మెయన్ ఫీచర్

‘పాపిస్తాన్’కు భంగపాటు ఖాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వినాశ కాలే విపరీత బుద్ధి’ అన్న నానుడి పాకిస్తాన్‌కు సరిగ్గా వర్తిస్తుంది. అంతర్జాతీయంగా తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా అపఖ్యాతి పాలవుతున్న పాకిస్తాన్ తన దేశంలోని తీవ్రవాదులను కట్టడి చేయలేని బలహీన స్థితిలో పడిపోయింది. తనకు తాను అల్లుకున్న మతం ముసుగులోని తీవ్రవాద విషవలయం నుంచి ఊరట పొందడానికి, ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికి మన దేశానికి చెందిన కులభూషణ్ జాదవ్‌ను గూఢచారిగా, తీవ్రవాదిగా ముద్రవేసి మరణశిక్ష విధించింది. పాకిస్తాన్ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారుగా పనిచేస్తున్న సర్తాజ్ అజీజ్ ఒక బహిరంగ ప్రకటనలో గూఢచర్యానికి, కులభూషణ్ జాదవ్‌కు సంబంధం లేదని, జాదవ్ భారత గూఢచారిగా పనిచేస్తున్నాడనడానికి ఎటువంటి సాక్షాధ్యారాలు లేవని ప్రకటించినప్పటికీ సైనిక పాలన, ఐఎస్‌ఐల అధీనంలో పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం జాదవ్‌కు మరణశిక్ష విధించింది.
జాదవ్ 1970 ఏప్రిల్‌లో మహారాష్టల్రోని సాంగ్లీలో జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం పాటు భారత నౌకాదళంలో పనిచేసిన జాదవ్ తన పదవీ కాలం పూర్తి కాకముందే ఉద్యోగం వదిలేసి ఇరాన్‌లో సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో జాదవ్‌ను బలవంతంగా ఎత్తుకొచ్చి, నకిలీపత్రాలు సృష్టించి ఆయనను భారత గూడచారిగా చిత్రీకరించి, విచారణ ‘తంతు’ ముగించి మరణశిక్ష విధించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. కొన్ని విదేశీ సంస్థల సమాచారం ప్రకారం జాదవ్‌ను జైష్-ఉల్-అదల్ అనే తీవ్రవాద సంస్థ కిడ్నాప్ చేయగా, ఆ సంస్థ ప్రతినిధుల నుంచి పాకిస్తాన్ ఆయనను కొనుక్కున్నది. జాదవ్ ఇరాన్ కేంద్రంగా కార్గో వ్యాపారం నిర్వహిస్తున్నారు. బందర్ అబ్బాస్, చబహర్ రేవుల ఆధారంగా వ్యాపారం నిర్వహిస్తూ వుండగా తీవ్రవాదులు ఎత్తుకెళ్లి పాకిస్తాన్‌కు అమ్మేశారు. ‘పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ ఎఫైర్స్’ ఏర్పాటు చేసిన సమావేశంలో ఓ జర్మన్ డిప్లొమాట్ మాట్లాడుతూ, జాదవ్‌ను తాలిబన్ శక్తులు ఎత్తుకెళ్లి పాకిస్తాన్‌కు అమ్మేశారని చెప్పారు.
పాకిస్తాన్‌లోని ఫీల్డ్ జనరల్ కోర్ట్ మార్షల్ జాదవ్‌కు 10 ఏప్రిల్ 2017న మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధించడాన్ని ఖండిస్తూ భారత ప్రభుత్వం పాకిస్తాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించి తన నిరసన తెలిపింది. జాదవ్‌కు విధించిన మరణశిక్షను ‘పథకం ప్రకారం చేసిన హత్య’గా భావించాల్సి ఉంటుందని, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారత్ హెచ్చరించింది. జాదవ్‌కు ప్రాణహాని జరిగిన పక్షంలో భారత, పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు తీవ్ర పరిణామాలకు లోనవుతాయనని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ హెచ్చరించారు. జాదవ్‌కు విధించిన మరణశిక్షపై అనేక అనుమానాలను వ్యక్తం చేయడమే కాకుండా పాకిస్తాన్ చేపట్టిన ఈ దుందుడుకు విధానాలను పలు పాశ్చాత్య దేశాల ప్రతినిధులు సైతం ఖండించారు. భారత్‌లో ముంబయి పేలుళ్ల ఘటనలో నిందితులను విచారించకుండా వాయిదాలు వేసుకుంటూ పోతున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఆగమేఘాల మీద జాదవ్‌ను విచారించడంలో అంతర్యం ఏమిటని వీరు ప్రశ్నించారు. ముంబయి పేలుళ్లపై పాకిస్తాన్ గత తొమ్మిది సంవత్సరాలుగా స్తబ్దుగా పడి ఉన్నది. కానీ, జాదవ్‌పై వచ్చిన ఆరోపణలన్నీ కేవలం మూడు నెలల్లోనే విచారణ ముగిసి శిక్షపడ్డది. దీన్ని పాకిస్తాన్ సైనిక వర్గాలు ఆమోదించాయి. జాదవ్‌కు మరణ శిక్ష విధించడం పాకిస్తాన్ రాజకీయ దురుద్దేశాలను తెలియజేస్తున్నదని, ఆయనపై మోపిన ఆరోపణలు అసమంజసంగా, ఆధార రహితంగా ఉన్నాయని వీరు వాదిస్తున్నారు.
చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సిపిఇసి) నిర్మాణాల పట్ల భారత్ అనేక అభ్యంతరాను తెలుపుతున్నది. సిపిఇసి నిర్మాణంలో భారత్ అడ్డుపడకుండా ఉండేందుకు జాదవ్ కేసుతో- భారత్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని ప్రపంచ దేశాల పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జాదవ్ నిజంగానే గూఢచార చర్యలకు పాల్పడినట్టయితే 2016లో అరెస్టు చేసినప్పుడే ఎందుకు శిక్ష విధించలేదు అని వీరు ప్రశ్నిస్తున్నారు. జాదవ్‌ను అడ్డం పెట్టుకుని భారత్‌పై దౌత్యపరంగా ఒత్తిడి తీసుకురావాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లయితే- భారత్ తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నదని పాకిస్తాన్ రుజువు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు జాదవ్‌కు మరణశిక్షపై తగిన కారణాలను ప్రపంచ దేశాల ముందు ఉంచాల్సి ఉంటుందని అనేక ప్రపంచ దేశాలు పాకిస్తాన్‌ను హెచ్చరిస్తున్నాయి. జాదవ్ వ్యవహారంలో పాకిస్తాన్ చెబుతున్న కథలు మిస్టరీగా ఉంటున్నాయని పూర్తి అసమంజసంగా ఉన్నాయని సౌత్ ఏసియా ఉడ్రో విల్సన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అంటున్నారు. జాదవ్‌ను ‘తురుపుముక్క’గా వాడుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. జాదవ్‌ను అడ్డం పెట్టుకుని భారత్ నుంచి అనేక ప్రయోజనాలను పొందాలని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ప్రపంచ పరిశీలకులు భావిస్తున్నారు.
జాదవ్ కేసును అడ్డం పెట్టుకుని ఇరాన్ నుంచి కూడా ప్రయోజనాలు పొందాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని పరిశీలకుల భావన. సౌదీ అరేబియాతోపాటు ఇరాన్‌తో కూడా సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నది. ఇరాన్ సరిహద్దు నుంచి ఒక భారతీయుడిని గూఢచార నెపంతో అరెస్టు చేసినట్టు చిత్రీకరించడం వల్ల ఇరాన్‌ను అప్రదిష్టపాలు చేసి ఇబ్బంది పెట్టి తన ప్రయోజనాలను సాధించుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని వీరి అభిప్రాయం. పాకిస్తాన్ సర్వ సైన్యాధికారి జనరల్ రషీల్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు రుహానీల మధ్య జాదవ్ అంశం చర్చకు వచ్చినట్టు పాకిస్తాన్ వర్గాలు అసత్య ప్రచారం చేసాయి. భారత్, పాకిస్తాన్‌లతో ఇరాన్‌కు సత్సంబంధాలు ఉన్నాయని ఈ విషయంలో పాకిస్తాన్ మరింత ముందుకు వస్తే అందరికీ మేలు జరుగుతుందని రుహాని చెప్పినట్టు ఇరాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
జాదవ్‌ను అరెస్టు చేసినప్పుడు భారత్‌కు ఎందుకు తెలుపలేదు? అన్న ప్రశ్నకు పాకిస్తాన్ దగ్గర సమాధానం లేదు. జాదవ్‌ను అరెస్టు చేసినట్టు భారత్‌కు చెప్పాల్సిన అవసరం లేదని పాకిస్తాన్ అధికారులు దబాయిస్తున్నారు. పాకిస్తాన్ నిస్సిగ్గుగా ఒక విషయాన్ని మర్చిపోతున్నది. ఐక్యరాజ్యసమితికి చెందిన ‘వియన్నా ఒప్పందం’పై పాకిస్తాన్ సంతకం చేసింది. 1963లో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం విదేశీయులను అరెస్టు చేసినప్పుడు ఆయా దౌత్య కార్యాలయాలకు కచ్చితంగా తెలియచేయాలి. అరెస్టు కాబడిన వ్యక్తికి- తన దేశపు రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుకునే అవకాశం ఇవ్వాలి. అరెస్టు కాబడిన వ్యక్తికి తగు రక్షణ కల్పిస్తూ అతనికి తగిన న్యాయ సహాయం అందించేందుకు ఆయా దేశాల దౌత్యకార్యాలయాలకు వెసులుబాటు కల్పించాలి. ఇటువంటి ఒప్పందంపై సంతకాలు చేసిన మాట వాస్తవమే అయినా వీటికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పాకిస్తాన్ అధికారులు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నారు.
