మెయిన్ ఫీచర్

అనువాదం.. పెనుభూతమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవును! వాళ్లదే ఇష్టపడుతున్నారు. కోట్ల బడ్జెట్‌ను పెనుభూతం గుటుక్కున మింగేస్తున్నా -ఎంగిలి కథల్ని ఎక్కడెక్కడి నుంచో ఏరి తెచ్చుకుని రీ‘మేకు’లు
కొట్టుకుంటున్నారు.
ఎందుకంటే -కథను
అల్లుకోవడం కంటే,
నొల్లుకోవడం సులువు కదా!
-తెలుగు పరిశ్రమ మీద తెరకు దూరమైన ఓ సీనియర్ నటుడు వేసిన బండరాయి ఇది. ‘మమకారం చంపుకోలేక ఈ మాట అంటున్నా’ అంటూ ఒకింత గుండె తడినీ వినిపించాడు ఆయన.
**
నిజమే! కథలకు కాణాచి తెలుగు. సంస్కారం నుంచి, సంస్కృతినుంచి, సంప్రదాయం నుంచి, సామాజిక జీవనపథం నుంచి -ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి తెలుగులోనే. తిక్క శంకరయ్యలను, తిరుగుబాటు ప్రదర్శించిన యోధులనూ కథలు చేసుకున్నది తెలుగులోనే. అంతెందుకు -కోటానుకోట్ల బడ్జెట్ పెట్టి తీసే హాలీవుడ్ సినిమాలకు సైతం ఒకప్పటి తెలుగు సినిమా కథలే మూలం అంటే ఆశ్చర్యమేస్తుంది. అలాంటి తెలుగు పరిశ్రమకు -కథలు కరవయ్యాయి. ఏ భాషలోనైనా ఓ హిట్టు సినిమా పడితే చాలు, దాన్ని ఎలా తెచ్చుకుందామా? అన్న ఆలోచనలకు పరిమితమైపోతోంది తెలుగు పరిశ్రమ. ఇదే విషయం ఎక్కడైనా ప్రస్తావనకు వస్తే వచ్చే సమర్థనా బలంగానే వినిపిస్తోంది. ‘ఔను తప్పేముంది? అవన్నీ మంచి కథలే కనుక తెచ్చుకుంటున్నాం. కాదంటారా?’ అని.
***
కోట్ల రూపాయలతో సాగే వ్యాపారం కనుక -పరిశ్రమలో సెంటిమెట్లు పరిపాటి. ఒక్క యాక్షన్ ఎపిసోడ్ హిట్టయితే -హీరోలంతా అలాంటి సినిమాలకు వరుస పెడతారు. ఒక్క ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సరైన టైంలో పడితే -మిగిలిన దర్శకులూ అలాంటి కథలే ఏరుకుంటుంటారు. ఒక్క హారర్ సినిమా వర్కవుటైతే -నిర్మాతలంతా అదే జానర్‌లో సినిమాలు చేద్దామని సిద్ధమవుతారు. ఇండస్ట్రీలో రొటీన్‌గా సాగిపోతున్న స్ట్రాటజిక్ సెంటిమెంట్ ఇది. అందులో భాగమే ఇప్పుడు నడుస్తున్న రీమేక్‌ల సీజన్.
