మెయన్ ఫీచర్

‘కాయకల్ప చికిత్స’తోనే కాంగ్రెస్‌కు కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ఏ రాజకీయ పార్టీకీ లేనంత నూట పాతికేళ్ల పైబడిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా గతమెంతో ఘనకీర్తి కలిగిన కాంగ్రెస్ మనుగడ ఇపుడు ప్రశ్నార్థకమైంది. డెభ్భై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఐదున్నర దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలించిన చరిత్ర దీనికి ఉంది. నెహ్రూ లాంటి క్రాంతదర్శి, ఇందిరాగాంధీ లాంటి వీరనారి ఈ పార్టీ తరఫున దేశానే్నలిన వారే. జాతిని ఆర్థిక సంక్షోభం లోంచి బయటపడేసిన పి.వి.నరసింహారావు, మన్‌మోహన్‌సింగ్ లాంటి మేధావులు, ఆర్థికవేత్తలు కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. మెజారిటీగా ఉన్న సామాజిక న్యాయ కులాల నుంచి నాయకులను ఎదిగించడంలో విఫలమైందన్న అపవాదు కాంగ్రెస్ పార్టీకున్నా, దాదాపు పార్టీలన్నీ మనువాద స్వభావం కలవే.
మిగతా పార్టీల కన్నా కాంగ్రెస్ నయమనిపించినా, ఆ అవకాశాన్ని అది ఉపయోగించుకోలేదు. నెహ్రూ, ఇందిరాగాంధీ కాలంలో సమర్ధ నాయకత్వం, సెమీ సోషలిస్టిక్ పంథా పొడగింపు వల్ల దళిత బహుజనుల ఓట్లు దశాబ్దాల పాటు సంపాదించగలిగినా కాంగ్రెస్ ఆ తర్వాత వాటిని నిలుపుకోలేకపోయింది. క్రమంగా పార్టీలో బ్రాహ్మణీయ అగ్రవర్ణ శక్తుల ప్రాబల్యం పెరగడంతో బిజెపికి, కాంగ్రెస్‌కు తేడా లేకుండా పోయింది. హిందుత్వ శక్తులు బలపడడానికి పార్టీ మూసధోరణి, బహుజన నాయకత్వాన్ని ఎదిగించకపోవడం, ప్రాంతీయ పార్టీల విజృంభణ, కమ్యూనిస్టుల అనైక్యత, వామపక్ష శిబిరాల్లోనూ కులాధిక్యత అన్నీ కాంగ్రెస్ బలహీనపడడానికి తోడ్పడ్డాయి. కాంగ్రెస్ తీసుకున్న సెమీ మనువాద, సెమీ హిందుత్వ అజెండా- బిజెపి రంగప్రవేశం చేస్తున్నకొద్దీ ‘పూర్తి మనువాద ఎజెండా’నే మేలన్న భావం హిందూ ఓటర్లలో కలిగింది. దాంతో కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. తమను కాపాడడానికి కాంగ్రెస్ కంటే బిజెపియే మేలని అగ్రవర్ణ పార్టీలు భావించి బిజెపి పక్షం వైపు మొగ్గు చూపాయి. అన్ని రాష్ట్రాల్లోనూ అగ్రవర్ణ ముఖ్యమంత్రులే ఉండడం, కేంద్రంలోను అదే పరిస్థితి కొనసాగడం, ఆర్థిక విధానాల్లో మెజారిటీ ప్రజల అనుకూల ధోరణి కరువుకావడం లాంటివి అన్నీ కాంగ్రెస్‌కు బహుజన ఓటర్లను దూరం చేశాయి.
ఇందిరమ్మ గరీబీ హటావో నినాదం, బ్యాంకుల జాతీయకరణ లాంటి సంచలన నిర్ణయాలను ఏ కాంగ్రెస్ నాయకుడూ ఏ రాష్ట్రంలోనూ తీసుకోకపోవడం వల్ల ఆ పార్టీ నిస్తేజమైంది. సామాజిక పార్టీల విజృంభణ, కుప్పలు తెప్పలుగా ఫ్రాంతీయ పార్టీలు రావడం, పివి తీసుకన్న గ్లోబలీకరణ, నూతన ఆర్థిక విధానాలు సోషలిస్టు అనుకూల ధోరణి నుండి అమెరికా అనుకూల సామ్రాజ్య విధానాలకు మారడం లాంటివన్నీ గ్రామీణ వ్యవస్థను, బహుజనుల జీవన విధానాన్ని ధ్వంసం చేసాయి. అగ్రవర్ణ పారిశ్రామిక వేత్తలకు, బిజెపిలాంటి హిందుత్వ శక్తులకు జీవం పోసాయి. సామ్రాజ్యవాద హిందుత్వ శక్తుల విజృంభణ, చాలామంది బిసిల బ్రాహ్మణీకరణ హిందుత్వ భావజాలం మోదీని మొదటిసారిగా బిజెపి మెజారిటీతో గెలవడానికి ఉపయోగపడ్డాయి. దేశవ్యాప్తంగా అగ్రకుల రాజకీయ శక్తులకిది పండుగైంది. అదే కొనసాగుతుంది.
