మెయన్ ఫీచర్

కాంగ్రెస్ స్వీయ పరాజయ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలలో ఓడిన పార్టీలు తర్వాతి ఎన్నికల కోసం విజయ వ్యూహాలు రచిస్తుంటాయి. కాని అది సాధారణంగా కనిపించే స్థితి. తెలంగాణాలో అసాధారణ పరిస్థితి ఉంది. అక్కడ కాంగ్రెస్ స్వీయపరాజయ వ్యూహాన్ని రచించుకుంటున్నది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఆరంభమైన తర్వాత రెండవ రోజున (డిసెంబర్ 17) ఆ పార్టీ సభ్యుల వ్యవహరణ తీరును గమనించిన మీదట ఇటువంటి అభిప్రాయానికి రాక తప్పటం లేదు. సమావేశాలు ఇంకా పది రోజులు సాగనున్నందున ఆ తీరులో మార్పు ఏదైనా ఉండగలదేమో చూడవలసి ఉంది. మారితే అది వారికే ఉపయోగకరమవుతుంది. లేని పక్షంలో తమకు ఏది మేలో దానిని వారే గుర్తించటం లేదని భావించవలసి ఉంటుంది.
ఇప్పటికి జరిగిందేమిటో ఒకసారి సమీక్షించి చూద్దాము. 17వ తేదీ శనివారంనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ నుంచి ఆరోజువరకు సస్పెండ్ అయారు. ఆ పని అసాధారణ వేగంతో జరిగింది. అంతకుముందు ఏమైంది? పది గంటలకు ప్రశ్నోత్తరాల సమయం మొదలై స్పీకర్ మధుసూదనాచారి మొదటి ప్రశ్నను ప్రస్తావించటమే తడవు కాంగ్రెస్ సభ్యులు తాము నోటీసు ఇచ్చిన వాయిదా తీర్మానం ఏమైందని అడిగారు. ప్రశ్నోత్తరాల వ్యవధి ముగిసిన తర్వాత ఇతర విషయాలలోకి వెళదామని స్పీకర్ వారికి నచ్చజెప్పజూశారు. సభ్యులు నోటీసు ఇచ్చిన పార్టీ ఫిరాయింపుల అంశం తన పరిశీలనలో ఉందని, ఏది ఏమైనా ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాతగాని వాయిదా తీర్మానం ప్రస్తావన రాదని చెప్పారు. అంతకుముందు రోజునే జరిగిన సభా కార్యక్రమాల సలహా కమిటీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశంలో, ప్రశ్నోత్తరాల వ్యవధిలో ప్రశ్నలనే చేపట్టాలి తప్ప ఇతర అంశాలను ప్రస్తావించరాదనే నిర్ణయం జరగటాన్ని వారికి గుర్తు చేశారు. ఆ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ప్రతినిధి కూడా పాల్గొని ఈ పద్ధతికి అంగీకరించిన విషయాన్ని కూడా గుర్తుచేశారు.
సభా సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను ఛానళ్లలో గమనిస్తున్న వారికి స్పీకర్ చెప్పిన వివరణ చాలా సహేతుకంగా తోచింది. అటువంటి స్థితిలో కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నోత్తరాల సమయం ముగిసేవరకు ఓపిక పట్టలేకపోవటం ఎందుకన్నది బోధపడలేదు. చివరకు సభ్యులు వెల్‌లోకి రావటం, సస్పెన్షన్ వేగంగా జరిగిపోయాయి.
