మెయిన్ ఫీచర్

నువ్వో సగం... నేనో సగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కష్టమైనా, సుఖమైనా అందరికీ సమానమే. ఎదుటి వారు కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోలేం. చాతనైన సాయం చేయడానికి ప్రయత్నిస్తాం. మనలో ఎవరైనా దాదాపు ఇలాగే స్పందిస్తాం. కానీ చాలా ఇళ్లల్లో నూటికి నూరుశాతం ఇలాగే జరుగుతుందని మాత్రం చెప్పలేం. భార్య తలకు మించిన పనులతో సతమతమవుతుంటే ఎంత మంది భర్తలు స్వచ్ఛందంగా ఆమెకి సాయపడుతున్నారు? శ్రీ మహావిష్ణువును తలపిస్తూ చిద్విలాసంగా సోఫా మీద కూర్చుని చిక్కటి బ్రూకాఫీ తాగుతూ టీవీలో వచ్చే న్యూస్‌ని ఎంజాయ్ చేయడమో, దినపత్రికలో వేడివేడి వార్తలు చదువుతూ దేశం పాడైపోతుందని నిట్టూర్చడమో చేస్తుంటారు.

**
కోడి కూయక ముందే నిద్ర లేచి తెలతెలవారే వచ్చే మున్సిపల్ కొళాయి నుండి నీళ్లు పట్టుకోవడం, ఇంటిని శుభ్రం చేయడం, కళ్లాపి జల్లి ముగ్గులేయడం, మధ్యలో అత్తగారికో, మామగారికో గొంతు తడిపేందుకు వీలు కాకపోయినా వంటింట్లోకి వెళ్లి కథాకళి చేసినట్లు కాఫీ, టీ వంటివి తయారు చేసి ఇవ్వడం, గ్యాస్ స్టవ్ మీద మరిగిపోతున్న పప్పుచారును మంట తగ్గించి కారిపోకుండా కాపాడుకోవడం వంటి పనులతో సవ్యసాచిని తలపిస్తుంది. అయితే ఇంత హైరానా పడుతున్న ఆమెకి కాస్త చేయి సాయం చేయాలని మాత్రం చాలా మంది పురుష పుంగవులు అనుకోరు. ఖాళీగా కూర్చున్న తండ్రితోనో, తల్లితోనో, అక్కచెల్లెళ్లతోనో పిచ్చాపాటీ మాట్లాడుతూ కాలం వ్యర్ధంగా దొర్లిస్తుంటారు. పైపెచ్చు అది చేయమని, ఇది చేయమని ఆజ్ఞలు జారీ చేస్తుంటారు. ఇంక ఆ ఇంటి ఇల్లాలు ఉద్యోగం కూడా చేసే పరిస్థితులు ఉంటే ఆమె బాధ చెప్పనలవి కాదు. ఇంటి పని, ఆఫీసు పనితో ఆమె నలిగిపోవలసిందే కానీ, వీసమెత్తు సాయం కూడా ఆమెకి మగడి నుండి అందదు. భర్తకి, పిల్లలకి కావలసినవి అమర్చి, ఆనక తాను తయారై, తనకి మధ్యాహ్నానికి క్యారేజీ కట్టుకుని ఆమె బయలుదేరాలి. ఇంత హడావిడి పడి వెళ్లే ఆమె ఏ కాస్త ఆలస్యమైనా ఆఫీసులో బాస్ యముడు ‘పోనే్ల పాపం ఆడకూతురు ఇంట్లో అలవికాని పని వల్ల ఆలస్యమై ఉంటుంది’ అని జాలి చూపడు. గుడ్లురుముతూ చూస్తాడు. పాపం ఆమె మహాపరాధం ఏదో చేసినట్లు గుడ్ల నీరు కుక్కుకుని సీట్లోకెళ్లి కూర్చుని పని చేయాల్సిందే.
సాయంత్రం వరకు అక్కడ గొడ్డు చాకిరీ చేసి ఇంటికెళ్లాక మళ్లీ ఆమె కోసం ఇంటి పనంతా ఎదురు చూస్తూనే ఉంటుంది. సాయంత్రం స్కూలు, కాలేజీ నుండి వచ్చే పిల్లల కోసం స్నాక్స్ తయారు చేయడం, రాత్రి డిన్నర్‌కి ప్రిపేర్ చేయడం తప్పదు. అందుకే సాయంత్రం వస్తూవస్తూ మార్కెట్లో కూరలు, మర్నాటికి కావలసిన వస్తువులు కొనుక్కుని రావాలి.
