మెయిన్ ఫీచర్

అంధులు కారు.. అజేయులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కికెట్ అంటే వారికి ఇష్టం..
మరోమాటలో చెప్పాలంటే ఆ ఆటంటే పిచ్చి..
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలన్న భావన వారిది...
ఇది చిన్నప్పటి నుంచి వచ్చిన లక్షణం...
కాకపోతే డబ్బులేదు...
పేదరికం ఆట వద్దంది..
మనసు ఆడి తీరాలంది..
అదే ఆటలో గాయాలపాలై
కంటిచూపు పోయింది...
కానీ వారి దృష్టి అంతా క్రికెట్‌పైనే..
వారి పట్టుదల చూసి అయినవారు కరిగిపోయారు.. ఊరివారు బ్యాట్ బంతీ పట్టండర్రా అన్నారు...
డబ్బుదేముంది.. మేమిస్తాం అన్నారు మరికొందరు..
అంతే...ఆటలో రాటు తేలారు.. పోటీ తరువాత పోటీకి సై అన్నారు.
చివరకు అంధుల టి-20 ప్రపంచకప్‌ను పట్టేశారు. భారత జట్టులో ఇద్దరు క్రీడాకారులు దున్న వేంకటేశ్వర రావు, టొంపాకి దుర్గారావు సిక్కోలు చిన్నోళ్లే...వారి విజయగాథ వింటే కన్నీళ్లొస్తాయి. ఎందరికో స్ఫూర్తిని రగిలిస్తాయి.
**
నిరుపేద కుటుంబం నుంచి వచ్చి..
ఉద్దానంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన దున్న వేంకటేశ్వర రావు తల్లిదండ్రులు నూకమ్మ, రామస్వామి కూలీ పనిపై ఆధారపడి జీవిస్తున్నారు. కొడుకు వెంకన్నకు క్రికెట్ అంటే పిచ్చి అని తెలుసు. ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా పిల్లాడి ముచ్చటకు అడ్డు చెప్పలేదు. నాలుగో తరగతి చదువుతున్నప్పుడు క్రికెట్ ఆడుతూండగా వేంకటేశ్వర రావు బంతి తగిలి కుడి కన్ను దెబ్బతింది. చూపుపోయింది. స్థోమత లేక వైద్యం చేయించలేకపోయారు. నిరుత్సాహం దరిచేరకుండా అలాగే బంతీబ్యాటూ పట్టాడు. వద్దని వారించినా ఆట మానలేదు. అతడి పట్టుదల చూసి గ్రామస్థులు, స్థానిక సౌదీస్ యువజన సంఘం అండగా నిలిచారు. విశాఖపట్నంలోని అంథుల అకాడమీలో చేరి, చదువు, ఆట రెండూ కొనసాగించాడు. అప్పటినుంచి ఒకటే ధ్యాస. జాతీయ క్రికెట్ జట్టు ఆటగాళ్లే స్ఫూర్తి. స్థానిక సర్పంచ్ చింత రజని భర్త నారాయణ కూడా భుజం తట్టారు. అలాగే స్థానిక యువత ఆర్థికంగా ఆదుకుంటోంది. అంతా కలసి చందాలు వేసుకుని పోటీలకు పంపేవారు. గౌతు లచ్చన్న బలహీనవర్గాల సేవాసంస్థ క్రికెట్ కిట్ నిమిత్తం రూ. 45 వేలు కాశీబుగ్గ డిఎస్పీ వివేకానంద చేతుల మీదుగా అందించింది ప్రోత్సహించింది. ఆ ప్రోత్సాహమే ఇప్పుడు ఫలితాన్నిచ్చింది.
**
పనిచేస్తేనే గడుస్తుంది.. కానీ..
మేం వ్యవసాయ కూలీలం. కూలీ పనులకు వెళితేగానీ ఇంట్లో పొయ్యి వెలగదు. చిన్న పూరింట్లో ఉంటున్నాం. అయినా మా అబ్బాయి ఇష్టాన్ని కాదనలేకపోయాం. ఊరికి పేరు తెస్తున్నప్పుడు ఎలా ఆడొద్దని చెబుతాం. మా కష్టమేదో మేం పడతాం. కానీ, వాడికొక ప్రభుత్వ ఉద్యోగమైన రావాలని మా ఆశ. అప్పుడేకదా పది మందిని ఆదుకుంటాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో సహకరిస్తే ఆనందిస్తాం.