ఇందులో గమనించదగ్గ విషయాలు కొన్నున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర అంశాలు ప్రస్తావించరాదన్న ప్రతిపాదనకు బిఎసి సమావేశంలో స్వయంగా అంగీకరించిన కాంగ్రెస్ సభ్యులు అందుకు ఎందువల్ల కట్టుబడలేదు? పార్టీ ఫిరాయింపులపై తమ వాయిదా తీర్మానాన్ని ఆమోదించేదీ లేనిదీ స్పీకర్ అప్పటికింకా ఏమీ చెప్పనపుడు, నిబంధనల ప్రకారం అటువంటి నిర్ణయాన్ని ఆయన ప్రశ్నోత్తరాలు ముగిసాక వెనుక ప్రకటించనున్నపుడు, కేవలం ఆ గంటన్నరసేపు (11.30వరకు) ఎందుకు ఓపిక పట్టలేకపోయారు? అసాధారణ పరిస్థితులు ఏర్పడినపుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దుపరచి నోటీసులోని అంశంపై చర్చ చేపట్టటం ఒకోసారి జరుగుతుంటుంది. మరి పార్టీ ఫిరాయింపుల అంశం అటువంటి అసాధారణమైన, అత్యవసరమైన పరిణామమా? అది ఎప్పటినుంచో నలుగుతున్న రాజకీయ అంశం. కోర్టులకు వెళ్లింది. న్యాయమూర్తులు స్పీకర్‌కు కొన్ని నిర్దేశాలు చేసారు. ఆ ప్రకారం వ్యవహరించేందుకు స్పీకర్ తన చర్యలు తాను తీసుకుంటున్నారు. అటువంటి స్థితిలో అది ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదావేసి మరీ చేపట్టవలసిన అత్యవసర, అసాధారణ విషయమవుతుందా? ఏది ఏమైనా అదట్లాకాదని భావించిన స్పీకర్, ప్రశ్నోత్తరాలు ముగిసేవరకు వేచి ఉండాలని, అపుడు ఈ విషయంలోకి వెళ్లవచ్చునని పలుమార్లు సభ్యులను కోరారు.
ఆ తర్వాత జరిగిందేమిటో ఛానళ్లలో అందరూ చూసిందే. దానినిబట్టి సాధారణ పౌరునికి ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ సభ్యుల తీరు సహేతుకమైనదని తోస్తుందా? లేక స్పీకర్ ఇచ్చిన వివరణలా? సస్పెన్షన్ జరిగి సభ్యులు సభనుంచి నిష్క్రమించిన వెనుక కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు కె.జానారెడ్డి ఆవేదనగా కొన్ని మాటలన్నారు. ఆయన భావనలను అర్ధంచేసుకోవచ్చు. పార్టీ పక్ష నాయకునిగా ఆయన సభ్యుల పక్షాన తన పాత్రను నిర్వహించేందుకు ప్రయత్నించటాన్ని కూడా అర్ధం చేసుకోవచ్చు. కాని అందులో మనం పైన చెప్పుకున్న ప్రశ్నలకు సమాధానాలు మాత్రం కన్పించవు. సభ్యులకు సభా నిబంధనలు తెలిసినా, బిఎసిలో జరిగిన నిర్ణయాలు ఎరుకైనా, సభలో స్పీకర్ ఇస్తున్న వివరణలు వినిపించినా, ఏ విధంగా వ్యవహరిస్తారన్నది అంతిమంగా వారి నిర్ణయం. వారికిగల సభా హక్కులనుబట్టి దానిని మనం బయటినుంచి సవాలు చేయలేము. కాని అంతమాత్రాన సాధారణ పౌరుల సందేహాలు ఆగిపోవు. చివరకు ఆ సభను ఎన్నుకుని దానికి సృష్టికర్తలైన పౌరుల సందేహాలకు కూడా వ్యక్తీకరణ హక్కులుండాలి. సందేహాలను ఎవరో ఒకరు తీర్చాలి. ఆ పని చేసేది ఎవరు? చేయవలసిందెవరు? అత్యుత్తమమైన పద్ధతి ఏమంటే, ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వ్యవహరించి సస్పెన్షన్ అనే పరిస్థితికి కారకులైనవారు ఆ పనిచేయటం ఉత్తమంగా ఉంటుంది.
