మెయన్ ఫీచర్

మహిళా భద్రత.. బేతాళ ప్రశే్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది మే 17న కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ మహిళా విధానం’ ముసాయిదాను విడుదల చేసింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత వచ్చిన విధానపత్రం అది. ‘జాతీయ, అంతర్జాతీయ నేపథ్యాలలో అనూహ్య మార్పులు వస్తున్న సమయంలో మహిళలు నిర్వహించగల పాత్రను దృష్టిలో వుంచుకుని ఈ విధాన పత్రం రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరిగిన మాట వాస్తవం. వృత్తి ఏదైనా గృహిణిగా, తల్లిగా, కుమార్తెగా అతివ నిర్వహించే బాధ్యతలు చాలా వుంటాయి. ఆమె ఎదుర్కొనే సమస్యలు కూడా బహుముఖంగానే వుంటాయి. వీటినన్నింటినీ దృష్టిలో వుంచుకుని మహిళలకు సంబంధించి విధాన రూపకల్పన జరుగుతుంది. వారి సమస్యలను పరిష్కరించే రీతిలో చట్టాలు రూపొందించబడుతూ వుంటాయి.
ఇంటా బయటా స్ర్తిలకు భద్రతను కల్పించే చట్టాలు మన దేశంలో చాలా వున్నాయి. ‘జాతీయ మహిళా విధానం’ప్రత్యేకంగా ఉన్నా- సర్వత్రా వారికి భద్రత పెను సమస్యగానే వుంది! భర్త, అత్తింటి వారి నుంచి గృహిణికి రక్షించడానికి ‘గృహహింస నిరోధక చట్టం’ (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమిస్టిక్ వయొలెన్స్ యాక్ట్), కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి ‘సెక్స్యువల్ హెరేస్‌మెంట్ ఆఫ్ వుమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్’ వంటి చట్టాలూ, ప్రయాణ సమయంలో మహిళలు వేధింపులకు గురికాకుండా నిర్దేశించబడిన చట్టాలు మనకు చాలా వున్నవి. శాసనాలు దండిగా ఉన్నా- వాటి కార్యాచరణ, నేరాల నివారణ, దోషులకు శిక్షలు.. వంటివి నామమాత్రంగానే వున్నవి. యువతులు కాలేజీలకు వెళ్లడానికి, ఉద్యోగినులు వారు పనిచేసే ప్రదేశానికి వెళ్లడానికి, గృహిణులు పలు అవసరాల నిమిత్తం బయటకు వెళ్లడానికి బస్సులు, మెట్రోరైళ్లు వంటి ప్రయాణ సాధనాలను నగరాల్లో ఉపయోగిస్తారు. అక్కడి నుంచే మహిళలపై లైంగిక వేధింపులు ప్రారంభమవుతాయి. బస్సులలో, మెట్రోరైళ్లలో జనం క్రిక్కిరిసి వుండడం తప్పనిసరి. రవాణా సదుపాయాలు సమకూర్చని సంస్థలలో పనిచేసే మహిళలు రాత్రి వేళ ఇంటికి వెళ్లడానికి ఇవే శరణ్యం. ఇలాంటి సందర్భాలలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల గురించి పలు స్వచ్ఛంద సంస్థలు సర్వేలు జరిపాయి. ‘ఏక్షన్ ఎయిడ్ యుకె’ అనే స్వచ్ఛంద సంస్థ గత ఏడాది జరిపిన సర్వే ప్రకారం భారత్‌లో ప్రతి అయిదుగురు మహిళల్లో కనీసం నలుగురు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. 18-24 మధ్య వయసు మహిళల్లో 92 శాతం మంది, 25-34 ఏళ్ల వయసు మహిళలు 97 శాతం మంది వేధింపులకు లోనవుతున్నారు. మగవారు శరీరాన్ని తాకడం, వ్యంగ్య, అసభ్య పదాలు వాడడం, వెకిలిగా ప్రవర్తించడం, పేర్లు పెట్టడం.. ఇలాంటివన్నీ మహిళల పట్ల వేధింపులుగానే భావించాలి.
