మెయిన్ ఫీచర్

పంట పండింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిఖితా భాను బయోటెక్నాలజీ ఇంజినీర్. హైదరాబాద్‌కు చెందిన ఈ యువ ఇంజినీర్ నాలుగువేల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలో దూసుకుపోతుంది. తన వ్యాపారంలో రైతులను భాగస్వామ్యులను చేసి నాణ్యమైన, పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని ప్రజల నోటికి అందించే సామాజిక బాధ్యతతో ముందుకు వెళుతోంది. వ్యవసాయ కుటుంబ నేపథ్యంకాకపోయినా పంటలపై ఆమెకున్న పరిజ్ఞానం ఆపారం. పసితనం నుంచి తల్లి ఇంట్లో సేంద్రీయ పద్ధతిలో పండించే కాయగూరలు, పళ్ల రుచి చూసింది. ఆ రుచినే అభిరుచిగా మలుచుకుని ‘టెర్రా గ్రీన్స్ ఆర్గానిక్’
స్థాపించింది. నేడు వేలాది ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను చేయస్తూ 10వేల మంది రైతుల జీవితాలకు
ఆసరా ఇవ్వాలని ఆరాటపడుతోంది.

లిఖితా భాను తండ్రి, తాత ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ నుంచి అస్సాంకు బదిలీ అయింది. అక్కడ ఉండే తేయాకు తోటలంటే భానుకు ప్రాణం. అంతేకాదు ఇంట్లో తల్లి పెంచే మొక్కలన్నా ఎంతో ఇష్టం. ఓరోజు తల్లి తమ ఇంటి పెరట్లో కాసిన మామిడి పండును తినమని ఇచ్చింది. సేంద్రియ ఎరువులతో పండించిన ఆ మామిడి పండు రుచి భానుకు అమోఘంగా అనిపించింది. ఇలా సహజసిద్ధంగా పండిన పంటలతో వ్యాపారం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించింది. ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్న వెంటనే కార్యరూపంలో పెట్టింది. అదే‘ టెర్రా గ్రీన్స్ ఆర్గానిక్‌గా’ రూపుదాల్చింది. అస్సాం నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిన తరువాత లిఖితాభాను తల్లి పద్మజ రెండు ఎకరాల భూమిలో కూరగాయలు, పండ్లు పండించటంతో పాటు ఆవులు, కోళ్లను పెంచేది. ‘‘మా ఇంట్లో పాలు, కూరగాయలు, పండ్లు అన్నీ కూడా సేంద్రీయ ఉత్పత్తులే. చివరికి గుడ్లు, కోడి మాంసం ఇంట్లోనివే తినేవాళ్లం. మార్కెట్ నుంచి తెచ్చుకునేవాళ్లం కాదు. అంతేకాదు తల్లి ఇంట్లో పండిన వాటిని చుట్టుపక్కల వారికి ఇచ్చేది. ఇలా మేము ఇచ్చే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు అక్కడ విపరీతమైన డిమాండ్ ఉండేది. దీంతో పద్మజ వారసత్వంగా వచ్చిన 40 ఎకరాల భూముల్లో సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించి మార్కెట్‌కు తరలించేది. లిఖితాభాను చదువు అయిపోగానే ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా అమ్మ పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను వ్యాపారంగా మలిచింది.
తాతగారి విల్లాలో
లిఖితా భాను తాతగారి రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ పేరు టెర్రా ఫాం. అందులో భాను ఆరంభించిన టెర్రా గ్రీన్ ఫాం ఒక భాగంగా ఉండేది. తొలిరోజుల్లో వీటి అమ్మకాలు అంత సజావుగా జరగలేదు. పొలంలో పండిన మామిడి పండ్లను ప్యాక్ చేయించి స్థానిక షాపులకు వేసేది.