మెయన్ ఫీచర్

వాతావరణ కాలుష్యానికి భారీ మూల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా అయిదేళ్ల లోపు బాలల మరణాల్లో నాలుగోవంతు మరణాలకు పర్యావరణ కాలుష్యమే కారణమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించిన నివేదికలో ఈ ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. విశ్వవ్యాప్తంగా ఏటా 1.7 మిలియన్ల మంది బాలలు కాలుష్యం కాటుకు బలైపోతున్నారు. వాయు, జల కాలుష్యం, పారిశుద్ధ్య లేమి వంటి కారణాలతో డయేరియా, మలేరియా, న్యుమోనియా, శ్వాసకోశ వ్యాధులు వ్యాపిస్తూ చిన్నారులు మృత్యువాత పడుతున్నారు.
ప్రకృతి మనకు స్వచ్ఛమైన గాలిని, నీటిని ఇచ్చింది. వీటికి కాలుష్యం బెడద లేని రోజుల్లో పిల్లలే కాదు, అన్ని వయసుల వారూ ఆరోగ్యంవంతంగా ఉండేవారు. యజుర్వేదంలో ‘విశ్వమంతా శాంతి వర్ధిల్లాలి, వాతావరణ శాంతి ఉండాలి, జలం వర్ధిల్లాలి, ఔషధం వర్ధిల్లాలి’ అనే ప్రార్ధన ఉంది. ఆ రోజుల్లో మనిషికి, ప్రకృతికి మధ్య ఆదర్శప్రాయమైన సంబంధాలు ఉండేవి. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. నేడు మానవుడు సమస్త ప్రకృతినీ, భూమిని ఉత్పత్తి సాధనాలుగా చూస్తున్నాడు. జాతిపిత గాంధీజీ పర్యావరణానికి సంబంధించి చెప్పిన సూక్తులలో మూడు ప్రధానమైనవి ఉన్నాయి.
‘నీ అవసరానికి కావలసినదంతా భూమి ఇస్తుంది. కానీ, నీ అత్యాశను అది సంతృప్తి పరచలేదు. నీ అత్యాశ మొత్తం ప్రకృతి వినాశనానికి దారి తీస్తుంది’.
‘మనం ప్రకృతి ఇచ్చే బహుమతులను పరిమితంగా ఉపయోగించుకోవాలి. ప్రకృతి ‘జమా ఖర్చు’ ఎప్పుడూ సమానంగా ఉండాలి. జమ కన్నా ఖర్చు ఎక్కువైతే పూడ్చుకోలేని హాని కలుగుతుంది’.
‘పారిశుద్ధ్యం అన్నింటికన్నా ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన మనసు ఆరోగ్యకరమైన శరీరంలోనే ఉంటుంది’.
పారిశ్రామిక విప్లవం (18వ శతాబ్దం)తో ప్రారంభమైన ప్రకృతి వినాశనం ఇవాళ ప్రపంచీకరణ ప్రభావంతో పరాకాష్ఠకు చేరింది. గాలిలో ఉండే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నత్రజని మధ్య సమతుల్యత దెమ్బతింటున్నది. అపరిమితంగా పెరిగిపోతున్న ఫ్యాక్టరీ గొట్టాలు వాయువును విషపూరితం చేస్తున్నాయి. ఫ్యాక్టరీలు వదిలే వ్యర్థ పదార్ధాలతో పవిత్ర నదులు నిండిపోయి జల కాలుష్యం ఏర్పడుతున్నది. రసాయనిక ఎరువులు భూసారాన్ని హరించి వేస్తున్నాయి. క్రిమి సంహారక మందుల్ని విస్తారంగా వాడడం వల్ల పురుగులు చావడం లేదు కానీ ఆ పంటను తిన్న మనుషులు అనారోగ్యం బారిన పడుతున్నాడు. ఓజోన్ పొర తరుగుదల, ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడడం, ఆమ్ల వర్షం, జీవావరణ అసమతుల్యం వంటి పదాలు ఇప్పుడు మానవాళిని భయపెడుతున్నాయి.
విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు, మోటారుకార్ల వినియోగం, శీతలీకరణ యంత్రాలు అధికం కావడం, కర్మాగారాలు, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అడవులను నరకడం మొదలైనవన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టి సర్వ సామాన్యమైపోయాయి. ఎప్పుడో 1952 డిసెంబర్ 5న ఉదయం లండన్ మహానగరం అంతా చిక్కని పొగమంచుతో ఒక దుప్పటి కప్పినట్టుగా అయిపోయిందనీ, పట్టపగలు కారు చీకటిగా మారిపోయిన పరిస్థితి అయిదురోజులు ఉందని, ఆమ్ల వర్షం ప్రభావంగా నాలుగు వేలమంది చనిపోయారని పుస్తకాలలో చదివి ఆశ్చర్యపోయాం. ఆనాటి నుంచి పర్యావరణ కాలుష్య నివారణకు చర్యలు ప్రారంభమైనా, ఈ విషయమై అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నా పర్యావరణ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ‘కింగ్స్ కాలేజ్ లండన్’ (కెసిఎల్) వారి పరిశీలన ప్రకారం- వాయు కాలుష్యం అధికంగా ఉన్న అయిదు యూరోపియన్ నగరాలలో లండన్ ఒకటి. 2010లో వాయు కాలుష్యంతో లండన్‌లో 9,416 మంది అకాల మరణం పొందారని తేలింది.
మనదేశం విషయాన్ని తీసుకుంటే, 2011-2015 సంవత్సరాల మధ్య పర్యావరణ స్థితిని పరిశీలించిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సిపిసిబి) వారి అంచనా ప్రకారం 22 రాష్ట్రాల్లోని 94 నగరాల్లో ఈ సమస్య చాలా అధికంగా ఉంది. 300 నగరాల్లో ఈ సమస్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ఢిల్లీ, ముంబయి, పూణె, కోల్‌కత వంటి నగరాల్లో వాయు కాలుష్యం ఎంత ఎక్కువగా ఉందో కొలిచి చెప్పే సాధనాలు ఉండగా, చాలా నగరాల్లో ఇలాంటి సాధనాలే లేవు. పర్యావరణ కాలుష్యాలతో ఎంతమంది మరణిస్తున్నారో నిర్ధారించే సాధనాలే లేవు. దేశానికే కాక వాయు కాలుష్యానికీ రాజధాని ఆయిన దిల్లీలో ఇలాంటి సాధనాలు 13 ఉంటే, కాలుష్యభరితమై పోతున్న గంగానది ఒక్డున వారణాసిలో ఇలాంటి సాధనాలు మూడు మాత్రమే ఉన్నాయి. 2015 నాటి ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్’లో ప్రకటించిన దానిబట్టి, ప్రపంచం మొత్తం మీద 4.2 మిలియన్ల మంది వాయు కాలుష్యంతో ఏటా చనిపోతున్నారు. వీరిలో ఇండియా, చైనాలకు చెందిన ప్రజలు 52 శాతం మంది ఉన్నారు. వాయు కాలుష్య నివారణకు చైనా కొంతమేరకు చర్యలు తీసుకుంటున్నా, భారత్‌లో మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. కొన్ని మెట్రో నగరాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసే వ్యవస్థలు లేవు. వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్న అలహాబాద్, కాన్పూర్, ఫిరోజాబాద్, లక్నో వంటి నగరాలలో ఈ తరహా చర్యలు లేవు. వాయు కాలుష్యాన్ని అంచనా వేసే ప్రత్యేక సాధనాలు లేకుండా నివారణ చర్యలు ఎలా తీసుకోగలం? సమస్య తీవ్రతను ఎలా గుర్తించగలం?
ప్రపంచ వాయు కాలుష్య నివేదికల ప్రకారం చూస్తే- ఈ సమస్యతో మన దేశంలో ఏటా మిలియన్ మంది ప్రజలు చనిపోతున్నారు. పర్యావరణ శాఖ ఇది చాలా అతిశయోక్తి అంటున్నది. అధిక సంఖ్యలో పేదలున్న దేశం మనది. వాయు కాలుష్యం కాటుకు ఎక్కువగా బలయ్యేది పేదలే. ధనికులు ఎంత ఖర్చయినా చేసి ఎయిర్ ప్యూరిఫైయర్స్ (కాలుష్యాన్ని నివారించే సాధనాలు) వాడతారు. ఎయిర్ కండిషన్డ్ కార్లలో తిరుగుతారు. బీదలకు ఈ సదుపాయాలు ఎలా లభిస్తాయి?
