మెయన్ ఫీచర్

తెలంగాణ మీడియా బలపడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడో మూతపడిన గోలకొండ పత్రిక తర్వాత, తెలంగాణ ప్రాంతంలో గుర్తింపు పొందిన దిన పత్రికలు ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ మాత్రమే. ఉర్దూ, హిందీ వాటిని అట్లుంచితే, 1969-70 ఉద్యమ కాలంలో ఈ రెండిటివైపు తెలంగాణ ప్రజలు చూసేవారు. ఆ ఉద్యమానికి ముందు, తరువాత కూడా తమ ప్రాంత వార్తలు, సమస్యలపై వ్యాఖ్యలకు అవి రెండే ఆధారమయ్యాయి.
-----
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ప్రశ్నపై చర్చ అంటూ జరగడం లేదు కానీ అది అప్పుడప్పుడు వినవస్తున్నది. తెలంగాణ మీడియా పరిస్థితి ఏమిటని కొందరు అడుగుతుంటారు గాని అందుకు సమాధానం ఎవరూ చెప్పలేకపోతున్నారు. తెలంగాణ మీడియా గురించిన ప్రశ్నలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో అదొక నిర్దిష్టమైన సువిశాల ప్రాంతం. ప్రత్యేకమైన స్వీయ స్పృహ ఉండేది. రాజకీయ గుర్తిం పు ఉండేది. కాని అందుకు తగిన మీడియా లేదనే భావన అక్కడి వారిని తొలుస్తుండేది. ఎప్పుడో మూతపడిన గోలకొండ పత్రిక తర్వాత, ఆ ప్రాంతంలో గుర్తింపు పొందిన దిన పత్రికలు ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ మాత్రమే. ఉర్దూ, హిందీ వాటిని అట్లుంచితే. కనుక 1969-70 ఉద్యమ కాలంలో ఈ రెండిటివైపు తెలంగాణ ప్రజలు చూసేవారు. ఆ ఉద్యమానికి ముందు, తరువాత కూడా తమ ప్రాంత వార్తలు, సమస్యలపై వ్యాఖ్యలకు అవి రెండే ఆధారమయ్యాయి. మిగిలిన అన్ని పత్రికల పట్ల ఎటువంటి దృష్టి ఉండేదో తెలిసిందే. తర్వాత కాలం గడిచిన కొద్దీ తెలంగాణ స్పృహ ఎక్కువైంది. ఈసారి ఉద్యమం వచ్చేసరికి, స్థానికులే పెట్టుబడి పెట్టి, స్థానికులే నడిపే పత్రికలు లేవన్నది ఒక పెద్ద కొరతగా కనిపించసాగింది. అందుకు తగినట్లు, వివిధ పత్రికలు, ఛానళ్లు తమ ఆకాంక్షలకు, ఉద్యమానికి తగినట్లు లేవన్న అసంతృప్తి బాగా ఏర్పడింది. ఉద్యమపు చివరి దశలో ఒక దిన పత్రిక, రెండు ఛానళ్లు మొదలైనా ప్రజల దృష్టిలో అవి సరిపోలేదు. తక్కిన పత్రికలను, ఛానళ్లను ఎదుర్కొనలేకపోయాయి.
ఈ పరిస్థితులలో ఎటువంటి మార్పు లేకుండానే ప్రత్యేక రాష్ట్రం ఉనికిలోకి వచ్చింది. ఆప్పటినుంచి సుమారు రెండేళ్లు గడిచాయి. కాని మీడియా పరిస్థితి యధాతథంగా ఉండిపోయింది. ‘తెలంగాణ వారిచేత తెలంగాణ వారికోసం’ అనదగ్గ మీడియా ఆ ఒక దినపత్రిక, రెండు చానళ్లకు మించి ఏమీ రాలేదు. ఇతరులపై ప్రజలు, పార్టీలు, ఆలోచనాపరుల ఫిర్యాదులు ఎప్పటివలెనే కొనసాగుతున్నాయి. కాకపోతే ‘ఉన్నంతలో మెరుగు’ అని కొన్నింటి విషయమై సర్దుబాట్లు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులు మారే అవకాశం కనుచూపు మేరలోనైనా ఉందా? తెలంగాణవారే ప్రారంభించి, తెలంగాణ కోసమే నడుపుతూ, మంచైనా, చెడైనా, చావైనా రేవైనా తెలంగాణకోసం కట్టుబడి నిలిచే మీడియా వస్తుందా? ఒక రాష్ట్రానికి అసలు సిసలైన స్వంత మీయా అవసరమనడంలో బహుశా ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండకపోవచ్చు. అందులోనూ ఇంత పెద్ద భూభాగం, ఇం దరు ప్రజలు, ఇంతటి ఆర్థిక వ్యవస్థ, వ్యవసా య-పారిశ్రామిక-వ్యాపార రంగాల రీత్యా ప్రా ముఖ్యత, పరిపాలనా పరంగా ఇన్నిన్ని జరగ డం, మొత్తం దేశంలోనే చైతన్యవంతమైన సమాజాలలో ఒకటి కావడం వంటివి ఉన్నపుడు ఆ విధమైన మీడియా ఒక తప్పనిసరి అవసరం. అది లేకపోవడం తెలంగాణకు అన్ని విధాల ఒక పెద్ద కొరత.
