మెయిన్ ఫీచర్

లా లా ల్యాండ్ ఉతికి ఆరేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుకున్నట్టే లాలా ల్యాండ్ ఆస్కార్ల పంట పండించింది. నామినేషన్ల స్వీకరణ దగ్గర్నుంచీ అంచనాలను పెంచేసిన లాలా ల్యాండ్ -మొత్తానికి 89వ ఆస్కార్ ఉత్సవాన్ని ఉతికి ‘ఆరే’సింది. 14 విభాగాల్లో నామినేషన్లు పొందిన లాలా ల్యాండ్‌కు ఆరు విభాగాల్లో ఆస్కార్లు అందాయి. ఫలితాల ప్రకటనకు ముందు -కనీసం ఐదుకు మించి ఆస్కార్లురాకుంటే న్యాయ నిర్ణయమే తప్పన్నంత గొప్పగా ఈ చిత్రం అందరి నోళ్లలో నానింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ కెమెరా, ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్.. ఇలా 14 విభాగాల్లో లాలా ల్యాండ్ నామినేషన్లు దక్కించుకుంది. ఆస్కార్ చరిత్రలోనే అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న సినిమాల జాబితాలో ఆల్ అబౌట్ ఈవ్, టైటానిక్ చిత్రాల తరువాత లాలా ల్యాండ్‌దే రికార్డు. 14 విభాగాల్లో లాలా ల్యాండ్ నామినేట్ అయినా, ఆల్ అబౌట్ ఈవ్ రికార్డును సమం చేసిందే తప్ప, టైటానిక్ రికార్డుల దరికి చేరలేదు. నామినేషన్లు పొందడంలో చూపించిన వేగం -అవార్డులు సొంతం చేసుకోవడం దగ్గర కనిపించక పోవడం గమనార్హం. ఉత్తమ దర్శకత్వం, నటి, ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ స్కోర్, ఛాయాగ్రహణం, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో లాలా ల్యాండ్‌కు అవార్డులు దక్కాయి.
యువ సంగీతకారుడు, వర్ధమాన నటి మధ్యసాగే సంగీతభరింత ప్రేమకావ్యమే -లాలా ల్యాండ్. ర్యాన్ గోస్లింగ్, ఎమ్మాస్టోన్‌లు కెమిస్ట్రీని అద్భుతంగా పండించి ప్రేమకావ్యాన్ని రక్తికట్టించారు. డామియెన్ చజెల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
అదీ అసలు కథ
నిజానికి ఏడేళ్ల క్రితం నుంచే ఈ స్క్రిప్ట్ పట్టుకుని దర్శకుడు పలు స్టూడియోల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. ఒక్క మ్యూజిక్ వీడియోకు మాత్రమే దర్శకత్వం వహించిన అనుభవమున్న డామియన్‌తో పని చేయడానికి ఏ స్టూడియో కూడా ఆసక్తి చూపలేకపోయింది. ఎక్కడికక్కడ స్క్రిప్ట్‌లో మార్పులు కోరడంతో -ఒక దశలో డామియన్‌కే తన స్క్రిప్ట్‌మీద నమ్మకం కోల్పోవాల్సి వచ్చింది. దాంతో పక్కన పెట్టేశాడు. 2014లో డామియన్ దర్శకత్వం వహించిన ‘విప్లిష్’ అనూహ్య విజయం సాధించటంతో -స్టూడియో దృష్టి అతనిమీద పడింది. డామియన్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్న సమ్మిట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ లాలా ల్యాండ్ నిర్మాణానికి ముందుకొచ్చింది. రెండేళ్ల సినిమా నిర్మాణం తరువాత -గత ఏడాది డిసెంబర్‌లో అమెరికాలో చిత్రం విడుదలైంది. అమెరికా బాక్సాఫీస్‌ను గలగలలాడించి 380 మిలియన్ డాలర్లు వసూలు చేసిన లాలా ల్యాండ్, ప్రపంచవ్యాప్తంగా మరో 30 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్టు అంచనా. కాదన్న సినిమా కోట్లు కొల్లగొట్టడం అంటే ఇదే మరి.
లాలాకు షాక్
బెస్ట్ డైరెక్టర్.. బెస్ట్ యాక్ట్రెస్.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్.. ఇలా ఆస్కార్ల మీద ఆస్కార్లు వచ్చి పడుతుంటే -లాలా ల్యాండ్ టీం ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఆ ఆనందానికి బ్రేక్ వేస్తూ.. ఒక్క షాక్ తగిలింది. అదే -ఉత్తమ చిత్రం ప్రకటన. ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయంలో ముందు ఉత్తమ చిత్రం అవార్డును లాలా ల్యాండ్‌కే ప్రకటించేశారు. అప్పటికి టీం వేదిక ఎక్కేసింది కూడా. పొరబాటును గుర్తించిన నిర్వాహకులు అసలు విషయాన్ని వెల్లడిస్తూ ఉత్తమ చిత్రం అవార్డును ‘మూన్ లైట్’కు ప్రకటించడంతో -లాలా ల్యాండ్ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఆనందం నీరుగారిపోయింది. ఒక కవరుకు బదులు మరో కవరు తీయడంవల్ల జరిగిన పొరబాటుగా నిర్వాహకులు తప్పును సరిదిద్దుకున్నారు.

ఓంపురికి నివాళి
ఆస్కార్ వేదికపై భారతీయ నటుడు ఓంపురికి విశేషం గౌరవం దక్కింది. తనదైన శైలితో నటనలో శిఖరాగ్రాన్ని అధిష్టించిన ఓంపురి ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. అద్వితీయ ప్రతిభ కనబర్చిన భారతీయ నటుడు ఓంపురి, డెబ్బీ రెనాల్డ్, క్యారీ ఫిషర్, బిల్‌పాన్స్‌టన్ లాంటి ప్రముఖులకు ఆస్కార్ వేదిక నుంచి నివాళి ప్రకటించారు. చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించి కన్నుమూసిన ప్రముఖులను స్మరించుకుంటూ నటి జెన్నీఫర్ ఎనిస్టెన్ ఒక వీడియోను ప్రదర్శించారు.

చిత్రం.. ఆస్కార్ ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఎమ్మా స్టోన్