మెయిన్ ఫీచర్

సమానత్వమే రామానుజ మతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూసమాజంలో భక్తికి ఎంతో ప్రాధాన్యం ఉంది. విశ్వాసాలకు, నమ్మకాలకు అంతే విలువ ఉంది. గురువుకు విశిష్టస్థానం ఉంది. సామాన్యులకు మంచి చెప్పి, సన్మార్గంలో నడిపించేవాడే గురువు. అందులోభాగంగా శాస్త్రాలను ధర్మసూక్ష్మాలను సహేతుకంగా నేర్పేవాడు, వాటి అర్థాన్ని విడమర్చి చెప్పేవాడు ఆచార్యుడు. అలాంటి గురువులను ఎవరూ, ఎప్పుడూ విస్మరించరు. విస్మరించలేరు. వెయ్యేళ్లక్రితం భరతభూమిపై ఉద్భవించిన భగవద్రామానుజులు అలాంటి ఉత్తమ ఆచార్యులు. గురువులకు గురువు. సాక్షాత్ తిరుమల వేంకటేశ్వరుడే ఆయనను గురువుగా భావించారని ప్రతీతి. సమాజంలో ప్రతి ఒక్కరూ మిగతావారితో సమానమేనన్నది ఆయన సిద్ధాంతం. విశిష్టాద్వైతం చెప్పినది అదేనని ఆయన విశ్వాసం. దానినే ఆయన నమ్మారు. త్రిదండం చేబూనారు.
దేశం అంతటా తిరిగారు. ప్రచారం చేశారు. విశిష్టాద్వైత ప్రచారంలో మమేకమైన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ సారథ్యంలో ప్రస్తుతం భగవద్రామానుజులవారి సహస్రాబ్ది ఉత్సవాలు నేటినుంచి ప్రారభమవుతున్నాయి. అద్వైత సిద్ధాంత ప్రచారకుల వద్ద విద్య నేర్చుకుని, చాలా సందర్భాలలో గురువుతో వాదించి, మెప్పించి, ఒప్పించి, చివరకు గురువే తన శిష్యుడిగా మారిపోయేలా ప్రభావం చూపిన ఆస్తికహేతువాది భగవద్రామానుజులు. నిమ్నకులంలో పుట్టి భగవత్ సేవలో తరిస్తున్న కంచిపూర్ణుడికి పాదసేవ చేయడానికి సిద్ధపడిన స్వామి భగవద్రామానుజులు. సతీమోహంతో ఇహాన్ని మరచిన ధనుర్దాసుకు ‘పాండురంగడి’ కనుదోయిలో సౌందర్యాన్ని వీక్షింపచేసి కర్తవ్యదీక్ష చేపట్టేలా చేసిన సద్గురువుశ్రీరామానుజులు. ఈ సందర్భంగా భగవద్రామానుజల వైభవం ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. 1017లో జన్మించి, 120 ఏళ్లపాటు ధర్మప్రచారంలో తలమునకలై 1137లో తన ఇచ్ఛమేరకు పరమపదం చేరుకున్నారు. ప్రస్తుతం సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్నాయి.
ఆదిశేషువులా..
తమిళనాడులోని శ్రీపెరంబదూరులో కేశవాచార్యులు, కాంతిమతిలకు జన్మించిన పిల్లవాడు అద్భుతమైన సౌందర్యంతో, చూడగానే ఆకర్షించే తెలియని ప్రత్యేకతలతో ఉండటాన్ని చూసిన మేనమామ పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణుడు) ఆదిశేషువులా ఉన్నాడని ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆదిశేషువులా ఉన్నాడుకనుక ‘ఇళయ పెరుమాళ్’ అని పేరుపెట్టారు. ఇది 1017నాటిమాట. ఆ తరువాత కుటుంబం అంతా కాంచీపురం వెళ్లవలసి వచ్చింది. వివాహం, కొంతకాలం తరువాత సన్యాసం స్వీకరించాక రామానుజాచార్యులుగా పేరుమార్చారు. కాశ్మీర్‌లోని శారదాపీఠంలో విద్యాభ్యాసం చేశారు. అద్వైత ప్రచారకులు యాదవప్రకాశుల వద్ద శిష్యుడిగా చేరారు. పలు సిద్ధాంతాలపై వాదోపవాదాలు జరిగేవి. వేదాలపై వాడీవేడిగా వాదనలు చేసేవారు. ఉపనిషత్‌లపై గురువు యాదవ ప్రకాశులు చెప్పే అర్థాన్ని, తత్వాన్ని రామానుజులు జీర్ణించుకోలేకపోయేవారు. ముఖ్యంగా ఆదిశంకరులు చెప్పిన విషయంలోని ఆంతర్యాన్ని గ్రహించక బయటకు కనిపించే విషయాన్ని చెప్పడాన్ని రామానుజులు విభేదించారు. ముఖ్యంగా ఛాందోగ్యోపనిషత్‌లో ‘కప్యాసం పుండరీకం...’ అన్న శ్లోకానికి భాష్యం చెప్పే విషయంలో ఇరువురి మధ్య చర్చ సాగింది. భగంతుడి మోము (కనులు) కోతి పృష్ఠ్భాగంలా ఎర్రగా ఉన్నాయన్న గురువు వ్యాఖ్యను రామానుజులు తప్పుబట్టారు. అవి తామరపూలవలే ఎర్రగా ఉన్నాయన్నది ఈయన వాదన. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే విషయంలోనూ గురువుతో విభేదించారు. ఇలా చాలా సందర్భాలలో ఇరువురి మధ్య విభేదాలు రావడం, ఆయన వేరుగా వెళ్లిపోవడం జరిగింది. ఆ తరువాత మహాపూర్ణులు, యామునాచార్యుల ప్రభావంతో భగవద్రామానుజులు చరిత్రకెక్కారు.
