మెయన్ ఫీచర్

న్యాయదేవత కళ్లు తెరిచేదెపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయస్థానాల్లో ‘యువర్ మెజెస్టీ.. యువరానర్.., మిలార్డ్..’ లాంటి బానిస పదజాలాన్ని గుర్తించడానికి దశాబ్దాలు పట్టింది. వలసవాదుల కాలంలో రూపొందిన ఈ అతి విధేయ పదజాల నిబంధనలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ఇంపైన పదజాలం న్యాయవ్యవస్థకు నిత్యం ముసుగు వేస్తూనే ఉంది. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ గొప్పదా? న్యాయవ్యవస్థ గొప్పదా? అనే చర్చకు పార్లమెంటే అత్యున్నతమనే సమాధానం వస్తుంది. పార్లమెంట్ విమర్శకు గురైనంతగా- న్యాయవ్యవస్థ ఏనాడు అభిశంసనకు కాదు గదా, పునః సమీక్షకు సైతం నోచుకోలేదు.
‘కొలీజీయం’ పేరున న్యాయాధీశుల్ని న్యాయధీశులే నియమించుకునే న్యాయవ్యవస్థ మనది. కింది స్థాయి కోర్టులను ఉన్నత న్యాయస్థానాలు నిర్దేశించడమే గాని, అవి నిజంగా ఆ స్థాయిలో పనిచేస్తున్నాయా? అనే ప్రశ్న మన మస్తిష్కంలో ఏనాడూ ఉదయించదు. కేసుల్ని బట్టి, నిందితుల రాజకీయ సంబంధాలను బట్టి, సామాజిక ఆర్థిక స్థాయిని బట్టి, కులం- మతం- వర్గాలను బట్టి తీర్పుల్ని చెప్పే వ్యాయస్థానాలు మనవి. ‘్భరతీయ జడ్జీలు అత్యధికంగా హిందువులని, ఉన్నత వర్గాల వారని, ఉన్నత కులుస్థులని , అందునా అధికులు మగవారేనని..’ఆమధ్య సోషల్ మీడియాలో ‘కొలీజీయం’పై విమర్శలు వెల్లువెత్తాయి. గత సెప్టెంబర్ 1న జరిగిన కొలీజీయం సమావేశానికి సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గైర్హాజరు కావడమే కాక, పారదర్శకత లేని కొలీజీయంపై కొన్ని ప్రశ్నల్ని సంధిస్తూ ప్రధాన న్యాయమూర్తికి సుదీర్ఘ లేఖ రాశారు. ఈ గందరగోళంలో 2014లో మోదీ ప్రభుత్వం రూపొందించిన జాతీయ స్థాయి న్యాయాధీశుల నియామక కమిషన్ (ఎన్‌జెఎసి) చట్టం అమలుకు నోచుకోకుండా పోయింది.
మన న్యాయవ్యవస్థ గూర్చి మనకు అనేక నమ్మకాలే కాదు, కొన్ని భ్రమలు కూడా ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అనేది తరచుగా వింటూ వుంటాం! గత ఏడు దశాబ్దాలుగా వెలువరించిన తీర్పుల్ని పరిశీలిస్తే దీని డొల్లతనం తెలుస్తుంది. అత్యున్నత స్థానాల్లో వున్నవారికి, అధికారంలో వున్నవారికి, ప్రముఖులకు, ధనవంతులకు, సెలబ్రిటీలకు, రాజకీయంగా పలుకుబడి వున్నవారికి, పాలక పక్షానికి అనుకూలంగా వచ్చిన తీర్పులే అత్యధికం. ‘నిర్భయ చట్టం’ రూపకల్పన సందర్భంగా జె.యస్.వర్మ కమిటీ చెప్పినా, కొన్నిసార్లు సుప్రీం కోర్టు స్పందించినా, సాయుధ బలగాల ప్రత్యేక హక్కుల పేరిట చేస్తున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని ‘మణిపూర్ ఉక్కుమహిళ’ ఇరోం షర్మిల 16 ఏళ్లు నిరాహార దీక్ష చేసినా న్యాయానికి కనువిప్పు కలగని వైనం. లాకప్ మరణాలకు, బూటకపు ఎన్‌కౌంటర్లకు, మహిళలపై పోలీసు స్టేషన్‌లోనే జరిగిన అత్యాచారాలకు బాధ్యులైన ఉన్నత స్థాయి పోలీసు అధికారులకు ఏనాడూ శిక్షలు పడని వ్యవస్థలో న్యాయస్థానాల్ని నిందించడం నిప్పుతో చెలగాటమే!
