మెయిన్ ఫీచర్

తలఫోటు..అందానికి, ఆరోగ్యానికి చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందంగా కనిపించాలంటే ముందు మనం ఆరోగ్యంగా వుండాలి. ఆరోగ్యం లేని అందం, ఆశయం లేని ఆవేశం వ్యర్థం. ఓసారి నా వద్దకు 35 ఏళ్ల న్యాయవాది వచ్చాడు. అతనికి రోజూ మధ్యాహ్నం ఒంటిగంటకల్లా తలపోటు మొదలవుతుంది. ఆ పోటు ఎంత ‘పంక్చువల్’గా వస్తుందంటే అది రాగానే మధ్యాహ్నం ఒంటిగంట అయిందని అతనికి అర్థమైపోతుంది. కొన్నాళ్లుగా తలపోటు భరించలేనంతగా వస్తోందని చెప్పాడు. అతను ఓ విచిత్రమైన మానసిక సమస్యతో బాధ పడుతున్నట్లు నా పరిశీలనలో తేలింది. అతను న్యాయవాది గనుక కేసులు ఎక్కువగా ఉంటే ఒత్తిడి వల్ల తలపోటు వస్తుంది. ఖాళీగా ఉంటే కేసులు లేవన్న దిగులుతో ఆ పోటు వస్తుంది. కేసులున్నా లేకపోయినా, తలపోటును భరించాల్సి రావడం అతనికి నిత్యకృత్యమైంది. భర్త పరిస్థితికి వేదన చెందడం వల్ల ఆయన భార్యకూ మధ్యాహ్నం ఒంటిగంటకు తలపోటు వస్తోంది. ఈ దంపతులు టెన్షన్ పడుతూ, ఇతరులను కూడా టెన్షన్‌కి గురిచేస్తున్నారు. నేడు ఎలాగోలా డబ్బు సంపాదించాలనే ఆలోచన, వృత్తిలో, చదువులో పోటీ, విపరీతమైన గుర్తింపురావాలనే ఆకాంక్ష... ఈ పరిస్థితుల్లో చాలామందిలో తలపోట్లు పెరిగాయి. ‘సాధించు-సంపాదించు’ అనేదే నేటి కుర్రకారు మూల మంత్రం. సమాజానికి మేలుచేయని సాధన, సంసారాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే సంపాదన- మనల్ని అనారోగ్య సమస్యల్లోకి నెట్టేస్తాయి. తలపోట్లు వంటి ఇబ్బందులు ఇలానే వస్తున్నాయి. తలనొప్పులని వివరంగా పరిశీలిస్తే పలు రకాలుగా కనిపిస్తాయి.
టెన్షన్‌తో తలనొప్పి
నేడు ప్రతి పదిమందిలో 8 మందికి వచ్చే నొప్పి ఈ తరహా తలనొప్పి. దీనికి కారణం ఒత్తిడి, దిగులు, చికాకు, ఆందోళన. ఇవి చిన్న పిల్లలుగా ఉన్నపుడే ప్రారంభం కావచ్చు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే ఈ తలపోట్లు భరించలేనంతవిగా మారుతుంటాయి. ఈ నొప్పి తలకి ఇరువైపులా వస్తుంది. నిస్తేజంగా (డల్), మెల్లగా తలని ఎవరో బాధుతున్నట్లు ఉండే ఈ పోటు- అరగంట నుండి కొన్ని గంటల వరకు (కొంతమందిలో రోజంతా) ఉండవచ్చు. ఈ నొప్పి వచ్చేముందు బాధితుడు కొంచెం లేక చాలా ఒత్తిడికి, దిగులుకి, చికాకు, ఆందోళనకి గురవుతుంటాడు.
చికిత్స
ఇది తగ్గడానికి వెంటనే నొప్పి మాత్రలు ఇవ్వాలి. ఎక్కువకాలం ఇవి వాడకుండా చూసుకోవాలి. కాదని వాడితే తలపోట్లు పెరిగే ప్రమాదం ఉంది. వీటినే ‘రిబౌండ్ హెడేక్స్’ అంటారు. మాత్రల్ని వ్యసనంలా తీసుకుంటే వేరే అవయవాలకి హాని కలిగే ప్రమాదం ఉంది. ఒత్తిడి, చికాకు లాంటివి తగ్గేలా ఎవరికివారే సాధన చేసుకోవాలి. లేకుంటే వైద్యుల వద్ద కౌనె్సలింగ్ తీసుకోవడం మంచిది.
