మెయన్ ఫీచర్

వామపక్షాల మహా డైలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వామపక్షాలు పైకి ఏమిచెప్పినా లోలోపల ఇంకా డైలమాలోనే ఉన్నాయా? ‘బూర్జువా’ పార్టీలతో ఏదో ఒక పేరు తో చేతులు కలపటంవల్ల జరిగిన మేలేమో గాని రాజకీయంగా చాలా నష్టపోయామని, అందువల్ల తమలో తాము ఐక్యత సాధించటం, ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయటం అనే రెండు పద్ధతులను అనుసరించి తామే ప్రత్యామ్నాయంగా ఎదగాలని 2014 ఎన్నికల అనంతరం వారు నిర్ణయించుకున్నారు. దానినిబట్టి వారు అనేక ప్రయోగాలు, వైఫల్యాల తర్వాత ఒక పెద్ద పాఠం నేర్చుకున్నట్లు కనిపించింది. అందులో తగినంత తర్కం కూడా ఉంది.
అయితే, జాతీయ స్థాయి ‘బూర్జువా’పార్టీలతో పొత్తుల గురించిన ఈ స్పష్టత ప్రాం తీయ పార్టీలతో పొత్తుల విషయమై లేదు. ప్రాంతీయ పార్టీలన్నవి, జాతీయ పార్టీల కేంద్రీకృత విధానాల పట్ల నిరసన భావనల నుంచి, ప్రాంతీయ ఆర్థిక- రాజకీయ- సామాజిక శక్తులకు తాము స్వయంగా ఎదగాలనే కోరిక కలగటం నుంచి, గుర్తింపు రాజకీయాల నుంచి ఎదిగివచ్చాయి. ఆ పార్టీల పట్ల ఇటువంటి అవగాహన గల వామపక్షాలు ఇది ప్రగతిశీలమైన ధోరణి అని భావించి వాటిని ఆహ్వానించాయి. వాటితో పొత్తులు పెట్టుకున్నాయి. దైనందిన రాజకీయాలకు సంబంధించి కూడా, జాతీయ పార్టీల ప్రాబల్యాన్ని సమతులనం చేసేందుకు, తాము స్వయంగా విస్తరించటానికి జాతీయ ‘బూర్జువా’ పార్టీలకన్న ప్రాంతీ య పార్టీలే ఎక్కువ ఆసరా కాగలవని భావించారు.
కాని కొన్ని దశాబ్దాల అనుభవాలతో వారికి ఇదంతా నిజమనిపించలేదు. ఏ విధంగానైతే జాతీయ ‘బూర్జువా’ పార్టీలతో పొత్తువల్ల ఆ పార్టీలు లాభపడి తాము నష్టపోయామో, ప్రాంతీయ పార్టీలతో పొత్తువల్ల సైతం అదే జరుగుతున్నదని వారు క్రమంగా గ్రహించారు. ప్రాంతీయ పార్టీలకు పైన పేర్కొన్న ‘ప్రగతిశీల’ లక్షణాలు కాదనలేనివి, ఒక చారిత్రక దశలో అవి దేశ రాజకీయాలను ముందుకు తీసుకుపోయినవి అయినప్పటికీ, క్రమంగా అవి కూడా ఆ లక్షణాలను కోల్పోయి జాతీయ ‘బూర్జువా’ పార్టీల స్వభావానే్న సంతరించుకున్నాయన్నది వామపక్షాల ప్రస్తుత అవగాహన. ఇందులో నిజం కొంత, నిజం కానిది కొంత ఉందన్నది వేరే విషయం. కాని వారు అటువంటి అవగాహనకు రావటం నిజం. ఇటీవలి బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఆరు వామపక్షాలు కలిసి స్వతంత్రంగా పోటీచేయటం వెనుక ఉన్నది ఈ అవగాహనే. ఫలితాలు ఏ విధంగా ఉన్నాయన్నది వేరే చర్చ.