మూడో స్తంభంగా అభివర్ణించబడే మన న్యాయవ్యవస్థ నాలుగు పాదాలపై ఎలా పనిచేస్తోందో గత ఏడాది ‘నేషనల్ లాయర్స్ క్యాంపెయిన్ ఫర్ జుడిషియల్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ రిఫార్మ్స్’ అనే సంస్థ సుప్రీం కోర్టుకు సమర్పించిన పిటిషన్‌ను చూస్తే తెలుస్తుంది. సుప్రీం లోని 28 మంది స్టాండింగ్ జడ్జీలకు గాను 9 మంది మాజీ ప్రధాన జడ్జీలు, ఇతర జడ్జీల కొడుకులు, మనుమలు, అల్లుడు లేదా ఇతర కుటుంబ సభ్యులేనని తేలింది. 24 హైకోర్టులకుగాను 13 హైకోర్టులలో సమాచారం సేకరించిన 300 మంది జడ్జీలలో 88 మంది మాజీ జడ్జీల పిల్లలు, కుటుంబ సభ్యులేనని తెలిపింది. తమకు నచ్చినవారిని, పైస్థాయి న్యాయాధీశులతో సంబంధం వున్నవారిని నియమించుకోవడం బ్రిటీషు వారసత్వంగా కొనసాగుతున్నదని పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యక్తిత్వాన్ని, జవాబుదారీతనాన్ని, న్యాయవ్యవస్థ పట్ల నిబద్ధతల్ని కొలీజీయం ఏనాడూ పరిగణనలోకి తీసుకోలేదని, దీనికి కర్నాటక హైకోర్టు జడ్జీగా, తర్వాత సిక్కిం హైకోర్టు ప్రధాన జడ్జీగా నియమితులైన పి.డి.దినకరన్ ఉదాహరణ అని పేర్కొన్నారు. భూ ఆక్రమణ, అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొన్న దినకరన్ చివరికి పార్లమెంట్ అభిశంసన ఎదుర్కోవలసిరాగా జూలై 29, 2011న రాజీనామా చేయాల్సి వచ్చింది. పారదర్శకత లేని కొలీజీయం ఎంపిక విధానం గూర్చి పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోదా (ఈయన కొలీజీయం ద్వారానే ఎంపికైనా) చలమేశ్వర్‌ను సమర్థించారు. 1994లో జడ్జీల ఎంపికలో వివక్షకు గురైన జస్టీస్ సోదీ కూడా చలమేశ్వర్‌ను సమర్థిస్తూ, 2007లో తాను రాసిన ‘న్యాయానికి మరోవైపు’ పుస్తకంలో లోపభూయిష్ట విధానాల్ని ఎత్తిచూపినట్లు తెలిపారు.