కాని అది ఇప్పటికే లేకపోవడమే కాక, సమీప భవిష్యత్తులో ఏర్పాటుపై కూడా సందేహాలుండటం తీవ్రంగా ఆలోచించవలసిన విష యం. ఇంతకు ముందు లేకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. నిజాం పాలనలో గాని, 1948 లేదా 1956 తర్వాత గాని పలు కారణాల వల్ల ప త్రికలు లేకపోయాయి. నవాబు కాలంలో చదువులు, పత్రికా స్వాతంత్య్రం, పత్రికలు నడిపేందుకు ఇతర అనువైన పరిస్థితులు ఏవీ లేకపోయాయి. చిన్నచిన్న సాహిత్య-్భషా పత్రికలు మొదలై కూడా ఎక్కువకాలం నిలవలేకపోయినప్పుడు ఇక ప్రెసిడెన్సీ ఆంధ్రతో పోల్చగల పత్రికల ప్రసక్తే లేదు. అక్కడ 19వ శతాబ్ది ద్వితీయార్థంతో ఆరంభించి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దానిని బట్టి అక్షరాస్యత, పైచదువులు, సాహిత్య వ్యాసంగాలు, పట్టణీకరణ, రవాణా సదుపాయాలు, పోస్టల్ సౌకర్యాలు, పాఠకుల కొనుగోలు శక్తి, ముద్రణా పరిశ్రమ వంటివన్నీ అభివృద్ధి చెందసాగాయి. అందుకు అదనంగా సామాజిక ఉద్యమాలకు, భావ ప్రకటనా స్వేచ్ఛ కు అవకాశాలు లభించాయి. ఆ పరిస్థితుల మధ్య మీడియా పురుడు పోసుకోవడమే కాక ప్రవర్థమానమైంది. ప్రెసిడెన్సీ ఆంధ్రలో సామాజికోద్యమాలతో పాటు దేశ స్వాతంత్య్రోద్యమం కూడా విస్తరించిన కొద్దీ మీడియా రంగంలోకి చిన్నవీ, పెద్దవీ (అప్పటి స్థాయిలో) పెట్టుబడులు ప్రవేశించాయి. ఆ కాలపు పరిణామాల నుంచి ఉద్భవించడం, అప్పటి రాజకీయ- సామాజిక-ఆర్థిక శక్తులతో మమేకం కావడం వల్ల ఆ పత్రికలు సహజంగానే ఆ ప్రాంతంలో తమను తాము గుర్తించుకున్నాయి. 1956 తర్వాత అదే పరిస్థితి కొనసాగడం కూడా ఒక విధంగా సహజమైన స్థితి అయింది.