తొలుత వారు తీసుకోవటానికి నిరాకరించారు. పండ్లు అమ్ముడుకాకపోతే పాడై నష్టపోవల్సి వస్తుందని తీసుకోవటానికి ఇష్టపడలేదు. అమ్ముడుపోకపోతే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని వారిని ఒప్పించి సరఫరా చేసింది. తియ్యగా ఉన్న ఆ మామిడి పండ్ల రుచి బాగుండటంతో చాలామంది ఫోన్లు చేసి పంపమనేవారు. దీంతో మామిడి పండ్లను ప్యాక్‌చేసి ‘టెర్రా గ్రీన్ ఫాం’ అనే లేబుల్ అంటించి సరఫరా చేసేవాళ్లం. ఆనాడు మామిడి పండ్ల అమ్మకాల వల్ల రూ.3,50,000 ఆదాయం వచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో 2015లో ‘టెర్రా ఆర్గానిక్ ఫాం’ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సంస్థ బోర్డు ఆఫ్ డైరక్టర్స్‌గా రైతులు కూడా ఉంటారు. రైతులను భాగస్వామ్యులను చేయటం వల్ల తక్కువ కాలం నిల్వ ఉండే ఆకుకూరలు తదితర వాటి రవాణాకు ఆటంకాలు కలుగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇతర రాష్ట్రాలలో..
ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులంటే ఏమిటో కూడా తెలియని రాజస్థాన్‌లో గోధుమలను పండించి సరఫరా చేస్తున్నారు. అలాగే మహారాష్టల్రో ఇలాంటి ఉత్పత్తులకు విపరీతంగా డిమాండ్ తీసుకరావటం జరిగింది. కర్నూలు రైస్ అంటే దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. అలాంటి కర్నూలు రైస్‌ను కూడా సేంద్రియ పద్ధతిలో పండించి అమ్ముతున్నాం.
90 రకాల వస్తువులు
ఓ ఇంట్లో ఉపయోగించే 90 రకాల వస్తువుల జాబితాను రూపొందించి వాటిని పండిస్తూ వినియోగదారుడికి అందించే ధ్యేయంతో రూ.6కోట్లతో ఈ సంస్థను ప్రారంభించటం జరిగింది. తొలుత నాణ్యమైన ఆర్గానిక్ ఉత్పత్తులను ట్రేడర్స్ నుంచి సేకరించి అమ్మేవాళ్లం. ఎందుకంటే మా రైతులు వేసిన పంటలు చేతికి వచ్చి వ్యాపారం అభివృద్ధి చెందాలంటే కనీసం కొంతకాలం పడుతుంది కాబట్టి తొలిసారిగా మా ఉత్పత్తులను రుచి చూసిన వినియోగదారుడు నిరుత్సాహపడకుండా బయట సేకరించిన ఆర్గానిక్ వస్తువులను అమ్మేవాళ్లం. మూడేళ్ల తరువాత తమ రైతుల పంటలు చేతికి వచ్చి వాటినే సరఫరా చేస్తున్నాం. వినియోగదారుల ఆరోగ్యం, పోషకవిలువల విషయంలో ఎలాంటి రాజీపడకపోవటం వల్లే లాభాల బాటలో పయనిస్తున్నామని భాను అంటున్నారు. ఎప్పటికప్పుడు రైతులతో సమావేశాలు ఏర్పాటుచేసి ఆర్గానిక్ సాగుపై శిక్షణ ఇస్తుంటాం. అలాగే రైతులు సలహాలు కూడా తీసుకుంటాం. రైతులు భూములు కూడా సారావంతంగా ఉండటం వల్ల రైతులు తమ సంస్థలో చేరటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
10 వేలమంది రైతుల భాగస్వామ్యానికి ప్రణాళిక
ప్రస్తుతం మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో 4వేల మంది రైతులు తమ సంస్థలో ఉన్నారు. 600 వందల మేజర్ స్టోర్స్‌కు తమ ఉత్పత్తులను సరఫరాచేస్తున్నాం. ఏడాదికి 15 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాం. బహుళజాతి సంస్థల పోటీని తట్టుకుని వ్యాపారాన్ని నిర్వహించటం అంత తేలికైనా విషయం కాదు. ఎందుకంటే దాదాపు 1.5 బిలియన్ల మంది నోళ్లకు ఆహారాన్ని అందించే పని రైతులు చేస్తున్నారు. రైతు లేనిదే ప్రజలకు తిండే లేదు. ఈ సూత్రాన్ని నమ్ముతూ వినియోగదారుల ఆరోగ్యం, పోషకవిలువలే ధ్యేయంగా ఈ ఉత్పత్తులను అందిస్తున్నామని చెబుతున్నారు లిఖితాభాను.

చిత్రం..తల్లి, మహిళా కార్మికులతో లిఖితాభాను

టి.ఆశాలత