మెయిన్ ఫీచర్

బాహుబలికి డబ్బు చేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట్లు పెట్టారు. కోట్లు వసూలు చేస్తున్నారు. చెప్పుకోడానికి ఇదొక్కటి తప్ప -ఏముంది బాహుబలిలో. ‘కన్‌క్లూజన్’ చూసిన తరువాత కోటి మందికి ఎదురైన ప్రశ్న ఇది.

దీనికి సమాధానమే -బాహుబలికి డబ్బు చేసింది? అందుకే ఎక్కడ చూసినా ‘బాహుబలి’ వసూళ్ల గురించి మాట్లాడుతున్నారు. థియేటర్లవారీ, ప్రాంతాలవారీ, రాష్ట్రాలవారీ, దేశాలవారీ, ఓవర్సీస్‌లో ఎంతెంత కొల్లగొట్టారో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.

ఐదేళ్ల సినిమా -అద్భుతం. బడ్జెట్ -అత్యద్భుతం. గ్రాఫిక్స్ -అమోఘం. తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచీ ఇప్పటి వరకూ ‘ఇలాంటి’ సినిమా లేదు. ‘ఇంత’ భారీగా రాలేదు. ఇక ఎప్పటికీ రాదు కూడా. ఇదీ బాహుబలి గురించి జరిగిన, జరుగుతోన్న ప్రచార ‘మానియా’. ఇంత విన్నాక, మొదటి భాగాన్ని గుర్తు చేసుకుంటూ రెండో భాగాన్నీ చూశాక -బాహుబలి గురించి ఎవరైనా యాంటీగా ఊసెత్తితే ‘రామ్‌గోపాల్ వర్మ’ లాంటివాళ్లకు కోపం రావొచ్చు. రాజవౌళి అభిమానులకు ఆగ్రహం కలగొచ్చు. అలా మాట్లాడేవాడిపై ‘యాంటీ బాహుబలి’ ముద్రే పడొచ్చు. ఒక్కముక్కలో చెప్పాలంటే -బాహుబలిని మెచ్చుకోనివాడు తెలుగోడే కాదని కూడా అనొచ్చు. అందుకే -నచ్చలేదని నిర్భీతిగా చెప్పేందుకు జంకుతున్నారు. ఏముంది అందులో? అని ప్రశ్నించేందుకు బెదురుతున్నారు.
***
గొప్ప సినిమా అన్న టాగ్‌లైన్ తగిలించడానికి ముందు-
కథ ముఖ్యమా? కలెక్షన్స్ ముఖ్యమా? అని ప్రశ్నించుకోవాల్సిన తరుణం వచ్చింది. ఇంతకుముందూ కొన్ని సినిమాల విషయంలో ఇలాంటి ప్రశ్నలు ఉద్భవించినా -బాహుబలి శకం తరువాత ఆ ‘ప్రశ్న’కు వచ్చిన వెయిటేజీ వేరు. ‘ఐదేళ్లు కష్టపడ్డాం. అహోరాత్రులు కృషి చేశాం. తలలు పట్టుకున్నాం. ఊహలల్లుకున్నాం. పాత్రల కసరత్తులు చేశాం. లొకేషన్లు వెతికిపట్టాం. స్కెచ్‌లు గీశాం. భారీ సెట్టింగులేశాం. తెరవెనుక టెక్నీషియన్లు, తెరమీద తారాగణం అంకితమైపోయాం. పది సినిమాల పనితనాన్ని, యాభై సినిమాల బడ్జెట్ కష్టాన్ని ఒక్క ‘చిత్రం’పై పెట్టాం. బహుశ ఇలా ఇప్పటివరకూ ఎవ్వరూ చేసి ఉండరు. అందుకే ఇదొక అద్భుతం. ప్రపంచ సినిమాకు పాఠం చెప్పగల అధ్యాయం. చూసి తరించండి’ అంటూ ఊదరగొట్టేస్తుంటే -అంతా తలలూపేస్తున్నాం. అయితే ఏంటని ప్రశ్నించేదెవరు. చెప్పుకున్నంత గొప్ప విషయం ఏముందని అడిగేదెవరు? మూడురోజుల క్రితం విడుదలైన ‘ముగింపు’ మాయకూ కోట్ల కొద్దీ కలెక్షన్లు వచ్చిపడుతుంటే -ఇదే తెలుగు సినీ చరిత్రను తిరగరాసే సరికొత్త చిత్రమని అనుకోవాలా? కలెక్షనే్ల గొప్ప సినిమాకు ప్రామాణికం అనుకుంటే -ఇంతకుముందు దిగ్గజ దర్శకులు తీసిన జానపద చిత్రాలను ఏం చేయాలి. రాజవౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యపు కోట గోడల కింద కప్పెట్టెయ్యాలా? పాత తెలుగు జానపద సినిమాల ఇన్‌స్పిరేషన్‌తోనే హాలీవుడ్ దర్శకులు సైతం అద్భుతాలు సృష్టించారని చెప్పుకోవడానికి సిగ్గుపడాలా?