ప్రముఖ న్యాయవాదులైన శాంతిభూషణ్, ప్రశాంత్ భూషణ్‌లు సెప్టెంబర్ 2010లో అప్పటివరకు సుప్రీం న్యాయాధీశులుగా పనిచేసినవారిలో 16 మంది వెలువరించిన అవినీతికర తీర్పుల్ని, విధానాల్ని సుప్రీంకోర్టుకు సీల్టు కవర్‌లో అందించారు. 1990-91లో చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన రంగనాథ్ మిశ్రా 1984 సిక్కుల ఊచకోతలో కాంగ్రెస్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు. తర్వాత ఈయనకు రాజ్యసభ సీటు దక్కింది. 1991లో కేవలం 18 రోజులపాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కె.యన్.సింగ్, జైన్ ఎక్స్‌పోర్టు సంస్థకు అనుకూల తీర్పునివ్వడమే కాక, కస్టమ్స్ అధికారులు వేసిన ఐదు కోట్ల జరిమానాను తగ్గించివేశాడు. 1994-97లో పనిచేసిన అహ్మదీ భోపాల్ గ్యాస్ లీక్‌కు కారణమైన యూనియన్ కార్బైడ్ సంస్థకు అనుకూల తీర్పునిచ్చాడు. 1998లో పనిచేసిన ఎం.ఎం.పుంచి జైలుశిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని, ఫిర్యాదుదారుతో రాజీ చేయించి విడుదల చేయించాడు. 1998-2001 మధ్యన పనిచేసిన ఎ.ఎస్.ఆనంద్ చీఫ్ జస్టిస్ కార్యాలయానే్న స్వంత విషయాలకు వాడుకొని, శ్రీనగర్‌లో ఓ హాస్పిటల్‌ని కూతురుకు దక్కేలా చేశాడు. 2005-2007 మధ్యన పనిచేసిన వై.కె.సబర్వాల్ ఢిల్లీలో నిషేధిత ప్రాంతంలో తన కొడుక్కి, రియల్ ఎస్టేట్ వర్గాలకు అనైతికంగా అనుమతిలిచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. 2007- 2010 మధ్యకాలంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కెజి బాలకృష్ణన్ లెక్కకు మించి ఆస్తులు కలిగి ఉన్నారని పలు అభియోగాలు వచ్చినా, పదవీ విరమణ తర్వాత ఆయనను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమించారు. దీనిపై చర్య తీసుకోవాలని అప్పట్లో జస్టిస్ సచార్, జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ ప్రభుత్వాన్ని కోరారు.
ఇలాంటివే వివిధ హైకోర్టులలో పనిచేసిన జడ్జీలు వెలువరించిన తీర్పులు కూడా ఉన్నాయి. కలకత్తా హైకోర్టులో జడ్జిగా పనిచేసిన సౌమిత్రి సేన్ రాజ్యసభ అభిశంసనకు గురయ్యాడు. ఓ పబ్లిక్ రంగ సంస్థ వాటాల అమ్మకంలో అవినీతి పాత్ర పోషించాడనేది ఈయనపై అభియోగం. తాజ్ కారిడార్ కేసులో మాయావతికి అనుకూలంగా తీర్పునిచ్చిన అలహాబాద్ జడ్జి రెబెల్లో, డబ్బు మాయతో తీర్పుల్ని చెప్పించడానికి దోహదపడిన పంజాబ్, హర్యానా జడ్జి మెహతాబ్ సింగ్ గిల్ లాంటి వారెందరో అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. హర్యానా అడ్వకేట్ జనరల్ సంజీవ్ బన్సాల్ 2008లో రూ.15 లక్షల కరెన్సీ ఉన్న ఒక ప్యాకెట్‌ను ఒక కేసు విషయంలో ఉత్తరాఖండ్ జడ్జిగా పనిచేసిన నిర్మలా యాదవ్‌కు పంపించగా, పొరపాటున అలాంటి పేరేగల మరో జస్టిస్ నిర్మల్‌జీత్ కౌర్‌కు అందించడంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ వ్యవహారం బయటపడింది. మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన కె.వీరాస్వామిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 1976లో ఆయన పదవీ విరమణ చేసినా, ఆ కేసు తెగలేదు. స్వయాన ఈయన అల్లుడైన వి.రామస్వామి సుప్రీంకోర్టు జడ్జిగా, 1991లో ఓ రూలింగ్ ఇస్తూ సుప్రీం ప్రధాన జడ్జి అనుమతి లేకుండా న్యాయాధీశులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవద్దని చెప్పడం, చివరికి రామస్వామి అభిశంసనకు గురై పార్లమెంట్‌లో విపత్కర స్థితిలో వుంటే, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎంపీలను పార్లమెంటుకు హజారుకావద్దని హుకుం జారీచేసి ఆయన్ని కాపాడింది. తర్వాత ఈయనే అన్నాడిఎంకె టికెట్‌పై 1999లో శివకాశి నుంచి పోటీ చేశాడు.