ఈ పరిణామాల మధ్య గమనించదగ్గది ఒకటున్నది. జాతీయ ‘బూర్జువా’ పార్టీలతో పొత్తుకు ససేమిరా అన్న వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు అంతే పూర్తిగా ససేమిరా అంటున్నట్లు లేవు. అటువంటి పొత్తులు ‘జాతీయ స్థాయిలో’ ఉండవని, నిర్ణయాలను తమ రాష్ట్ర శాఖలు తీసుకోగలవని చెప్తున్నాయి. ఇందులో కన్పించే సూచన ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. కాని అదే సమయంలో బిహార్‌లోని ఈ పార్టీల రాష్ట్ర శాఖలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు అక్కరలేదని, విడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో వైరుధ్యం ఉన్నదనటం లేదు. ప్రాంతీయ పార్టీలతో పొత్తుల విషయమై రాష్ట్ర శాఖలు నిర్ణయించగలవనే మాటకు అర్థం, పొత్తులు అవసరమో కాదో ఆలోచించి ఆ ప్రకారం నిర్ణయిస్తారని తప్ప, అవి జరిగి తీరుతాయని కాదు. బిహార్ శాఖలు తమ ఆలోచనలు తాము చేసి విడిగా పోటీచేయాలనుకున్నాయి. ఇందులోని వారి ఆలోచనలు ఏమిటన్నవి మనకు తెలియవు. ఎన్‌డిఎ వల్ల మహాకూటమికి ముప్పులేదనే భరోసా ముందే కలిగి ఉండవచ్చు. లేదా తమ కొత్త ప్రయోగం తాము చేయాలనుకొన్నారేమో. ఇటువంటి ప్రయోగాలు మరికొన్నింటి తర్వాత అనుభవాలను సమీక్షించుకుని తిరిగి నిర్ణయాలకు వస్తారేమో తెలియదు. కేరళ, బెంగాల్‌లలో పుంజుకుంటున్న సూచనలు ఉన్నందున తిరిగి తమ పట్టుపురుగు గూడులోకి వెళ్లి వెనుకటి వైఖరులను కొనసాగిస్తారేమో కూడా చెప్పలేము. ఎందుకంటే, రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు సుస్థిరంగా ఉండవనే మాట ఇతరులకే కాదు, వామపక్షాలకు కూడా వర్తించటం వ్యవస్థలలో అనివార్యం.
ఇటువంటి దూరదృష్టితోనే కావచ్చు, ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు పూర్తి ససేమిరా అనకుండా, తమ ప్రాంతీయ శాఖల పేరిట చిన్న అవకాశం కల్పించుకున్నారు. పైగా కేరళ పరిస్థితి ఒకటి ఉండనే ఉన్నది. బెంగాల్‌ది ‘లెఫ్ట్ ఫ్రంట్’కావచ్చు గాని, కేరళది ‘లెఫ్ట్-డెమోక్రటిక్ ఫ్రంట్’. అక్కడి కూటమిలో లెఫ్ట్ పెద్ద శక్తిఅయినందున దాని నాయకత్వాన ‘డెమోక్రటిక్’ పార్టీలు చేరాయి. లోగడ వి.పి.సింగ్ నాయకత్వాన నేషనల్ ఫ్రంట్‌లో తాము మైనారిటీ గనుక అది ‘డెమోక్రటిక్- లెఫ్ట్‌ఫ్రంట్’వంటిది అయింది. ఈ రకరకాల నమూనాల ప్రయోగాలు లేదా ఎత్తుగడలు ఉంటూనే ఉన్నాయి. అందువల్ల భవిష్యత్తులో ఎపుడు ఏమవుతుందనేది అట్లుంచితే, ప్రస్తుతానికి మాత్రం జాతీయ బూర్జువా పార్టీలతో పూర్తి ససేమిరా, ప్రాంతీయ పార్టీలతో సగం ససేమిరా అన్నది వారి వైఖరి అనుకోవాలి.
