మెయన్ ఫీచర్

అభాగినులకు పునరావాసం అసలు సమస్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మహిళల అక్రమ రవాణా మానవాళికి ప్లేగ్ వ్యాధి వంటిది’ అన్నారు పోప్ ఫ్రాన్సిస్. ఇంకా చెప్పాలంటే ప్లేగ్ కన్నా భయంకరమైంది. తగు పారిశుధ్య చర్యలు, వైద్య సదుపాయాలతో ఆ వ్యాధి అంతరించిపోతుంది. కానీ, మహిళల అక్రమ రవాణా సమస్య- మనిషిలో స్వార్థం, ఆకలి, దారిద్య్రం ఉన్నంత కాలమూ ఉంటుంది. వస్తువులను ఒక చోట నుండి మరొక చోటకు తరలిస్తే దానిని ‘రవాణా’ అంటాం. జాతీయ, అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాలను ఎగుమతి, దిగుమతి చేయడం- స్మగ్లింగ్‌కు తోడ్పడడం ఇట్లాంటి వాటిని ‘అక్రమ రవాణా’ అంటాం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, బాలికలను అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) చేసే ముఠాలు యథేచ్ఛగా పనిచేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఇటలీలోని ‘పాలెర్మో’ అనే చోట డిసెంబర్ 2000లో- మహిళల అక్రమ రవాణా నివారణ, దోషులను శిక్షించడం అనే విషయాలపై ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశానికి భారత్ సహా సభ్య దేశాలన్నీ హాజరై ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన అంశాలకు అంగీకారం ప్రకటించాయి. దీనినే ‘పాలెర్మో ప్రొటోకాల్’ అని అంటారు. పాలెర్మో ప్రొటోకాల్ ‘అక్రమ రవాణా’ (ట్రాఫికింగ్)ను ఇలా నిర్వచించింది. ‘బలవంతంగా ఎత్తుకుపోవడం, వత్తిడి తేవడం, మోసం చేయడం, అధికార దుర్వినియోగం, దళారీలకు ధనం చెల్లించడం వంటి చర్యలతో మహిళలను, బాలికలను తరలిస్తే అది అక్రమ రవాణా అవుతుంది. ఈ సమస్య చాలాదేశాల్లో జాతీయంగాను, అంతర్జాతీయంగాను విషమిస్తోంది.
పేదరికం, కుటుంబ సభ్యులు లేకపోవడం, భర్త వదిలేయడం వంటి సందర్భాల్లోనూ స్ర్తిలు అక్రమ రవాణాకు గురవుతున్నారు. అయితే, బలవంతంగా ఎత్తుకునిపోవడం, నయవంచన వల్లనే ఎక్కువమంది మహిళలు, బాలికలు వేరే ప్రాంతాలకు చేరుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) ఇటీవల ప్రకటించిన గణాంకాల ప్రకారం- 2010లో అక్రమ రవాణాకు గురైన వారి సంఖ్య 29,795 కాగా, 2014 నాటికి ఆ సంఖ్య 57,311కు చేరింది. బలవంతంగా ఎత్తుకుపోయిన మహిళలను వ్యభిచార వృత్తిలో దించుతారనే విషయం బహిరంగ రహస్యం. నేపాల్, బంగ్లాదేశ్ మొదలుకొని భారత్‌లోని ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్‌కత వరకూ దక్షిణ ఆసియాలో ఈ అక్రమ రవాణా విస్తృతంగా సాగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ‘సంఘటిత నేర వ్యవస్థ’గా సాగుతున్న పది బిలియన్ డాలర్ల బృహత్ వ్యాపారమిది! స్ర్తిల అక్రమ రవాణాపై సిద్ధార్థ కారా ‘సెక్స్ ట్రాఫిక్ ఇన్‌సైడ్ ది మోడరన్ వరల్డ్ ఆఫ్ సెక్స్ స్లేవరీ’ (ఆధునిక లైంగిక బానిసత్వంలో లైంగిక అక్రమ రవాణా) పేరిట రాసిన పుస్తకంలో- ‘ప్రతి అరవై సెకండ్లకు ప్రపంచం మొత్తం మీద ఒక స్ర్తి లేదా ఒక బాలిక అక్రమ రవాణా అవుతున్నది’ అని రాశారు. రేఖా పాండే రచించిన ‘సెక్స్ ట్రాఫికింగ్ ఇన్ సౌత్ ఏషియా విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఇండియా’ పుస్తకంలోనూ అనేక ఆందోళనకరమైన విషయాలు రాశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎంతోమంది మహిళలు ‘ట్రాఫికింగ్’ బారిన పడుతున్నారు.
