మెయన్ ఫీచర్

ప్రవాస నేతల ‘పెట్టుడు ఉద్యమం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలుగు కుంభకర్ణులు’ మళ్లీ నిద్రలేచారు. సుష్ఠుగా తిన్నది అరిగాక, మళ్లీ ఆకలితో రోడ్డెక్కారు. ఈ మ హానేతలను చూసి ఆ కుంభకర్ణుడు కూడా ఈర్ష్యపడతాడేమో! అలనాడు తెల్లదొరల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ విదేశీగడ్డ నుంచి బ్రిటీషర్లపై ‘ప్రవాస ఉద్యమం’ నడిపారు. అది దేశం కోసం కాబట్టి, నేతాజీకి ఎలాంటి స్వార్థం లేదు కాబట్టి, ఆయన ఉద్యమంలోని నిజాయితీని ఎవరూ తప్పుపట్టలేదు. కానీ, ఇప్పటి మన నేతాశ్రీలు ‘పొరుగు రాష్ట్రం’ నుంచి- ఏపికి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ప్రవాస ఉద్యమం నవ్వులపాలవుతోంది.
రాజధాని కూడా లేకుండా విడిపోయిన ఏపికి ప్రత్యేక హోదా అవసరం లేదన్న వాడు మూర్ఖుడి కిందే లెక్క. ఇద్దరు ‘నాయుళ్లు’ పది, పదిహేనేళ్ల పాటు ఆ హోదా కావాలని విపక్షంలో ఉండగా గొంతెత్తిన వారే. తీరా ఆ ఇద్దరూ అధికారంలోకి వచ్చాక జరిగిందేమిటి? ‘జిందా తిలిస్మాత్’ మాదిరి ‘హోదా’నే ఏపికి సంజీవని అని సెలవిచ్చిన ‘చిత్తూరు నాయుడు’ ఇప్పుడు మాట మార్చినా, హోదా గురించి ఇక మర్చిపోండని ‘నెల్లూరు నాయుడు’ ప్యాకేజీని ప్రసాదించినా అది కచ్చితంగా మాట తప్పి, మడమ తిప్పడమే. నిజమే! మరి ఇప్పుడేమి చేయాలి? రాని హోదా గురించి పోరాడాలా? ప్యాకేజీకి ఇంతవరకూ చట్టబద్ధత కల్పించకుండా చచ్చు పుచ్చు ఇచ్చకాలతో పొద్దుతిరుగుడు పువ్వులా వ్యవహరిస్తున్న కేంద్రంపై పోరాడాలా? రాని హోదా కోసం, లేని ఉనికి కోసం పోరాడుతున్న రాజకీయ పార్టీలను సమర్ధించాలా?
చంద్రబాబు ఇప్పుడు చేయగలిగేదీ లేదు. ఆయన చక్రం ఇప్పుడు తిరగడం లేదు. ‘పైనున్నవాడు’ అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న. వాజపేయిలా బోళామనిషి కాదు. ఆవులించకుండానే పేగులు లెక్కపెట్టే రకం. హోదా ఇవ్వనందుకు ఆగ్రహించి ఎన్‌డిఎ శిబిరం నుంచి బాబు బయటకొచ్చినా మోదీకి వచ్చిన నష్టమేమీ లేదు. ఇప్పటి పరిస్థితిలో- ఇచ్చింది తీసుకుని, రావలసినవాటి కోసం లౌక్యంగా వ్యవహరించడమే స్థితప్రజ్ఞుల లక్షణం. కాదు కూడదని పోరాడితే, బాబుకు సైతం వచ్చిన నష్టమేమీ లేదు. మరో రెండున్నరేళ్లూ ఆయనే సిఎంగా ఉంటారు. కాకపోతే నవ్యాంధ్రకు మిగిలేది చిప్పనే!
ఎవరు అవునన్నా, కాదన్నా కేంద్రం దయమీదనే రా ష్ట్రాలు బతకాలి. ఎన్టీఆర్‌లా కేంద్రాన్ని ఎదిరించే దమ్మున్న నేతలెవరూ ఇప్పుడు లేరు. ఎవరి ‘నలుపు’ వారికి ఉండనే ఉంది. సీబీఐ, ఈడీ, ఐటి వంటి బ్రహ్మాస్త్రాలన్నీ కేంద్రం అమ్ములపొదిలో ఉంటాయి. ప్రాంతీయ పార్టీలకు ‘నిధుల సమీకరణ’ లేకుంటే మనుగడ కష్టం. ఆ క్రమంలో వెలుగుచూసే కుంభకోణాల కోసం కేంద్రం ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకే ఎవరికీ కేంద్రాన్ని ఎదిరించే దమ్ముండదన్నది నిర్వివాదం.
