మెయిన్ ఫీచర్

రెండో హిట్టు కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ -తాజాగా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెడుతుంటే వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి. పెద్ద హీరో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే -రెండో హీరోయిన్ ఎవరోనన్నది ఆసక్తి. స్టార్ హీరో డ్యూయల్ రోల్ చేస్తున్నాడంటే -రెండో పాత్ర ఫాదరో, బ్రదరో?నన్న ఆసక్తి. స్టార్ హీరోయిన్ ఫస్ట్ లవర్‌కు హ్యాండిస్తే -సెకెండ్ లవర్ ఎవరో శోధించే ఆసక్తి. పెద్ద నటుల వారసులు రెండో సినిమా చేస్తున్నారంటే -బడ్జెట్ ఎంతోనన్న ఆసక్తి. సో.. ఇండస్ట్రీలో ‘సెకెండ్’కు మంచి ప్రాధాన్యతే ఉంది. ఇప్పుడు -నలుగురు కుర్ర దర్శకుల విషయంలోనూ పరిశ్రమలో అదే ఆసక్తి కనిపిస్తోంది. చడీచప్పుడు లేకుండావచ్చి -బాక్సాఫీస్ షాకయ్యే హిట్టు పట్టుకుపోయిన నలుగురు కుర్ర దర్శకుల
‘సెకెండ్’ ప్రాజెక్టు ఏమిటన్నదానిపై ఇండస్ట్రీ ఆసక్తి చూపిస్తోంది.

కొత్త దర్శకుడిగా పరిశ్రమలో సంచలన విజయం అందుకున్నవాళ్లు చాలామందే ఉండొచ్చు. రెండో ప్రాజెక్టు విషయంలోనూ అదే స్టామినాను ప్రూవ్ చేసుకున్న వాళ్లు మాత్రం బహుతక్కువ. ద్వితీయ విఘ్నంతో విఫలమైన దర్శకులు అనేకమంది -తరువాత సరైన సినిమా అవకాశాల రాక పడరాని పాట్లు పడటం చూస్తూనే ఉన్నాం.
నిజానికి ఇండస్ట్రీలో ఇదో సెంటిమెంట్. అందుకే -ప్రతి సినిమా మొదటి సినిమాలాగే ఫీలవ్వాలి. నిలదొక్కుకుని ఇండస్ట్రీలో కొంతకాలం మనగలగాలంటే -హిట్టొక్కటే మార్గం.

