మెయిన్ ఫీచర్

బంగారు భవితకు నాంది హేమలంబ ఉగాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలము అనంతం, అప్రమేయం. అపరిమితమైన కాలంలో పరిమితమైనది మానవ జీవితం. మానవ జీవితమే కాలస్వరూపం. సూర్యోదయ, సూర్యాస్తమయం మధ్య మనిషి వయస్సు పెరుగుతుంది, ఆయుష్షు తగ్గుతుంది. వయస్సు అందరికీ పెరుగుతుంది. ఆ వయస్సు సార్థకం అయ్యేదీ, వయస్సుతో పాటు వ్యక్తిత్వం పెరిగేదీ కాల ప్రాముఖ్యాన్ని గుర్తెరిగి, కాలాన్ని సద్వినియోగపరచుకుంటేనే. కాల సంబంధిత పండుగ ‘ఉగాది’.
వసంత ఋతువు - ఋతు ధర్మములు
మధుశ్చ మాధవశ్చ వాసంతి కానృతూ అన్నది వేదం. చైత్ర వైశాఖ మాసములు కలది వసంత ఋతువు. నవ్య చైతన్యాన్ని ప్రసాదించే ఋతువుఇది. పౌర్ణమి చిత్తా నక్షత్రంతో కూడి ఉండే మాసం- చైత్రమాసం. ‘ఇంద్రస్య చిత్తా’ చిత్తా నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. చిత్తా నక్షత్రం కుజునిది. కుజుడు అగ్ని సంబంధమైనవాడు. విశాఖా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగల మాసం- వైశాఖమాసం. విశాఖా నక్షత్రానికి అధిపతి గురుడు. సూర్యుడు చైత్రమాసంలో మేషరాశిలో ఉంటాడు, వైశాఖ మాసంలో వృషభరాశిలో ఉంటాడు. ఈ రెండు నెలలు వసంత ఋతువు. కుజ గురులు సూర్యునికి మిత్రులు. ఇంద్రాగ్నులు సూర్యస్వరూపులు. చిత్తా విశాఖ నక్షత్ర కాంతులు- సూర్య తేజస్సు. రవి- మేష వృషభరాశులలో ఉన్నపుడు కలిగే ప్రకృతి శోభ, దాని ప్రభావము. ఇంద్రాగ్నుల చిత్తా విశాఖా నక్షత్రముల ప్రభావముల మేలుకలయికతో వచ్చేది- వసంత ఋతువని జ్యోతిష వేద శాస్తమ్రులు పేర్కొన్నాయి. వసంత ఋతువులో సకల జీవులకు మానసిక, శారీరక బలం కలుగుతుంది. బుద్ధి వికాస లబ్ధి జరుగుతుంది. వసంత ఋతుగమనంతో ప్రకృతిలో నూతన తేజోత్సాహం క లిగి, నవ జీవన వెలుగు జ్యోతకమవుతుంది. అందుకే ‘ఋ తూనాం కుసుమాకరః’ ‘‘ఋతువులలో వసంతఋతువును నేనే’’నన్నాడు శ్రీకృష్ణపరమాత్మ.