మైగ్రేన్ తలనొప్పి
ఈ తరహా తలనొప్పులు ఎప్పుడైనా మొదలు కావచ్చు. రెండు లేక మూడు పదుల వయస్సులో ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. మగవారిలోకంటే ఆడవారిలో ఇవి ఎక్కువగా వస్తుంటాయి. తలకి ఒకవైపు మాత్రమే వస్తాయి. ఇది వచ్చే ముందు చూపులో మార్పులు కనిపిస్తాయి. మసక మసకగా కనిపించడం లేక కొన్ని సెకండ్లు ఏమీ కనిపించకపోవడం లాంటివి. దీనిని ‘విజువల్ ఔరా’ అంటారు.
తలనొప్పితోపాటు వాంతి వచ్చే భావన కూడా కలుగుతుంది. కొంతమందిలో వాంతులు అవుతాయి. బాధితులు కొన్ని రకాల కాంతులకి, ఇంకా శబ్దాలకి చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అలాంటి కాంతులు చూసినా, శబ్దాలు విన్నా మైగ్రేన్ నొప్పి మొదలవుతుంది.
చికిత్స
నొప్పి మాత్రలు తాత్కాలిక ఉపశమనం కోసం వాడాలి. ఏ శబ్దాలు లేదా కాంతుల వల్ల ఇది వస్తుందో వాటికి దూరంగా ఉండాలి. రిలాక్సేషన్ థెరపీ మంచి ఫలితాలని ఇస్తుంది.
క్లస్టర్ హెడేక్
ఇవి కూడా ఇరవైలలో, ముప్ఫై ఏళ్ల వయసులో వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆడవారికన్నా మగవారిలో 5 రెట్లు ఎక్కువగా వస్తాయి. తలకి ఒకవైపే ఈ నొప్పి వస్తుంది. ఆ నొప్పి తలనుంచి నుదుటికి, కంటిచుట్టూ, ముక్కు, కింది దవడ వరకూ పాకవచ్చు. నొప్పితోపాటు కళ్ళు ఎర్రగా అవడం, కంటివెంట నీరు కారడం, ముక్కు మూసుకుపోవడం లాంటివి ఉంటాయి. ప్రారంభంలో రోజుకోసారి వచ్చి అలా వారం లేక కొన్ని నెలల దాకా ఉండి, ఆ తరువాత అవే మాయమైపోతాయి. ఈ తలనొప్పి కొన్ని వాసనల వల్ల, మద్యపానం వల్ల కలగవచ్చు.
చికిత్స
తక్షణ ఉపశమనానికి మాత్రలు వేసుకోవాలి. కొన్ని రకాల వాసనలకు, మద్యానికి దూరంగా ఉండాలి. ఈ నొప్పి విపరీతమైనపుడు ఆక్సిజన్‌ను ఉపశమనం కోసం వాడతారు.
సైనస్ హెడేక్
ముఖంలోని సైనస్‌లకి ఇన్‌ఫెక్షన్ కారణంగా వచ్చే తలనొప్పే ‘సైనస్ హెడేక్’. ఇది తలకు ఇరువైపులా లేక ఒకవైపే రావచ్చు. తల బరువుగా ఉండడం, పై పళ్ళలో వెనకవైపు నొప్పి కలగడం, గొంతులో నీరు కారడం లాంటివి వీటి లక్షణాలు.
చికిత్స
ముఖానికి సంబంధించి ఎక్స్‌రే లేక సిటి స్కాన్ అవసరం వుంటుంది. ముఖంలో చాలా సైనస్‌లు ఉంటాయి. ఏ సైనస్‌కి ఇన్‌ఫెక్షన్ వచ్చిందో, ఎన్నాళ్లుగా ఉందో, ముక్కు బ్లాక్ అవుతోందా? లేదా? లాంటివి చూసి, వాటిని బట్టి మందులు వాడాల్సి వస్తుంది. మందులకి లొంగకుంటే ఆపరేషన్ చేయడం ఉత్తమం.
టెంపోరల్ ఆర్టెరిటిస్
నుదుటి పక్క్భాగంలో ప్రవహించే ఒక రక్తనాళం పేరు టెంపోరల్ రక్తనాళం. కొంతమంది ముసలివాళ్ళలో, ప్రత్యేకంగా స్ర్తిలలో ఈ రక్తనాళం వాచిపోయి విపరీతమైన తలపోటుకి దారితీస్తుంది. ఇది తలకి ఒకవైపు మాత్రమే వస్తుంది. ఈ రక్తనాళం మీద వేలు పెట్టి నొక్కితే నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.