ఇలా మగువ జీవన చదరంగంలో నలిగిపోతున్నప్పుడు ఆమె జీవిత భాగస్వామి అయిన భర్త ఆమెకి అండగా నిలవాలి. ఒక పని ఆమె చేస్తుంటే మరో పని తానందుకోవాలి. ఎలాగూ మగవాళ్లు ఆఫీసులకి వెళ్లేది బైకుల మీదే కాబట్టి ఆఫీసు నుండి వచ్చేటప్పుడు తప్పనిసరిగా వాళ్లే ఇంట్లోకి ఏమేం కావాలో తెచ్చి పడెయ్యాలి. ఇందుకు తెలివిగా ఒక రిజిస్టర్ ఇంట్లో నిర్వహిస్తుండాలి. రోజులో మనం అనేక వస్తువులు వాడుతుంటాం. అందులో ఏ వస్తువు ఇంట్లో నిండుకుందో దానిని పైన ఆరోజు డేట్ వేసి దాని కింద ఆ వస్తువు కావాలని రాయాలి. ఈ అలవాటు ఇంట్లోని వారందరికీ చెయ్యాలి. భర్త, భార్య, పిల్లలు ఎవరైనా ఇంట్లోకి అవసరమయి, అది అయిపోతే నిర్లక్ష్యం చేయక వెంటనే ఆ రిజిస్టర్‌లో రాసెయ్యాలి. దీనివల్ల ఇంటికి ఏది కావాలనే లిస్టు ప్రిపేర్ చేయడం సులువవుతుంది. మార్కెట్‌కి వెళ్లి వచ్చాక ‘అయ్యో! ఆ వస్తువు మరిచిపోయామే’ అనుకోనక్కర్లేదు. అలాగే కరెంట్‌బిల్లు కట్టడం, పాలకార్డు తేవడం, ఉతికిన బట్టలు లాండ్రీవాటికి వెయ్యడం, నెలవారీ ఇంట్లో వాడే మందులు తీసుకోవడం, గ్యాస్ బుక్ చేయడం వంటి ఇంటి పనులకు సంబంధించి అన్నీ ఇల్లాలి మీదే వదిలేయకుండా భార్యాభర్తలు ఎవరికి వీలైన పనులు వారు చేసుకుంటూ పోతే ఏ ఒక్కరి మీదో భారం పడదు.
ఇంటి పనిలో సైతం భాగస్వాములై చకచకా చేసుకుపోవడానికి ప్రయత్నించాలి. కుళాయి నీళ్లు పట్టడం, కూరలు తరగడం, పిల్లల్ని నిద్రలేపి తయారు చేయడం, వారికి బ్రష్, స్నానాలు చేయించి, టిఫిన్లు తినిపించడం, వాళ్ల స్కూలు బ్యాగులు సర్ది, స్నాక్స్, వాటర్ బాటిళ్లు సర్దిపెట్టడం, సమయానికి ఆటోలో వారిని ఎక్కించడం వంటి పనులను భార్యాభర్తలు షేర్ చేసుకుంటే ఆ ఇంట్లో హైరానా వాతవరణమే కనిపించదు. ఆ జంట కూడా పెద్ద బాదరబందీ పడకుండా మార్నింగ్ సెషన్‌ని దిగ్విజయంగా పూర్తి చేసి ఎవరి విధులకు వారు వెళ్లిపోగలరు. దీనివల్ల ఆఫీసు పనిని ప్రశాంతంగా పూర్తి చేసి బాస్ మెచ్చుకోలుకు పాత్రులు కాగలరు. అలాగే సాయంత్రం పనులను కూడా చక్కటి అవగాహనతో ‘నీవో సగం... నేనో సగం’ అనుకుంటూ పూర్తి చేస్తే అంతా సాఫీగా సాగిపోవడమే కాకుండా ఆ దంపతుల మధ్య అనురాగం, ఆప్యాయత ఇనుమడించి, వారి బంధం గట్టి పడడానికి అది చక్కటి వారధి అవుతుంది.
కనుక ఇంటి పనులు చేయడం ఆడవాళ్ల బాధ్యతే అని, మేము మగ మహారాజులం కనుక ఆ పనుల జోలికి పోం అనుకునే మిస్టర్లంతా సహృదయంతో అవగాహన చేసుకుని జీవన సహచరికి చేదోడు వాదోడుగా ఉంటే ఆ ఇల్లు నందనవనం అవుతుంది.

- లావణ్య