మెయన్ ఫీచర్

మంచి పనులకు కాంగ్రెస్ మోకాలడ్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకే రకమైన భావజాలం కలిగిన వ్యక్తులు ఒక కూటమి లేదా దళంగా ఏకమై ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజల ఆమోదం పొంది చట్టసభల ద్వారా జనం శ్రేయస్సు కోసం చట్టాలు చేస్తూ వాటి అమలు విధానాన్ని నిత్యం పర్యవేక్షించడం రాజకీయ పార్టీల ప్రధాన లక్షణం. ప్రజామోదం పొందలేక ప్రతిపక్ష స్థానంలో ఉండాల్సి వస్తే, అధికార పక్షం చేసే మంచి పనులను సమర్ధిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను సవరించాల్సిన బాధ్యతను నిర్వహించాలి. సోనియా, రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి అధికార పార్టీగాను, 2014 నుంచి ప్రతిపక్షం గాను తన అర్హతను కోల్పోతున్నది. ప్రజా సంక్షేమానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక చట్టాలను అకారణంగా అడ్డుకుని అభివృద్ధిని ఆలస్యం చేస్తున్నది. ఇందుకు తాజా ఉదాహరణ- బిసి కమిషన్‌కు రాజ్యాంగపరమైన స్థాయి కల్పించే చట్టాన్ని అకారణంగా కాంగ్రెస్ అడ్డుకోవడం. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఆఖరి క్షణంలో రాజ్యసభలో అడ్డుకుని బిసి వర్గాలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసింది. ఈ చర్యతో కాంగ్రెస్ నేతలు తమ అహాన్ని సంతృప్తిపరుచుకోవచ్చు. కానీ, బిసి వర్గాల ప్రగతికి అడ్డుకట్ట వేసింది. పార్టీలకు అతీతంగా చూడాల్సిన ‘సామాజిక శ్రేయస్సు’ అంశాన్ని సంకుచిత స్వభావంతో చూస్తూ మోదీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న కడుపు మంటతో చట్టాలను అడ్డుకోవడం కాంగ్రెస్ చేస్తున్న పెద్ద తప్పిదం.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం 29 జనవరి 1953న మొట్టమొదటి బిసి కమిషన్‌ను కాకా కాలేల్కర్ అధ్యక్షతన నియమించారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న వారిని గు ర్తించి, వారినందరినీ ఒక శ్రేణిగా కూర్చి వారి అభివృద్ధికి తగిన సూచనలు చేయడం కాలేల్కర్ కమిషన్ ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకోలేకపోతున్న వారిని, వ్యాపార వాణిజ్య రంగాలలో వెనుకబడ్డ వారిని కూడా గుర్తించే ప్రయత్నాన్ని కాలేల్కర్ కమిషన్ చేసింది. 1955లో ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను అప్పటి పార్లమెంట్ ఆమోదించలేదు. ఆ తర్వాత బిసిల స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించేందుకు 1978లో మండల్ కమిషన్‌ను నియమించారు. డిసెంబర్ 1980లో మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను 1989లో ఆమోదించారు. ఈ నివేదిక ఆధారంగా 27 శాతం రిజర్వేషన్లను బిసిల కోసం నిర్దేశించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇందిరా సహానీ సహా మరికొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మండల్ కమిషన్ సూచించిన విధంగా 27 శాతం రిజర్వేషన్లను సుప్రీం ఆమోదిస్తూ, ఇందిరా సహానీ కేసులో 1992లో ఒక తీర్పు చెబుతూ- బిసి కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదాను కల్పించాల్సిందిగా ఆదేశించింది. బిసిల కోసం ఉద్దేశించిన కాలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్ తాత్కాలికమైనవి. ఎస్సీ,ఎస్టీల కోసం ఏర్పడ్డ శాశ్వత కమిషన్ల తరహాలో బిసిలకు సైతం ఒక కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్న కోర్టు సూచన మేరకు 1993లో ‘జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్’ను ఏర్పాటు చేసారు. ఏయే కులాలను బిసి జాబితాలో చేర్చాలన్న అంశాన్ని పరిశీలించడం, తగిన సిఫార్సులు చేయడం కమిషన్ ప్రధాన ఉద్దేశం.
