషల్‌గా చేయించి వడ్డించింది. తను చేసిన క్రియేటివ్ వర్క్స్ చూపించింది. భేషజాలు లేనివాళ్లతో మాట్లాడటం జయకు చాలా ఇష్టం. జయ ఉన్నతమైన స్థానాన్ని అందుకోవడానికి ప్రధాన కారణం -ఆమె తల్లి సంధ్య పెంపకమే. ఎన్ని కష్టాలు పడినా కూతురికి కష్టం తెలియకుండా పెంచారామె. సినిమాలను కెరీర్‌గా మలచుకున్న కొద్దిరోజుల్లోనే -పద్మిని, వైజయంతిమాల, బి సరోజాదేవిలాంటి పెద్ద స్టార్‌లను ఢీకొన్న టాలెంట్ జయది. ‘దేవుడు చేసిన మనుషులు’ షూటింగ్ టైంలో చెన్నైలో విద్యుత్ సమస్య తలెత్తింది. దాంతో యూనిట్‌ను బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. అక్కడ ఎన్టీఆర్, జయలలిత, కృష్ణ, విజయనిర్మలతో దాదాపు మూడు నెలలున్నాం. అప్పుడు మరింత దగ్గరయ్యాం. ఆమె పిచ్చి ప్రేమ నాకు అర్థమయ్యేది కాదు. ఆమెకు నచ్చితే అంత దగ్గరకు తీసుకుంటుంది. తరువాత ఆమెకు రాజకీయాలపై దృష్టిమళ్లింది. నన్ను ఆహ్వానించినా వస్తాననలేకపోయాను. నచ్చిన రంగంలో ఆమె ఏస్థాయికి చేరారో అందరికీ తెలిసిందే. చివరిరోజుల్లో శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొని ఉండచ్చేమోగానీ, ఆమె ప్రయాణంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యలు లేవు. ఒకవేళ ఎదురైనా అధిగమించి ముందుకుపోగల డైనమిక్ లేడీ. కళ్లముందు పెరిగిన మామూలు నేస్తం -ఓ రాష్ట్రానికే అమ్మయ్యింది. అమ్మ గురించి మాటల్లో చెప్పలేం. ఆమె భౌతిక కాయం వెనుక -బోరున విలపిస్తూ నడిచిన లక్షలాది పిల్లల్ని చూసి అర్థం చేసుకోవాలంతే. ఆమె తల్లి సంధ్య తమిళ ప్రజలకు ‘అమ్మా’ అని ఆప్యాయంగా పిలుచుకునే ఓ అమ్మనిచ్చారు. జయలలిత -నభూతో నభవిష్యతి. అంతే!

జయలలితాజీ అనేదాన్ని
-షావుకారు జానకి
ఆవిడ గురించి తెలియని వాళ్లెవరండి? జయలలిత ఐదేళ్ల బిడ్డగా ఉన్నప్పటినుంచీ తెలుసు. మా రెండు కుటుంబాలు మంచి స్నేహంగా ఉండేవి. ఆమె మా పెద్దమ్మాయికన్నా ఏడాది సీనియర్. వాళ్లమ్మ సంధ్య, నేను కన్నడం, తెలుగు, తమిళ చిత్రాల్లో కలిసి నటించాం. ఆ చనువుతోనే మా పిల్లలతో కలిసి ఆడుకోటానికి జయలలితను మా ఇంట్లో వదిలేసేది సంధ్య. అందానికి అందం, తెలివికి తెలివి. స్కూల్లో, స్పోర్ట్స్‌లో జయ నెంబర్ వన్. మా పెద్దమ్మాయి, జయలలిత ఒకే కానె్వంట్‌లో చదివారు. నేను నటించడానికి వచ్చినప్పుడు నా చేతిలో బిడ్డ ఉంది. ఆమెకంటే ఏడాది పెద్దదైన జయలలిత, తరువాత సినిమాల్లోకి వచ్చాక ఎంజిఆర్‌కు ఇద్దరం హీరోయిన్లుగా చేశాం. షూటింగ్ టైంలో ఆమె బ్రేవ్ అండ్ బ్రిలియంట్‌నెస్ చూసి విస్తుపోయేదాన్ని. నా పిల్లలతోపాటు పెరిగింది ఆ అమ్మాయేనా అనిపించేది. మేమిద్దరం షూటింగ్‌ల్లో పాల్గొనేటప్పుడు స్క్రిప్ట్‌పరమైన తేడాలొచ్చినా, తర్వాత ఫ్రెండ్లీగానే ఉండేవాళ్లం. 