మెయిన్ ఫీచర్

సలలిత రాగసుధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె గాత్రం ఓ ప్రవాహం. సప్తస్వరాల సుధాసారం. శ్రుతిలయల సమాహారం. భావాన్ని ఒడిసి పట్టి, పాత్రోచిత స్వర విన్యాసంతో సాగిన వేనవేల పాటల మనోహర స్వరం సుశీల.
ఏ పాట తీసుకున్నా.. అదో అద్భుతం. అమృతం రుచి ఎలా ఉంటుదో తెలియదు కానీ.. కమనీయత అంటే ఏమిటో సుశీల పాట వింటే తెలుస్తుంది. తెలుగు మాటలోని తీయదనం ఆమె గొంతులో పలికిన తీరు మైమరిపిస్తుంది. ఆమె కంఠంలో భిన్న భావాలు అలవోకగా పలుకుతాయి.
బాధయినా, వేదనైనా, ప్రేమైనా,
అనురాగమైనా, లాలిత్యమైనా,
విరహమైనా సరే.. భావస్ఫోరకతకు
ఆమె కంఠం నిలయమే!

కృషి మాత్రమే మనది. గుర్తింపు భగవదనుగ్రహం. ఆ గుర్తింపే కళాకారులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
సంగీతం నా ప్రాణం. ఇన్ని వేల పాటలు పాడే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకులు అందరికీ రుణపడి ఉంటాను.