అన్ని రాష్ట్రాల్లో కొంతవరకైనా బలం, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ ఒక్కటే. ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పంజాబ్‌లో అధికారం చేపట్టగలిగినా, మూడు రాష్ట్రాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలవగలిగింది. అంటే దేశ రాజకీయాలను మతతత్వ శక్తుల నుండి నామమాత్రపు లౌకికత వైపైనా తిప్పగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంది. అందుకు కాంగ్రెస్ చేయాల్సిందల్లా తనను తాను సామాజికత వైపుమలుచుకోవడం. పార్టీని సామాజీకరణం చేయడం, దళితీకరణం చెందడం. ఈ ప్రక్రియ గత పార్లమెంటు ఎన్నికలకు ఒకటి రెండు సంవత్సరాల ముందు జరిగి వుంటే మతతత్వ శక్తుల విజృంభణ ఈ స్థాయిలో జరిగి ఉండేది కాదన్న వాదనలు లేకపోలేదు. దేశవ్యాప్తంగా సామాజిక శక్తులను ఐక్యం చేసే లేదా ప్రభావితం చేసే పార్టీ ఒక్కటి కడా లేకుండా పోయింది. ఆ పేరుతో బిఎస్‌పి, ఆర్‌జెడి లాంటి పార్టీలు ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమై తమను తామే ఓడించుకునే ప్రక్రియలో మునిగి తేలుతున్నాయి. పేదల పక్షం వహిస్తున్నామని చెప్పబడుతున్న కమ్యూనిస్టు నేతలు తమ పార్టీల్లోనే సామాజికాంశాన్ని విస్మరించినట్టయింది. బిజెపి స్పష్టమైన హిందుత్వ ఎజెండాతో వెళుతుండగా- దాన్ని ఎదుర్కొనే శక్తియుక్తులు ఏ పార్టీకీ లేనట్టు కనిపిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ సామాజిక పంథాను సొంతం చేసుకుంటే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం సామాజిక పార్టీలను, కమ్యూనిస్టు పార్టీలను కాంగ్రెస్ కలుపుకోక తప్పదు. ముందయితే కాంగ్రెస్ తాను సామాజీకరణం చెంది, తన తప్పిదాలను సరిచేసుకోవాలి. అందువల్ల ఆ పార్టీకి కాయకల్ప చికిత్స తప్పదు.
ఒకప్పుడు కాంగ్రెస్‌ను ఓడించే పార్టీ లేదు, కాంగ్రెస్‌ను కాంగ్రెస్సే ఓడించుకుంటుంది అనేవారు. అది నిజం కూడా. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవులనాశించే వారు అనేకమంది ఉండడం, వాళ్లంతా దాదాపుగా అగ్రకులాల వాళ్లే కావడం వాళ్లు ఒకర్నొకరు ఓడించుకుంటానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌లో ‘రీసెర్చి అండ్ డెవలపింగ్’ విభాగం ఉందో లేదో తెలియదు కానీ కాలానుగుణంగా ఓట్లు రాబట్టుకునే మెథడాలజీ, చరిష్మా గల నాయకత్వం లేకుండా పోయింది. తాను చేసిన మంచి పనులను కూడా చెప్పుకోలేని బలహీనత, మాటల గారడీ లేనందున ఇందిరాగాంధీ తర్వాత సమర్ధవంతమైన నాయకత్వం కరువైంది.
