మెయిన్ ఫీచర్

పనిచేసే చోట.. లైంగిక వేధింపుల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు,దిల్లీ) మహిళల పట్ల లైంగిక వేధింపుల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశ రాజధానిలో ప్రభుత్వ, ప్రైవేటురంగ కార్యాలయాల్లో ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు సంబంధించి 2013 తర్వాత 101 ఫిర్యాదులు అందగా, అందులో 50 శాతం ఫిర్యాదులు జెఎన్‌యుకి చెందినవేనని దిల్లీ మహిళా కమిషన్ తాజాగా ప్రకటించింది. ‘పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013’ ప్రకారం ఫిర్యాదు చేస్తున్న ఉద్యోగినుల సంఖ్య దిల్లీలోనే కాదు, దేశ వ్యాప్తంగా నానాటికీ పెరుగుతోంది. ఈ చట్టం ప్రకారం ప్రతి కార్యాలయంలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను విధిగా ఏర్పాటు చేయాలి. ఉద్యోగినులపై లైంగిక వేధింపుల విషయమై జెఎన్‌యులో 51, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో 10, ఇందిరాగాంధీ జాతీయ దూర విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో 9 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇగ్నో, ఎయిమ్స్, ఐఐటి, జామియా మిలియా ఇస్లామియా వంటి సంస్థల్లో ఇప్పటికీ పలు ఫిర్యాదులు విచారణ దశలోనే ఉన్నట్లు దిల్లీ మహిళా కమిషన్ స్పష్టం చేసింది. జెఎన్‌యు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, ఐఐటి, దిల్లీ విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో విద్యార్థినులు, ఉద్యోగినులపై లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతునే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యుజిసి), కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు, దిల్లీ మహిళా కమిషన్ పలుసార్లు లేఖలు రాసినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ విషయంలో దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా సంస్థలపై తగు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
ఫిర్యాదుల వెల్లువ..
పనిచేసే చోట మహిళలపై లైంగిక నేరాల సంఖ్య ఆందోళనకరంగా ఉందని జాతీయ మహిళా కమిషన్ తాజా నివేదికలో పేర్కొంది. కార్యాలయాల్లో ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు సంబంధించి 2013లో 249 కేసులు నమోదు కాగా, 2014లో ఆ సంఖ్య 526కు చేరింది. పనిచేసే చోట మహిళల పట్ల లైంగిక నేరాల నిరోధానికి 2013లో అమలులోకి వచ్చిన చట్టం ప్రకారం ప్రతి కార్యాలయంలో అంతర్గత కమిటీలను సంబంధిత యాజమాన్యాలు ఏర్పాటు చేయాలి. ప్రతి ఫిర్యాదును ఈ కమిటీ విచారించి నిందితులపై చర్యలకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఆ కమిటీ సభ్యుల వివరాలు, సమావేశాలు జరిగే తేదీలు వంటి సమాచారాన్ని కార్యాలయాల్లో విధిగా ప్రదర్శించాలి. ఉద్యోగినులకు భద్రత కల్పిస్తూ, వారు స్వేచ్ఛగా పనిచేసుకునే పరిస్థితులు కల్పించాల్సి ఉంది. లైంగిక వేధింపుల చట్టాలు, శిక్షల గురించి ఉద్యోగులందరికీ అవగాహన కల్పించాలి. దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి సంస్థల కార్యాలయాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఉద్యోగినుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉద్యోగినులపై లైంగిక వేధింపుల నిరోధానికి 2013లో కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో ఆశించినంతగా మార్పు రాలేదని ఇటీవలి సర్వేలో తేలింది. 2013 నాటి చట్టం ప్రకారం ఫిర్యాదు చేసేందుకు 31 శాతం మంది బాధితులు విముఖత చూపుతున్నట్లు తేలింది. కార్యాలయాల్లో అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు కారణమని సర్వేలో కనుగొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో 36 శాతం, బహుళజాతి సంస్థల్లో 25 శాతం మంది ఉద్యోగినులు ఫిర్యాదులు చేసేందుకు ఇష్టపడడం లేదు.
దేశవ్యాప్తంగా చూస్తే 40 శాతం కార్యాలయాల్లో అంతర్గత కమిటీల ఏర్పాటుకు, అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. భారతీయ కంపెనీల్లో 47 శాతం, బహుళజాతి సంస్థల్లో 34 శాతం, ఇతర కంపెనీల్లో 35 శాతం మేరకు అంతర్గత కమిటీలు ఏర్పాటుకాని పరిస్థితి కనిపిస్తోంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో అయితే చట్టాన్ని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. 71 శాతం చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో అంతర్గత కమిటీల ఊసే లేదు. ఉద్యోగినులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని, చట్టపరంగానే కాదు, ఆ సంస్థలు అన్ని విధాలా రాణించాలన్నా కార్యాలయాల్లో అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని ‘్ఫక్కీ’ ( ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్) సెక్రటరీ జనరల్ డాక్టర్ ఎ.దీదార్ సింగ్ అంటున్నారు. పనిచేసే చోట భద్రత లోపించినట్లు ఉద్యోగినులు భావిస్తే- ఆ ప్రభావం ఉత్పాదకత, పని సామర్థ్యంపై తప్పక పడుతుందని ఆయన తెలిపారు. ఈ పరిణామాల వల్ల నైపుణ్యం ఉన్న వారు వేరే చోటకు వెళ్లిపోతారని, సంస్థలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నారు. మానవ వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే ముఖ్యంగా ఉద్యోగినుల్లో భద్రతా భావం పెరగాలని ఆయన సూచిస్తున్నారు. పనిచేసే చోట లైంగిక వేధింపుల్ని అరికట్టేందుకు కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదుల్ని విచారించేందుకు, బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చట్టాలపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో విస్తృత అవగాహన కల్పించాలి. ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి.
*