2011లో సీఎం అయినప్పుడు ఆమె ఆహ్వానం మేరకు ఇంటికెళ్లి -ఆమెను చాలా గర్వంగా చూసుకున్నా. కళ్లముందు పెరిగిన పిల్ల ఒక రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు అవుతుందని ఊహించలేదు. చిత్రరంగం గర్వించేలా, మరోవైపు రాజకీయాల్లో తనదైన ముద్రవేసేలా జయలలిత ఎదిగింది. మనకున్న ఒక ఇంటిలిజెంట్, మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్టిస్టుగానే కాకుండా రాజకీయాల్లో కూడా ఒక వెలుగు వెలిగిన జయలలిత ఇక లేదన్న ఆలోచన కష్టంగానే ఉంది. అవాంతరాలకు భయపడకుండా, పదవి పోయినపుడు కుంగిపోకుండా, అవమానాలకు నలిగిపోకుండా... జైలుకెళ్లినా ఫీనిక్స్‌లా పైకిలేచిన ఉత్తుంగ కెరటం ఆమె. విమర్శకులకు పాఠాలు చెప్పింది. చరిత్ర మర్చిపోలేని స్థానానికి ఎదిగింది. ఎప్పటికీ మరువలేని అమ్మగా అందరి హృదయాల్లో నిలిచింది. జయలలిత మరణ వార్త విన్నాక ఎవరికి సంతాపం ప్రకటించాలి? అన్న సంశయం తలెత్తింది నాకు. ఎవరి హృదయాల్లో ‘అమ్మ’గా నిలబడిందో ఆ రాష్ట్ర ప్రజలకే సంతాపం తెలిపాను. ఆమె ఆదరవు అందుకున్న బీదా బిక్కికే సానుభూతి ప్రకటించా. ఎన్ని విజయాలు అందుకున్నవారైనా -ఏదోకరోజు మృత్యువు చేతిలో ఓడాల్సిందే. కాని -నోబుల్‌లేడీ జయలలిత ఎప్పటికీ విజేతే. కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేదే. సీఎం కాకముందు జయలలిత అనే దాన్ని. సీఎం అయ్యాక జయలలితాజీ అని సంబోధించేదాన్ని. ఆమె గుర్తుకొచ్చినపుడల్లా -నా పిలుపే నాకు వినిపిస్తోంది.

బహుభాషల మిత భాషి
-వాణిశ్రీ
జయలలిత గొప్ప నటి అనేకంటే -నాయకురాలు అనడమే సబబు. రాజకీయాల్లోకి రావడానికి ఆమెకు సినిమా ఒక ద్వారమంతే. అందానికి మించిన ఇంటిలెక్చ్యువల్ ఆమె. అన్ని తెలివి తేటలు సినిమాకు అక్కర్లేదనిపిస్తుంది జయను చూస్తే. అందుకే నటికంటే -నాయకురాలిగానే జయ తన స్టామినా చూపించారు. ఎన్నో భాషలు తెలిసిన ఆమె మితభాషి. వెవ్‌లెంగ్త్ కలిస్తేనే మాట్లాడేవారు. నాకు తెలిసి లీజర్ టైం అన్నది ఆమె డిక్షనరీలోనే లేదేమో. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకంతో కనిపించేంది. అలా చిన్న వయసులోనే వేల పుస్తకాలు చదివిన జ్ఞానం ఆమెది. రాజకుటుంబాల్లోని పిల్లలకు మ్యానర్స్ శిక్షణ ఇచ్చినంత కచ్చితంగా ఆమె వ్యవహార శైలి ఉండేది. ఓసారి ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్నాం. దాదాపు ఏడెనిమిది మంది ఉన్నాం. అందులో అక్కినేని, ఆదుర్తిలతోపాటు నేను, జయలలిత కూడా. విమానం ఆరుగంటలు లేట్. అందరం కబుర్లలో పడినా -ఓ పక్కకు బొమ్మలా కూర్చున్న జయలలిత మాత్రం కనీసం కదల్లేదు. రెండు గంటలు అలానే కూర్చుంటే మనకు ఆవులింతలు వస్తాయి. ఒళ్లయినా విరుచుకుంటాం. కానీ ఆమెలో అలాంటిదేమీ చూడలేదు. ఈమెలా కూర్చోగలనా? వౌనంగా ఉండగలనా? అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. ఆమె ఏదైనా తినేటపుడో, మంచినీళ్లు తాగేటపుడో బాడీ లాంగ్వేజ్ కూడా వైవిధ్యంగా ఉండేది. షూటింగుల్లో సైతం షాట్ రెడీ అనేంత వరకూ బొమ్మలాగే కూర్చునేది. ఏ అవలక్షణాలు లేని విలక్షణ వ్యక్తిత్వం ఆమెది.