‘లైంగిక అక్రమ రవాణా అనేది సమకాలీన ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ వ్యవస్థల అత్యంత వికృతరూపం. ఆర్థిక ప్రపంచీకరణతో ప్రపంచంలో పెచ్చుపెరిగిపోతున్న అసమానతల ఫలితమిది. పెరిగిపోతున్న గ్రామీణ దారిద్య్రం, బీదల అసహాయత, సంపన్నులకు తరలిపోతున్న ఆర్థిక వనరులు ఇందుకు కారణం’ అని మనం అంగీకరించాలి. ‘ప్రజ్వల’ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ సునీతా కృష్ణన్ అభిప్రాయపడినట్లు ‘ప్రపంచం మొత్తం మీద ఇది మూడవ స్థానాన్ని ఆక్రమించే సంఘటిత నేర వ్యవస్థ’ అని గ్రహిస్తే సరిపోతుంది. ‘ఈ అక్రమ రవాణా మహిళల శరీరాన్ని, మనసును, ఆత్మను కూడా నాశనం చేస్తుంది’ అనే మాటలు అక్షర సత్యాలు.
ఉద్యోగం పేరిట మోసం, ప్రేమలు-పెళ్లిళ్ల ముసుగులో వంచన, ఆర్థిక సమస్యలు, బలవంతంగా తరలించడం వంటి కారణాలతో అక్రమ రవాణాకు గురైన మహిళలు చివరికి వ్యభిచార కూపాలలో ఇరుక్కుపోతున్నారు. బీజాపూర్‌లోని మిజాఫర్‌పూర్ అనే పట్టణంలో- 2012 సెప్టెంబరులో ‘నవారునీ’ అనే పనె్నండేళ్ల బాలికను కొందరు దుండగులు బలవంతంగా ఎత్తుకుపోయారు. ఆ బాలిక ఏమైంది? ఎక్కడుంది? ఏ వ్యిభిచార గృహంలో మగ్గుతోంది? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే లేరు. ఆ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూ, ఉన్నతాధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి ఎంతో అవస్థ పడినా పట్టించుకునే నాథుడే లేడు. తల్లిదండ్రుల చెంతకు తిరిగి చేరని ఇలాంటి ‘నవారునీ’లు ఈ దేశంలో ఎందరో?
2016 ఆగస్టులో ‘నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ’ సుప్రీంకోర్టుకు ఒక నివేదికను ఇస్తూ- జాతీయ,రాష్ట్ర,జిల్లా స్థాయిలలో ‘నోడల్ ఏజెన్సీ’లను ఏర్పాటుచేసి, బాలికల అక్రమ రవాణాను నిరోధించడానికి, వ్యభిచార గృహాలలో చిక్కుకుపోయినవారిని రక్షించి, పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి ఏర్పాటైన కేంద్ర కమిటీ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి ప్రవేశించిన వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ విషయమై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రామాణిక విధి విధానం (స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్) వుండాలని నిర్ణయించడమే కాక, దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాను నిరోధించే కేంద్రాలు (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అసలు సమస్యంతా ఇక్కడే వుంది. పోలీసులు వ్యభిచార గృహాలపై దాడిచేసి, అక్కడ వున్న స్ర్తిలను అవమానపరుస్తూ కేసులు పెడుతున్నారు. ఐచ్ఛికంగా ఈ వృత్తిలో దిగినవారికి, దౌర్జన్యంగా ఈ కూపాలలోనికి దించబడినవారికీ తేడాను పోలీసులు చూపించడం లేదు. సంస్కరణ గృహాల్లో చేర్చిన వారికి ఆహారం, నీరు, విద్య, జీవించే హక్కు, జీవనభృతి పొందేందుకు అవకాశాలను కల్పించడం, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా చేయడం ప్రభుత్వ బాధ్యత. సంస్కరణ గృహాల్లో వాతావరణం- కొందరు మహిళలు తిరిగి తమ వృత్తిలోనికి వెళ్లిపోతేనే బాగుంటుందనేలా చేస్తున్నది!
కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కింబర్లీ వాల్టర్స్ హైదరాబాద్‌లోని బాధిత మహిళల పునరావాసం కోసం ఏర్పాటయిన ‘రక్షణ గృహాలు’ (రెస్క్యూ హోమ్స్) పరిస్థితిని గురించి చెబుతూ, ఈ రక్షణ గృహాల్లో 2011, 2014 సంవత్సరాలలో జరిగిన రెండు సంఘటనల గురించి తన వ్యాసంలో వివరించారు. 2011లో రక్షణ గృహంలో ‘బంధించబడిన’ స్ర్తిలు ఒక్కుమ్మడిగా తిరగబడి గార్డును చావబాది, రక్షణ గృహానికి తాళం వేసి 30 మంది వరకూ పారిపోయారు. 2014లో హైదరాబాద్‌లోని మరొక ‘రక్షణ గృహం’లో 300 మంది స్ర్తిలు కూడా ఇదేమాదిరిగా తిరగబడి నలుగురు సిబ్బందిని గాయపరిచడమే కాకుండా అక్కడ వున్న ఐదు లక్షల రూపాయల విలువైన సామగ్రిని ధ్వంసం చేసి పారిపోయారు. ఈ ఘటనలు ఎందుకు జరిగాయి? రక్షణ గృహాలు బాధిత మహిళలను నిజంగా రక్షిస్తున్నాయా? పునరావాసాన్ని కల్పించి వారి కాళ్లమీద వారు నిలబడేలా చేస్తున్నాయా? అనేది ఆలోచించాల్సిన విషయం.
అక్రమ రవాణాకు గురైన స్ర్తిలకు పునరావాసం కల్పించేందుకు ముంబయి, చెన్నై, కోల్‌కత , హైదరాబాద్ వంటి పెద్ద నగరాలలోనూ, కొన్ని చిన్న నగరాలలో కూడా ఇట్లాంటి పునరావాస గృహాలున్నాయి. వాటిలో కొన్ని ప్రభుత్వ పరంగా నడిచేవి. కొన్ని జాతీయ, అంతర్జాతీయ విరాళాలతో నడిచేవి. కాని, వీటిలో అత్యధిక శాతం సక్రమంగా పనిచెయ్యడం లేదనేది చేదు నిజం. వ్యభిచార గృహాల్లో వున్న స్ర్తిలను తీసుకొచ్చి రక్షణ గృహాల్లో చేర్చితే బాధ్యత తీరిపోతుందా? ‘వ్యభిచారం చేయడం నేరం, మహాపాపం’ అని ఉపన్యాసాలు ఇప్పిస్తే సరిపోతుందా? బాధిత మహిళలకు కనీస సౌకర్యాలు, స్వయం ఉపాధి, భద్రత వంటివి కల్పించనక్కర్లేదా? వ్యభిచార గృహాల నుంచి విముక్తి పొంది, రక్షణ కేంద్రాలకు చేరుకున్న మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నది కాదనలేని నిజం. చాలా రక్షణ గృహాల్లో కడుపునిండా తిండి పెట్టరు. రుచికరమైన ఆహారం ఇవ్వరు. సరైన దుస్తులు ఇవ్వరు. బట్టలు ఉతుక్కోడానికి, స్నానం చెయ్యడానికి చిన్న సబ్బులు ఇచ్చి అవే నెలంతా వాడుకోమంటారు. గాలీ వెలుతురూ లేనిచోట వీరిని ఇరుకైన గదుల్లో కుక్కేస్తున్నారు. రక్షణ గృహం ఆవరణలోనైనా స్వేచ్ఛగా తిరగనివ్వరు. అనారోగ్యం వచ్చినా పలుసార్లు మొరపెట్టుకుంటేగాని వైద్యం చేయించరు. నిధులు, విరాళాలు భారీగా వస్తున్నా కనీస సదుపాయాలు కల్పించరు. ఈ పరిస్థితుల్లో బాధిత మహిళలు ఆత్మహత్యకు తెగిస్తున్న ఉదంతాలు లేకపోలేదు. స్వయం ఉపాధి పథకాల్లో శిక్షణ పొందే అవకాశాలు తక్కువే. రక్షణ గృహాల్లో అభాగినుల పరిస్థితి ఇలా ఉందంటే- అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణం. అవస్థలు, అవమానాలు ఎదురైనప్పటికీ బాధిత మహిళలు తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఇష్టపడరు. నిజంగా వీరంతా ఇంటిముఖం పడితే రక్షణ గృహాల నిర్వాహకులకు నిధులు, విరాళాలు అందే పరిస్థితి ఉండదు. అక్రమ రవాణాను నివారించడం ఎంత ముఖ్యమో- బాధిత స్ర్తిలకు పునరావాసం కల్పించడం అంతే ముఖ్యం.
*

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969