మెయన్ ఫీచర్

భారత్ దౌత్య విధానం విశ్వశాంతికి సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వపటంపై భారత్‌కు సమున్నత స్థానం కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో మరొక భాగం ఇటీవలే ముగిసిన ‘రైజినా డైలాగ్’. వివిధ దేశాల రాజకీయ, ఆర్థిక అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు సేకరించి, వాటిని విజయవంతంగా అమలుచేసే బాధ్యతను మనదేశం తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్నది. ఇందుకోసం అందుబాటులో ఉన్న ప్రతి వేదికను వాడుకోవడం, అవసరమైతే తగిన వేదికలను రూపొందించుకుంటూ భారత దౌత్యనీతి ముందుకు సాగుతోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక భారత విదేశాంగశాఖ ప్రముఖ సామాజిక అధ్యయన సంస్థ ‘అబ్జర్వర్ రీసెర్చి ఫౌండేషన్’ (ఒఆర్‌ఎఫ్)తో కలసి ప్రపంచ దేశాల ప్రాతినిధ్యంతో విధానపర నిర్ణయాలు రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నది. ముఖ్యంగా వర్ధమాన దేశాలు తమ అవసరాలను, అభిప్రాయాలను ప్రకటించడానికి తగిన వేదిక లేకుండా ఇబ్బంది పడుతున్న సమయంలో 2016 మార్చిలో భారత విదేశాంగ మంత్రిత్వశాఖ, ఓఆర్‌ఎఫ్‌లు మొదటి ‘రైజినా డైలాగ్’ను నిర్వహించాయి. ‘ఆసియా కనెక్టివిటీ’ అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో 40 దేశాల నుంచి 120 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ దేశాల నేతలు, మేధావులు, సామాజిక ఉద్యమ కార్యకర్తలు హాజరయ్యారు. మొదటి స దస్సు విజయవంతం కావడంతో ఈనెలలో- ‘న్యూ నార్మల్, మల్టీలేటరిజం విత్ మల్టీ పోలారిటీ’’ అంశంపై జరిగిన సదస్సులో 65 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
విశ్వశ్రేయస్సుకు, మానవాళి అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధనకు, ఏకోన్ముఖంగా ప్రయత్నించడానికి మోదీ ప్రధాని పీఠాన్ని అధిష్టించినప్పటి నుంచే అవిరళ కృషి చేస్తున్నారు. యోగాను అంతర్జాతీయంగా ప్రచారం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం వెంటనే ఫలితాన్ని ఇచ్చింది. ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలంటూ ఐరాసలో మోదీ చేసిన ప్రతిపాదనను ప్రపంచ దేశాలు ఆమోదించడం అత్యంత అరుదైన సంఘటన. ఆర్థిక అవినీతిని, నల్లధనం వ్యాప్తిని నిరోధించడానికి ప్రపంచ దేశాలన్నీ ఒకే విధానాన్ని పాటించాలంటూ మోదీ చేసిన విజ్ఞప్తుల కారణంగా అనేక దేశాలు ముందుకువచ్చి తమతమ దేశాలలో విదేశీయులు దాచుకుంటున్న ధనం వివరాలను వెల్లడించడానికి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. పన్నులు ఎగవేసి ఇతర దేశాల బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నల్లధనాన్ని దాస్తూ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నవారి నడ్డి విరిగేలా ఈ చర్యలు దోహదపడ్డాయి. వివిధ దేశాల్లోని పన్ను చట్టాలను అడ్డం పెట్టుకుని ‘టాక్స్ హేవెన్’గా మారి లబ్దిపొందుతున్న దేశాలను తమ చట్టాలను మార్చుకుని ఇతర దేశాలకు సహాయం చేసేలా ‘జి-7’ వేదికపై నుంచి ఒత్తిడి తీసుకురావడంతో మోదీ ప్రభుత్వం విజయవంతమైంది. పాకిస్తాన్ కేంద్రంగా తీవ్రవాద చర్యలు పెచ్చరిల్లుతున్న సంగతి ప్రపంచానికంతా తెలుసు. పాక్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు నామమాత్రపు ప్రయత్నాలు చేశాయే తప్ప నిబద్ధతతో పని చేయలేదు. పాక్ ప్రేరిత ఉగ్రవాదాన్ని అడ్డుకోవల్సిన అవసరంపై మోదీ గత రెండున్నరేళ్లుగా వివిధ ప్రపంచ వేదికల నుంచి తెస్తున్న ఒత్తిడి కారణంగా ఇవాళ పాకిస్తాన్ ఏకాకిగా మారింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ ప్రతిపాదించిన తీర్మానాలను ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాయి. గతంలో పాక్‌ను సమర్ధించిన అమెరికా సైతం మోదీ ఒత్తిడి కారణంగా పాకిస్తాన్‌ను నియంత్రించే చర్యలు చేపడుతున్నది. పక్షపాతంతో కూడుకున్న సబ్సిడీ విధానాలకు వ్యతిరేకంగా ‘బ్రిక్స్’ సదస్సు లాంటి వేదికనుంచి భారత ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడి కారణంగా అభివృద్ధి చెందుతున్న, వెనుకబడ్డ దేశాల రైతులకు ఇచ్చే సబ్సిడీలపై అభివృద్ధి చెందిన దేశాల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాలు తమ రైతులకు సబ్సిడీలు అందచేస్తూ అభివృద్ధి చెందుతున్న, వెనుకబడ్డ దేశాల్లో సబ్సిడీలు ఇవ్వరాదని ఒత్తిడి తీసుకువచ్చాయి. వివక్షతో కూడుకున్న ఈ సబ్సిడీ విధానంపై భారత్ సాహసోపేతమైన పోరాటం చేసింది. ఈ సందర్భంగా అనేక దేశాలు భారత్‌పై విపరీతమైన ఒత్తిడులు తీసుకువచ్చాయి. అయినా భారత్ బెరకలేదు. మన దేశపు రైతుల ప్రయోజనాల కోసం పోరాటాన్ని తీవ్రతరం చేసింది. రైతులకు సబ్సిడీలపై భారత్ చేపట్టిన విధానపర పోరాటాన్ని సమర్ధిస్తూ వందలాది దేశాలు మనపక్కన నిలబడ్డాయి. చివరికి అభివృద్ధి చెందిన దేశాలు మెట్టు దిగిరాక తప్పలేదు. దీంతో చిన్న దేశాల రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరడంతోపాటు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు, సార్వభౌమాధికారాలు నిలబెట్టుకోవడానికి ఉపయోగపడ్డాయి. పర్యావరణ పరిరక్షణ విధానాలలో అభివృద్ధి చెందిన దేశాల పక్షపాత, ఏకపక్ష విధానాలను మోదీ ప్రభుత్వం సహేతుకంగా ఎండగట్టగలిగింది. బాధ్యతాయుతంగా దౌత్యనీతిని నిర్వహిస్తూ, వివిధ దేశాలను కలుపుకుని ముందుకు వెడుతున్న కారణంగా ఇవాళ భారతదేశాన్ని, దాని శక్తిసామర్థ్యాలను ప్రపంచ దేశాలు గుర్తించాయి. భారత్ ప్రమేయం లేకుండా నేడు ప్రపంచ విధానాలు నిర్ణయం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. మానవ వనరుల వినియోగంపై భారత్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా శ్లాఘించబడుతున్నాయి.