ఇప్పుడు హోదా పేరుతో నానా యాగీ చేస్తున్న ‘పులివెందుల ముద్దుబిడ్డ’ ఒకప్పుడు కేంద్రాన్ని ఢీకొని, జైలుకెళ్లి మా డు పగలకొట్టుకున్నవాడే. ఆ తర్వాతే కదా తత్త్వం బోధపడి, సోనియా మాతకు సరెండరైతే తప్ప బెయిలుకు గతిలేకుండా పోయింది?! ఇప్పుడు ఆయన తన ఎంపీలతో ప్రధాని ఎదుట ధర్నాలు చేసి నాటి హీరోయిజం ప్రదర్శించవచ్చు కదా? హోదా ఇవ్వాల్సిన మోదీని వదిలేసి, కేంద్రాన్ని వీసమెత్తు కదిలించే సత్తా లేని చంద్రబాబుపై అస్త్రాలు ఎక్కుపెట్టడంతోనే అర్థం కాలేదా జగన్ బాబు పులివెందుల ప్రతాపం? హస్తినలో జంతర్‌మంతర్ ముందు ధర్నాల జిమ్మిక్కులు చేస్తే మీడియాలో ప్రచారం తప్ప, రాష్ట్రానికొచ్చేదేముంది? పైగా ఆయనకు ఈడీ, సీబీఐ, ఐటిలతో ఇంకా ప్రేమానుబంధం కొనసాగుతోంది. కాబట్టి ‘కాబోయే సిఎం’ జగన్‌కూ చంద్రబాబు మాదిరిగానే కేంద్రంపై పిడికిలి బిగించే ధైర్యం లేదన్నది కఠోర సత్యం.
ఇంతకీ- జగన్ ప్రేమ హోదా కోసమా? తాను చెప్పినట్లు రెండేళ్లలో, దేవుడు దయతలిస్తే ఏడాదికో అవుతానంటున్న సిఎం పదవి గురించా? నిజంగా విశాఖ బీచ్‌కు వెళ్లి, జనాలకు నాయకత్వం వహించాలన్న చిత్తశుద్ధి ఉంటే అంతకుముందురోజే జగన్ అక్కడికి వెళ్లాలి కదా. అలాకాకుండా- ఎటూ ఎయిర్‌పోర్టుకెళితే పోలీసులు ఆపేస్తారు కాబట్టి, దానికి మరికొంత ఆవేశం జోడిస్తే కావలసినంత ‘మైలేజీ’ దక్కించుకోవాలన్న తీసివేత-కూడికల వ్యూహం ఉంటే ఫలితాలు కూడా వెగటుగానే ఉంటాయి. హోదా పోరు సంగతి అటుంచితే- ‘పులివెందుల యువరా జా’వారు తాను సిఎం అవుతానని, గనుక ఇప్పటినుంచే అందరినీ ‘ఒళ్లు దగ్గరపెట్టుకోవాల’న్న సంకేతాలైతే జనంలోకి దివ్యంగానే వెళ్లాయి. ఆ ముచ్చట తీరాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. ఇక, వైకాపా నేతలు అప్పటివరకూ దేవతావస్త్రాల కథలో మాదిరి జగన్మోహనుడిని పురవీధుల్లో విహరింపచేసి, ఆయన మనోవాంఛ తీరిస్తే సరి!
విశాఖ వేదికగా జరిగిన హంగామాకు దిక్కుమాలిన జల్లికట్టు స్ఫూర్తికావడం బట్టి మన నేతల ఆలోచనలు ఎంత బూజుపట్టిపోయాయో అర్థమైంది. ‘జల్లికట్టు’ అనే వికృత క్రీడను సంప్రదాయంలో భాగంగా చేసుకున్న తమిళుల పోరాటాన్ని ‘హోదా’తో పోల్చడం బోడిగుండుకి, మోకాలికి ముడిపెట్టే వెర్రితనమే. ఇప్పటివరకూ హోదా పొందిన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, జమ్ము-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం,ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పె ట్టుబడులు పెట్టేందుకు ఎందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్న ఆలోచన మన నేతలకు ఎందుకు రావడం లేదు? ఈ దేశంలో వాణిజ్యానికి మంచి అవకాశాలున్న రాష్ట్రాల జాబితాలో- ‘హోదా పొందిన రాష్ట్రాల’ ర్యాంకులు 17 నుంచి 32వ స్థానం వరకూ ఉన్నాయంటే- ‘హోదా’తో ఆయా రాష్ట్రాలు బావుకున్నది ఏమిటో ఈ ‘తెలివైన మేధావులు’ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? ఇప్పుడు జరుగుతున్న ‘హోదా’ అనే ‘పెట్టుడు ఉద్యమం’లో పాల్గొంటూ, వారికి నాయకత్వం వహించే ముఖాలేవీ ఏపిలో రోజూ కనిపించేవి కాదు. పక్క రాష్టమ్రైన తెలంగాణలో సేదదీరుతూ, తీరిక దొరికనప్పుడు, ఏ కాలక్షేపం తోచనప్పుడు హోదా ఉద్యమాలు చేస్తున్న ఈ బాపతు నేతలు- తమ విన్యాసాలను జనం విశ్వసిస్తారనుకోవడం వెర్రితనం! హైదరాబాద్‌లో ఉంటూ పోరాడుతున్న ఈ ప్రవాస నాయకుల వల్ల హోదా వస్తుందా?