***
రాజవౌళి అద్భుతాన్ని సృష్టించాడన్నది మంది మాట. ఇదే ఇండియన్ సినిమా బలాన్ని, భావోద్వేగాన్ని చెప్పగల సినిమా అంటూ ప్రచారం చేసేయడం మీడియా ఎత్తుకున్న బాట. ఇంతకుమించిన సినిమా లేదని జరుగుతోన్న ప్రచారానికి అనుభవజ్ఞులు అడ్డుచెప్పకపోవడం మరీ దారుణం. అద్భుతాలు సృష్టించిన దిగ్గజ దర్శకులను అవమానించేలా ప్రచారం సాగుతుండటం మరీ మరీ విడ్డూరం. నిజానికి బాహుబలిని తలదనే్న బాహు‘్భళి’లు నాలుగైదు దశాబ్దాల క్రితమే మన దర్శకులు సృష్టించారు. గొప్ప దర్శకుడు కెవి రెడ్డి సృష్టించిన అద్భుతం ‘మాయాబజార్’. పాండవుల ప్రస్తావన లేకుండా మహాభారతాన్ని మాట్లాడుకోలేం అన్న వాళ్లకు కెవి రెడ్డి ఇచ్చిన సమాధానమే అది. ‘బిగినింగ్’ నుంచి ‘కన్‌క్లూజన్’ వరకూ కన్ను పక్కకు తిప్పుకోవడానికి వీల్లేనంత గొప్పగా తీసిన సినిమా. అంతకంటే ‘బాహుబలి’ని గొప్పగా చెప్పుకోగలమా? హాలీవుడ్ దర్శకులు సైతం తీయలేనంత గొప్ప గ్రాఫిక్స్ ‘బాహుబలి’లో ఉన్నాయని భయంకరమైన ప్రచారం జరుగుతోంది. ఈ ‘ట్రిక్స్’ను 40 ఏళ్ల క్రితం మార్కస్ బార్‌ట్లేలాంటి ఉద్దండ సినిమాటోగ్రాఫర్లు చేసి చూపించారు. అలాగని -ఇంతగా జబ్బల చరుచుకోలేదే. సినిమాకు సంబంధించి ఎలాంటి సాంకేతిక వనరు అందుబాటులో లేనపుడే మార్కస్ ఎన్నో ట్రిక్స్ చేసి ‘మాయాబజార్’లో చూపించారు. భారీకాయంతో ఘటోత్కచుడు అంతఃపురంలోకి అడుగుపెట్టడం, నిద్రపోతున్న శశిరేఖను మంచంతోసహా మాయం చేసి ఆకాశంలో ప్రయాణించటం లాంటి సన్నివేశాల్లో మనం అద్భుతానే్న చూస్తాం. బాహుబలిలో అలాంటి సన్నివేశాలను అనుకరించినా, గ్రాఫిక్స్ తప్ప ప్రాణమున్న భావన ఎక్కడా కలగదు. అందుకే 40 ఏళ్ల క్రితం చూసిన మాయాబజార్ ఇప్పటికీ గుర్తుంటుంది. నాలుగు రోజుల క్రితం చూసిన ‘బాహుబలి’లో ఒక్క సన్నివేశమూ మనల్ని వెంటాడటం లేదు. ‘్భళీ’ అనిపించదగ్గ గొప్ప కథలు, సన్నివేశాలు, కెమెరా ట్రిక్స్, అద్భుతమైన స్క్రీన్‌ప్లే పాత జానపదాల్లో ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తాయి.