ఎంబెరుమానార్‌గా ప్రసిద్ధి
గోష్టీపురంలో గోష్ఠీపూర్ణుడు (తిరుక్కోట్టియార్ నంబి) అనే గురువు వద్ద శిష్యరికం కోసం ఆయన 18సార్లు వెళ్లారు. కానీ అవకాశం దక్కలేదు. చివరకు 19వసారి గురువు ప్రసన్నమై శిష్యునిగా చేర్చుకున్నారు. మోక్షాన్ని ప్రసాదించే తిరుమంత్రాన్ని రామానుజులకు ఆయన రహస్యంగా ఉపదేశించి ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ చెప్పవద్దని మాటతీసుకున్నారు. కానీ సామాన్యభక్తుల కోరిక మేరకు భగవద్రామానుజులు శ్రీరంగంలోని గోపురమెక్కి అందరికీ వినిపించేలా ఆ మంత్రాన్ని ఉచ్చరించారు. ఇది తెలిసి గురువు ఆగ్రహంతో రామానుజులను పిలిచి మందలించారు. నరకానికి పోతావని అన్నారు. వేలమంది ప్రజలు మోక్షాన్ని ప్రసాదించే తిరుమంత్రం చెప్పడం వల్ల వారికి మోక్షం లభిస్తే, తను ఒక్కడూ నరకానికి వెళ్లాల్సి వస్తే అందుకు సిద్ధమేనని ధైర్యంగా చెప్పారు. దీంతో ఆయన సమతాభావనకు పొంగిపోయిన గోష్ఠీపుర గురువు రామానుజ వైభవాన్ని వర్ణిస్తూ ‘ఎమ్ పెరుమ్ అనారే’..(ఎంబెరుమానార్) అని కీర్తించారు. తనవారిని రామానుజ శిష్యులుగా చేశారు.
ఆ మూడే కీలకం
తర్కానికి నిలబడేదే ధర్మమన్నది రామానుజుల విశ్వాసం. తనకన్నా ముందు ఆళ్వార్లు విశిష్టాద్వైతాన్ని విస్తృత ప్రచారం చేశారు. కాలమానపరిస్థితులను బట్టి ప్రజల సంక్షేమానికి తగినట్లు ఆచారవ్యవహారాలను మార్చాలన్నది ఆయన సూచన. సమాజశ్రేయస్సే ముఖ్యమన్నది ఆయన లక్ష్యం. ప్రముఖ గురువు ‘ఆళ్వందార్’ ‘యామునాచార్యుల’ వద్ద శిష్యరికం చేయాలని అనుకున్నా అవకాశం దక్కలేదు. మహాపూర్ణుల సహాయంతో యామునాచార్య సన్నిధికి వెళ్లినప్పటికీ, అప్పటికే ఆ స్వామి తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని పరిశీలించి కుడిచేతి మూడువేళ్లు ముడుచుకుని ఉన్న విషయాన్ని గ్రహించారు. మోక్షానికి మూడుమార్గాలున్నాయని, పంచసంస్కార కర్మ, నాలాయిర దివ్య ప్రబంధ బోధన, శరణాగతితో కూడిన మతప్రచారం ఆ మూడింటి సారాంశమని భావించారు. అలా భావించిన మరుక్షణం యామునాచార్యుల పార్థివ దేహంలో చేతి మూడువేళ్లు మామూలుగా మారిపోయాయి. అది ఆయన సమ్మతిగా రామానుజులు భావించారు. కర్తవ్యదీక్షలో తలమునకలైపోయారు.