‘రైజినా డైలాగ్’ వేదిక నిర్మాణం పూర్తిగా భారత్ చొరవతో ఏర్పడ్డదే. ఇటువంటి వేదిక ఇప్పటికే ‘షాంగ్రీలా డైలాగ్’ పేరుతో పనిచేస్తున్నది. అయితే ఈ వేదికపై నుంచి రక్షణ రంగ అవసరాల, విశే్లషణ అంశాలే చర్చిస్తారు. 2002 నుంచి కొనసాగుతున్న ‘షాంగ్రీలా డైలాగ్’లో ఆసియా పసిఫిక్ దేశాల రక్షణశాఖ మంత్రులు, సైనికాధికారులు, రక్షణ రంగ నిపుణులు పాల్గొని విధాన నిర్ణయాలను తీసుకుంటారు. ఈ సదస్సు నుంచి ప్రేరణ పొంది భారత విదేశాంగశాఖ, సామాజిక అధ్యయన సంస్థ ఓఆర్‌ఎఫ్‌తో కలసి ఏటా ‘రైజినా డైలాగ్’ను నిర్వహించాలని నిర్ణయించారు. దీంతోపాటు ‘రైజినా యంగ్ ఫెల్లోషిప్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 39 ఏళ్ల వయస్సుకంటే తక్కువ ఉన్న 26 దేశాలకు చెందిన 35 మంది యువ మేధావులు ఈ ఫెల్లోషిప్ పథకం కింద రీసెర్చి చేస్తున్నారు.
ఈ నెలలో జరిగిన ‘రైజినా డైలాగ్’ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ సదస్సులో మోదీ లేవనెత్తిన అంశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. శాంతియుత సమాజం కోసం భారత్ ఒక్కటే ప్రయత్నిస్తే సరిపోదని, పాకిస్తాన్ తన ఉగ్రవాద చర్యలను మానుకోకపోతే ఇరుదేశాల మధ్య చర్చలకు ఆస్కారం ఉండదని భారత్ చేసిన హెచ్చరికను ప్రపంచ దేశాలు స్వాగతించాయి. మన ఆర్థిక ప్రగతి, మన దేశాల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వౌలిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం, మన ఉత్పత్తులకు తగిన మార్కెట్, మన దేశ సార్వభౌమాధికారం, దేశరక్షణ తదితర కీలక అంశాలన్నీ ప్రపంచ గమనంపై ఆధారపడి ఉన్నాయి. ఇదే సమయంలో ప్రపంచం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా భారత్‌ను కలుపుకుని పోవాల్సిందే. భారత్‌కు ప్రపంచం ఎంత అవసరమో, ప్రపంచానికి కూడా భారతదేశపు అవసరం అంతే ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో భౌగోళికంగా దేశాల సరిహద్దులు అడ్డుగోడలు కాకపోవచ్చు. ఆయా దేశాల నాయకత్వాల ఆలోచనా ధోరణి, వ్యాపార విస్తరణ, మానవ వనరుల వినియోగాలను అడ్డుకునే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. తాముమాత్రమే అభివృద్ధి చెందాలి, ఇతర దేశాల మనుగడతో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్న కొన్ని దేశాల నాయకత్వపు ఆలోచనాధోరణి ప్రపంచ అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. దీని కారణంగా ప్రైవేటీకరణ ఫలితాలు అందరికీ అందడం లేదు. ఫలితంగా అస్థిరత్వం, హింస, వివాదాలు, తీవ్రవాదం, వేర్పాటు ధోరణులు ప్రపంచ దేశాల అభివృద్ధిని నిరోధిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలతో ఈ సమస్యలు పరిష్కరింపబడవు. నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు, మేధావులు, విద్యావేత్తలు కలిసిరాకపోతే ఈ సమస్యలకు పరిష్కారం అసాధ్యం. వనరుల వినియోగంపై సమాన అవకాశాలు ఉండాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధిలో అన్ని దేశాలు భాగస్వాములైనపుడే ఇది సాధ్యం. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మార్పులు సంభవిస్తున్నప్పుడు వివిధ దేశాలు ఏ విధంగా స్పందించాలన్నది ప్రధాన ప్రశ్న. సహజీవనం, పరస్పర సహకారం, భాగస్వామ్యం అన్న సిద్ధంతం ఆధారంగా పనిచేయకపోతే మార్పులకు అనుగుణంగా అభివృద్ధిని సాధించడం సాధ్యం కాదు. దేశాల మధ్య బలమైన సంబంధాలు లేకుంటే సామూహిక అభివృద్ధి జరగదు. ఇటువంటి అంశాలకు సానుకూల వాతావరణం కల్పించడానికి ‘రైజినా డైలాగ్’ ప్రయత్నిస్తున్నది.