జానపదాన్ని ఎంత అద్భుతంగా తీయవచ్చో విఠలాచార్య ఎన్ని చిత్రాల్లో చూపించలేదు. కళ్లముందు కథను సాక్షాత్కరింప చేసి ‘ఇదీ మన జానపదం’ అని ఎన్ని చిత్రాల్లో కమలాకర కామేశ్వర రావు తన ప్రతిభ చాటలేదు. వేదాంతం రాఘవయ్య, జి విశ్వనాథం, ఎన్టీఆర్‌లాంటి గొప్ప దర్శకులు ఇలాంటి చిత్రాలపై ఎప్పుడో పాఠాలు చెప్పేశారు. ఇప్పుడు బాహుబలిని సృష్టించిన రాజవౌళి నుంచి భారతీయ సినిమా కొత్తగా పాఠాలు నేర్చుకోవాలా? మన సినిమా ఎంత గొప్పదో దేశ విదేశాల్లో, పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో బాపు, కె విశ్వనాథ్, బాలచందర్, శ్యాంబెనగల్, మృణాల్‌సేన్, సత్యజిత్ రే లాంటి దర్శకులు ఎన్నిసార్లు నిరూపించలేదు. కోట్ల రూపాయలు పెట్టి తీసిన హాలీవుడ్ చిత్రాలు సైతం మనవాళ్ల సినిమాల ముందు ఎన్నిసార్లు వెలవెలబోలేదు. అంతకంటే గొప్పదని చెప్పుకోడానికి బాహుబలిలో ఏముంది? ఇదే అసలు ప్రశ్న. భారీ పెట్టుబడే గొప్ప సినిమాకు ప్రామాణికం అనుకుంటే నిస్సందేహంగా ‘బాహుబలి’ని మించిన భారతీయ సినిమా లేనే లేదు. కానీ, ఒక సినిమాకు అదే ప్రామాణికమని అనుకోగలమా? కాదనుకుంటే -వాటికిలేని ఆర్భాటం దీనికెందుకు? మార్కెట్ స్ట్రాటజీ అనుకోవాలా?
ఈ ప్రశ్నలకు బదులేది?
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఇదీ ‘కన్‌క్లూజన్’ను పైకిలేపిన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నంలోనే సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది. కానీ -సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో. ముందుగా పాత్రలు ఊహించుకుని, ఆ పాత్రల ప్రవర్తన మేరకు కథను అల్లుకున్నట్టు అనేక సందర్భాల్లో దర్శకుడు రాజవౌళే చెప్తూ వచ్చాడు. మరి ఆ పాత్రల ఔచిత్యంలోనే లోపాలున్నపుడు -ప్రపంచానికి పాఠం చెప్పగల గొప్ప సినిమాగా ఎలా పరిగణించాలి? కథను చెప్పే విధానంలోనే అనేక లోపాలు పెట్టుకుని గొప్ప సినిమా అని ఎలా ప్రచారం చేసుకోవాలి. ‘బిగినింగ్’ కోసం తీసిన భాగాలనే అటుతిప్పి ఇటుతిప్పి రెండో భాగంలో చూపించి -అతుకుల బొంత చేస్తే ‘బాహుబలి’ని గొప్ప సినిమా అని ఎలా అనాలి? ‘బిగినింగ్’లో కనిపించిన భల్లాల దేవుడు, ‘కన్‌క్లూజన్’ చివరిలో బక్కచిక్కిపోవడానికి సరైన ప్రణాళిక వేసుకోకపోవడం కారణం కాదూ! ఇంత చిన్న విషయాలోనే లోపాలు కనిపిస్తున్నా ‘సాహో’ అని మనకు మనమే జబ్బలు చరచుకోవడాన్ని ఏమనుకోవాలి? ఇక్కడ ‘లవ కుశ’ చిత్రాన్ని ప్రస్తావించుకుందాం. ఆ సినిమా నిర్మాణం మొదలుపెట్టిన తరువాత ఆర్థికపరమైన ఇబ్బందులతో అనేకసార్లు షూటింగ్ ఆగిపోయింది. అలా ఎనిమిదేళ్లపాటు ఆ చిత్రాన్ని షూట్ చేశారు. కానీ ‘బిగినింగ్’ నుంచి ‘కన్‌క్లూజన్’ వరకూ ఎక్కడా మనకు తేడా కనిపించదు. అంతకంటే గొప్ప ప్లానింగ్ బాహుబలిలో కనిపించిందని అనుకోవాలా?
ప్రామాణికత ఎంత?
బాహుబలి -ది కన్‌క్లూజన్‌తో తెలుగు సినిమా కథ ముగిసినట్టు కాదు. ఇకపైనా సినిమాలు వస్తాయి. గొప్ప చిత్రాలూ వస్తుంటాయి. భారీ చిత్రాలూ రూపుదిద్దుకుంటాయి. కానీ బాహుబలిని ప్రామాణికంగా తీసుకుని ఏ ఒక్క సినిమా అయినా రూపుదిద్దుకునే అవకాశం ఉందా? అన్నదే అసలు ప్రశ్న. సినిమాను ఎలా తీయాలో, ప్రాణం పెట్టి తీసిన సినిమా ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పటికే ముందుతరం దర్శకులు మనకు రుచి చూపించారు.
పెట్టుబడి పెట్టి ఎంత గొప్పగా లాభాలు సంపాదించాలో ‘బాహుబలి’ని చూసి నేర్చుకోవాలి తప్ప, కొత్తగా బాహుబలిలో చూడదగ్గదీ, దాని నుంచి నేర్చుకోదగ్గదీ ఏమీ లేదన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.

-విజయప్రసాద్