2016లో జాదవ్ అరెస్టు జరిగిన తరువాత ఆయనను కలిసేందుకు అవకాశం ఇమ్మని 14 సార్లు భారత్ కోరింది. అన్నిసార్లూ భారత్ అభ్యర్థనను పాకిస్తాన్ తిరస్కరించింది. ఎటువంటి ఒప్పందాలు,కట్టుబాట్లకు లోబడి పని చేయకుండా పాకిస్తాన్ ఒక ‘రోగ్’ దేశంగా వ్యవహరిస్తున్నది. అంతర్జాతీయ ఒప్పందాలను పాకిస్తాన్ తుంగలో తొక్కుతున్నది. తమదేశాల చట్టాలను మాత్రమే పాటిస్తామని చెబుతున్నది. ముంబయి పేలుళ్లలో పట్టుబడ్డ కసబ్‌కు భారత్ కోర్టులో పూర్తిస్థాయి విచారణ జరిగింది. కసబ్‌కు న్యాయ సహాయం అందించారు. పాకిస్తాన్ దౌత్య కార్యాలయం కసబ్‌తో సంప్రదింపులు జరిపింది. పూర్తిస్తాయి విచారణ జరిగిన తరువాతనే కసబ్‌కు ఉరి శిక్ష విధించారు. జాదవ్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇటువంటి సంప్రదాయాలను తుంగలో తొక్కింది.
దాదాపు15 సంవత్సరాల క్రితమే జాదవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించాడన్న సంగతిని గుర్తించడానికి పాకిస్తాన్ సిద్ధంగా లేదు. గూఢచర్యం చేసే వ్యక్తి భారత్ పాస్‌పోర్టును ఎందుకు ఉపయోగిస్తాడనన్న ప్రశ్నకు పాకిస్తాన్ సమాధానం చెప్పలేకపోతున్నది. కులభూషణ్ జాదవ్ గూఢచార చర్యలకు పాల్పడినట్టు పాకిస్తాన్ ఇంతవరకు ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపించలేకపోతున్నది. జాదవ్‌పై పాకిస్తాన్ సైనికాధికారులు ఆరున్నర నిముషాల వీడియోను బయటపెట్టారు. అయితే ఈ వీడియోను చూసిన వారెవరికీ ఇది నిజమైన వీడియో కాదని వెంటనే అర్థం అవుతుంది. ఈ వీడియో ముక్కలు ముక్కలుగా అతికించారు. జాదవ్ మాట్లాడిన వాక్యాల మధ్య పొంతన లేదు. పాకిస్తాన్ విడుదల చేసిన వీడియో మొత్తం కృత్రిమంగా నిర్మించినది. ఇదొక ఫేక్ వీడియో. భారత దేశాన్ని అప్రదిష్టపాలు చేయడానికి పాకిస్తాన్ చేస్తున్న దుష్ట ప్రయత్నాలలో ఇదొకటి అని భారత హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు.
భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ తన పబ్బం గడుపుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు భారత్‌ను రెచ్చగొడుతూనే ఉన్నది. అన్ని ఒప్పందాలనూ నిర్లక్ష్యం చేసి సరిహద్దుల అవతలి వైపునుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది. తీవ్రవాదం ద్వారా అప్రకటిత యుద్ధం కొనసాగిస్తున్నది. భారత వ్యతిరేకత ఆధారంగానే పాకిస్తాన్ మనుగడ కొనసాగిస్తున్నది. ఇప్పటి జాదవ్ అరెస్టు, ఆయన మరణ శిక్షను వాడుకుని లబ్ధి పొందాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నది. అయితే పరిస్థితులు మారిపోయాయి అన్న సంగతిని పాకిస్తాన్ మరిచిపోతున్నది. భారత వైమానిక స్థావరాలపై జరిగిన దొంగదాడులకు ప్రతీకారంగా నరేంద్ర మోదీ సారధ్యంలోని ప్రభుత్వం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో తీవ్రవాద శిబిరాలపై మెరుపుదాడులను నిర్వహించింది. జాదవ్‌ను సజీవంగా వెనక్కి తీసుకురావడానికి నేడు దేశం మొత్తం సన్నద్ధమవుతున్నది. జాదవ్ కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113