నవభారత నిర్మాణంలో నెహ్రూ పాత్ర గాంధీజీ కంటే ఎన్నో రెట్లెక్కువ. నెహ్రూ ఆశించిన సౌకర్యవంతమైన గ్రామీణ వ్యవస్థ గాంధీ ఆశించిన ఫ్యూడల్ గ్రామీణ వ్యవస్థ కంటే అభివృద్ధికరమైంది. గాంధీ కంటే అన్ని రంగాల్లోనూ ప్రగతిశీల భావాలు కలవాడు నెహ్రూ. అయినా కాంగ్రెస్ 70 ఏళ్లుగా గాంధీ జపమే చేస్తోంది కానీ నెహ్రూను అనుసరించడం లేదు. ఇది కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే అయింది. నెహ్రూ పంథాను, అంబేద్కర్ అణగారిన జాతుల బాటను కాంగ్రెస్ అనుసరించి ఉంటే బిజెపి అంతగా విజృంభించేది కాదు. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, ఆర్థిక సంస్కరణలు లాంటి ప్రగతిశీల కార్యక్రమాలు చేసినా, వాటిని చెప్పుకుని ఓట్లు పొందలేని దుస్థితిలో ఉన్నందున కాంగ్రెస్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
తెలంగాణలో గత మూడేళ్ల కాలంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓ ప్రాంతీయ పార్టీ చేతుల్లో ఘోరంగా ఓడిపోవడం గమనించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన పార్టీగా టిఆర్‌ఎస్ గెలవడం సహజమే అయినా, ఈ ఘోర ఓటమిలో కాంగ్రెస్ పార్టీ అమాయత్వం, తాను తెలంగాణ కోసం చేసింది కూడా చెప్పుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేని బలహీన పరిస్థితులను గమనించకుండా, రెడ్డి వర్గానికి చెందిన ఓ అయిదారుగురు తామే కాబోయే ముఖ్యమంత్రులమని ప్రకటించుకోవడం వంటి వన్నీ కాంగ్రెస్ ఓటమికి కారణాలయ్యాయి. నిజానికి తెలంగాణ ఉద్యమం బడుగు, బలహీన వర్గాల బాగుకోసం, ఆత్మగౌరవం కోసం, బహుజన కులాల విముక్తి కోసం జరుగుతున్న పోరాటమని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ముందుగానే ఊహించారు. దీనికి సంబంధించిన నివేదిక ఆధారంగానే ఆమె తెలంగాణ ఇచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు- కాంగ్రెస్‌లో విలీనమైతేనే తెలంగాణ ఇస్తామని టిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ చెప్పి ఉంటే ఆపరిస్థితుల్లో విలీనమయ్యేవాళ్లు. తెలంగాణ ఇచ్చింది తామే కాబట్టి గెలుస్తామన్న ధీమాతో కాంగ్రెస్ బోల్తా పడింది. తాము తెలంగాణ ఎందుకిచ్చామో కూడా బలంగా చెప్పుకోలేకపోయింది. తాము మొదటి నుంచీ తెలంగాణకు అనుకూలమేనని ప్రజలను నమ్మించలేకపోయింది. ఒక నిమ్న కుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా రెడ్డి సామాజిక వర్గం నుంచే ముఖ్యమంత్రి అవుతారని అనడం వల్ల బహుజన వర్గాల సానుభూతిని పొందలేకపోయింది. ఎన్నికల తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీగా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో ఏమాత్రం తెలివిగా పనిచేయకపోగా తానే రక్షణ స్థితిలోకి నెట్టబడుతోంది. ఇలా కాంగ్రెస్ తనకు తానే ఓటమిని తెచ్చుకుంటోంది. వందేండ్లకు పైబడిన చరిత్రను సగర్వంగా చెప్పుకోలేక పోవడానికి సరైన రీసెర్చ్ అండ్ అనాల్సిస్ లేకపోవడం, అప్‌డేట్‌గా తనను తాను మార్చుకోకపోవడం, సామాజికత వైపు ఆలోచించకపోవడం ప్రధాన లోపాలు.
కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావాలంటే సమూల మార్పులు రావాలి. ఇంతవరకు సెమీ మనువాద బ్రాహ్మణీయ దృష్టి కోణంలో వున్న ఆర్థిక విధానాలు బహుజన దృష్టి కోణంలోకి మారాలి. అన్ని రంగాల్లో సామాజిక దురన్యాయానికి గురవుతున్న బహుజన కులాల వారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పాలి. నిమ్న కులాలకు ఐచ్ఛికంగా అధికారాలు అప్పగించాలి. పీడిత కులాలకు, సామాజిక న్యాయం పొందని కులాలకు అధికారాలు అప్పచెప్పకుండా ఏదీ సాధ్యం కాదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటే పూర్వ వైభవం వస్తుంది తప్ప మూస పద్ధతిలో పోతే ఇక అంతే సంగతులు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే ఎస్సీ లేదా బిసిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి బహుజనవాద పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి. బిజెపిని ఎదుర్కోవాలన్నా ఇదే పద్ధతి అనుసరించి మహాకూటమిగా ఏర్పడాలి. ముందయితే కాంగ్రెస్ తనను తాను బహుజనీకరించుకోవాలి. సామాజీకరణం చెందాలి. దళితీకరణం చెందాలి. ఇదే ఆ పార్టీకి కాయకల్ప చికిత్స.

-డా. కాలువ మల్లయ్య