1956 నాటికి రెండు ప్రాంతాల మీడియా స్థితిగతుల మధ్యగల అంతరం భూమ్యాకాశాల వంటిదనడం అతిశయోక్తి కాదు. కొనసాగి ఉంటే మీజాన్, గోలకొండ పత్రికల భవితవ్యం ఏవిధంగా ఉండేదో చెప్పలేము కాని, అవి మూతపడటమే గాక కొత్తవి రాలేదు తెలంగాణలో. చిన్నచిన్న వార, పక్ష, పత్రికల వంటివి తప్ప. 1948లో నిజాము పోయి, 1956లో ఆంధ్ర రాష్ట్రంతో విలీనానికి మధ్య ఎనిమిదేళ్ల కాలం పాటు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా తెలంగాణ స్వంతంత్రంగా ఉండినప్పుడు రాజకీయంగా పాలించినవారు తెలంగాణేయులే. వారంతా తగినంత ధనవంతులు, బాగా చదువుకున్నవారు. అయినప్పటికీ తెలంగాణలో పత్రికల ఆరంభానికి, అభివృద్ధికి ప్రయత్నాలు జరిగినట్టు కనిపించవు. ఉండిన గోలకొండ పత్రిక బలహీన పడి 1967 నాటికి నిలిచిపోయింది. అట్లా ఎందుకు జరిగిందన్నది పరిశోధించాల్సిన అంశం. వాస్తవానికి ఆ ఎనిమిదేళ్ల హైదరాబాద్, లేదా తెలంగాణపై, నికరమైన, సమగ్రమైన పరిశోధనలు, చరిత్రలు ఇతరత్రా కూడా లేవు. మొ త్తానికి అది తెలంగాణ నాయకులు, ధనికులు, విద్యావంతుల వైఫల్యం. అది 1956 తర్వాత కొ నసాగడమే గాక, క్రమంగా సీమాంధ్ర పత్రికలు ఇటు వ్యాపించడంతో కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని ప్రభావాలు అరవయ్యేళ్ల పాటు కొనసాగాయి. ఈ మధ్యకాలంలో రెండు పత్రికలు భౌగోళికంగా తెలంగాణ (హైదరాబాద్) నుంచి ఆరంభమైనా, అవి ‘‘తెలంగాణ వారిచేత, తెలంగాణ కోసం’’ అన్నట్లు కాలేకపోయాయి.
దీనంతటి మధ్య తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడింది. 1948కి ముందుకన్న, 1948-56 మధ్యకన్న, 1956 తర్వాత కనీసం మూడు నాలు గు దశాబ్దాల కన్న పరిస్థితులు ఇప్పుడు గణనీయంగా మారాయి. సీమాంధ్ర మద్రాసు ప్రెసిడెన్సీలో 1953 వరకు భాగంగా ఉన్నప్పటికన్నా, 1953-56 మధ్య ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పటికన్నా ఈ మార్పులు ఎంతమాత్రం తీసిపోవు. సీమాంధ్ర పరిస్థితులను 1956 తర్వాత కొన్ని దశాబ్దాలు గమనించినప్పటికీ అంతకన్నా ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితులు మరీ తీసిపోయేవి కావు. వ్యత్యాసాలుంటాయి గాని అవి తగ్గుతూ వస్తున్నాయి. అభివృద్ధి పరంగా, విద్యాపరంగా, కొనుగోలు శక్తిపరంగా కూడా. ఇక సామాజిక చైతన్యపరంగా నైతే తెలంగాణ నాలుగడుగులు ముందే ఉంటుంది. వివిధ దినపత్రికల అమ్మకాలు సగటున జిల్లాకు సీమాంధ్రలో ఎంత, తెలంగాణలో ఎంత? ప్రకటనల ఆదాయి ఎం తెంత? అనే లెక్కలు మనకు నిర్దిష్టంగా అందుబాటులో లేవు గాని, సుమారు అంచనాలను బట్టి చూస్తే, తెలంగాణ పాఠకుల సంఖ్యలు, రెవెన్యూలు పత్రికలను నిలబెట్టలేవని అనలేము. అగయినప్పటికీ ఆ ప్రయత్నాలు ఎందుకు జరగడం లేదన్నది విచారించవలసిన అంశం.
ఈ రోజులలో మీడియా నిర్వహణ తేలిక కాదన్నని నిజం. ఖర్చులు పెరిగాయి. సర్క్యులేషన్ కోసం, ప్రకటనల కోసం తీవ్రమైన పోటీలు ఉన్నాయి. సమర్ధులైన సిబ్బంది కొరత ఉన్నది. తగినంత కాలం నష్టాలను భరించాలి. అయినప్పటికీ ఈ సమస్యలను తట్టుకుంటూ మీడియాను ఆరంభించి నిలబెట్టడం అసాధ్యమైనది కాదు. మీడియా నాణ్యత, ప్రమాణాలు, విశ్వసనీయతకు తగినట్లు ప్రజాదరణ తప్పక ఉంటుం ది. ముందొచ్చిన చెవుల కన్నా, వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు విజయవంతమైన మీడి యా సంస్థలే ఇందుకు ఉదాహరణ. కాని వీటన్నింటికన్నా ప్రధానమైంది, వౌలికం అయింది ఒక రాష్ట్రానికి, అక్కడి సమాజానికి తనదైన మీడియా అవసరమనే స్పృహ. దానిని సృష్టించుకొని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అక్కడి వారిదే.