కాలేల్కర్ కమిషన్ 1953లో సమర్పించిన నివేదిక ప్రకారం 2,399 కులాలను బిసి జాబితాలో చేర్చారు. ఇందులో 837 కులాలను అతి వెనుకబడ్డ కులాలుగా గుర్తించారు. 1961లో జనగణన సమయంలో బిసి కులాల జనాభాను కూడా గుర్తించాలని కాలేల్కర్ సూచించారు. 2006 నాటికి బిసి శ్రేణిలోకి 5013 కులాలు వచ్చి చేరాయి. కుల ప్రాతిపదికన బిసిల నిర్ధారణకు సుముఖంగా లేని అప్పటి ప్రభుత్వాలు ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వారినందరినీ బిసి జాబితాలో చేర్చే ప్రయత్నాలు చేసాయి. దాంతో ఈ శ్రేణిలో కులాల సంఖ్య అయిదు వేలను దాటింది. 2015లో ‘నేషనల్ కమిషన్ ఫర్ బాక్‌వర్డ్ కమిషన్’ సూచన ప్రకారం కుటుంబ వార్షికాదాయం 15 లక్షల కంటే తక్కువగా వున్నవారిని బిసి శ్రేణిలో చేర్చాలని సూచించారు. బిసిలను శ్రేణుల వారీగా విభజించాలని కూడా ఆ కమిషన్ సూచించింది. వీరిని మూడు శ్రేణులుగా- వెనుకబడ్డ తరగతులు, చాలా వెనుకబడ్డ తరగతులు, అతిగా వెనుకబడ్డ తరగతులు వారీగా గుర్తించి, 27 శాతం రిజర్వేషన్లను ఆయా వర్గాల వారీగా నిష్పత్తుల ప్రకారం వర్గీకరించాలని కమిషన్ సూచించింది. బిసిలలో అభివృద్ధి చెందిన కులాల వారు అన్ని సదుపాయాలను సౌకర్యాలను, రిజర్వేషన్లను అనుభవిస్తూ మిగిలిన వారికి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇటువంటి వర్గీకరణ అనివార్యమని కమిషన్ అభిప్రాయపడింది. ఉపాధి, విద్యారంగాల్లో ఏయే కులాలను బిసిలుగా గుర్తించాలి? ఏయే కులాలను తొలగించాలన్న సిఫార్సులు, సలహాలను కేంద్రానికి చేసే అవకాశం జాతీయ బిసి కమిషన్‌కు ఉంది. ఇదే పద్ధతిలో రాష్ట్రాలు కూడా బిసి కమిషన్‌లను నియమించుకుంటున్నాయి. జాతీయ బిసి కమిషన్‌కు సివిల్ కోర్టు హోదా ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు లేవు. జాతీయ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్‌లకున్న అధికారాలు జాతీయ బిసి కమీషన్‌కు లేవు.
ఒక అంచనా ప్రకారం జనాభాలో 53 శాతం ఉన్న ప్రజల కోసం ఉద్దేశించిన జాతీయ బిసి కమీషన్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అనేక వర్గాల నుంచి ఏళ్ల తరబడి వత్తిడులు వస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాలు దృష్టి సారించలేదు. 2014లో మోదీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన భాజపా ప్రభుత్వం బిసిల కోసం రాజ్యాంగపరమైన జాతీయస్థాయి బిసి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించడానికి అన్ని లాంఛనాలను పూర్తి చేసింది. లోక్‌సభలో బిజెపి తనకున్న మెజారిటీతో, ఎన్టీఏ పార్టీల సహకారంలో రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొంది పూర్తిస్థాయి బిసి కమిషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. అయితే, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో అడ్డం తిరిగి, అధిక సంఖ్యాకుల ప్రయోజనాలకు భంగం కలిగించడం దురదృష్టకరం. ఏ సామాజిక, రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాంగ్రెస్ అడ్డుకుందన్నది బేతాళ ప్రశ్న.
జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించాలన్న డిమాండ్ చిరకాలంగా ఉంది. పార్లమెంటరీ కమిటీలు కూడా ఈ మేరకు సిఫార్సులు చేసాయి. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఈ బిల్లును అడ్డుకుని సెలక్ట్ కమిటీకి పంపడంతో- ఆ పార్టీలోని బిసి ఎంపీలే అంతులేని ఆశ్చర్యానికి లోనయ్యారు. బంగారం లాంటి అవకాశం చేజారిపోతుందేమోనని వారు బాధపడుతున్నారు. కాంగ్రెస్ అవలంబిస్తున్న వ్యతిరేకాత్మక రాజకీయ చర్యలతో వెనుకబడిన తరగతుల వారు నష్టపోతున్నారని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడున్న ‘నేషనల్ కమిషన్ ఫర్ బాక్‌వర్డ్ క్లాసెస్’ స్థానంలో ‘నేషనల్ కమిషన్ ఫర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బాక్‌వార్డ్ క్లాసెస్’ ఏర్పడితే- బిసిలకు అనేక సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ప్రయోజనాలతోపాటు రాజ్యాంగ బద్ధత కలిగిన సంస్థ ఏర్పడుతుంది. వీరికి సంబంధించి అనేక సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది.