ఎంబిబిఎస్‌లో ఏడు మెడల్స్ సాధించిన నా కూతురు అనుపమ ఫొటోను దినతంతి పత్రికలో వేశారు. అది చదివి మా కుటుంబాన్ని ఆమె ప్యాలెస్‌కు ఆహ్వానించారు. అక్కడ ఆమె హోదా చూసి స్థాణువులా ఉండిపోయాను. ఏంటి వాణిశ్రీ అలా నిలబడే ఉన్నారు? మీవారిని పరిచయం చేయరా? అని ఆప్యాయంగా పలకరించారు. ఏడు మెడల్స్ తీసుకున్న మీ పాపను చూడాలనిపించి పిలిచాను. ఈ పాపేనా? అంటూ ప్రశంసించారు. మన పిల్లలకు ఇన్ని మెడల్స్ వచ్చాయంటే మనకూ ఆనందం కదా అంటూ మెచ్చుకున్నారు. సినీ పరిశ్రమలో ఉన్నవారి పిల్లలు ఇంత బాగా చదువుతున్నారా? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశావంటూ కితాబిచ్చారు. సాటి నటీమణిగా అలా ఎంకరేజ్ చేయడం ఆనందాన్నిచ్చింది. తనతో ఎన్నిసార్లు కలిసి పనిచేసినా డీప్ ఫ్రెండ్‌షిప్ మాత్రం లేదు. ఎదురుపడితే ‘షూటింగ్ ఎక్కడ? నిన్న ఎక్కడ చేశారు? ఈరోజు ఇక్కడే ఉంటారా? అయితే కలిసే పనిచేస్తామన్నమాట. సో నైస్’ అంటూ ముక్తసరిగా మాట్లాడేవారు. దసరాబుల్లోడు ప్రారంభోత్సవ సమయానికి జయలలిత అమ్మగారు చనిపోయారు. బయటి సినిమాలు చేయడానికి వీల్లేదని ఎంజిఆర్ చెప్పడంతో, ఆ సినిమాలో చేయాల్సిన జయలలిత పాత్ర నేను చేశా. వైవిధ్యమైన తమిళ రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు నెగ్గుకు రావడంలోనే ఆమె ధీరత్వం కనిపిస్తుంది. ఇంతమంది తమిళ ప్రజలకు ‘అమ్మ’గా మారిన నోబుల్ లేడీ -జయలలిత.

నా చిన్నప్పటి జయ..
-కృష్ణకుమారి
శ్రీశైలమహత్మ్యం చిత్రంలో జయలలితది నా చిన్నప్పటి పాత్ర. సినిమా డబ్బింగ్ కూడా నా వాయిస్‌తోనే చేశారు. భార్యాభర్తలు, తిక్కశంకరయ్య, చిక్కడు దొరకడు చిత్రాల్లో ఇద్దరం కలిసి నటించాం. అపోలో హాస్పిటల్ ఎదురుగా మా ఇంటి గృహప్రవేశం జరిగింది. అప్పుడు జయలలిత 15 ఏళ్ళ అమ్మాయి. వాళ్ల అమ్మగారి ప్రోత్సాహంతో నృత్యప్రదర్శన ఏర్పాటు చేశాం. సినిమా వాళ్ళంతా వస్తారని, ఆమె ప్రదర్శన చూస్తారని ఆమె ఆశ. 1961లో అనుకుంటా, తిక్క శంకరయ్య చిత్రంలో సూర్యకాంతం కూతురిగా నటించింది. నేను ఆమె అక్క పాత్ర చేశాను. నాకు పెళ్లై బెంగుళూరు వచ్చేశాక ఆమెతో కొంచెం టచ్ తగ్గింది. సినిమాల్లో నటించేటప్పుడు మాత్రం చాలా స్వీట్‌గా కన్పించేది. చాలా నిశితంగా ఆలోచించేది. తాను తీసుకున్న నిర్ణయానికి ముందు వెనుకలు బేరీజు వేసి ఏ పనైనా ఎవరూ వంకపెట్టకుండా చేసేది. పరిశ్రమకు వందేళ్లు నిండిన సందర్భంలో ఆమెనుంచి సత్కారం అందుకున్నా.
జయలలిత ఇంటిలిజెంట్ బ్యూటీ. ఆమె సాధించాల్సిన కార్యాలు ఎన్నోవున్నా, అనూహ్యంగా వెళ్లిపోవడమే బాధాకరం. జయలలిత ఆస్తిని చాలామంది చాలారకాలుగా లెక్కలుకడుతున్నారు. నా వరకూ అయితే -అంతిమయాత్రలో ఆమె వెంట నడిచిన వాళ్లంతా ఆమె ఆస్తే. జనసందోహం బాధను చూస్తే ‘అమ్మ’గా ఆమె స్థానం అర్థమవుతుంది. జయలలిత గ్రేట్ -అనడం తప్ప ఆమె గురించి ఇంకేం చెప్పగలం.

-సరయు శేఖర్