వాయు కాలుష్యాన్ని నివారించే చట్టం భారత ప్రభుత్వం 1981లోనే చేసింది. జల కాలుష్య నివారణ, అడవుల పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి ఎన్నో చట్టాలున్నాయి. కానీ, వాటిని అమలు పరచడంలో పలు రకాల అడ్డంకులు ఉన్నాయి. అధికార యంత్రాంగం ఉన్నా ప్రజలను రక్షించే నాథుడే లేడు. మన దేశంలో గృహ నిర్మాణాలకు, ఫ్యాక్టరీల ఏర్పాటుకు, బహుళార్ధక సాధక ప్రాజెక్టుల కోసం అడవులను నరకడం సర్వసామాన్యమైంది. దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి 7,47,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అడవులు వుండేవి. అంటే దేశ విస్తీర్ణంలో 22.74 శాతం భాగం అడవులు ఉండేవి. 1989 నాటికే దేశ విస్తీర్ణంలో 18.34 శాతంగా అడవులు వుండే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుందాం. పచ్చటి అడవులకు, నదీ జలాలకు, జీవ వైవిధ్యానికి, ప్రకృతి సౌందర్యానికి నిలయం ఆ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఒకప్పుడు 83,748 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు వుండేవి. అంటే ఆ రాష్ట్రం విస్తీర్ణంలో 60 శాతం భాగం అటవీ సంపదతో నిండి ఉండేది. జనసాంద్రత చదరపుకిలోమీటరుకు 17 మంది మాత్రమే! 2011లో వెలువడిన అటవీ నివేదిక ప్రకారం 74 చదరపు కిలోమీటర్ల అటవీ సంపద కనుమరుగైపోయింది. ఫలితంగా ఆ రాష్టం ప్రకృతి సౌందర్యాన్ని కోల్పోతుండడమే కాక పర్యావరణానికి హాని కలుగుతున్నది. జీవ వైవిధ్యం అంతరించిపోతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు ప్రకృతి సౌందర్యానికి, విదేశీ పక్షులు రావడానికి ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు జలకళ లేక ఎండిపోతున్న వైనం అందరికీ తెలిసిందే.
అడవుల నరికివేత వల్ల జరిగే అనర్థాల కారణంగా వన్యప్రాణులకు, పర్యావరణానికి తీరని నష్టం జరుగుతోంది. బిహార్‌లోని ఒక కొండ ప్రాంతంలో జరిగిన ఉదంతం గురించి ఈ సందర్భంగా పేర్కొనాలి. అక్కడి ఓ గ్రామాన్ని మైదాన ప్రాంతంతో కలిపేందుకు మార్గం ఏదీ లేదు. దట్టమైన అడవిలోంచి ఆ ఊరికి వెళ్లాలి. అందుచేత ఆ ఊళ్లో యువకులకు ఆడపిల్లలను ఇచ్చేందుకు మిగతా గ్రామాల వారు నిరాకరిస్తున్నారు. ఆ గ్రామంలో దాదాపు అందరూ బ్రహ్మచారులుగానే మిగిలిపోయారు. రోడ్డు వేస్తామని ఎన్నికల సమయంలో హామీలిచ్చే నేతలు ఆ తర్వాత స్పందించడం మానేశారు. దీంతో ఆ ఊరి యువకులంతా పూనుకుని తమ గ్రామానికి రోడ్డు వేసుకుని ‘బ్రహ్మచర్యం’ చెర వదిలించుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు వేసుకుని గ్రామంలో మొదటి వివాహాన్ని గ్రామస్థులు సంబరంగా జరుపుకున్న తర్వాత, అటవీ అధికారులు అక్కడికి చేరుకుని- ‘చెట్లు నరికేసి అడవికి నష్టం కలిగించారని, జీవ వైవిధ్యానికి హాని కలిగించార’ని ఆ యువకులపై కేసు బనాయించారు. ఇలా ఉంటాయి ప్రభుత్వ చర్యలు! ఏది ఏమైనా, ఇకనైనా ప్రభుత్వం, అధికారులు పూనుకుని వాయుకాలుష్యాన్ని అరికట్టడానికి, మానవాళిని రక్షించడానికి ప్రయత్నం చేయడం అవసరం. ఎక్కిన కొమ్మను నరుక్కోవడం విజ్ఞత కాదు. *

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969