సభ మొదటిరోజున (16వ తేదీ) చాలా బాగా జరిగింది. అన్నిపక్షాల సభ్యులూ పౌరులకు ఆనందంకలిగేట్లు వ్యవహరించారు. ప్రశ్నోత్తరాలు, తర్వాత జీరో అవర్, ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దుపై జరిగిన చర్చనుంచి ప్రజలు తెలుసుకున్నది ఎంతైనా ఉంది. ఆనాటి ధోరణిని గమనించిన తర్వాత, ఇక తక్కిన రోజులు కూడా అదే విధంగా సాగగలవనే ఆశాభావం కలిగింది. కాని మరునాడే అది భంగపడిపోయింది. సస్పెన్షన్లు అంత వేగంగా జరగవలసిందా, స్పీకర్ మరికొంత సేపు వేచి చూడవలసిందా, కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు పరిస్థితిని గమనిస్తున్నందున స్వయంగా జోక్యం చేసుకుని తమ సభ్యులను వారించవలసిందా వంటి ప్రశ్నలు, చర్చ ఎవరైనా చేయదలచుకుంటే చేయవచ్చు. కాని అదే సమయంలో, ఈ మలి దశ పరిణామాలకు మూలకారణమైన తొలి దశ పరిణామాలు ప్రాథమికం అవుతాయి. చర్చ అక్కడ మొదలై మలిదశకు వెళుతుంది. పైన చెప్పుకున్న విషయాలనుబట్టి అపుడు తేలేదేమిటి?
పార్టీ ఫిరాయింపుల మాట ముఖ్యమైనది కాదని, సభలో చర్చించనక్కరలేదని ఎవరూ అనజాలరు. తమ ఎమ్మెల్యేలు అధికార పక్షంలోకి మారటం, అసలే ఓటమి బాధలో ఉన్న కాంగ్రెస్ బాధను మరింత పెంచటం, వారు ఆందోళన చెందటం సహజం. ఆ సభ్యులు ఎందుకు పార్టీ మారారు, అందులో కాంగ్రెస్ బలహీనతల పాత్ర ఎంత, అధికార పక్షం పట్ల ఉండే ఆకర్షణ ఎటువంటిది, ఫిరాయింపులు ఇపుడు కొత్తగా మొదలయాయా, స్వయంగా కాంగ్రెస్ ఇనే్నళ్లుగా ఎనె్నన్ని ఫిరాయింపులు జరిపింది, తన అధికారంకోసం ఇతర పార్టీలను ఎంత ప్రలోభపెట్టి ఎన్నిసార్లు చీల్చి అందుకు ఎటువంటి సమర్ధనలు చెప్పుకున్నది వంటివన్నీ ప్రజలందరికీ తెలిసినట్లు ఈ సభ్యులకు కూడా తెలుసు. అందు గురించి ఎవరెన్ని ప్రశ్నలు వేసినా వారు సమాధానం ఇవ్వలేక వౌనం వహిస్తుండవచ్చుగాక. అయినప్పటికీ తమవారు ఫిరాయించటంవల్ల బాధ కలగటం, ఆ విషయమై వారు సభలో చర్చించాలనుకోవటం అర్ధం చేసుకోదగినవే. కాని సమస్య ఏమంటే అందుకొక పద్ధతి ఉండాలి. దానిని పాటించేందుకు నిరాకరించటం వల్లనే ఈ పరిణామాలు సభలో కన్పించాయి. ఇందువల్ల వారు సాధించింది ఏమైనా ఉందా? సభా పరిధిలో సాధించింది ఏమైనా ఉందా అనే దానికన్న ముఖ్యమైన ప్రశ్నలు ప్రజల దృష్టిలో సాధించింది, రాజకీయంగా సాధించింది ఏమైనా ఉన్నాయా అనేవి. ఇవి అన్నింటికన్న కీలకమైనవి. సభకు బయట రాజకీయంగా వారి భవిష్యత్తుకు సంబంధించినవి.