ఉగాది పండుగ
మాసములలో మొదటిది చైత్రము. పక్షములలో మొదటిది శుక్లపక్షం, తిథులలో మొదటిది పాడ్యమి, నక్షత్రములలో మొదటిది అశ్విని, వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయానికి పా డ్యమి ఉన్న తిథి రోజున సంవత్సర ఆరంభముగా నిర్ణయించి ఆ రోజు ‘ఉగాది’ జరుపుకుంటారు. ఉగము ఆదిగా గలది ‘ఉగాది’. ఉగము అంటే జన్మ, ఆ యుష్షు, యోగము, యుగము అనే అర్థాలున్నాయి. ఉగాది అంటే జ న్మాది. ‘‘జననో జన జన్మాదిః భీమో భీ మ పరాక్రమః’’ అన్నది విష్ణుసహస్ర నా మం. కనుక జన్మాది శ్రీమహావిష్ణువు. ఉగ్ + ఆది = ఉగాది. ‘ఉక్ ఆదౌయస్యసః ఉగాదిః’ ఉగ్, ఆది యందుగల రోజు ఉగాది. ‘ఉ’ అంటే శివుడు. ‘ఉ’ ఆదిగా గలది ఉమ. కనుక ఉగాది అంటే ‘ఉమ’- ప్రకృతి శక్తి- బ్రహ్మవిద్య, కుండలినీ యోగశక్తి- చేతనాచేతన జీవరాశికి ప్రతీక. సరైన జీవన విధానానికి ఉపకరించే అసలైన విద్యను నేర్చుకోవటానికి ప్రారంభ దినమే ఉగాది. ‘ఉ’ అంటే ఉత్తమమైన, ‘గం’ అంటే జ్ఞానం. ఉగం అంటే ఉత్తమమైన జ్ఞానం. ఉత్తమమైన జ్ఞానం ఏమిటి? పరమాత్మ తత్త్వం. పరమాత్మ వేదవేద్యుడు. వేద జ్ఞానం. పరమాత్మ తత్త్వాన్ని తెలియజేసేది వేదము. ‘ఉగమ్’ అంటే వేదము. ‘ఉగాది’ అంటే- ఉగమునకు ఆది అనగా వేదమునకు ఆది. ఏమిటది? ఓంకారము. ఓంకార ప్రణవనాదము. ప్రాణాగ్నుల కలయికతో నా దము ఏర్పడుతుంది. అదే దైవీవాక్కు. స్వరము కూడా ఉగాదే.
కొత్త ఏడాదికి స్వాగతం, గత ఏడాదికి వీడ్కోలు పలికే రో జు ఉగాది. ఉదయానే్న అభ్యంగన స్నానం, ఇష్టదేవతారాధన, భగవంతునికి నివేదించిన షడ్రుచులతో కలిసిన ఉగాది పచ్చడి సేవనం, పంచాంగ శ్రవణం ఈ రోజున ఆచరించాలి.
ఉగాది పచ్చడి
ఇది ఆరు రుచులతో కలిసి ఉంటుంది. అవే- చేదు, వగరు, తీపి, పులుపు, కారం, ఉప్పు. మానవ జీవితం వైవిధ్యం అంతా ఉగాది పచ్చడిలో ప్రతిబింబిస్తుంది. జీవితంలో అన్నింటినీ సమచిత్తంతో స్వీకరించే ఆత్మస్థైర్యం ఉండాలని ఉగాది పచ్చడి మనకి సందేశమిస్తుంది. ‘‘శతాయుర్వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం’’ అనే శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడిని సేవిస్తే ఆయుర్‌వృద్ధి, దేహదారుఢ్యం కలిగి సర్వసంపదలు చేకూరుతాయి. అరిష్టాలు తొలగి, సుఖ సంతోషాలు లభిస్తాయి.
పంచాంగ శ్రవణం
తిథి వార నక్షత్ర యోగ కరణములతో కూడినది పంచాంగం. తిథి వలన సంపద, వారము వలన ఆయుష్షు, నక్షత్రము వలన పాప పరిహారము, యోగము వలన వ్యాధి నివారణం, కరణము వలన కా ర్యానుకూలత చేకూరుతాయి. పం చాంగ శ్రవణము వలన, నవగ్రహముల ధ్యానము వలన శుభ ఫలితాలు కలుగుతాయి. పంచాంగం వింటే సంవత్సరమంతా శుభము కలుగుతుంది. శత్రుబాధలుండవు. చెడు కలల వలన కీడు తొలగుతుంది. గంగలో స్నానం చేసినంత పుణ్యం, గోదానంతో సమానమైన మేలు చేకూరుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. సంతాన సౌభాగ్యం లభిస్తుంది. అనేక శుభ పుణ్యకర్మలకు పంచాంగం సాధనమవుతుంది.
‘హేమలంబ’ అంటే..?
