మెయిన్ ఫీచర్

విరిసినపద్మాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికసించిన పద్మాలు వీరు. విభిన్న రంగాల్లో వీరు వెదజల్లిన పరిమళం వారి ప్రతిభకు కొలమానంగా నిలిచి ఈ ఏటి మేటి పురస్కారమైన పద్మశ్రీ వరించింది. ఒకరు వైద్యంతో ప్రాణాలు పోశారు. మరొకరు యుద్ధకళలో రాటుదేలిన ధీర.. ఇంకొకరు ఛిద్రమైన జీవితాల్లో వెలుగులు నింపిన చిరుదివ్వె.. విద్యా సుగంధాలను వెదజల్లిన చదువుల తల్లి. ఇలా అడుగుపెట్టిన రంగంలో తమదైన ముద్రవేసుకుని బాధ్యతలను బరువుగా భావించకుండా భవిష్యత్తుకు పునాదులు వేశారు.
అందుకే ఈ ప్రతిభావంతులకు పద్మాలు సొంతమయ్యాయి.
**
చదువులమ్మకు పట్టం

చదువులమ్మగా, తాను స్థాపించిన విద్యాసంస్థ పేరునే తన ఇంటిపేరుగా గుర్తింపు తెచ్చుకున్న మహిళా విద్యావేత్త ఎవరు అంటే టక్కున చెప్పగలికే ఒకే ఒక్క పేరు మాంటిస్సోరి కోటేశ్వరమ్మ. మిగతా రంగాల్లోలాగే విద్యారంగం కూడా పురుషాధిక్యమైన సమాజంలోఓ మహిళా విద్యావేత్తగా ఆమె సాధించిన విజయం అనన్యం. స్ర్తి విద్యే పరమావధిగా విజయవాడలో ఓ విద్యాసంస్థను నెలకొల్పి దాని ద్వారా ఆరు దశాబ్దాలుగా ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఆమెకు ‘పద్మశ్రీ’ అవార్డుతో పట్టం కట్టింది.ఈ సందర్భంగా ఆ విశిష్ట మహిళా విద్యావేత్త గురించి కొన్ని మాటలు ఇక్కడ ప్రస్తావించుకుందాం.
విజయవాడ విద్యలవాడగా కూడా పరిఢవిల్లడానికి పడిన తొలి అడుగుల్లో చదువులమ్మగా మాంటిస్సోరి కోటేశ్వరమ్మ వేసింది ఓ ప్రతిష్ఠాత్మకమైన ముందంజ. ఆడపిల్లలకు ఉన్నత విద్య అంటే నీళ్లు నమిలే కాలంలో ఆమె అదే తన జీవిత ధ్యేయంగా ఎంచుకుని బాలికల కోసం 1955లోప్రాథమిక విద్యతో మాంటిస్సోరి విద్యాసంస్థను స్థాపించారు. ఓ చిన్న మొక్కగా ప్రారంభమైన ఆ సంస్థ శాఖోపశాఖలుగా విస్తరించి నేడు మహావృక్షంగా ఓ ఉన్నత విద్యాసంస్థగా ఎదిగింది. అరవై ఏళ్ల విద్యా ప్రస్థానంలో ఈ చదువులమ్మ వేలాదిమంది మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించింది. తన విజయానికి గుర్తుగా ఎనె్నన్నో పురస్కారాలను ఆమె అందుకున్నారు. ఇంతటి ఘనత సాధించిన ఆమె నేపథ్యాన్ని తరచి చూస్తే...
కృష్ణాజిల్లా గోసాల గ్రామంలో కోనేరు మీనాక్షి, వెంకయ్య దంపతులకు 1925 సెప్టెంబర్ 15న కోటేశ్వరమ్మ జన్మించారు. ఈడుపుగల్లులోప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించిన ఆమె ఆ తర్వాత విజయవాడ(1941)లోఇంటర్, గుంటూరు(1945)లో డిగ్రీ,రాజమండ్రి(1947)లోబిఇడి, ఆంధ్ర విశ్వవిద్యాలయం(1972)లోఎం.ఎ పూర్తి చేసుకుని 1979- 80లలో నాగార్జున యూనివర్సిటీ నుంచి విరేశలింగం సాహిత్యం మీద డాక్టరేట్ పట్టాపుచ్చుకున్నారు.ఒకవైపుతన విద్యార్హతలను పెంచుకుంటూనే సమాంతరంగా తాను స్థాపించిన విద్యాసంస్థను కూడా అంచెలంచెలుగా ఆమె అభివృద్ధి చేశారు. కొనే్నళ్లపాటు కెజి టు పిజి వరకు కొనసాగించిన మాంటిస్సోరి విద్యాసంస్థలో రాష్ట్రంలోనే తొలిసారిగా 1972లో మహిళా బిఇడి కోర్సును ప్రారంభించారు.తదనంతరం 1992 ఎంబిఎ, 1995లో ఎంసిఎ, 2000 సంవత్సరంలో ఫిజియోథెరపీ కోర్సులను ప్రవేశపెట్టారు.ఉపాధి, వృత్తివిద్యా కోర్సులను అందుబాటులోకి తెచ్చారు.మహిళలను ఇంకా ఎన్నో విధాలుగా విద్యావంతుల్ని చేయాలనే తపనతో ఆమె నిరంతర కృషిచేశారు.అందుకే కేవలం విద్యతోనే గాక పత్రికలను కూడా స్థాపించి ఆ దిశగా కూడా తన కృషిని కొనసాగించారు.ఈ కృషిలో తన జీవిత సహచరుడు కృష్ణారావు తోడ్పాటు ఎనలేనిదన్నారు.
కోటేశ్వరమ్మ చేసిన అవిరళ కృషి వృథా పోలేదు. అందుకు ప్రతిఫలంగా ఆమె ఎన్నో పురస్కారాలనూ అందుకున్నారు. 1971లో అప్పటి రాష్టప్రతి వివి గిరి చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జాతీయ అవార్డును, 1980లో రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ టీచర్‌గా అవార్డును,నేషనల్ ఉద్యోగ ఎక్స్‌లెన్స్, లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డులను, రాష్ట్రీయ విద్యా సరస్వతి పురస్కారాన్ని, విద్యారత్న, విశిష్టమహిళ వంటి పురస్కారాలనెన్నింటినో అందుకున్నారు. అంతేకాదు ఎనె్నన్నో విద్యాసంస్థలు, సేవా సంస్థలు ఆమెను తమ సంస్థల్లో భాగస్వామిని చేశాయి.
జీవితప్రస్థానంలోని 90వ పడిలో ఇప్పుడు పద్మశ్రీ అవార్డు అందుకోవడం పట్ల ఆమె స్పందనను తెలుసుకోగా.. ఇది తనకెంతో ఆనందాన్నిచ్చిందని చెబుతూనే తన విద్యార్థులు ఎంత ఎక్కువ విజయాలు సాధిస్తే తనకు అంతటి విజయంగా భావిస్తానన్నారు.తాను స్థాపించిన మాంటిస్సోరి సంస్థ విశ్వవిద్యాలయం స్థాయికి చేరుకోవాలన్నది తన ఆశయంగా పేర్కొన్నారు.

- దుర్గరాజు స్వాతి, విజయవాడ