తెలుగు పరిశ్రమలో రీమేక్‌ల సంస్కృతి ఇప్పుడే మొదలు కాలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల కాలం నుంచీ ఉన్నదే. కాకపోతే -మన కథ మన కథే. పరభాషా కథ పరభాషదే అన్నట్టే ఉండేది. ఎన్టీఆర్ కెరియర్లో సూపర్ హిట్టు అనిపించుకున్న అనేక సినిమాల్లో -రీమేకులదీ సింహభాగమే. కొండవీటి సింహం, అడవిరాముడు, గుడిగంటలు, ఆరాదన, అనురాగ దేవత, ఖైదీ నెంబర్ 1, యుగంధర్, బడిపంతులు లాంటి సినిమాలన్నీ నిజానికి రీమేకులే. అలాగని వాటికోసమే అప్పటి హీరోలు వెంపర్లాడలేదు. అదొక ప్రయోగంగా మాత్రమే ఆలోచించారు. హిట్టయిన కథకు మన భాషనుంచి ఇచ్చే సమున్నత గౌరవంగానే భావించారు. అయితే, అదంతా అంత సులువుగా జరిగిపోయేది కాదు. అప్పటికి అందుబాటులో ఉన్న సినిమా సాంకేతిక పరిస్థితిని గుర్తు చేసుకుంటే -రీమేక్‌ని కూడా డైరెక్ట్ సినిమా తీసినంత కష్టపడాల్సి వచ్చేదన్నది నిజం. కానీ -ప్రస్తుత పరిస్థితి వేరు. సినిమా టెక్నాలజీ విస్తృతమైంది. హిట్టయిన సినిమా హక్కులు సంపాదించుకుంటే -రీమేక్ సినిమాను సిద్ధం చేయడం సులువైపోయింది. దీంతో పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలే కాదు, చిన్న బడ్జెట్‌తో సినిమాలు తీసేవాళ్లు సైతం అదే సాంకేతికత సామర్థ్యంతో రీమేక్‌లవైపు పరుగులు తీస్తున్నారు. పైగా ఎక్కడో హిట్టయిన కథను తెచ్చుకుని సినిమా చేయడం కూడా సొంత హీరోయిజం లెవెల్లో ప్రచారం చేసుకుంటుంటే -ఎటుపోతున్నాం అన్న ప్రశ్నలు ఇండస్ట్రీకి దూరంగా బతుకుతున్న సీనియర్ల నుంచి ఆవేదనతో వినిపిస్తున్నాయి.
**
సినిమాకూ వ్యాపారమే సూత్రమైనపుడు -రీమేక్‌లతో వచ్చే లాభాలను ఎందుకు వదులుకోవాలి? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న మాట. నిజమే -గత రెండేళ్లలో వచ్చిన అనేక అనువాద సినిమాలు బాగానే డబ్బుచేశాయి. సినిమావర్గాలకు సిరులే కురిపించాయి. కానీ -అచ్చమైన తెలుగు కథకు ఆడియన్స్‌ని దూరం చేస్తున్నాయన్న నష్టాన్ని గమనించక పోవడం దురదృష్టకరం. ఒకవిధంగా చెప్పాలంటే -మన సంస్కృతినుంచి ఆడియన్స్‌నే దూరం చేస్తున్నాయన్నది కాదనలేని వాస్తవం. ఇటీవల వచ్చిన కొన్ని అనువాద చిత్రాలనే తీసుకుందాం. నిన్నటికి నిన్న తమిళ మాతృత కథతో చిరంజీవి చేసిన ఖైదీ నెంబర్ 150, రామ్‌చరణ్ చేసిన ధ్రువ, కొంచెం ముందు ఫ్రెంచ్ సినిమా మాతృకతో నాగార్జున చేసిన ఊపిరి, మళయాలం మాతృక కథతో చైతూ చేసిన ప్రేమమ్‌లాంటి చిత్రాలన్నీ ఆడియన్స్ మెప్పు పొందినవే. ఆర్థికంగా అనుకున్న స్థాయికి చేరుకున్నాయా? అన్న మాటను పక్కనపెడితే -ఒకసారి చూసి ఆడియన్స్ ఓకే అనేశారు. అంతకుముందు సీజన్‌లో -దృశ్యం, గబ్బర్‌సింగ్, గోపాల గోపాల లాంటి చిత్రాలూ మంచి రేటింగ్‌నే సాధించాయి. మరీ ముందుకెళ్తే -టాగోర్, శంకర్‌దాదా ఎంబిబిఎస్ లాంటి చిత్రాలనూ ప్రస్తావించుకోవచ్చు. హిట్టుమార్కు కొట్టాయి కనుక వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏమీ ఉండకపోవచ్చు. మరి ఫట్ మార్క్ వేసుకున్న సినిమాల సంగతి? అంటే ఎవరూ మాట్లాడరు. సందీప్ కిషన్ ‘రన్’, అల్లరి నరేష్ ‘విక్టరీ’, సుమంత్ ‘నరుడా డోనరుడా’, నారా రోహిత్ ‘తుంటరి’, ఆంధ్రపోరి, దాగుడుమూతల దండాకోర్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, డైనమేట్, జేమ్స్‌బాండ్, శంకరాభరణం చిత్రాలూ గత రెండు మూడేళ్లలో వచ్చిన రీమేకులే. మంచి కథలనే తెచ్చుకున్నా -తెలుగులో అడ్రస్‌లేకుండా పోయాయి.