సినిమా షూటింగులు లేనప్పుడు తీరికూర్చుని ‘ట్వీ ట్ల’తో హోదా యుద్ధం చేస్తున్న పవన్‌కల్యాణ్ బాబు, రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా ఉంటూ రెండున్నరేళ్లయినా ఏపి రాజధానిలో కాపురం పెట్టని జగన్‌బాబు, హైదరాబాద్, ఢిల్లీ చుట్టూ తిరుగుతూ, అప్పుడప్పుడు ఏపి గుర్తుకొచ్చే కెవిపి, ఇప్పుడు సినిమాలు లేక- హైదరాబాద్ నుంచే హోదా కేకలు వేస్తున్న నటుడు శివాజీ, హైదరాబాద్‌లోనే తిష్టవేసి చర్చాగోష్టులకే పరిమితమైన ‘ఆంధ్రా మేధావి’ చలసాని శ్రీనివాస్ వంటి వారు తమకు తోచినపుడు యుద్ధం చేస్తే- వెంట వచ్చేందుకు జనసైన్యం సహజంగానే సిద్ధంగానే ఉండరు. అందుకే హోదా ఉద్యమం విలువను కోల్పోయి, కొందరి ‘సొంత మీడియా’ ప్రచారాలకే పరిమితమవుతోంది. హోదాపై వాంతులు చేసుకునే నాయకుల అసలు లక్ష్యమేమిటో ప్రజలకు తెలియదనుకుంటే అది అమాయకత్వమే.
చంద్రబాబు రాజీకి, వైఫల్యానికి కారణాలేమిటి? జగన్ నేరుగా ప్రధానిపై పోరాడకపోవడానికి కారణమేమిటి? ‘వైఎస్ ఆత్మ’ అయిన కాంగ్రెస్ ఎంపీ కెవిపి తన పదవికి రాజీనామా చేయకుండా దాన్ని అంటిపెట్టుకుని వేళ్లాడటానికి కారణమేమిటి? నేరుగా యుద్ధంలోకి దిగేందుకు పవన్‌కున్న భయానికి కారణాలేమిటన్నది బహిరంగ ర హస్యం. ట్విట్టర్‌లో బోలెడు సందేశాలిస్తున్న పవన్- రిపబ్లిక్‌డే రోజున విశాఖకు వెళ్లకుండా ఎక్కడున్నారో ఎందుకు చెప్పలేదు? కాటమరాయుడు షూటింగ్‌లో ఉన్న పవన్‌బాబుకు తీరికలేక అక్కడికి వెళ్లలేదట. అంటే- ఆయనకు సంపాదన కావాలే తప్ప హోదా ఉద్యమంలో పాల్గొనే ఆసక్తిలేదన్నట్లే కదా?! పోనీ, తాను వెళితే అక్కడ పరిస్థితి ఇంకా ముదురుతుందన్న మాట నిజమైతే, ఆ ముక్క ముందు ఎందుకు చెప్పలేదు? కనీసం జనసేన కార్యకర్తలకైనా చెప్పాలి కదా? నాయకుడికే అవగాహన లేకపోతే ఇక సినిమాబాబు రాజకీయాల్లో ఏం ఉద్ధరిస్తారు? పవన్ కంటే కామెడీ హీరో సంపూనే బెటర్ కదా?!
* * *
కోర్టు బోనులో నిలబడ్డ జగన్‌ను చూసి- ‘సిఎం అవుతానంటూ ఎయిర్‌పోర్టులో గొడవ చేస్తుంటే తీసుకువచ్చారు సార్..’ అని న్యాయవాది జడ్జిగారికి విన్నవించారు. దానికి జడ్జిగారు- ‘బాబూ.. నువ్వు సిఎం అవుతావని నీకెవరు చెప్పారు..?’ అని ప్రశ్నించారు. అందుకు జగన్- ‘ప్రధానమంత్రి చెప్పారు సర్..’ అని వినమ్రంగా తెలిపారు. అంతలో అక్కడున్న రాహుల్ గాంధీ- ‘అయ్యో.. నాకేమీ తెలియదండీ..’-అని వాపోయాడు. ఇదీ- విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్ ‘బైఠాయింపు సీన్’ తర్వాత సోషల్ మీడియాలో పేలుతున్న జోక్. కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు ఉద్యమంలో పాల్గొనడంతో నిజంగానే ‘హోదా పోరు’ కామెడీగానే రక్తికట్టింది.

*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144