అయితే దీనంతటిలో వారు జాతీయ బూర్జువాలను, ప్రాంతీయ బూర్జువాలను నిందిస్తున్నారు గాని, స్వయంగా తాము చేసిన తప్పుల గురించి అంతగా చెప్పటం లేదు. ఆ పొత్తులను అప్పటి అవగాహనలు, పరిస్థితులనుబట్టి పెట్టుకుని ఉండవచ్చు. ఒక విధంగా అది అవసరం కూడా. కాని, రెండు ప్రశ్నలున్నాయిక్కడ. ఆ పొత్తుల ద్వారా బిజెపి వగైరా ప్రమాదాలను నిలువరించటం, ప్రభుత్వ విధానాలను వీలైనంత ప్రభావితం చేయటం వరకు సరే. కాని ఆ సమయాలలో ఆ అవకాశాలను ఉపయోగించుకుని తమ పార్టీలను శక్తివంతం చేసుకోవటానికి జరిగిందేమిటి? అసలు పొత్తులు ఉండటం, ఉండకపోవటం అనే దానితో నిమిత్తం లేకుండా, తాము విస్తరించేందుకు తగిన ఆర్థిక-సామాజిక పరిస్థితులు ఉన్న రాష్ట్రాలలో ఆ దిశగా చేసింది ఎంత? అందువల్ల, బూర్జువా పార్టీలతో పొత్తులదే దోషమంతా అనలేరు. ఆ పొత్తులు తెంచివేసుకోవటంతో అంతా బాగుపడిపోదు.
పైన వేసుకున్న రెండు ప్రశ్నలలో ఇమిడి ఉన్న అంశాలు, అర్థాల కారణంగానే నిజానికి వామపక్షాల వ్యూహాలు కొన్ని విఫలమయ్యాయి. ఉదాహరణకు 2009, 2014 ఎన్నికలకు ముందు కాలంలో థర్డ్‌ఫ్రంట్ నినాదాన్ని అందరికన్నా ఎక్కువగా భుజానికెత్తుకున్నది వారే. విశ్వనీయత, నికరమైన వైఖరులు లేని ప్రాంతీయ పార్టీలతో అటువంటి కూటమి వీలుకాదని ఎందరు వ్యాఖ్యానించినా వామపక్షాలు వెనుకకు తగ్గలేదు. ప్రాంతీయ పార్టీలలో పరివర్తన అంతకు క్రితమే ఎప్పుడో మొదలైందన్నది కనిపిస్తున్నదే. ఆ పరివర్తన రెండువిధాలుగా జరిగింది. ఒకటి ఆర్థిక విధానపరమైనది. అంతకన్న ముఖ్యంగా, దాదాపు వారందరికీ బిజెపి అంటరానిదేమీ కాకుండా పోయింది. ఈ రోజున దేశాన్నంతా వెతికినా బిజెపితో ఏదో ఒక దశలో పొత్తులేనివి, లేదా అందుకు సుముఖత చూపనివి ఒకటిరెండు మించి లేవేమో. వాస్తవానికి ఈ పరిస్థితి 2009/2014 నాటికే ఏర్పడింది. అయినప్పటికీ వామపక్షాలు ఎండమావుల వెంట పరుగుతీస్తూనే పోయా యి. అట్లా ఎందుకు తీయవలసి వచ్చిందన్నది అసలు ప్రశ్న. సమాధానం సూటిగా చెప్పాలంటే వారు ఎదగలేదు. కనుక తమను ఎవరూ లెక్కించని స్థితి, అవసరమైనపుడు మాత్రం ఉపయోగించుకునే స్థితి వచ్చింది. అయినప్పటికీ వామపక్షాలు తమకు గత్యంతరం లేదనుకోవటం అన్నింటికి మించిన దయనీయత. ‘టూరిజం తప్ప ఇక ఏ ఇజమూ లే’దని ఈసడించిన చంద్రబాబుతో, తను ఆర్థిక విధానాలు మార్చుకోకుండానే మార్చుకున్నానంటూ చేసిన నటనను ఆసరాచేసుకుని 2009లో ఆయన పట్ల వైఖరి మార్చుకోవటం ఇందుకు మంచి ఉదాహరణ. ఇపుడు బిహార్‌లో బిజెపి కూటమితో తీవ్రమైన పోటీ ఉన్నట్లు కనిపించినా, మహాకూటమి నాయకులు వామపక్షాలతో పొత్తు విషయాన్ని పట్టించుకోకపోవటం ఈ క్షీణస్థితికి తాజా ఉదాహరణ. కనుక, ఇక ఎవరితోనూ పొత్తులుండవన్నది ఒక విధంగా ‘అవసరార్థపు పాతివ్రత్యం’ వంటిది.
సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఇదే నెలలో ఒక తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, తమ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు బిజెపి గెలవగలదన్న భయంతో మహాకూటమికి ఓటేసారన్నారు. పార్టీ నాయకత్వం కార్యకర్తలకు దగ్గరకాకపోవటం గురించి కూడా చెప్పారు. తమ సభలకు, ఆందోళనలకు జనం చాలా వస్తున్నారని, కాని ఓట్లుమాత్రం వేయనిది ఎందుకో తెలియటంలేదని సుమారు ఆరేళ్ల క్రితం సిపిఎం నాయకుడు బి.వి.రాఘవులు అన్నారు. ఇట్లా ఎందుకు జరుగుతున్నదో గ్రహించటం ఈ రెండు పార్టీల నాయకులకు కష్టం కాకూడదు. వామపక్ష కార్యకర్తలు, సానుభూతిపరులు గంగానదీ పరీవాహక ప్రాంతంలో కుల గుర్తింపు పార్టీలవైపు, (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ వంటిచోట్ల ఎన్టీఆర్ వంటి వారివైపు, దేశవ్యాప్తంగా నక్సలైట్ల దిశగా ఆకర్షితులు కావటం, చివరికిపుడు బెంగాల్‌లో బిజెపి మద్దతుదారులవుతుండటం వంటివన్నీ ఏంచెప్తున్నాయి? ఈ పరిణామక్రమం దశాబ్దాల క్రితమే ఆరంభమై ఇప్పటికీ కొనసాగుతున్నదనేది అన్నింటికన్న ప్రధానంగా కనిపిస్తున్న వౌలిక వాస్తవం. ఈ క్రమం దశాబ్దాల కాలానిది అయినపుడు ఇరుపార్టీల నాయకులు ఇపుడు ఆశ్చర్యపోవటం ఎందుకు? పైగా, ఎవరో ఒకరిని ‘‘నిలువరించటం’’కోసం ఆ విధంగా ఓటుచేయాలని తామే స్వయంగా ప్రోత్సహించినపుడు, మెటీరియలిస్టు అవసరాలు తెలిసినంతగా సిద్ధాంతాలు వంటబట్టని కార్యకర్తలు, సానుభూతిపరులు, వామపక్షాల వయా మీడియాకన్న ఆయా పార్టీలను నేరుగానే ఆశ్రయించటం మెరుగని ఒక దశ తర్వాత భావించారా? ఇందులో దోషాలు రెండున్నాయి. తాము స్వయంగా బలపడకపోవటం వౌలికమైంది. ఇతరులవైపు చూసేట్లు ప్రోత్సహించటం రాజకీయమైంది. తాము ఈ పేరిట సంపాదించ జూస్తున్నది మరొక రెండు సీట్లు మాత్రమేనన్న భావన ఏర్పడి, కాలక్రమంలో స్థిరపడిపోయిన తర్వాత, బయటివారిని అట్లుంచి తమ కార్యకర్తలకు, సానుభూతిపరులకైనా తమపట్ల గౌరవం, విశ్వాసం ఎట్లా కలుగుతాయి? బిహార్‌లో మహాకూటమికి గాక తమకెందుకు ఓటువేస్తారు?
ఇటువంటి ప్రశ్నలు అనేకం మనకేగాక వారికి కూడా తప్పక ఎదురవుతూనే వుండి ఉంటాయి. జాతీయ ‘బూర్జువా’ పార్టీలతో పొత్తుకు సంబంధించి 2019 ఎన్నికల విషయమై ఒక ఊహాత్మక చిత్రాన్ని చూద్దాము. ఇటీవల మోదీ/ బిజెపి బలహీనపడుతున్న అభిప్రాయం కలుగుతున్నది. కాని రానున్న మూడు సంవత్సరాల అసెంబ్లీలను, తర్వాత లోక్‌సభనూ వారు గణనీయంగా గెలవగల పరిస్థితులు ఏర్పడతాయని అనుకుందాము. ఈలోగా వామపక్షాలు బలపడగలవా? ప్రాంతీయ పార్టీలతో పొత్తులకోసం తమ రాష్టశ్రాఖలకు అనుమతి ఇస్తాయా? గతంలో అవగాహన ఉండిన కాంగ్రెస్ అనే జాతీయ ‘బూర్జువా’ పార్టీతో తిరిగి అవగాహనకు వస్తాయా? లేక మరేదైనా చేస్తాయా?

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)