ప్రస్తుతం అమలులో ఉన్న బిసి జాతీయ కమిషన్‌కు వివిధ వర్గాలు,వ్యక్తులు, సంస్థల నుంచి- సామాజిక వివక్ష, విద్య, ఉపాధి రంగాల్లో అన్యాయాల గురించి రోజూ వందలాది ఫిర్యాదులు అందుతున్నాయి. రిజర్వేషన్లను అమలు చేయడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. వీటిని పరిశీలించడానికి తగిన ఆధికారాలు ఇప్పుడున్న సంస్థలకు లేవు. వీటిని పరిశీలించాలన్నా, కొత్త కులాలను బిసిలుగా పరిగణించాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలన్నా రాజ్యాంగబద్ధత కలిగిన కమిషన్ అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరాన్ని మోదీ ప్రభుత్వం గుర్తించి, రాజ్యాంగాన్ని సవరించి సరికొత్త బిసి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని గత రెండున్నరేళ్లుగా చేసిన శ్రమపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు పోసింది. ఈ ప్రయత్నం సాగకుండా కొంత కాలంపాటు జాప్యం చేయగలిగింది.
బిసి కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించాలన్న ప్రతిపాదన అధికారికంగా 2012-13 లోనే వచ్చింది. అప్పుడున్న కమిషన్ చైర్మన్‌లు 2013-14, ఆ తరవాత కాలంలో ఇదే రకమైన డిమాండ్లు చేస్తూ వచ్చారు. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వీటిని నిర్లక్ష్యం చేసాయి. ఎస్సీ జాతీయ కమిషన్ కూడా బిసిలకు రాజ్యాంగబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాలని 2012 నుంచే అనేక నివేదికలలో కోరుతూ వచ్చింది. మోదీ ప్రభుత్వం 22 మార్చి 2017న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ సూచనను ఆమోదించింది. వెంటనే కార్యరంగంలోకి దూకి 10 ఏప్రిల్ 2017న లోక్‌సభలో దాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదింపచేసింది. రాజ్యసభలో ఎన్‌డిఏ బలం తక్కువ. దీన్ని సాకుగా తీసుకుని తమ అహంకార ప్రదర్శనకు పాల్పడి కాంగ్రెస్ పార్టీ దీనిని సెలక్ట్ కమిటీకి పంపి అనవసర కాలయాపన చేసింది.
ఈ సమావేశాలలో కాకపోతే, రానున్న సమావేశాలలో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందుతుంది. అయితే అనవసరంగా జరిగిన కాలయాపనకు, అప్పటి వరకు బిసి వర్గాలకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. తన చర్యలతో కాంగ్రెస్ ఏం సాధించిందో ఎవరికీ అర్థం కావడం లేదు. బిసిలకు ప్రయోజనం చేకూర్చడం మనందరి బాధ్యత. ‘సబ్‌కే సాథ్ -సబ్‌కా వికాస్’లో బిసిలు కూడా ఉన్నారు. ఏ ఒక్క వర్గాన్ని విస్మరించి అభివృద్ధిని సాధించడం కష్టం. అందుకే దేశంలో అత్యధిక శాతం కలిగిన బిసిల ప్రయోజనం కోసం పనిచేసే సంస్థను ఏర్పాటు చేయాలన్న మోదీ ప్రయత్నాన్ని తాత్కాలికంగా రాహుల్ బృందం అడ్డుకోవచ్చు. అభివృద్ధిని ఎక్కువ కాలం ఆపడం ఎవరి తరం కాదు. కాంగ్రెస్ వల్ల తమకు జరిగిన అన్యాయాన్ని బిసి వర్గాలు గుర్తిస్తున్నాయి. ఈ నిప్పు కణిక రేపటికి దావాలనమై కాంగ్రెస్‌ను తనలో కలుపుకుంటుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలలో వెనుకబడిన తరగతుల వారు పెద్ద ఎత్తున మోదీకి మద్దతు పలికి కాంగ్రెస్-సమాజ్ వాదీ కూటమిని పరాజయంపాలు చేయడంతో అవమానంతో రగిలిపోతున్న రాహుల్ బిసి కమీషన్‌ను అడ్డుకుంటున్నారన్న వాస్తవాన్ని బిసిలు గుర్తిస్తున్నారు.
‘సందట్లో సడేమియా’ అన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కెసిఆర్ కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుత బిసి కమిషన్‌లో వున్న లొసుగులను ఆసరాగా చేసుకుని ఇప్పటికే అగ్నిపర్వతంలా ఉన్న తెలంగాణను పాకిస్తాన్‌కు అనుబంద రాష్ట్రంగా మార్చేలా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యాంగ వ్యతిరేకం అని తెలిసి కూడా మతపరమైన రిజర్వేషన్లను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. బిసిలకు నిర్దేశించిన అవకాశాలను దొడ్డిదారిన ముస్లింలకు కట్టబెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ప్రజలను మతపరంగా విభజించేందుకు జిన్నా అనుయాయుడిగా, రజాకార్ల ఏజెంటుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇటువంటి కుత్సిత రాజకీయాలకు అంతం పలికి బిసిలకు మేలు జరగాలంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ అవసరం. ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్న కాంగ్రెస్‌ను జనం క్షమించరు.
*

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113