వ్యూహం అనే ప్రస్తావన ఇక్కడ వస్తున్నది. 17వ తేదీన సభలో ఏమి జరిగిందన్నది అట్లుంచితే, అసలు సమస్య ఏమంటే 2014లో ఓడినప్పటినుంచి ఇంతవరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక సవ్యమైన రాజకీయ వ్యూహం అన్నది లేదు. దాని ప్రతిఫలనమే సభలో కన్పించిన స్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇటీవల టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి సగ కాలం పూర్తయినపుడు, ఆ విషయమై సమీక్షలు అనేకం వెలువడ్డాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ పనితీరును సమీక్షించింది. కాని ఎందువల్లనో గాని ప్రతిపక్షాల సగకాలపు పని గురించి మీడియా సమీక్షలు జరిపినట్లు లేదు. ఆయా పార్టీలు తమ పరిధిలో తాము ఆంతరంగికంగా సమీక్షించుకున్నాయో లేదో తెలియదు గాని, దానిపై వార్తలు వెలువడలేదు. నిజానికి వారు ఆ సమీక్షలు చేసుకోవలసింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మరీ ముఖ్యంగా చేసుకోవలసింది. వారాపని ఇప్పటికైనా చేసుకోవాలి. బయటినుంచి గమనిస్తున్న వారికి మాత్రం కాంగ్రెస్‌వారు వ్యూహాలంటూ మాట్లాడటం అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. ఇక్కడివారు ఆలోచనలు చేస్తుంటారు. ఢిల్లీవారు ఆలోచించి చెప్తుంటారు. అవి రకరకాలుగా మారుతుంటాయి. యధాతథంగా అవి ఎంతవరకు పాటిస్తున్నారోగాని ఫలితాలు మాత్రం ఈ రెండున్నర సంవత్సరాలలో కన్పించలేదు. కన్పించింది ఏమైనా ఉంటే అది విజయ వ్యూహం కాదు, పరాజయ వ్యూహం. ఎపుడైనా వ్యూహమన్నది ఏ విధంగా ఉండాలి? జరుగుతున్న మంచిచెడుల గురించిన వాస్తవాలు తెలుసుకోవాలి. వాటి వెనుకగల ఇతర వాస్తవాలు గ్రహించాలి. అందుకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనలు జరపాలి. ప్రజల అభిప్రాయాలను, అవసరాల వివరాలను నిష్పాక్షికంగా సేకరించాలి. ప్రభుత్వ వైఫల్యాలు ఏవైనా ఉంటే అందువల్ల ఏర్పడే శూన్యంలోకి ప్రవేశించేందుకు తగిన నేర్పు ఉండాలి. ఈ ప్రయత్నాలన్నీ నిరంతరం సాగాలి. అంశానికి తగిన ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలి. ఇవన్నీ కలిసి వ్యూహంలో భాగమవుతాయి. ఇదిగాక పార్టీలో ఐక్యత కావాలి. తగిన నాయకత్వాన్ని గుర్తించి దానికి బాధ్యతలు, అధికారం అరమరికలు లేని విధంగా అప్పగించాలి. నాయకత్వం మాటకు అందరూ కట్టుబడి సహకరించాలి. ఆలోచనలలో భిన్నత్వాలు సహజమైనా అవి అనైక్యత, వైరుధ్యాలు, ధిక్కారాల స్థాయికి పోకూడదు.
కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినందున ఢిల్లీనుంచి తగు మార్గదర్శకత్వం చేయటంతోపాటు, రాష్ట్ర నాయకత్వానికి తగిన వ్యవహరణా స్వేచ్ఛనివ్వాలి. గ్రూపులను ప్రోత్సహించటం అసలుండకూడదు. వ్యూహంలో పైన చెప్పుకున్నవి ఒక భాగమైతే, ఇవి మరొక భాగమవుతాయి. తెలంగాణ కాంగ్రెస్ గత రెండున్నర సంవత్సరాల పనితీరును సమీక్షించినపుడు వారికి ఈ రెండు భాగాలతో కూడిన సమగ్ర వ్యూహం ఉన్నట్లు ఎంతమాత్రం అనిపించటం లేదు. రోజుకు పది మాటలు, మధ్యమధ్య హడావుడులు కన్పిస్తాయి గాని, వాటి పట్ల ప్రజలకు నమ్మకం కలుగుతున్నది శూన్యం. ఆ పార్టీనుంచి, ఇతర పార్టీలనుంచి ఇన్ని ఫిరాయింపులు జరిగినా ప్రజలు పట్టించుకొనక పోవటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి పైన పేర్కొన్న వివిధ లోపాలు వారిలోనే ఉండటం. రెండు, ఈ రెండున్నర సంవత్సరాలలో వారు సవ్యమైన వ్యూహమేదీ రూపొందించుకోలేక పోవటం. ఈ రెండింటివల్ల రాజకీయ మయసభలో ప్రవేశించి వారు పరాజయ వ్యూహం రచించుకుంటున్నారు.

టంకశాల అశోక్ 98481 91767