చికిత్స
నొప్పి మాత్రలు, స్టెరాయిడ్స్ వాడాలి. ఈ తరహా తలనొప్పి ఉందన్న అనుమానం ఉన్నవారిలో కొద్ద్భిగం రక్తనాళాన్ని కోసి పరీక్షకి పంపి నిర్థారణ చేసుకోవాలి. మందులకి తగ్గని వారిలో ఈ రక్తనాళాన్ని ఆపరేషన్ ద్వారా తొలగిస్తారు.
టిఎమ్‌జె (దవడ కీలు) వల్ల వచ్చే తలనొప్పి
కొంతమందిలో నోరు తెరచుకుంటున్నపుడు,కింది దవడ కీలులో ‘క్లిక్’ అన్న శబ్దం వినిపిస్తుంది. మరికొంతమందిలో నోరు మూసుకునేప్పుడు ఈ శబ్దం వినిపిస్తుంది. ఈ ‘క్లిక్’ శబ్దం వచ్చేవారి దవడ కీలులో సమస్య ఉందని అర్థం. ఈ శబ్దం నొప్పితో కానీ, నొప్పి లేకుండా కానీ ఉండవచ్చు. ఏ వైపు కీలులో ఈ శబ్దం వస్తుందో, ఆ పక్కన వీరిలో తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇది విపరీతమైనపుడు బాధితులలో నోరు ఒక పరిమితి వరకే తెరుచుకుంటుంది. కీలు నుండి నొప్పి నుదుటివరకూ పాకుతుంది. ఈ కీలు సమస్య రావడానికి రెండు కారణాలు. 1.కీలుకి దెబ్బతగలడం 2.నిద్రలో కానీ, కోపం వచ్చినపుడు కానీ తెలియకుండా గట్టిగా పళ్లు కొరకడం (ఇది కొందరిలో ఒక అలవాటు)
చికిత్స
మొదట కీలుకి సిటి లేక ఎంఆర్‌ఐ స్కాన్ చేయించాల్సి ఉంటుంది. పళ్ళు కొరికే అలవాటు ఉన్నవారిలో, లేనివారిలో కూడా రాత్రిపూట పళ్ళకి తొడిగే ఒక ఉపకరణం వాడడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. నొప్పి మాత్రలు వాడడం, నోరు ఎక్కువ తెరవకుండా ఉండడం, మెత్తటి ఆహారం తినడం లాంటివి పాటించాలి. ఇవి పాటించినా ఉపశమనం లేనపుడు కొన్ని ద్రవ్యాలను ఉపయోగించి కీలుకి చికిత్స చేయాల్సి వస్తుంది. అలా చేసినా ఉపశమనం రాని వారిలో ఆపరేషన్ అనివార్యం.
ప్రమాదాల తరువాత..
రోడ్డు ప్రమాదంలో తలకి గాయం అయినవారికి, ఆ సంఘటన జరిగిన కొనే్నళ్ల తరువాత తలపోటు వచ్చే అవకాశం ఉంది. దీనే్న పోస్ట్ ట్రుమాటిక్ హెడేక్ అంటారు. తలకి గాయం అయిన వైపు నొప్పి కలుగుతూ ఉంటుంది. ఈ తలపోటు అధిక ఒత్తిడి, ఆందోళన వల్ల మరింత ఎక్కువయ్యే అవకాశం వుంది.
చికిత్స
మొదట సిటి స్కాన్ లేక ఎంఅర్‌ఐ చేయించాలి. ఆందోళన తగ్గించే మాత్రలు, నొప్పి తగ్గించే మాత్రలు వాడాల్సి వుంటుంది. కౌనె్సలింగ్ కొంతమేరకు ప్రయోజనకరంగా ఉంటుంది.
పనిఒత్తిడి వల్ల కొందరిలో, ఏ పనీ లేక అనవసర విషయాలపై అతిగా ఆలోచించడం వల్ల మరి కొందరిలో తలనొప్పులు వస్తుంటాయి. సంపాదన యావలో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తలనొప్పులు తప్పవు. అపుడు సంపాదించిన డబ్బును ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముందుగా పనిలో ఒత్తిడిని జయించాలి. ఏ పనీ లేకుండా అనవసర విషయాలపై మితిమీరి ఆలోచించడం కన్నా- సమాజానికో లేదా మన మనసుకు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగించే పనులు చేస్తే ఉపయోగం ఉంటుంది. అధికంగా ఆలోచిస్తే తలపోటును భరించక తప్పదు. *

-డాక్టర్ రమేష్ శ్రీరంగం, సర్జన్, ఫేస్ క్లినిక్స్ సెల్ నెం: 92995 59615