ఇలాంటి కథనాలు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో తెలియదు. కోర్టు ఆవరణలోనే అవినీతి, భారీ ఫీజులు, ఏళ్ల తరబడి కేసుల వాయిదాలు.. షరామామూలే. వీటిపై నియంత్రణగాని, సమీక్షగాని లేదు. నకిలీ న్యాయవాదుల, దళారీల జోరు సైతం అధికంగానే ఉందట! సుప్రీం కోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా ఆ మధ్య తెలిపిన వివరాల ప్రకారం- దేశవ్యాప్తంగా 16.5 లక్షల మంది న్యాయవాదుల్లో దాదాపు 9 లక్షల మంది నకిలీ డిగ్రీలతో న్యాయవాదులుగా చెలామణీ అవుతున్నట్లు, ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం కూడా అతీతం కాదని తెలపడం గమనార్హం! ఇలాంటివారు కూడా లక్షల్లో ఫీజుల్ని వసూలు చేయడం కొసమెరుపు.
ఈ దేశపు మొదటి మహిళా న్యాయమూర్తిగా (దిల్లీ), హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (హిమాచల్ ప్రదేశ్) పనిచేసిన లీలాసేథ్ 2014లో తన అనుభవాలపై పత్రికలో ఓ కథనాన్ని రాశారు. స్వయాన తన పెద్దకొడుకు లైంగిక నేరాలు చేశాడని, ఇలాంటివారిని నియంత్రించేందుకు చట్టం చేయాలన్న దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నిలుపుదల చేయడం బాధాకరమని తెలపడం గమనార్హం. ఎంత దుర్మార్గుడైనా కొడుకును రక్షించుకోవాలనే వ్యవస్థలో ఆమె న్యాయధర్మానికే మొగ్గు చూపారు. నిజానికి తన దాంపత్యం, కుటుంబం అన్యోన్యంగా వుందని, అయినా తన కొడుకు అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనడం శిక్షార్హమేనని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ‘న్యాయం గూర్చి మాట్లాడుదాం: ఆధునిక భారత్‌లో ప్రజల హక్కులు’ అనే పుస్తకాన్ని ఆమె రాశారు.
కళ్లు లేని న్యాయవ్యవస్థ అనేక సందర్భాలలో కనీసం మూడు పాదాలపై కూడా నడవని స్థితి నెలకొంది. అవసరమైన వాటిని పట్టించుకోకపోవడం, ప్రజాప్రయోజన వ్యాజ్యాలను (పిల్స్) వేసినందుకు సమయం వృథా అయిందంటూ మందలించి జరిమానా విధించడం, కరడుగట్టిన నేరస్థులకు ఆగమేఘాలపై బెయిలు ఇవ్వడం, సల్మాన్ ఖాన్ లాంటి వారిని నిర్దోషులుగా వదలడం, గుజరాత్ అల్లర్ల తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేరారోపణ ఎదుర్కొన్న అమిత్ షా నిర్దోషిగా గుర్తించబడటం, దళితుల, ముస్లింలపై జరిగిన హత్యాకాండలో దోషులు నిర్దోషులుగా బయటకు రావడం వంటి ఉదంతాలు చూస్తూనే వున్నాం. న్యాయవ్యవస్థలోని లోపాలపై మాట్లాడడానికి జంకుతున్నాం. అయినా మనం ప్రజాస్వామ్యంగా జీవిస్తున్నామని భ్రమపడుతున్నాం. ఇలాంటి అస్తవ్యస్త వ్యవస్థలో జస్టిస్ కర్ణన్ వంటి న్యాయమూర్తులు పుట్టుకురావడం వింతేమీ కాకపోవచ్చు. కర్ణుడు కౌరవపక్షం చేరి విలన్ అయినట్లు, జస్టిస్ కర్ణన్ వివేచన కోల్పోయి న్యాయవ్యవస్థకు చెప్పులో రాయిగా, చెవిలో జోరీగగా, కంటిలో నలుసుగా మారడం ఇబ్బందికరమే! ఆయన చేసిన, చేస్తున్న ఆరోపణలు కొన్నైనా నిజం కాకమానవు. సుప్రీంకోర్టు కూడా అంతే ఉత్సుకతను ప్రదర్శించి న్యాయవ్యవస్థను రోడ్డుపైకి లాగింది. కర్ణన్‌ను అభిశంసించాలని పార్లమెంట్‌ను కోరివుంటే, చట్టసభ స్థాయి మరింతగా పెరిగేది. కర్ణన్‌కు జైలుశిక్షపడితే- న్యాయవ్యవస్థ న్యాయంగా వుందా? వుంటుందా? అని మనం ప్రశ్నించుకోవాలి! *

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162