***
పవర్‌స్టార్ అనిపించుకున్న పవన్ సైతం -కెరియర్లో గట్టిగానే రీమేకులకు ఓటేశాడు. గోకులంలో సీత, స్వాగతం, తమ్ముడు, ఖుషి, అన్నవరం, తీన్‌మార్, గబ్బర్‌సింగ్, గోపాలగోపాల.. ఇప్పుడు తాజాగా కాటమరాయుడు. రెండురోజుల క్రితం విడుదలైన కాటమరాయుడు వసూళ్లపరంగా పెద్దలెక్కలే చెబుతున్నా -కామన్ ఆడియన్స్ మాత్రం పెదవి విరుస్తుండటాన్ని గ్రహించాలి. కొద్దిరోజుల్లోనే మరో రీమేక్ చిత్రం వెంకటేష్ ‘గురు’ విడుదలకు సిద్ధమవుతుంటే, హిందీ హంటర్‌కు రీమేక్‌గా అవసరాల శ్రీనివాస్ చేస్తున్న సినిమా ‘బాబు బాగా బిజీ’ రానుంది. ఇక తమిళంలో హిట్టయిన ‘బోగన్’ చిత్రాన్ని తెలుగులో చేసేందుకు రవితేజ్ ఒప్పుకున్నట్టు టాక్. అంటే మరికొంత కాలం తెలుగు పరిశ్రమ రీమేక్‌లనే నమ్ముకోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
***
ఇలాంటి రీమేక్‌ల సీజనే టాలీవుడ్‌లో కొంతకాలం క్రితం కూడా సాగింది. అప్పట్లో వచ్చిన ఎన్నో అనువాద చిత్రాలు పెనుభూతం బారినపడి ఢమాల్‌మన్నాయి. అయినా మళ్లీ రీమేకుల వైపే హీరోలు పరుగులు తీశారు. ఆ సంగతి ఈ సినిమాలను గ్రహిస్తే అర్థమవుతుంది. హిందీలో సూపర్ హిట్టయిన ‘బోల్ బచ్చన్’ను తెలుగులో వెంకటేష్, రామ్‌ల కాంబోలో ‘మసాలా’ చేస్తే ఘాటు ఎక్కువై అట్టర్ ప్లాపయ్యింది. హిందీ ‘బ్యాండ్ బాజా’ను తెలుగులో నాని, వాణీకపూర్‌తో ‘ఆహా కళ్యాణం’గా రీమేక్ చేస్తే అడ్రస్ లేకుండా పోయింది. హిందీలో హిట్టయిన తను వెడ్స్ మను చిత్రాన్ని -కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ‘మిస్టర్ పెళ్ళికొడుకు’గా చేస్తే అట్టర్ ఫ్లాప్. కన్నడంలో మినిమమ్ గ్యారంటీ అనిపించుకున్న ‘తాజ్‌మహల్’ను అదే పేరిట నటుడు శివాజీ సొంతంగా రీమేక్ చేస్తే సినిమా దారుణంగా పరాజయమైంది. మలయాళంలో ఫర్వాలేదనిపించుకున్న ‘రామాచారి’ సినిమా తెలుగులో వేణు హీరోగా రీమేకై ఎప్పుడొచ్చిందో తెలీకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. హిందీలో సూపర్ హిట్టయిన ‘లవ్ ఆజ్‌కల్’ చిత్రాన్ని పవన్‌కళ్యాణ్ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ‘తీన్‌మార్’గా తీస్తే అట్టర్ ఫ్లాప్ అనిపించుకుంది. కన్నడంలో విష్ణువర్ధన్, సంధ్య, విమలారామన్‌లతో పి వాసు తీసిన ‘ఆప్తరక్షయ’ ఘన విజయం సాధించింది. దానే్న వెంకటేష్ హీరోగా ‘నాగవల్లి’ అంటూ తెలుగులో రీమేక్ చేస్తే ఫెయిలైంది. మలయాళం, హిందీ, తమిళంలో హిట్టయిన ‘బాడీగార్డ్’ను వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్.
అయినా ఇంకొన్నాళ్లు -తెలుగులో రీమేక్‌లు వస్తాయి. వచ్చి తీరుతాయి. ఎందుకంటే -మనం మారం. సులువైన ప్రక్రియకు అలవాటుపడిపోతున్నాం. అంతే!