ఆడపిల్లలు విద్యాలయాల నుండి తిరిగి వచ్చేటప్పుడు, ఉద్యోగినులు రాత్రివేళ ఇంటిముఖం పట్టేటప్పుడు వేధింపులు ఎక్కువగా వుంటున్నాయని సర్వేలలో తేలింది. ‘అక్షర’ అనే స్వచ్ఛంద సంస్థ 5,000 మంది మహిళలను సర్వే చేయగా పలు ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. ముంబయిలోని ప్రజారవాణా వ్యవస్థలో పనిచేస్తున్న మహిళా కండక్టర్లకు ఈ సమస్యను ఎదుర్కొనే విషయమై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. బస్సుల్లో స్ర్తిలను వేధించే ఆకతాయిలను పోలీసులకు అప్పగించేలా మహిళా కండక్టర్లకు తర్ఫీదు ఇచ్చారు. అయితే, చాలామంది ఆడపిల్లలు ఫిర్యాదు చేసేందుకు ఇష్టపడడం లేదని, ఇలా ఉపేక్షిస్తే వేధింపులు మరింత తీవ్రరూపం దాలుస్తాయని నివేదికలో పేర్కొన్నారు. ముంబయిలోనే కొందరు పురుషులు ‘మెన్ ఎగినెస్ట్ వయొలెన్స్ అండ్ ఎబ్యూజ్’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి మగపిల్లల ఆలోచనా విధానంలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. లైంగిక విద్యను ఒక పాఠ్యాంశంగా బోధిస్తే ఈ బెడద చాలావరకూ తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. ‘అక్షర’ సంస్థ ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యునిసెఫ్’ సహకారంతో మహారాష్టల్రోని 100 విద్యాలయాలతో కలిసి పనిచేస్తోంది. ‘ప్రేమ, మోహం, ఆకర్షణ’ల మధ్య తేడాను యువకులకు చెబుతూ, ఆడపిల్లలను గౌరవించాల్సిన ఆవశ్యకతను గురించి ఈ సంస్థ సభ్యులు చెబుతున్నారు. ఈ సంస్థ కృషి ఫలించి యువకులలో మార్పువస్తే అంతకన్నా కావల్సింది ఏముంది?
మహిళల పట్ల ఇంటి బయట జరుగుతున్న లైంగిక వేధింపులు ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ అని ‘అక్షర’ నివేదిక విశే్లషిస్తోంది. కార్యాలయాల్లో పనిచేసే మహిళలది మరింత తీవ్రమైన సమస్య. బస్సుల్లో మహిళలపై జరిగేవి ఆకతాయి చేష్టలు కావచ్చు. కానీ, కార్యాలయాల్లో ఉద్యోగినులపై లైంగిక వేధింపులు మరింత తీవ్రమైనవి. దురుద్దేశ పూర్వకమైనవి, ప్రమాదకరమైనవి కూడా. ఈ విషయమై బొంబాయి హైకోర్టు 1966లో ఇచ్చిన తీర్పులో రెండు కీలక విషయాలు పేర్కొంది. మొదటిది- ప్రతి కార్యాలయంలోనూ పురుష ఉద్యోగులు- ఉద్యోగినుల విషయంలో చేయదగినవి, చేయకూడనివి అయిన అంశాల జాబితా (డూస్ అండ్ డోన్ట్స్) పెట్టాలనే విషయానికి సంబంధించినది. రెండోది- ఉద్యోగినులపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు ఫిర్యాదులను విచారించడానికి ‘ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ’ ఏర్పాటు చేయాలన్నది. 2013లో రూపొందించిన ‘సెక్స్యువల్ హెరాస్‌మెంట్ ఆఫ్ వుమెన్ ఇన్ వర్క్ ప్లేసెస్’ చట్టాన్ని కఠినంగా అమలు చెయ్యాలని కూడా పలు కోర్టులు ఆదేశించాయి. కాని, ఆచరణలో ఇవేమీ జరగడం లేదు. ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ 2015లో చేసిన పరిశీలనలో 33 శాతం కంపెనీల్లో ‘ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ’లు ఏర్పాటుకాలేదు. 40 శాతం మంది ఉద్యోగినులకు ఇలాంటివి కంపెనీలే ఏర్పాటు చేయాలన్న విషయం తెలియదు. భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిశీలన ప్రకారం- చిన్న కంపెనీలలో కంటే, సుమారు వంద భారీ కార్పొరేట్ కంపెనీలోనే అధికారుల లైంగిక వేధింపులు అధికంగా వున్నాయి. తమ కోరిక తీర్చకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామనీ లేదా ప్రమోషన్లు రాకుండా చేస్తామని బెదిరించే అధికారులు ఈ కంపెనీలలోనే అధికంగా వున్నారు. ఈ వేధింపులు అధికారుల నుంచే కాదు, సహచర పురుష ఉద్యోగుల నుంచి కూడా వచ్చే అవకాశం వుంది. ఈ విషయాలను బాధిత మహిళలు బహిర్గతం చేయడం లేదు.
‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్’కు చెందిన ఒక బృందం చేసిన పరిశీలన ప్రకారం- ఒక అధికారి ప్రవర్తనపై ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీకి లేదా పోలీసులకు ఫిర్యాదుచేస్తే నిందితులను శిక్షించడం జరగదు గాని, ఆ ఉద్యోగినిపై పనివత్తిడిని పెంచడం, రాజీనామా చేసే పరిస్థితులను కల్పించడం జరుగుతున్నది. మహిళలు ఉద్యోగం చేస్తున్నా, గృహిణిగా ఉన్నా ‘గృహహింస’ తప్పడం లేదు. శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, ఆర్థికపరంగా, గృహిణిపై భర్త, అత్తింటివారు మాటలతో, చేతలతో చేసే దాడిని ‘గృహహింస’ అంటారు. ‘నేషనల్ క్రయిమ్స్ రికార్డ్ బ్యూరో’ 2014లో ‘్భరతదేశంలో మహిళలపై జరిగిన నేరాలు’ పేరిట ప్రచురించిన నివేదికలో గృహహింస మిగతా నేరాల కంటే అధికస్థాయిలో ఉంది. గృహహింస కింద 2013లో 1,18,860 కేసులు, 2014లో 1,22,877 కేసులు నమోదయ్యాయి. వరకట్నం వేధింపులతో మరణాలు 2010-2014 మధ్యకాలంలో ప్రతి ఏటా ఎనిమిది వేలకు పైగానే వున్నాయి. కట్నాలూ, లాంఛనాలు ఇవ్వలేదనో, ఇతర ఆర్థిక ప్రయోజనాలు తీర్చలేదనో మహిళలను హత్యచేసినా, బాధితురాలు ఆత్మహత్య చేసుకొన్నా వరకట్న చావుగానే భావించాలి. మహారాష్టల్రో తీవ్ర ‘గృహహింస’కు ప్రతిస్పందించి- ఆ రాష్ట్రంలోని న్యాయవాదులు, మహిళా సంఘాల వారు నిర్వహించిన ఉద్యమాల ఫలితంగా 2005లో ‘ప్రొటెక్షన్ ఆఫ్ వుమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్’ను ప్రభుత్వం చేసింది. అయితే, గృహహింస జరిగిందని మహిళలు చేసిన ఫిర్యాదును కోర్టు విచారణకు స్వీకరించే ముందు ఆమెకు, భర్తకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. అతడికి, ఆమెకు, అత్తవారింటి కుటుంబ సభ్యులకు రాజీ చేసేందుకు ‘మధ్యవర్తిత్వం’ జరగాలి. ఇదంతా జరిగాకే ‘గృహహింస’ చట్టం కింద విచారణ ప్రారంభం అవుతుంది. అంటే- మహిళలకు సత్వరం న్యాయం జరగదు. రాజీ ప్రయత్నాలు విఫలం అయిన తర్వాతే- సుదీర్ఘ విచారణల తర్వాతే ఆమెకు న్యాయం జరిగే అవకాశం వుంటుంది. మధ్యవర్తిత్వం నడిపే పెద్ద మనుషులు సాధారణంగా భర్తకే వత్తాసు పలుకుతారు. తిరిగి అత్తవారింటికి పంపడానికే చూస్తారు. పుట్టింటివారు కూడా కాపురం నిలబడితే చాలని అనుకుంటారు.
కోర్టుకు వెళ్లిన కేసుల్లో కూడా న్యాయం జరిగిన సందర్భాలు తక్కువే! ‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్’ జరిపిన పరిశీలన ప్రకారం ‘గృహహింస’ కింద నమోదైన 2,466 కేసుల్లో 821 కేసుల్ని మాత్రమే కోర్టులు విచారించాయి. న్యాయం జరిగింది 166 కేసుల్లో మాత్రమే. ఇలాంటి స్థితిలో ‘గృహహింస’కు వ్యితిరేకంగా రచ్చకెక్కడం తప్ప స్ర్తికి ఒరిగేదేముంది? 2016లో ప్రభుత్వం రూపొందించిన జాతీయ మహిళా విధానం కూడా బాధితులకు మేలుచేసేది కాదు. ‘హక్కులకు ప్రాధాన్యతను ఇస్తూ శ్రేయస్సును కల్పించే విధానాలను’ వారు కోరుతున్నారు. ఒంటరి మహిళల హక్కుల గురించి గాని, కూలిపనులు చేసుకునే మహిళలకు సౌకర్యాల గురించి గాని చర్యలు తీసుకోవడం లేదు. చట్టాలెన్ని చేసినా ఆచరణలో జరిగేది స్వల్పమే. చిత్తశుద్ధి, లక్ష్యసిద్ధి లేకుండా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఏం ప్రయోజనం?
*

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969