Others

‘తలాక్’ రద్దు కోసం ఎదురుచూపులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడుసార్లు ‘తలాక్’ శబ్దాన్ని ఉచ్ఛరించడం ద్వారా విడాకులు ఇచ్చేసే దుష్ట సంప్రదాయానికి వ్యతిరేకంగా ముస్లిం మహిళలు దీర్ఘకాలంగా చేస్తున్న పోరాటం కీలక దశకు చేరింది. ముస్లింలను ‘మూకుమ్మడి ఓటు బ్యాంకు’గా పరిగణిస్తూ కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాలుగా అనుసరిస్తూ వచ్చిన ముస్లిం సంతుష్ఠీకరణ విధానాల వల్ల అత్యధికంగా నష్టపోయింది ఆ వర్గం మహిళలే. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సంతుష్టీకరణ విధానాలకు, ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో వ్యవహరించడం వల్ల ‘తలాక్’ అంశం సుప్రీం కోర్టు ధర్మాసనం వద్దకు చేరింది. మూడుసార్లు ‘తలాక్’ శబ్దం ఉచ్ఛరించడం ద్వారా ముస్లిం మహిళలకు వారి భర్తలు క్షణకాలంలో విడాకులు ఇచ్చే సంప్రదాయం రాజ్యాంగ వ్యతిరేకమని, మానవతా ధర్మాన్ని ఉల్లంఘించడమేనని కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసింది. ‘తలాక్’ పేరిట అణగదొక్కబడుతున్న ముస్లిం మహిళలకు విముక్తి ప్రసాదించాలే తప్ప ఈ అంశాన్ని రాజకీయ కోణం నుంచి చూడరాదు. భారత్‌తోపాటు ప్రపంచంలోని నామమాత్రపు దేశాలలో అమలులో వున్న తలాక్ విధానం లింగ వివక్షను స్పష్టంగా తెలియజేస్తుంది. ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంది.
మూడుసార్లు తలాక్ కారణంగా లక్షలాదిమంది ముస్లిం మహిళలు అనాథలయ్యారు. ఇందులో పేద ముస్లిం మహిళల పరిస్థితి మరీ ఘోరం. దిక్కుతోచని స్థితిలో దుర్భర పరిస్థితుల మధ్య వీరు జీవనం కొనసాగిస్తున్నారు. భారతదేశంలో దాదాపు 20 కోట్లమంది ముస్లింలు ఉన్నారు. వీరి వివాహాలు, విడాకులు ‘ముస్లిం పర్సనల్ లా’ ఆధారంగా జరుగుతున్నాయి. ‘షరియత్’ (ఇస్లామిక్ చట్టం) ఆ ధారంగా ఈ ముస్లిం పర్సనల్ లా ఏర్పడిందని చెబుతారు. 1937లో ముస్లిం పర్సనల్ లా అమలులోకి వచ్చింది. ముస్లింల వ్యక్తిగత విషయాలలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని ఇందులో రాశారు. ఆంగ్లేయులు భారత్‌ను వదిలివెళ్ళిపోవాల్సిన రోజుల్లో మన సమాజాన్ని దీర్ఘకాలం పాటు ఇబ్బందులు గురిచేయడం కోసం ‘విభజించు - పాలించు’ సిద్ధాంతాన్ని వారు అమలు చేశారు. ఇందులో భాగంగానే హిందువులు, ముస్లింల మధ్య వైరుధ్యాలు పెంచేందుకు కుట్ర పూరితంగా ఇటువంటి చట్టాలను అమలులోకి తెచ్చి సమాజం, రాజ్యాంగం కంటే ముస్లింలే అధికులు అన్న భావనను కలిగించే ప్రయత్నం చేశారు. ముస్లిం మహిళలను కించపరచే, క్షణకాలంలో వారి జీవితాల్లో నిప్పులు కురిపించే ‘ట్రిపుల్ తలాక్’ విధానం గురించి షరియత్ కానీ ఖురాన్‌లో కానీ ఎక్కడా కనపడదు. అనేక దశాబ్దాలుగా అమలులో వున్న ‘తలాక్’ సంప్రదాయం ఒక విషపుమొక్క అని ముస్లిం మేధావులు అంగీకరిస్తూనే ఈ విధానాన్ని సమర్థించడం అర్థరహితం.
విడాకులకు సంబంధించిన అంశాలను ఖురాన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. విడాకులు పొందడానికి కనీసం మూడు నెలలు గడువు ఉండాలి. ఈమధ్యకాలంలో విభేదాలను తొలగించుకోవడానికి, మనసు మార్చుకోవడానికి తగిన సమయం భార్యాభర్తలిద్దరికీ లభిస్తుంది. ఇస్లామిక్ రాజ్యాలుగా ఏర్పడ్డ పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కూడా తలాక్ విధానం అమలులో లేదు. దురదృష్టవశాత్తూ సెక్యులర్ దేశంగా పిలవబడుతున్న భారత్‌లో మతం పెత్తనం చేస్తున్న ఇటువంటి అమానవీయ విధానం అమలులో ఉన్నది.
