మెయన్ ఫీచర్

మనసారా నవ్వగలిగే రోజులెపుడో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్టీసీ బస్సులో ఇప్పటికీ ఎంపికి, ఎంఎల్‌ఏకు సీట్లు రిజర్వు అన్న పదాలు ఆ సీటు వెనుక కనపడుతూ ఉంటాయి. కానీ, ఏనాడు ఓ ఎంపి, ఓ ఎంఎల్‌ఏ ఆర్టీసీ బస్సు ఎక్కిన పాపాన పోరు. వారేకాదు- ఎంపిటిసి, జెడ్‌పిటిసి సభ్యులు కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కడం తమ హోదాకు తగ్గట్టుగా వారు భావించడం లేదు. చివరికి మున్సిపల్ కౌన్సిలర్లు, మేజర్ పంచాయతీ సర్పంచులు కూడా నెంబర్ ప్లేట్లపై వారి హోదాల్ని ఎర్రక్షరాలతో రాయించుకుని సొంత కార్లలో ప్రయాణిస్తున్న రోజులివి. ఇలాంటి వారందరూ టోల్‌గేట్ వద్ద చార్జీలు కట్టడం అవమానంగా భావిస్తారు. బాధంతా బస్సుల్లో రోజూ ప్రయాణం చేసే సాధారణ ప్రజల ఇబ్బందులు ఈ నేతలకు తెలియకపోవడమే! రైల్లో ప్రయాణం చేస్తే ఎసి కోచ్‌లలో, విమానంలో అయితే ఒకటో శ్రేణి తరగతిలో ప్రయాణం చేసే నాయకులకు అదే రైల్లో సాధారణ బోగీల్లోని అతి సాధారణ ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకునే అవకాశం వుండదు. అది ఎన్ని రోజులుగా శుభ్రం చేయబడలేదో, టాయిలెట్ల పరిస్థితి ఏంటో ప్రజా నాయకులకు సంబంధించిన అంశం కాదు. ఒంటికాలిపై చేసే ప్రయాణం, ఊపిరాడని వాతావరణం వీరి ఊహలకు కూడా తట్టదు.
ఉదయానే్న ఓ పాల ప్యాకెట్ కొంటాం. దాని ధరెంతో తెలియదు. ఏజెంటు ఇవ్వమన్నంత ఇవ్వడం తప్ప. ప్యాకింగ్ తేదీ, ఎన్ని రోజుల్లో వాడాల్సింది ఆ ప్యాకెట్‌పై వెతుక్కుంటే కానీ అవి కనపడవు. కనబడినా పట్టింపు వుండదు. వంటనూనె ప్యాకెట్లు లీటరు ధర నుంచి ప్యాకెట్ ధరకు మారిపోయాయి. అందులో వుండే పరిమాణమెంతనో ఎవరికీ పట్టదు. కారణం- ప్యాకెట్ అంటే లీటరే అనే భ్రమ! పిల్లల్ని ఆకర్షించే చిప్స్, కుర్‌కురేలు చూడడానికి గోనెసంచి తిత్తిలా వుంటాయి. గాలి తీసేస్తే మిగిలేది ఓ పది ముక్కలే! బియ్యం దుకాణానికి వెళ్లి శాంపిల్ చూస్తాం. ఆ శాంపిల్ చూశాక మన కళ్ళు తెల్లబడతాయి. డోర్ డెలివరీ అంటే సంతోషించి ఓ పది ప్యాకెట్లని పంపమంటాం. పంపినవి చూసినా శాంపిల్ లాంటి బియ్యమేనా? ప్యాకెట్ తూకం వేస్తే నిజంగా 25 కిలోలు వుంటాయా? అనేది ఓ పనికిమాలిన ఆలోచన! ధర గిట్టుబాటైందా? లేదా? అని మాత్రమే మన పట్టింపు. వండి చూడండి, నచ్చకపోతే వాపస్ అంటే తెగ నమ్ముతాం. ఎందుకంటే మనం తిరిగి పంపమనేది షాపువాడి ధీమా!