మీడియాకు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని అనుకూలతలు ఉండేవి. ఆరంభించేందుకు గాని, న డిపించేందుకు గాని, కొన్ని రంగాలనుంచి కొం దరికి సులభమైన ఆదాయాలు లభించేవి. ఆ సొమ్ముతో మీడియా సంస్థల ఆరంభం తేలికయ్యేది. నష్టాలు వచ్చినా సమస్య లేదు. రకరకాల పద్ధతులలో వాటిని పూడ్చుకునేవారు. పలువురికి అధికారంలో గల వారినుంచి ఆదరణలుండేవి. కొన్ని మీడియా సంస్థలను కేవలం రాజకీయం కోసం నిర్వహించేవారు. ఖర్చులను, నష్టాలను రాబట్టటం మాట అట్లుంచి మీడియాను అనువుగా చేసుకుంటూ ఇతరత్రా గణనీయంగా సంపాదనలు చేసిన వారున్నారు. ఈ తరహావి గాక, చిరకాలంగా స్థిరపడిన సంస్థలు కొన్నున్నాయి. అట్లా స్థిరపడిన వాటిల్లోనూ కొ న్ని అనంతర కాలంలో అవాంఛనీయ మార్గాల ను అనుసరించాయి. గమనించదగినదేమంటే, అటువంటి కాలంలోనూ, కనీసం అటువంటి వర్గాలవారు కూడా ‘‘తెలంగాణ వారి చేత, తెలంగాణ వారికోసం’’ అన్న పద్ధతిలో తగినన్ని మీడియా సంస్థలను సృష్టించలేకపోయారు. వారిలో సహజమైన, ఆరోగ్యకరమైన వ్యాపార సంస్కృతి అభివృద్ధి చెందకపోవడమైనా అం దుకు కారణం కావచ్చు, లేక ఆ తరహా ‘కళ’ లేనందుకో, లేక అసలు మీడియా ప్రాముఖ్యత అనే స్పృహ కలగకపోవడంతోనో అయి ఉం డాలి. మొత్తానికి 2014 జన్‌లో రాష్ట్రం ఏర్పడే సరికి అటువంటి పరిస్థితి ఉంది.
రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితులు తగినంత మారాయి. పైన అనుకున్న తరహాలో ‘తేలిక సంపాదనలకు’ అవకాశాలు అంతగా కనిపించడం లేదు. అది లేదు కనుక మీడియా సంస్థల ఆరంభం, నష్టాలు భరిస్తూ నిర్వహణ ఆమేరకు మరింత కష్టం. పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే విధంగా ఉందంటున్నారు. కనీసం ఇప్పటికి. పైగా ప్రధానమైన పత్రికలతో అక్కడ కొత్తవాటికి ఆస్కారం తక్కువ. ‘‘అక్కడి వారిచేత, అక్కడి కొరకు’’ అనదగ్గ పత్రికలకు కొరత లేదు. ఈ కొరత ఉన్నది తెలంగాణ రాష్ట్రంలోనే. అందువల్ల అక్కడ మీడియా సంస్థల రాక అవసరం. కాని పైన అనుకున్నట్లు, రాష్ట్ర విభజన అనంతరం ‘‘తేలిక సంపాదనలకు’’ అవకాశం తెలంగాణలో చాలావరకు తగ్గింది. అటువంటి అవకాశాలు ఉండిన ఉమ్మడి రాష్టల్రోనే ఆ పని ఒక పరిమితిలో చేయగలిగిన అక్కడి ధనిక వర్గాలు, మీడియా మాట అప్పుడే ఆలోచించలేదు. అటువంటిది తేలిక సంపాదన అవకాశలు స్వల్పమైన పరిస్థితుల్లో ఏ వైఖరి తీసుకుంటాయో ఊహించవచ్చు.
ఇదంతా సమస్యల మాట. సమస్యలున్నాయని అవసరాలు మాయమైపోవు. అవసరం రాష్ట్రానిది, సమాజానిది. దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో అక్కడి ప్రయోజనాలతో, ప్రజలతో, ఆ నేలతో మమేకమైన మీడియా ఏర్పడింది. అవి ప్రస్తుత దశలో బలమైనవి కావచ్చు, సాధారణమైనని కావచ్చు. కాని ఆ దృష్టి ముఖ్యం. ఒక సమాజానికి, స్వంత మీడియా అన్నది ఆత్మ వంటిది. అది మన సంస్కృతిలో భాగం వంటిది. అందువల్ల తెలంగాణ ‘‘తనవారి చేత, తనకొరకు’’ అనగల మీడియా పెరగాలి.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)