ఆరు దశాబ్దాల పాటు అలుపెరుగని పాటల ప్రవాహాన్ని సాగించిన స్వరధుని సుశీలకు గిన్నీస్ రికార్డుల్లో చోటు లభించడం ఆమె గొప్పతనానికి నిదర్శనం కాదు. అలవోకగా తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ఆమె పాడిన వేలాది పాటలకు గుర్తింపు. సుశీలలో నిబిడీకృతమై ఉన్న స్వరలయ ప్రతిభకు దర్పణం. ఒక గాయకుడు లేదా గాయని మాతృ భాషలో అనంతమైన పేరు ప్రఖ్యాతులు పొందడం సహజం. కానీ సుశీల ప్రత్యేకత ఏమిటంటే.. మాతృభాషతో సమానమైన రీతిలో ఆమెకు తమిళంలోనే మహాగాయనిగా నిరుపమాన గుర్తింపు లభించడం. అలాగే కన్నడ, మలయాళ భాషల్లో నిర్మితమైన వందలాది చిత్రాలకూ ఆమె గాత్రమే శరణ్యం కావడం. ఆమె ఏ పాట పాడినా అది మనోహర, కమనీయ భావ ప్రపంచమే.. తన పాటలతో కవ్వించారు. నవ్వించారు. ఉరకలెత్తించారు. ఊరడించారు.. ఏడిపించారు కూడా.. ఇంతటి ప్రతిభకు అంతటి (గిన్నీస్) గుర్తింపు సహజసిద్ధమే. ఆమె పాడితే వీణ మీటినట్టుంటుంది. స్వరంలో వీణ తంత్రులు మేటవేశాయా అన్నట్టుగా సుశీల వీణ పాటల తేనియలొలికించారు. కారణం.. పాటకు ప్రాణమైన భావానికి సుశీల స్వరం ఆయువు పట్టు కావడం. ‘ఈ వీణకు శ్రుతి లేదు..’ అని ఎలుగెత్తితే అందులోని పాత్రధారి బాధ, ఆర్ద్రత కన్నీళ్లు తెప్పిస్తాయి. అంతటి గొప్పతనం ఆమె స్వరానిది. పాడింది పాత్రధారే కానీ సుశీల కాదన్నట్టుగా తన స్వర మాధుర్యంలో శ్రోతల్ని కట్టి పడేసిన సమ్మోహిత శక్తి ఆమె సొంతం. పాటలోని మాధుర్యాన్ని, మార్దవాన్ని రంగరించి సుశీల ఒలికించిన వినూత్న రస విన్యాసాలకు కొదవ లేదు. ‘మొక్కజొన్న తోటలో.. ముసిరిన సీకట్లలో’ అంటూ జానపదాల్ని పరుగులు పెట్టిస్తే ఆ పదబంధాలు మురిసిపోయాయి. అందులోని విరుపులు, మెరుపులు, పరుగులు ప్రతి ఒక్కరిని ఔరా అనిపించాయి. ‘గోదారీ గట్టుంది..’ అంటూ ఆమె స్వరం ఎలుగెత్తితే గోదారమ్మ తన తరంగాలను పంపి తనివితీరా ఆ మాధుర్యాన్ని ఆస్వాదించింది. ‘మానూ మాకును కాను’ అంటూ అంతర్వేదనను పలికిస్తే.. కరుగని పాషాణం ఉండదు. యాభై దశకంలో తెలుగు స్వర సీమలో అడుగుపెట్టిన సుశీలది మొదటి నుంచీ తిరుగులేని గళ విహారమే. సినిమా సినిమాకు, పాట పాటకూ ఆమె స్వర మాధుర్యం సరికొత్త రుచుల్నే శ్రోతలకు అందించింది. తమకు సుశీలే పాడాలని నాటి తెలుగు, తమిళ అగ్ర కథానాయికలందరూ పట్టుబట్టారంటే.. పాటల్లో ఆమె ఒలికించే భావాలకు వారెంతగా మంత్రముగ్ధులయ్యారో స్పష్టం చేసేదే. కొన్ని సినిమాల విజయం కంటే సుశీల పాటలే అమితమైన ప్రాచుర్యాన్ని పొందాయని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు. సుశీలకు ప్రతి పాట ఓ సవాలే. ఆమె స్వరలయ విన్యాసానికి కత్తిమీద సామే. అందుకే ఆమె అందుకున్న ప్రతి పాట సమ్మోహనాస్తమ్రే అయింది. పాత్ర లేదా పాట మూలాల్లోకి వెళ్లగలిగితేనే సందర్భోచితమైన రీతిలో భావాన్ని పలికించడం సాధ్యమవుతుంది. జానపదం జానపద గుబాళింపులందించాలి. ప్రేమ పాట ప్రేమైకత్వంలో శ్రోతల్ని ఓలలాడించాలి. ఆనందడోలికల్లో విహరింపజేయాలి. ‘నిన్ను చూసి వెనె్నల చూస్తే.. ఆ వెనె్నలా చల్లగా ఉండ’దంటూ సుశీల పాడితే చంద్రుడూ ఉలిక్కి పడాల్సిందే. తన చల్లదనంపై సందేహించాల్సిందే! అలాగే ‘నా ఎదుట నీవు.. నీ ఎదుట నేను..’ అంటూ ఆమె స్వరం విరహాగ్ని బాణాన్ని సంధిస్తే ఆ చల్లని చంద్రుడూ దిగిరావాల్సిందే. ఆ విరహిని విరహాగ్నిని చల్లార్చాల్సిందేననడం అతిశయోక్తి ఏమీ కాదు. ఆ పాటలో సుశీల పలికించిన విరహభావ వీచికలు ప్రతి ఒక్కరినీ కట్టిపడేశాయి. అమ్మ మాటలోనూ సుశీలమ్మది అందెవేసిన చెయ్యి.. ‘అమ్మ లాంటి చల్లనిది.. లోకమొక్కటి ఉందిలే..’ అంటూ అమ్మమాటలోని కమ్మదనాన్ని ఒడిసి పట్టినా.. ‘అన్నా నీ అనురాగం..’ అంటూ రక్త సంబంధ మమకారాన్ని గుదిగుచ్చినా.. ‘మీర జాలగలడా నా యానతి’ అంటూ ధిక్కార స్వరాన్ని వినిపించినా అది సుశీలకే చెల్లింది. ‘కొండమీద కోయిలమ్మ కుహూ అన్న’దంటూ ఆమె పాట ఎత్తుకుంటే కోకిలలు నొచ్చుకోవాల్సిందే. అందుకే ఆమె ప్రతి పాట కోటి వీణల మాధుర్య మూట. ఎంతగా వర్ణించినా.. ఇంకెంతగా అభివర్ణించినా.. సుశీల పాటకు పూర్తి న్యాయం చేయలేం. తొలి నాళ్లలో లీల, జిక్కీ వంటి మహాగాయనీమణులెందరో ఉన్నా.. వారిని తనదైన గాత్ర మాధుర్యంతో అధిగమించగలిగారు. ఈ పాట సుశీలే పాడాలి అన్నంతగా వెండితెరపై దూసుకుపోయారు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌లకు ఘంటసాల పాట ఎంతటి ఖ్యాతినార్జించిపెట్టిందో సావిత్రి, జమున, కృష్ణకుమారి, జయలలిత, వాణిశ్రీ వంటి నాటి మేటి నటీమణుల కెరీర్‌లకు సుశీల పాట పెట్టని కోటగా మారింది. తరాలు మారినా కొత్త తరం కథానాయికలకు సుశీల స్వరం సునాయాసంగానే ఇమిడిపోయింది. ‘ఇది మల్లెల వేళ యనీ..’ అన్న పాట వాణిశ్రీ కెరీర్‌ను మలుపుతిప్పిందని చెప్పడానికి ఆ పాటకు లభించిన ప్రాచుర్యమే నిదర్శనం. యుగళ గీతాల్లో ఘంటసాలకు పోటీగా సుశీల తన గళ తంత్రుల్ని మీటారు. హీరోఇమేజ్‌ను ఘంటసాల పాట పెంచితే హీరోయిన్‌కు సరికొత్త ఇమేజ్‌నే సుశీల తీసుకొచ్చారు. ‘హిమగిరి సొగసులూ..’అంటూ ఘంటసాలతో సుశీల పాడిన పాటని ఏమని వర్ణించగలం. సందర్భాన్ని బట్టి గాత్రగాంభీర్యాన్నీ మహాగాయకుడితో సరిసమానంగా సుశీల ప్రదర్శించారు. అలాగే ‘చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది..’అనే పాటలో ఘంటసాలకు పోటీగా సుశీల కనబరిచిన గాత్ర వివేచన అద్భుతం. పిబి శ్రీనివాస్, ఎస్‌పి బాల సుబ్రమణ్యం, రామకృష్ణ ఇలా అనంతర గాయకులతో కూడా వందలాది పాటలు పాడిన ఘనత ఆమెది. తరాలు మారినా ఆమె గాత్ర మాధుర్యం అమృత కలశంలా కొత్త సొబగులను అందిపుచ్చుకుంటూనే ఉంది. సమున్నత గాత్ర శిఖరాలను అధిరోహించిన ఆమె స్వరసామ్రాజ్ఞి. ఎందరు అందుకోవాలన్నా.. అందనంత ఎత్తులో శిఖర సమానంగా నిలిచిన స్వర ధుని సుశీల!

బి. రాజేశ్వర ప్రసాద్