ఆలయ నిర్వహణకు మార్గదర్శకాలు
మేల్కొటే, కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ ఆలయంలో నూతిలో నీళ్లు తోడి సేవలు అందించడం, తిరుమలలో వేంకటేశ్వరుడికి శంఖ, చక్రాల అలంకార నిర్ధారణ, శ్రీకూర్మం, పూరి, తిరుమల, తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం, శ్రీరంగం ఆలయాల్లో ఆగమ విధానాలు, పూజారీతులను నిర్ణయించి, వాటిని అమలు పరిచేలా జియ్యంగార్ వ్యవస్థలను నిర్దేశించిన వ్యక్తి భగవద్రామానుజులు. ఆలయ నిర్వహణలో, స్వామి కైంకర్యాలలో సమాజంలోని అన్ని వర్గాలు, జాతికులాలకు అతీతంగా ఒక్కో పనిని అప్పగించే విధానాలను వెయ్యేళ్ల క్రితమే ఆయన నిర్దేశించారు. అమలు చేశారు. భక్తికి, కులానికి సంబంధం లేదని, భగవంతుడి ముందు అందరూ సమానమేనన్నది ఆయన నమ్మిన వైష్ణవ సిద్ధాంతంలోని మూలభావన. పల్లకీమోత ఒకరికి, కైంకర్యం ఒకరికి, వాయిద్యాలు మోగించే పని ఒకరికి ఇలా...ఒక్కో పనికి ఒక్కోవర్గాన్ని కేటాయించారన్నమాట. అద్వైతం, విశిష్టాద్వైతం, మధ్వ సిద్ధాంతాలు ఏ రూపంలో ఉన్నా భగంతుడు ఒక్కడేనన్నది ఆయన చెప్పిన సూత్రం. ఉపనిషత్‌లు, వేదాలు, ముఖ్యంగా బ్రహ్మసూత్రాలు సంస్కృతంలో ఉన్నందున సామాన్యులకు సులభంగా అర్ధమయ్యేందుకు తమిళభాషలో ఆయన రచనలు చేశారు. ఆయన రాసిన వాటిలో వేదార్థ సంగ్రహం, శ్రీభాష్యం, గీతాభాష్యం, వేదాంత దీపం, వేదాంతసారం, శరణాగతి గద్య, శ్రీరంగగద్య వంటివి మోక్షానికి మార్గనిర్దేశనం చేసే గ్రంథాలు. యతిరాజ ఉడయవర్, లక్ష్మణమూర్తి, తిరుప్పావై జీయర్ వంటి పేర్లు ఆయనకు ఉన్నాయి.
వేంకటేశ్వరుడి సన్నిధిలో..
గురువులతో, సమాజంలోని విభిన్నవర్గాల వారితో వాదించి, ఒప్పించి తన సిద్ధాంతాన్ని ధైర్యంగా ప్రచారం చేసిన ధీశాలి భగవద్రామానుజులు. తిరుమల వేంకటేశ్వరుడిని కీర్తించిన ఆళ్వార్లు ఎన్నడూ తిరుమల కొండపై నడవలేదు. ఆ భావనతోనే భగవద్రామానుజులు కూడా కొండపై కాళ్లతో నడవక, మోకాళ్లపై నడచి శ్రీనివాసుని సేవలో తరించారు. శ్రీవారి తిరునామం, శంఖు, చక్ర చిహ్నాల విషయంలో వాదించి, పరీక్షకు నిలబడి సాధించారు. ఆ తరువాత కొంతకాలానికి ఆయన శ్రీరంగం తిరుగుముఖం పట్టారు. అది తట్టుకోలేని అనంతాచార్యులు శ్రీనివాసుడిపై గునపం విసిరి నిరసన తెలుపుతాడు. శ్రీవారి గెడ్డానికి గాయమైన సంగతి అందరికీ తెలిసిన కథే. అయితే, రామానుజులను ఆపాలని శ్రీనివాసుడికి అనంతాచార్యులు విన్నవిస్తాడు. వేంకటేశ్వరుడు ప్రత్యక్షమై తనకూ రామానుజులు కావాలని, కానీ ఆయనకు వేరే బాధ్యతలున్నాయని చెబుతాడు. అనంతునివద్ద ఉన్న రామానుజ విగ్రహాన్ని ఆలింగనం చేసుకుని, తనశక్తిని అందులోకి జొప్పించి రామానుజులు వెడలిపోతారు. అనంతునివద్ద ఉన్న ఆ రామానుజ విగ్రహాన్ని తన ఆలయంలో తన (విగ్రహం) ఛాతీవద్ద రామానుజల పాదాలు ఉండేలా ప్రతిష్ఠించాలని, రామానుజులు సాక్షాత్తు తన గురువులని స్వయంగా అనంతాచార్యులు చెప్పారన్నది విశ్వాసం. ఇప్పటికీ ఆ ప్రతిమ అలానే ఉంది. అదే భగవద్రామానుజుల వైశిష్ఠ్యానికి ప్రతీక.

- ఎస్.కె.కృష్ణరవళి