‘ప్రభవ’ నుంచి ‘అక్షయ’ వరకూ తెలుగు సంవత్సరాలు అరవై. ప్రభవించడంతో ప్రారంభమైన ‘ప్రభవ’ ‘అక్షయ’తో ముగుస్తుంది. ‘అక్షయ’ అంటే క్షయము కానిది. వీటిలో ముప్ఫయి ఒకటవది ‘హేమలంబ’. ‘హేమలంబ’ అంటే బంగారు తోరణము అని అర్థం. ‘‘హేమలంబ విలంబీచ వికారీ శార్వరీ తథా..’’ అని హేవిలంబ నామ సంవత్సరం తరువాత వచ్చే సంవత్సరాల పేర్లను తెలియపరచారు. హితము, రమ్యము అయినది బంగారం. బంగారంలో రహస్యంగా ‘అగ్ని’ ఉంటుందని వేదం చెప్పింది. ‘హేమలంబ’లో అందరూ ఆరోగ్యంగా ఉంటారని, దేశం సుభిక్షంగా, సుసంపన్నంగా ఉంటుందని ఈ సంవత్సర నామం చెబుతోంది. హేమలంబ నామ సంవత్సరానికి ‘ఆదిత్యుడు’ దేవత. ‘ఆదిత్యం తేజసాం స్థానం హేమలంబి కృతాహ్వయమ్ సప్త సప్తి సమారూఢం జగతాం నేత్ర మాశ్రయే’. ఈ సంవత్సర గ్రహ పరిస్థితులు, రాశిఫలితాలు ఎలా వున్నా, రోజూ ఉదయానే్న ఆదిత్య హృదయ సోత్రాన్ని పారాయణ చేస్తే సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉంటారు.
ఉగాది ప్రాశస్త్యం
ఉగాది పండుగకు పౌరాణికంగా, ఖగోళ శాస్త్ర రీత్యా, చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యం వుంది. మత్స్యరూపంలో సముద్రాన జొచ్చి వేదాలను దొంగిలించిన రాక్షసుణ్ణి సంహరించి, బ్రహ్మకు వేదాలను అందజేసిన శుభదినమే చైత్రశుద్ధ పాడ్యమి. ఇది మత్స్య పురాణం చెప్పిన ఉగాది విశేషం. బ్రహ్మపురాణం ప్రకారం, బ్రహ్మ ఆదిలో తాను ఈ చరాచరమైన సృష్టినంతా చైత్రశుద్ధ పాడ్యమినాడే ప్రారంభించాడని ఉగాది ప్రాశస్త్యం చెప్పబడింది. పదునాలుగేళ్లు అరణ్యవాసం చేసి, రావణ వధానంతరం, సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు, చైత్ర శుద్ధ పాడ్యమినాడు అయోధ్యకు తిరుగు ప్రయాణ సన్నాహం చేశాడని ఉగాది ప్రాశస్త్యాన్ని శ్రీమద్రామయణం పేర్కొన్నది. పురు వంశరాజైన వసురాజు, ఇంద్రుడనుగ్రహించిన అతిలోక సుందరమైన విమానాన్ని, ఎప్పటికీ వాడని ఒక పూలదండను యుద్ధంలో ఉపయోగించి అజేయుడై, ఆ వస్తువులతో చైత్రశుద్ధ పాడ్యమినాడు పట్టణ ప్రవేశం చేశాడని ఉగాది ప్రాశస్త్యాన్ని వసుచరిత్ర చెప్పింది. ఖగోళ శాస్తర్రీత్యా ఉగాది నాడు సూర్యుడు భూమధ్యరేఖపై ఉంటాడని చెప్తారు. ఈరోజు యుగాదుల దిన, మాస, వర్షారంభము ఏర్పడతాయి. విక్రమార్క చక్రవర్తి ఈరోజునే పట్ట్భాషిక్తుడైనాడు. విక్రమార్క శకం ఉగాది నాడే ప్రారంభమైంది.
ఉగాది సందేశం..
మనిషిగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. మనిషికి పరమాత్మ బుద్ధిని, భావప్రకటనకు భాషను ఇచ్చాడు. మనిషి- జీవితం విలువను గుర్తించి, తనలోని పశు రాక్షస ప్రవృత్తిని రూపుమాపుకొని, మానవతా విలువలను పెంచుకొని, అంతర్లీన దైవ ప్రకృతిని దేదీప్యమానంగా ప్రకాశింపచేసికొని, పరిమిత జీవితకాలంలో ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసికొని జీవిత చరితార్థతను పొందాలని హెచ్చరిస్తోంది- ఉగాది పండుగ.
*
-పసుమర్తి కామేశ్వర శర్మ సెల్:94407 37464

-పసుమర్తి కామేశ్వర శర్మ సెల్:94407 37464