మొదటి సినిమా చేసినపుడు చూపించినంత కసి -రెండో ప్రాజెక్టుపై పెట్టకపోవడం వల్ల ‘ద్వితీయ విఘ్నాన్ని’ దర్శకులు అధిగమించలేకపోతున్నారన్నది ఒక కారణం. ఈ పరిస్థితుల్లో -గత ఏడాది హిట్టందుకున్న నలుగురు యంగ్ డైరెక్టర్లు ఈ ఏడాది ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ద్వితీయ విఘ్నాన్ని ఎలా అధిగమించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
**
టాలీవుడ్‌లో గత ఏడాది ఆరంభం నుంచి యంగ్ టాలెంట్ హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా యువ దర్శకులకు కాలం కలిసొచ్చి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ పట్టుకెళ్లారు. కథలో కొత్తదనం, కథనంలో పటుత్వంతో సినిమాలు చేసి తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కువ శాతం దర్శకులకే ఇలాంటి చాన్స్ దక్కినా, నలుగురి విషయంలో మాత్రం ఇండస్ట్రీ ఆసక్తికరంగా చూస్తోంది.
పెళ్లిచూపుల సంచలనం
కొబ్బరికాయ ఎప్పుడు కొట్టారో తెలీదు. గుమ్మడికాయ ఎప్పుడు కొట్టారో అస్సలు తెలీదు. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్లు లేవు. అట్రాక్టివ్ పోస్టర్లు పడలేదు. సైలెంట్‌గా వచ్చిన సినిమా -సెనే్సషన్ క్రియేట్ చేసింది. అదే -‘పెళ్లిచూపులు’. గత ఏడాది టాలీవుడ్‌లో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన చిన్న సినిమా. భారీ ప్రోమోలు, భయంకరమైన అంచనాలకు దూరంగా -ఓ చిన్న సినిమా అనే ఫీల్‌తోవచ్చి పెద్ద షాక్ ఇచ్చింది. నిజానికి విడుదలైనపుడు -ఎన్ని సినిమాలు రావడం లేదూ! అన్న ఆలోచనతోనే థియేటర్లకు వెళ్లారు. సినిమా నచ్చేసేసరికి -్భజానికెత్తేసుకున్నారు. అయితే రిలీజుకు ముందే సినిమాకి ప్రివ్యూతో పాజిటివ్ టాక్ వచ్చేసింది. రిలీజు తరువాత సూపర్ హిట్ అనిపించుకుంది. సినిమా విడుదల సమయంలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ -వారం తిరక్కుండానే ప్రాజెక్టులకు ఆహ్వానాలు అందుకున్నాడు. అప్పటికే సైన్మా షార్ట్ ఫిల్మ్‌తో క్రేజ్ సంపాదించుకున్న తరుణ్ -పెళ్లిచూపుల తరువాత విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. పెద్ద నిర్మాతలు సైతం తరుణ్ భాస్కర్‌ని ఎంగేజ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు నాగార్జున పిలిచి చైతూ లేదా అఖిల్‌తో సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చాడన్నది ఇండస్ట్రీ టాక్. మంచి కథ దొరికినపుడు సినిమా చేద్దామని మెత్తగా చెప్పిన తరుణ్, ప్రస్తుతం తాను తీసిన సైన్మా షార్ట్ ఫిల్మ్‌ను సినిమాగా తీసే పనిలో పడ్డాడని అంటున్నారు. మళ్లీ కొత్తవాళ్లతోనే ప్రాజెక్టును పట్టాలపై పరిగెత్తించే పనిలో తీరికలేకుండా ఉన్నాడట. ఇప్పటికే సినిమా మొదలైంది. సో.. కలిసొచ్చిన కాలం, పేరుతెచ్చిన షార్ట్ ఫిల్మ్‌తో తరుణ్ భాస్కర్ ద్వితీయ విఘ్నాన్ని ఎలా దాటుతాడోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది.
క్షణంలోనే..
తక్కువ బడ్జెట్‌తో వచ్చి సూపర్ హిట్ అనిపించుకున్న సినిమాల సంఖ్య సాధారణంగా చాలా తక్కువ ఉంటుంది. అలాంటి సినిమాలను వేళ్ళమీదే లెక్కపెట్టొచ్చు. అలాంటి సినిమాల్లో ‘క్షణం’ను గంటలకొద్దీ చర్చించుకోవచ్చు. గత ఏడాది సంచలనం రేపిన చిత్రాల్లో ఇదొకటి. క్షణక్షణం ఉత్కంఠగా సాగే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు రవికాంత్ పేరాపు హిట్టు పట్టేశాడు. తొలి సినిమాతోనే రవికాంత్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతో అతనికి వరస ఆఫర్లు రావడం మొదలెట్టాయి. అయితే వాటిల్లో చాలావరకూ అలాంటి చిత్రాలే చేయాలనీ అవకాశాలు వస్తున్నాయని, రవికాంత్ మాత్రం పెద్ద సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు సన్నిహితులు. తన తదుపరి చిత్రాన్ని రానా దగ్గుపాటితో ప్లాన్ చేస్తున్నాడు. గత కొద్దిరోజులుగా ఓ లవ్‌స్టోరీ మీద వర్క్ చేస్తున్నట్టు పరిశ్రమలో చర్చ వినిపిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోందట. రానా దగ్గుపాటితో లవ్‌స్టోరీ పట్టాలెక్కిస్తాడని అంచనా. సోలో హీరోగా సరైన హిట్ అందుకోలేక పోయిన రానా, ఘాజా హిట్టు రేంజికి రావడంతో మంచి ఊపుమీదున్నాడు. అటు బాహుబలి, ఇటు ఘాజీలో రానా కనిపించిన తీరు వేరు. ఇప్పుడు లవ్ స్టోరీ అనేసరికి -పేరేపు ప్లాన్‌పై ఆసక్తి కనిపిస్తోంది. సెకెండ్ ప్రాజెక్టును పేరేపు ఏ రేంజ్‌కు తీసుకెళ్తాడన్నది చూడాలి.
సోగ్గాడే...
ఇక గత సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అచ్చమైన పండగ సినిమా అనిపించుకున్నది ‘సోగ్గాడే చిన్నినాయిన’. సాదాసీదాగా సాగుతోన్న నాగ్ కెరీర్‌కు ఒక్కసారిగా ఊపునిచ్చేసిన సినిమా. ఫ్యామిలీ కథతోపాటు ఆకట్టుకొనే సన్నివేశాలు, ఆహ్లాదకరమైన కామెడీ, వీటన్నిటికి మించి పల్లెటూరి బ్యాక్‌డ్రాప్... వెరసి నాగ్ రెచ్చిపోయాడు. మాస్ క్లాస్ తేడాకు చాన్స్‌లేకుండా దర్శకుడు సినిమా మొత్తం మాయచేసి చూపించేశాడు. అద్భుతమైన కలెక్షన్స్‌తో దూసుకుపోయిన ఈ సినిమాతోనే -నాగ్ యాభై కోట్ల హీరో అయ్యాడంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. నాగార్జునని ఈ వయసులో ఎనర్జిటిక్ సోగ్గాడిగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. అందుకే కళ్యాణ్‌కు వెంటనే మరో అవకాశం ఇచ్చాడు నాగ్. అంతేకాదు ఈ సినిమా తరువాత సోగ్గాడేకు సీక్వెల్‌గా బంగార్రాజు సినిమా తీద్దామని కూడా ప్రామిస్ చేశాడట. తక్కువ సమయంలోనే నాగ్ మరో ఆఫర్‌ని తనకివ్వటం కల్యాణ్‌కృష్ణకు షాకింగ్ న్యూసే. మరి నాగచైతన్య సినిమా ఎలా ఉంటుందో, ఆ సినిమా టైటిల్ గురించి కనీస సమాచారం కూడా ఇంకా బయటకు రాలేదు. తండ్రితో హిట్టుకొట్టి తనయుడు చైతూతో ద్వితీయ విఘ్నాన్ని ఎలా అధిగమిస్తాడన్నది చూడాలి.
జయమ్ము..
కమెడియన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి, గీతాంజలి సినిమాతో హీరోగామారి మంచి విజయం అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన రెండోసారి హీరోగా చేసిన సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’. రియల్ టాలెంట్‌కు ఆత్మవిశ్వాసమే అండ. ఆత్మన్యూనతతో ఏడుస్తూ కూర్చునేవాడు జీవితంలో ఒక్క మెట్టుకూడా పైకి ఎక్కలేడన్న సందేశమిచ్చిన కథ. సినిమాటిక్ టాలెంట్‌తో సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు శివరాజ్ కనుమూరి. కొత్త దర్శకుడు తన స్వీయ నిర్మాణంలో సినిమా తీయడం ఆశ్చర్యకరమైన విషయం. శివరాజ్ ఆ బాధ్యతను సమర్ధంగా నిర్వర్తించడమే కాదు, సినిమాను పక్కా ప్లాన్‌తో బాగా ప్రమోట్‌చేసి మంచి హిట్ అందుకున్నాడు. వినోదంతోపాటు అనుభూతి కూడా ఇచ్చేలా నిజ జీవితంలోని మనుషులు గుర్తుకొచ్చేలా పాత్రల్ని తీర్చిదిద్ది తొలి ప్రయత్నంలోనే మంచి సినిమా చేశాడు. ఈ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్‌తో శివరాజ్‌కు ఒక స్టార్ ప్రొడ్యూసర్ నుంచి పిలుపొచ్చింది. ఇంకా ఆయన రెండో సినిమాకు సంబంధించిన వివరాలు ఏవీ బయటికి రాలేదు. ఒకవేళ మంచి కథ కుదిరితే తానే నిర్మిస్తూ సినిమా తీస్తానని చెబుతున్నాడు. సో రెండో సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో దీన్నిబట్టే అర్థమైపోతుంది. మరి ఈ దర్శకులు కొత్త ఆలోచనలతో కొత్త సినిమాలు తెరకెక్కించి పరిశ్రమలో కొత్త ఉత్సాహం నిలిపారు. ఈ దర్శకులంతాద్వితీయ విఘ్నం సులువుగా దాటిసి -స్టార్ రేంజ్‌కు చేరుకోవాలని ఆశిద్దాం.

చిత్రాలు..కళ్యాణ్ కృష్ణ, తరుణ్ భాస్కర్, రవికాంత్ పేరేపు

-శ్రీ