మూడు సార్లు తలాక్ శబ్ద ఉచ్ఛారణ ద్వారా విడాకులు పొందిన స్ర్తి- గొడవలు సద్దుమణిగిన తరువాత తన భర్తతో కాపురం చేయాలని అనుకుంటే మధ్యకాలంలో మరొక పురుషుడిని వివాహమాడి ఆయనతో శారీరక సంబంధాలు పెట్టుకొని సదరు వ్యక్తినుంచి విడాకులు పొందిన తరువాతనే తన మొదటి భర్తను చేరగలదు. కేవలం భారతదేశంలో మాత్రమే ఇటువంటి నీతిబాహ్యమైన, ఇస్లాం వ్యతిరేక విధానం కొనసాగుతూండడం మనందరికీ సిగ్గుచేటు. ఇటువంటి మహిళా వ్యతిరేక విధానాలను అమలుచేస్తున్న ముస్లిం పర్సనల్ లా విధానాలన్నింటినీ పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకమైన తలాక్ లాంటి పద్ధతుల కారణంగా ముస్లిం ఖాజీలు, వౌల్వీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ముస్లిం మహిళలను మరిన్ని కష్టాలకు గురిచేస్తున్నారు.
ట్రిపుల్ తలాక్ విధానాన్ని ఖండిస్తూ దీన్ని ‘హరామ్’ (నిషిద్ధం)గా పేర్కొంటూ ఈ విధానం కొనసాగాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదించడం హాస్యాస్పదం. ట్రిపుల్ తలాక్ విధానాన్ని ఖురాన్ ఆమోదించలేదు. అయినప్పటికీ దీన్ని నిషేధించే అధికారం భారత ప్రభుత్వానికి, భారత కోర్టులకు లేదు. ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఒక నైతిక సంస్థ. దీని ద్వారా మేం ముస్లింలను చైతన్యపరుస్తాం’ అని వర్కింగ్ కమిటీ సభ్యురాలు అస్మాజిహ్రా వాదించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ముస్లిం మహిళల మాన ప్ర ణాలకు అతి పెద్ద శాపంగా మారిన ట్రిపుల్ తలాక్ విధానాన్ని సమర్థించుకునేందుకు కొత్త కొత్త వాదనలు పుట్టిస్తున్నారు. భారత్‌లో ట్రిపుల్ తలాక్ విధానం అమలులో ఉన్నప్పటికీ ముస్లింలలో విడాకుల శాతం తక్కువే కాబట్టి ఈ విధానం కొనసాగించాలన్నది ఒక వర్గం వాదన. ఈ అంశాన్ని గోరంతలు కొండంతలుగా చూపిస్తూ ముస్లిం మత విధానాలలో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నది ఇంకొక వాదన. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లింల జీవనం దుర్భరమైపోయిందని, తలాక్ అంశాన్ని అడ్డం పెట్టుకొని మోదీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) అమలు చేయాలని ప్రయత్నిస్తున్నదని ఇంకొక వాదన.
ట్రిపుల్ తలాక్ విధానం చెల్లదని, ‘పర్సనల్ లా’ పేరిట మానవ హక్కుల ఉల్లంఘన సహించరాని అంశమని అలహాబాద్ హైకోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వ సిద్ధాంత స్ఫూర్తికి ఈ విధానం పూర్తిగా భిన్నమైనదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దశాబ్దాలుగా తమకు జరుగుతున్న అన్యాయాలను ఇకపై ఏ మాత్రం సహించబోమని ముస్లిం మహిళలు తెగేసి చెబుతున్నారు. కూరలో ఉప్పు తక్కువైతే విడాకులు ఇచ్చేస్తున్నారు. ఆడ సంతానం పుడితే తలాక్ చెప్పేస్తున్నారు. మరో స్ర్తిని వివాహం చేసుకోదలిస్తే విడాకులు ఇచ్చేస్తున్నారు. మూడుసార్లు తలాక్ ఉచ్ఛారణ ద్వారా విడాకులను సమయం, సందర్భం, కారణం, న్యాయం, తర్కం లేకుండా ముస్లిం మహిళలకు విడాకులు ఇచ్చేసి వారిని అనాథలను చేస్తున్నారు. కన్నుమూసి తెరిచేలోగా సంసారాలు భగ్నం అవుతున్నాయి. భవిష్యత్‌పైన ఏ మాత్రం నమ్మకం లేని దిక్కుతోచని స్థితికి ముస్లిం మహిళలు లోనవుతున్నారు. ఏ క్షణాన భర్త ఇంటి నుండి బయటికి గెంటివేస్తాడో అన్న భయంతో కట్టు బానిసల్లా పడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. విద్యావంతులైన ముస్లింలు కూడా తెల్లకాగితం మీద మూడుసార్లు ‘తలాక్’ అని రాసి భార్యకు పంపించి విడాకులు ఇచ్చేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం? అని ప్రశ్నించే కనీస హక్కు కూడా ముస్లిం మహిళలకు లేదు. అడిగితే ఇస్లాంకు, ఖురాన్‌కు వ్యతిరేకం అంటూ ముల్లాలు, వౌల్వీలు అడ్డుపడుతున్నారు. ముస్లిం పురుషులు తమ శారీరక వాంఛలు తీరిన తరువాత ‘ట్రిపుల్ తలాక్’ను అడ్డు పెట్టుకుని పైసా ఖర్చు లేకుండా మహిళలను వదిలించుకుంటున్నారు. విడాకులు ఇచ్చిన భార్యకు భరణం సంగతి దేవుడెరుగు, వారిని తమ గడపలు కూడా తొక్కనీయడం లేదు. వీరు తిరిగి పుట్టింటికో లేదా అనాథ శరణాలయాలకో చేరుతున్నారు. వీరి సంతానం గురించి పట్టించుకునే వారే లేరు. అయితే ఇరానీ హోటళ్ళల్లో కప్పులు కడగడం లేదా సైకిల్ దుకాణాల్లో పంచర్లు వేయడానికో వారి పిల్లలు పరిమితం అవుతున్నారు. మన దేశంలో తీవ్రవాద కార్యక్రమాలు, హింసాత్మక విధానాలను అమలుచేయడానికి శత్రు దేశాల వారికి ఉపయోగపడే అరాచక శక్తులుగా తయారవుతున్నారు.