చేపల మార్కెట్, మటన్ మార్కెట్, చికెన్ సెంటర్.. వధించబడే జీవాలు, వధిస్తున్న తీరు, తూకంలో వ్యత్యాసం చూస్తే- ఇవన్నీ తూనికలు-కొలతల శాఖ అధికారికి కూడా తెలుస్తాయా? అనేది అనుమానం. మామూళ్ళపై వుండే శ్రద్ధ వీటిపై శానిటరీ ఇన్స్‌పెక్టర్‌కుగాని, కొలతల శాఖ అధికారికిగాని వుండదు. వీరుంటారని, వీరికి కొన్ని విధులుంటాయనే విషయం జనాలకు తెలియకపోవడం ఓ విషాదం! దుబాయి మార్కెట్లను మరిపించే మన షాపింగ్ మాల్స్ మాయాజాలం వాటిని సృష్టించిన వాడికైనా తెలుసా? అనేది అనుమానమే! ఓ పప్పుకో, ఉప్పుకో, పెప్సీకో, ముక్కిన బాస్మతి బియ్యాన్నో కనీస ధర అంటూ- ఒకటికి మరొకటి ఉచితం అనగానే ఉబ్బితబ్బిబ్బై వాటితోపాటు అవసరానికి మించిన, అవసరం లేని వస్తువుల్ని, పదార్థాల్ని ట్రాలీలో వేసుకుంటూ మాల్‌లో తిరగడం ఓ గర్వకారణం! ఇక చంటిగాడో, చంటిదో వుంటే వారితో పాటు ఐస్‌క్రీం లాగించడం, కళ్ళకు కనపడని పైసల్ని కార్డుతో గీకడం పెరుగుతున్న మన హోదాకు ఓ చిహ్నం! ఓ సరదా! కానీ- వాటిపైన ఉన్న ధరల్ని, అందులోని క్వాంటిటీని, క్వాలిటీని, ఎక్స్‌పైరీ తేదీని గుర్తించడం, గుర్తించాలని అనుకోవడం మన హోదాకు తగింది మాత్రం కాదు. ఇప్పుడంతా ఆకట్టుకునే ప్రకటనలే! ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ డెలివరీలే! మన శరీరాన్ని బరువెక్కించే ఈ షాపింగ్ విధానం తెలియకపోతే ఎంత నామోషీయో! ఇలాంటి అధునాతన షాపింగ్ విధానంతో అధునాతన రోగాలుండనే వుండే- వీటిని చూసుకోవడానికి కార్పొరేట్, రిఫరల్ హాస్పిటల్స్ వుంటే- వాటిని మేపడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు మన వెన్నంటే వుంటాయి.
లీటరు పెట్రోలు ధర, ఆటోమీటర్ చార్జీ- ఇంకా నయాపైసకు విలువనిచ్చే విధానమే! పెట్రోల్ బంకుల్లో, ఆటోలో ప్రయాణిస్తున్నందుకు మనం పోగొట్టుకుంటున్నదెంతో మనకు తెలియదు. కల్తీ పెట్రోలా? కాదా? అనేది పక్కనబెడదాం. పోస్తున్న పరిమాణం, తీసుకుంటున్న పైసలు ఎంతనో తెలియదు. చిల్లర అడిగితే ‘చిల్లరవాళ్లమైపోతామనే’ మనస్తత్వం! వంట గ్యాస్ కథ అంతే! మనం ఇచ్చే బిల్లు డోర్ డెలివరీకి అని తెలియదు. తెలిసినా ప్రశ్నించడం నామోషీ. అదనంగా ఇరవై, ముప్పయి ఇవ్వాల్సిందే! ఆటోవాలా నుంచి అధికారుల దాకా ఈ వసూళ్లు వెళతాయి. ఇక సిలిండర్‌ను తూచి ఇవ్వాలనే ‘సోయి’ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌కు వుండదు. సివిల్ సప్లయిస్ శాఖ అధికారికి వుండదు. ఈ ‘సోయి’ వుండాలనేది మనకు తెలియదు. గ్యాస్ సిలిండర్ డెలివరీ కావడమే మహాభాగ్యంగా భావించడం తప్ప!