-రామస్వామి, నూకమ్మ
(వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు)
**
మూడు ప్రపంచకప్‌లలో ఆడా
చిన్నప్పటి నుంచి ఆటే లోకమైంది. ఏనాడూ విసుగు రాలేదు. భారత జట్టులో 16 ఏళ్లనుంచి సభ్యుడిగా ఉంటున్నా. ఇప్పటి వరకు మూడు వరల్డ్‌కప్ పోటీల్లో ఆడా. చిన్నప్పుడు ఆటలో దెబ్బతగిలి చూపు పోయింది. అయినా బెంగ పెట్టుకోలేదు. విశాఖ అంథుల అకాడమీ చేరి, చదువు, ఆట కొనసాగించా. నైపుణ్యం పెంచుకుని జిల్లా, రాష్టస్థ్రాయి ఇలా... సౌత్ జోన్‌కు ప్రాతినిథ్యం వహించా. మెట్టు మెట్టు నిర్మించుకుంటూ 2011 పాకిస్తాన్‌పై అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేశా. అప్పటి నుంచి తిరిగిచూసుకోలేదు. జాతీయ జట్టులో కొనసాగుతున్నా. అయితే, ఆర్థిక సమస్యలున్నాయి. దేవునల్తాడలోని పాఠశాలలో కాంట్రాక్టు పిఇటిగా ఉద్యోగం చేస్తున్నా. నెలకొచ్చే అయిదు వేల రూపాయలు ఇంటికివ్వాలో... కిట్ కొనుక్కొవాలో అర్థం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పిస్తే నాలాంటి వారికి ఉపకారం చేసినట్లే.
-దున్న వెంకటేశ్వరరావు
**
తల్లి కష్టమే దారి చూపింది..
శ్రీకాకుళం జిల్లా కొప్పరివలసకు చెందిన దాలయ్య, సుందరమ్మల కుమారుడు దుర్గారావు. పదేళ్ళ కిందట తండ్రి చనిపోయారు. తల్లి సుందరమ్మ అన్నీతానై ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. పెద్దావాడైన దుర్గారావుకు ఆరేళ్ల వయస్సులోనే కంటిచూపుపోయింది. ఇంటికి భారమయ్యాడు. బొబ్బిలి అంధుల పాఠశాలలో చేర్పించింది. అక్కడి పిల్లలతో క్రికెట్ ఆడిన దుర్గారావుకు ఆ ఆటే సరస్వమైంది. క్రికెట్ పోటీలపై టీవీల్లో వచ్చే కార్యక్రమాలు విని, ఆసక్తి పెంచుకుని రాణించేందుకు ప్రయత్నించాడు. నైపుణ్యం సంపాదించుకున్నాడు. 2011లో స్థానిక పోటీల్లో తనేంటో నిరూపించుకున్నాడు. అదే ఏడు జూన్‌లో రాష్టస్థ్రాయి అండర్-19 జట్టులో అడుగుపెట్టాడు. సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్‌గా ఎంపికై, సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2012 లక్నోలో జాతీయ జట్టుకు రాష్ట్రం తరుఫున ఆడాడు. 50 పరుగులు చేశాడు. 2014 తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఎంపికల్లో ప్రతిభ చూపాడు. అదే ఏడాది డిసెంబర్‌లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు, బంధువుల సహకారం, ఇండియా క్రికెటర్ల స్ఫూర్తితో దూసుకుపోతున్న దుర్గారావుకు ఆర్థికంగా తోడ్పాటు ఉంటే మరింత రాణిస్తాడు.
**
కూలీ డబ్బులు ఆటకు ఇస్తున్నా..
పెనిమిటి చనిపోవడంతో ఇంటిపై ఆర్థిక భారం ఎక్కువైంది. అయినా దుర్గారావు ఆటకు డబ్బులు ఇస్తున్నా. నిజానికి ఇది మా కుటుంబానికి భారమే. కానీ, బాగా అడుతుండడం, అందరూ మెచ్చుకోవడంతో ఇంకా బాగా ఆడాలని అప్పోసప్పో చేసి, ఖర్చులకు ఇస్తున్నా. పెద్ద ఆటగాళ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నా.
-సుందరమ్మ ,దుర్గారావు తల్లి
**
ఆదుకుంటే అదరగొడతా
మాది కూలీల కుటుంబం. నాన్న దాలయ్య చనిపోవడంతో అమ్మే కుటుంబ భారాన్ని మోస్తోంది. అమ్మ, మామయ్యలు ప్రసాద్, గౌరీశంకర్ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. అయితే, ఎన్నాళ్లిలా? ఇప్పటికే సమర్థనం స్వచ్ఛంద సేవా సంస్థ ఆదుకుంటోంది. మా జట్టు నాయకుడు అజయ్‌కుమార్ ప్రోత్సాహంతో రాణిస్తున్నా. డిగ్రీ చదువుకుంటున్న నాకు మరింత సహకారం అవసరం.
-టొంపాకి దుర్గారావు

-జి.కృష్ణమూర్తి