మెయిన్ ఫీచర్

సాధికారత సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మొత్తం మీరే చేశారు చిన్నప్పట్నుంచి మీరు చేసింది చాలు, నేను కోల్పోయింది
చాలు నాకేం కావాలో, నేనేం కోరుకుంటున్నానో తెలుసుకోరు
నాకేమివ్వాలో అని ఆలోచిస్తారే గాని నాకేం కావాలో తెలుసుకోరు
అంతా మీకు నచ్చినట్లే జరగాలి నా ఆట కూడా మీరే ఆడేస్తే
ఇక నేనెందుకు నాన్నా ఆడడం’’
బొమ్మరిల్లు సినిమాలోని ఈ డైలాగులు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆ సినిమాలో తన తండ్రితో హీరో అనే మాటలివి. నిజానికి సమాజంలో మహిళల ఆవేదనకు ఆ మాటలు అద్దం పడతాయ. పాత్రలు మారతాయంతే. మనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇంకొకరు నిర్దేశిస్తుంటే కలిగే ఆవేదనను అవి సూచిస్తాయ.
‘మహిళా సాధికారత’ గురించి మాట్లాడుకుంటే యాదృచ్ఛికంగా ఎవరికైనా ఈ మాటలు స్ఫురణకు వస్తాయ. ఇంట, బయట స్ర్తిల విషయాలను నిర్దేశిస్తున్నది పురుషులే. అందుకే ఇప్పుడు మహిళా సాధికారత అనేది ప్రత్యేక దృష్టి సారించాల్సిన విషయంగా మారింది.
నిజానికి మహిళా సాధికారత అనే మాట ఈ దశాబ్దంలో చాలా తరచుగా వినబడుతోంది. వేదికలపై చర్చనీయాంశంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అసలు మహిళా సాధికారత అంటే ఏమిటి? అర్థమైనట్టే ఉండి అర్థం కాని మాటల్లో ఇదొకటి. మహిళలు ఉన్నత విద్యావంతులు కావడమా, ఉద్యోగాల్లో, సామాజిక, ఆర్థిక రంగాల్లో వారి సంఖ్య గణనీయంగా పెరగడమా, చట్ట సభల్లో, స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యం చెప్పకోతగ్గ స్థాయిలో ఉండడమా, మహిళా సాధికారత అంటే అదేనా అని ప్రశ్నించుకోవలసి వస్తోంది. కాని ఇవేవీ కూడా ఆ మాటకు సరైన అర్థాన్నిచ్చేవి కావు. ఇంట కాని బయట కాని ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా స్ర్తిలు వారికెదురయ్యే ప్రతి అంశంలోను వారే నిర్ణయాత్మక శక్తిగా ఉండగలగాలి. అంటే స్వీయ నిర్ణయాధికారం అన్నమాట. వాస్తవానికి ఇప్పుడు కొరవడింది కూడా అదే. అందుకే మహిళా సాధికారత అనేది నేటికీ ఇంకా నెరవేరాల్సిన లక్ష్యంగానే ఉంది. కాలానుగుణంగా సమస్యల స్వరూపాలు మారినట్టే సాధించాల్సిన లక్ష్యాలు మారుతూ ఉంటాయి. స్ర్తిల విషయంలో చూస్తే గత శతాబ్దపు ప్రథమార్ధంలో బాల్య వివాహాలు, బాలికా విద్య, సతీ సహగమనాలు ప్రధాన సమస్యలు కాగా, తదుపరి కాలంలోస్ర్తిల ఉన్నత విద్య, అస్థిత్వ పోరాటాలు ప్రధానాంశాలు అయ్యాయి. ఇక ఈ శతాబ్దంలోకి వస్తే మహిళల సర్వతోముఖాభివృద్ధితో పాటు మహిళా సాధికారత అనేది విస్తృత లక్ష్యంగా తెరపైకి వచ్చింది. ఇక్కడా, అక్కడా అని కాకుండా ప్రపంచ దేశాలన్నింటా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సమాజంలో పురుషులతో సమానంగా మహిళల సర్వతోముఖాభివృద్ధికి అనువైన పరిస్థితులేర్పడాలి.
ఇంటి నుంచే ప్రారంభం కావాలి
ఎవరి జీవన ప్రస్థానమైనా ప్రారంభమయ్యేది ఇంటి నుంచే కాబట్టి స్ర్తిలకు సంబంధించిన విషయాలన్నింటా స్వీయ నిర్ణయాధికారం అక్కడి నుంచే ప్రారంభం కావాలి. అదే పరిస్థితి బాహ్య ప్రపంచంలోనూ ఉండాలి. ఒకప్పటితో పోల్చి చూస్తే ఇప్పుడు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలన్నిటిలోనూ మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా కనబడుతోంది. ఈ పరిణామం వెనక పురుషాధిక్య సమాజం నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఎదిగిన నేపథ్యమూ ఉంది. పైకి ప్రస్ఫుటంగా కాకపోయినా ఇప్పటికీ మహిళల విషయాలన్నింటిలో పరోక్షంగా పురుషాధిక్యత కనబడుతూనే ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఇది మరింతగా ప్రభావాన్ని చూపుతోంది.