ఇక పాఠశాలల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు. ప్రభుత్వ పాఠశాలల్ని ఎలాగో మర్చిపోయాం. సాధారణ ప్రైవేట్ పాఠశాలలు కూడా మన ముఖచిత్రం నుంచి చెరిగిపోతున్నాయి. మిగిలింది కార్పొరేట్ విద్యాసంస్థలే. అందులో పిల్లలకు అడ్మిషన్ దొరకడమే భాగ్యంగా భావించే తల్లిదండ్రులకు తెలిసిన మూడు మంత్రాలు ఎస్ (కూళఒ), నో (్య), ఆల్ రైట్ ( జదఆ)లే! ‘ఎస్’ అంటే ఫిల్లల్ని క్రమం తప్పకుండా పంపడానికైతే, ‘నో’ అంటే యాజమాన్యం గూర్చి, వారు వసూలు చేసే ఫీజుల గూర్చి కాగా, ఆల్‌రైట్ అంటే- పిల్లవాడు బాగా చదవకపోతే, ఇంటికి పంపిస్తామనే సంకేతాలన్నమాట! ఇంటిదగ్గర చదువు చెప్పడం, కుదరకపోతే చెప్పించడం, రుద్దడం ఎలాగూ అదనం. అయినా మన కంట నీరు రాదు. ఎందుకంటే పిల్లలు ఎలాగూ ఏడుస్తారు కాబట్టి. ఉత్తమ బోధన పేరున బాధించబడుతున్న ఆ పాఠశాలల ఉపాధ్యాయుల బాధలు వీరికి పట్టవు. ప్రభుత్వ పాఠశాలల వలే ప్రభుత్వ దవాఖానాల్ని మర్చిపోతున్నాం. కన్నీరు ఎండిపోయేలా పైసల్ని గుంజే కార్పొరేట్ వైద్యంలో రోగమొకటైతే, వరుసబెట్టి డాక్టర్లు చూడడం, వారి ఫీజే రోజువారీగా వేలల్లో ఉండడం వింత కాదు. ఇది తెలియకపోవడమే ఓ వింత! ఓ స్పెషలిస్టు డాక్టర్ ముక్కుపిండి ఎంత ఎక్కువ వసూలు చేస్తే అంత మంచి వైద్యం అన్నమాట! ఇంతా చేస్తే ముందు చెల్లించిన ఫీజు రెండో విజిట్‌కి పనికిరాదు. తిరిగి చెల్లించాల్సిందే! డాక్టర్‌కి ఇదో పెద్ద హోదా! రాసే మందులకు, చెల్లించే బిల్లుకు, చేసే పరీక్షలకు రోగులు మూల్గడం నిషిద్ధం! ఓ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మరో డాక్టరు ఖాతరు చేయడు. వైద్య పరీక్షల తంతూ ఇంతే! డాక్టరు మారినా, దావఖానా మారినా అన్ని వైద్య పరీక్షలు మళ్లీ మొదటి నుంచి చేయించాల్సిందే!
ఇప్పటిదాకా నాటుసారా ప్రమాదమనుకుంటే, బ్రాండెడ్ విస్కీలు కూడా కల్తీయేనని వార్తలు. వీటి ధరలకు అప్పుడప్పుడు రెక్కలు వస్తాయట! అందరిలాగా ఇవి చెప్పుకునే బాధలు కావు. పట్టించుకునే సమస్య కాదు. ఈ ‘మందు’ కథ ఇట్లా వుంటే, పంటలకు వాడే పురుగు మందులు, ఎరువులు, విత్తనాలది మరో మహాభారత పర్వం లాంటిది! రైతు కంట కారే కన్నీటిని తుడవడానికి కాటన్ గుడ్డ కూడా దొరకని వైనం. బహుశా ఈ వ్యవస్థలో సరదాకు కూడా నవ్వని వ్యక్తి ఓ రైతే! మన వ్యవసాయ విధానానికి ఇదో మాయనిమచ్చ మాత్రం కాదు. ఈ సమస్య వుంటేనే కదా పార్లమెంటులో, అసెంబ్లీలో మాట్లాడేది! లేకుంటే చట్టసభలు ఏ చర్చలూ లేక మూగబోవాల్సిందే! మన పాఠ్యాంశాల్లో నీటికి మూడే రూపాలు. కానీ, మార్కెట్లలో ఎన్ని రూపాలో..? బిస్లెరీ, కినే్ల, ఆక్వా, గంగోత్రి, యమునోత్రి, గోదావరి, కృష్ణ, మరో ప్రాంతంలో మరో నది పేరున అమ్ముకునే జలం. ఇలా పేరు పెట్టినందుకు అదనంగా అవి గొప్పగా మారిపోతాయి. ఎప్పుడు నింపబడ్డాయో, వాడాల్సిన రోజులెన్నో, అసలైన ధరెంతనో గుర్తించడం మనకు అబ్బని విద్య. గుర్తించినా ప్రశ్నించలేని అమాయకపు మూర్ఖత్వం. హడావుడి జీవితం కాబట్టి అడిగినంత ఇస్తాం. చిల్లర లేదని చాక్‌లెట్ ఇచ్చినా ఇకిలిస్తాయం. ఇక ‘రైల్ వాటర్’ది మరోకథ. ప్లాట్‌ఫారాలపై నల్లాలుంటాయి. కొన్ని రైల్వే స్టేషన్లలో కూలర్లు వుంటాయి. అవి పనిచేసినా, మనం తాగని పరిస్థితి నెలకొన్నా ప్రశ్నించుకోం. కోచ్‌ల్లో అదనంగా డబ్బు చెల్లిస్తూ నీటిని కొనుక్కుంటూనే వాడుతాం. దినపత్రికలది ఇదే తంతు. పత్రిక ధరకు, అమ్మే ధరకు సంబంధమే వుండదు. అడిగినంత ఇవ్వడమే మనకు అలవాటు. పోస్టుకార్డు, ఇన్‌లాండ్ లెటర్, ఎనవలప్ కవరు దశాబ్దాల క్రితం మాట. ఇప్పుడంతా కొరియర్ మయమే! పోస్టుమాన్ డెలివరీ చేయకపోతే రుసరుసలాడిన మనం, కొరియర్ ఏజెంట్ అడ్రస్ దొరకడం లేదంటే, మనమే పరుగెత్తి తెచ్చుకుంటాం! ఇదో థ్రిల్!