ప్రపంచ దేశాలు తమ ఆలోచనాధోరణిని మార్చుకునేందుకు, కొత్త శక్తిని పొందేందుకు, ఉత్తమస్థాయి సంస్థల నిర్మాణానికి భారతదేశపు ఆర్ష విజ్ఞానం అయిన యోగా, ఆయుర్వేదం వంటి అంశాలను వినియోగించుకోవాలని మోదీ ఇచ్చిన పిలుపు పలువురిని ఆశ్చర్య చకితుల్నిచేసింది. వ్యక్తులైనా, దేశాలైనా భౌతిక స్థితిగతుల మార్పువల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. మానసిక స్థితి, ఆలోచనా ధోరణి మారితేనే ప్రయోజనం ఉంటుంది. ఈ దశల్లో వచ్చిన మార్పులు ప్రకటితం కావాలి. మనం మారుతూ మన పొరుగువారిని మార్చే ప్రయత్నం చేయాలి. మన సంబంధాలు, చరిత్ర, సంస్కృతి, లక్ష్యాలు తదితర అంశాలతో భాగస్వామ్యం చేస్తేనే మార్పు సాధ్యం. అప్పుడే ప్రపంచం నిజమైన స్వరూప, స్వభావాల్లో ‘గ్లోబల్ విలేజ్’గా మారుతుంది.
భారత్ ఉపన్యాసాలు, నినాదాలకు మాత్రమే పరిమితం కాలేదు. తాను చెబుతున్న అంశాలను ఆచరణలో ప్రపంచం ముందు ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల తీవ్రవాదాన్ని తిట్టుకుంటూ, భారత కంపెనీలపై దాడులు ఎదుర్కొంటూ, మన పౌరుల కిడ్నాపులను తిప్పికొడుతూ ఆ దేశపు పునర్నిర్మాణంలో భారత్ కీలకపాత్ర వహించింది. రికార్డు సమయంలో ఆప్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనాన్ని, పలు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించి ఇచ్చింది. ఆ దేశపు రక్షణవ్యవస్థను బలోపేతం చేసింది. బంగ్లాదేశ్‌లో వివిధ నిర్మాణాలు చేపట్టింది. బంగ్లాదేశ్‌తో ఉన్న భూ జల సరిహద్దు వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకున్నది. నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు తదితర దేశాలలో భారతదేశం పెద్దఎత్తున వౌలిక సదుపాయాల ఏర్పాటు కార్యక్రమాలు చేపట్టింది. పాకిస్తాన్‌తో సత్సంబంధాలకు మోదీ చొరవ తీసుకుని లాహోర్ వెళ్ళివచ్చారు. పొరుగుదేశాలు అభివృద్ధి చెంది, శాంతిభద్రతలతో ఉన్నప్పుడు మనం కూడా సుస్థిరత, అభివృద్ధి పథంలో ఉంటాం.
జాతి పునరుత్థానానికి, దేశ పునర్నిర్మాణానికి అన్ని దిక్కుల నుంచి మంచి ఆలోచనలు నిరంతరంగా ప్రవహించాలి. ఈ ప్రక్రియ ఎల్లకాలం కొనసాగేలా అవిశ్రాంత ప్రయత్నాలు జరుగుతూనే ఉండాలి. ఇందుకోసం ఒకే దృక్పథంతో ఆలోచించేవారు, పనిచేసే వారు ఒకచోట సమావేశమై వారి వారి అభిప్రాయాలు పంచుకోవాలి. ఇందులో రోజురోజుకూ కొత్తవాళ్ళు వచ్చి చేరుతూ ఉండాలి. ఆలోచనల్లో నాణ్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు సమర్ధవంతంగా అమలుఅవుతాయి. మేధోమధనం నుంచి అమృతం ప్రవహిస్తుంది. అది ప్రజల జీవనాడి అవుతుంది. అభివృద్ధికి ఊతం అవుతుంది. ప్రజల సుఖశాంతులకు మూలం అవుతుంది. అటువంటి ప్రక్రియలో భాగం మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘రైజినా డైలాగ్’. ఇది శాంతి, సుస్థిరత, అభివృద్ధికి సోపానం.
*

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113