ప్రస్తుతం పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల ప్రాతినిధ్యం ఎంతో పెరిగినా ఈ పెరుగుదల వెనక మహిళలు స్వచ్ఛందంగా రాజకీయ రంగాన్ని ఎంచుకుని రావడం వల్ల కాక ఆపద్ధర్మంగానో, అవసరార్థంగానో ఈ రంగంలోకి తీసుకురావడం వల్లే జరుగుతోంది. ఓ నాయకుడు మరణించినప్పుడు ఆ కుటుంబం నుంచి ఒక మహిళను బరిలోకి దించి సానుభూతి ఓట్లతో గెలిపిస్తున్నారు. అలాగే మహిళల కోటాలో ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు. ఆ విధంగా అధికార స్థానాల్లో మహిళలు ఉంటున్నా వాళ్లనడ్డం పెట్టుకుని అన్ని విషయాల్నీ చక్కబెడుతోంది మగవాళ్లే. ఈ పరిస్థితి ప్రభుత్వ యంత్రాంగంలోనే కాదు ఆయా రాజకీయ పార్టీల్లో అంతర్భాగమైన మహిళా సంఘాల విషయంలోనూ జరుగుతోంది. ఏ పార్టీలోనూ స్వీయ నిర్ణయాధికారంతో మహిళలు పనిచేసే పరిస్థితి లేదు. అభ్యుదయ భావాలు గల వామపక్ష పార్టీల్లో స్థితిగతులు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేవు.
ఈ సందర్భంగా స్ర్తిల పరంగా ఉన్న లోటుపాట్లను కొంత ప్రస్తావించుకోవలసిన అవసరం ఉంది. వాళ్లు స్వచ్ఛందంగా రాజకీయ రంగాన్ని ఎంచుకుని రాకపోవడం ఓ కారణమైతే మగాళ్లతో పోటీ పడి మనం ఆ రంగంలో నెగ్గుకు రాలేమన్న భీతి కూడా ఉండడం మరో కారణం. అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్న తపన లేకపోవడం మరో కారణం. ఈ పరిస్థితిని అధిగమించి మగవాళ్లతో సమానంగా పోటీ పడగల మహిళా నేతలు (జయలలిత, మమతా బెనర్జీ) కొందరు అధికార స్థానాల్లో రాణించడం మనకు తెలుసు. కాని అలాంటి ధీర వనితల్ని మనం వేళ్ల మీద లెక్కించవచ్చు.
విద్య, ఉద్యోగ, కార్పొరేట్, కళా రంగాల్లో రాణించినంతగా పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో మహిళలు చెప్పుకోదగ్గంత స్థాయిలో రాకపోవడం వెనక వారి కృషి లోపంగా చెప్పుకోవలసి ఉంటుంది. మిగతా రంగాలన్నిటి కన్నా రాజకీయ రంగంలో ప్రవేశించిన మహిళలకే సమాజంలో ఎక్కువగా గుర్తింపు ఉంటుంది. ఎంతో కొంత అధికారం చెలాయించగలిగే అవకాశం ఉంటుంది. అందుకే కాబోలు ఇప్పుడు చట్టసభల్లో మహిళల సంఖ్య ఒకప్పటి కన్నా ఎన్నో రెట్లు పెరిగింది. మహిళా రిజర్వేషన్ విషయంలో దేశమంతా కూడా అంత సుముఖంగా లేరు. పైకి నాయకులంతా మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తూ మాట్లాడినా అంతర్గతంగా దాని పట్ల వారికి చిత్తశుద్ధి లేదు. నిజంగా సమర్థిస్తున్నట్లయతే ఈ పాటికి మహిళా బిల్లు ఎప్పుడో పార్లమెంట్‌లో పాసై ఉండేది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకరిపై మరొకరు సాకు చూపిస్తూ మహిళా బిల్లును అడ్డుకుంటున్నారు.
ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో మహిళా సాధికారతపై ప్రత్యేకంగా చర్చకు రావడం ఆహ్వానించదగిన పరిణామం. విజయవాడ సమీపంలో పవిత్ర సంగమ (ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణ, గోదావరి నదులు కలిసే చోట) స్థలిలో, ముగురమ్మల (మరియమ్మ, దుర్గమ్మ, కృష్ణమ్మ) కనుసన్నలలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు జాతీయ మహిళా పార్లమెంట్ జరగనుండడం విశేషం. ఈ సందర్భంగా మహిళా సాధికారత అంశం మరింత విస్తృత స్థాయిలో విశే్లషించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మహిళా సాధికారత సాధించే దిశగా ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమ ప్రధాన సలహాదారు సి.రామలక్ష్మి చెప్పడం ప్రస్తావనార్హం. ఈ సదస్సులో చర్చించబోయే అంశాల్లో ‘మహిళా సాధికారతతో సామాజిక, రాజకీయ మార్పులు’, ‘మహిళా స్థాయి, నిర్ణయాలు తీసుకునే శక్తి’ అనేవి మహిళా సాధికారతకు నిజమైన అర్థం చెప్పగలిగే కీలకమైన అంశాలు. మొత్తం మీద మహిళా శక్తిని వెలుగులోకి తెచ్చే ఈ ప్రయత్నం నిజమైన మహిళా సాధికారత సాకారానికి వేదిక కావాలని ఆశిద్దాం.

- డి.స్వాతి