అయినా బతుకీడ్తున్నాం. ఏడవడం బాగుండదని నవ్వుతున్నాం. నటిస్తూ నవ్వుతున్నాం. నవ్వాలి కాబట్టి నవ్వుతున్నాం. ఏడవడం తెలియక కూడా నవ్వుతున్నాం. ఇంటా బయటా మనం, పాఠశాలల్లో పిల్లలు ఎక్కువ సమయం ఏడవడానికే కేటాయిస్తున్నాం కాబట్టి, మిగతా సమయాల్లో ఎలాగైనా నవ్వడానికే ప్రయత్నిస్తున్నాం. అప్పటికీ నవ్వలేనివారు, నవ్వడం రానివారు లాఫింగ్ క్లబ్బుల్లో చేరి మరీ నవ్వాల్సి వస్తుంది. లేకపోతే మాయదారి జబ్బులు అంటుకుంటాయి కాబట్టి. అందుకే మనం నవ్వాలి. నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతూ బతికే తెలంగాణ ఏర్పాటే లక్ష్యం అంటున్న కెసిఆర్ మాటలకోసమైనా నవ్వాలి! మన నాయకులు మనతోపాటు ఆర్టీసీ బస్సులు ఎక్కి మనకు ఇబ్బంది కల్గించనందుకు, సాధారణ రైలు కోచ్‌ల దరిదాపుల్లోకి రానందుకు, ధర ఎంతైనా కల్తీ పాలైనా దొరుకుతున్నందుకు, హానికరమైనా పలురకాల వంటనూనెలు అందుబాటులోకి వచ్చినందుకు మనం నవ్వాలి. గరీబోళ్లకే ప్రభుత్వ పాఠశాలల్ని, ఆస్పత్రుల్ని రిజర్వు చేసి నేతలు మనతో పోటీపడనందుకు, కావాల్సినన్ని పౌల్ట్రీ ఫామ్‌లు పెట్టి చికెన్, మటన్‌ను కావాల్సినంత తినేలా చేసినందుకు, ధర పెరిగినా గ్యాస్ సిలిండర్లు లభిస్తున్నందుకు, రోగాలకు మందులు, పంటలకు పురుగుమందులు కావాల్సినంతగా ఉత్పత్తి జరుగుతున్నందుకు, శల్యపరీక్షలు చేయించి చివరికి రోగం లేదని చెప్పినందుకు, సినిమా రిలీజు అయినప్పుడు బ్లాకులో టికెట్ దొరికినందుకు, నీళ్ళ ట్యాంకరు వచ్చినందుకు, నిలువు దోపిడీ చేసే ప్రైవేట్ పాఠశాలలో మన పిల్లలకు అడ్మిషన్ దొరికినందుకు, పైసలు పోయినా, కార్పొరేట్ హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చినందుకు... ఇలా అన్నింటికీ నవ్వాల్సిందే! ఓ సినీకవి అన్నట్లు- నవ్వుతూ బతకడమే కాదు.. నవ్వుతూ చావడం కూడా ఓ తెలివే! ఇవి నేర్చుకోకపోతే మన లక్ష్యాలు, ప్రగతి అంతా వ్యర్థవౌతాయి. అందుకే- నవ్వడం ఓ భోగం, నవ్వించడం ఓ యోగం, నవ్వకపోవడం రోగం. ఈ రోగం ముదరకుండా చూసుకోవాల్సింది మనమే! అందుకే మొదలుపెడుదాం! నవ్వే సమాజమే లక్ష్యంగా సాగుదాం!! *

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162