మూడుసార్లు ‘తలాక్’ అని పలికినంత మాత్రాన విడాకులు ఇచ్చినట్లు కాదని, ముస్లిం మహిళలందరూ ఖురాన్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ ధర్మపత్ని సల్మా అన్సారీ చేసిన బహిరంగ ప్రకటన మారుతున్న ముస్లిం మహిళల మనఃస్తత్వానికి అద్దం పడుతున్నది. ట్రిపుల్ తలాక్ అంశాన్ని పూర్తిగా మతపరమైనదిగా చూడకూడదని, ఈ అంశాన్ని ఉలేమాల అధీనం లోంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ కేసులో సుప్రీంకోర్టులో అమెకస్ క్యూరేగా ఖుర్షీద్ వ్యవహరిస్తున్నారు. ఈ అంశమై ప్రపంచంలోని ఇస్లాం దేశాల ఉలేమాలు, భారతదేశంలోని ఉలేమాల మధ్య విస్తృతమైన చర్చ జరగాలి. భారత ముస్లిం మత పెద్దలు ‘తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లు’ అన్నట్లుగా వ్యవహరించడం కుదరదు.
ఏ పర్సనల్ లా అయినా సరే రాజ్యాంగానికి లోబడి మాత్రమే పని చేయాలి. ముస్లిం పర్సనల్ లా పేరిట ఫత్వాలను జారీ చేయడం మన న్యాయవ్యవస్థను సవాల్ చేసినట్లే. ఇతరుల హక్కులకు భంగం కలిగించే ఫత్వాలు చెల్లవు. తమ వర్గం లేదా మతం వారిపట్ల నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా వ్యవహరించే పర్సనల్ లా ఎందుకు ఉండాలి? ముస్లిం మహిళలు, స్వచ్ఛంద సంస్థలు ఇపుడు పురుషాధిక్యతపై నేరుగా పోరుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ హయంలో నోరు మెదపని నాయకులందరూ ఇపుడు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం మహిళల హక్కుల సంరక్షణ కోసం మోదీ ప్రభుత్వం అందిస్తున్న నైతిక బలం కారణంగా ఈ ఉద్యమానికి ఇపుడు మరింత ఊతం లభిస్తున్నది. జమాత్ ఉలేమా ఐహింద్ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని ప్రముఖ ముస్లిం నాయకులు మోదీని కలిసి ట్రిపుల్ తలాక్ అంశాన్ని వ్యతిరేకిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
మూడుసార్లు తలాక్ విధానంపై సుప్రీం కోర్టులో వాదోపవాదాలు ప్రారంభమవుతున్నాయి. హిందువు, సిఖ్, క్రిస్టియన్, జోరాస్ట్రియన్, ముస్లింలతో కూడిన అయిదుగురు సుప్రీంకోర్టు జడ్జీల ధర్మాసనం వెలువరించే తీర్పుకోసం ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు భారత ముస్లిం సమాజంలో విప్లవాత్మకమైన ప్రక్షాళన తీసుకువస్తూ మన దేశ సామాజిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్న ఆశలు కనబడుతున్నాయి. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులను కాపాడుతూ వారికి జీవిత భద్రత కల్పిస్తుందన్న నమ్మకాలు కనపడుతున్నాయి. తలాక్ విధానం ఇంకా కొనసాగితే ఇస్లాంను వీడి హిందూ ధర్మంలోకి మారిపోతామని ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన మహిళలు హెచ్చరిస్తున్నారు. లింగ, వర్గ, మత వివక్షలకు తావీయకుండా పటిష్టమైన సామాజిక వ్యవస్థ నిర్మాణంలో సుప్రీం కోర్టు తన వంతు పాత్రను నిర్వహిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113