మెయిన్ ఫీచర్

సినీ రేడు సినారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుపాటను పరవళ్లు తొక్కించిన అద్వితీయ శైలి సినారేది.
తేటతెనుగు మాటలతో అద్భుతమైన భావాలను పలికించడం
అలవోకగా అలవరచుకున్న సినారే కలం నుంచి జాలువారిన వేలాది పాటలు వేటికవే సాటి. సాహితీ ప్రక్రియలో అనన్య సామాన్యమైన ప్రతిభను సంతరించుకున్న
సినారేకు తెలుగు పాట సరికొత్త ప్రతిభావేదిక అయింది. సినీ సాహితీ సామ్రాజ్యంలో ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీల ఏకఛత్రాధిపత్యం కొనసాగుతున్న తరుణంలో
‘నన్ను దోచుకుందువటే..’ అంటూ ఓ మెరుపులా మెరిసి సీనీసీమను తన బాట పట్టించుకున్న
అనితరసాధ్యుడు నారాయణ రెడ్డి.
*
భాగ్యనగర్ స్టూడియోకు వెళ్లిన సినారేకు ‘కలిసి ఉంటే కలదు సుఖం’ షూటింగ్‌కు వచ్చిన ఎన్టీయర్‌తో పరిచయం కావడం అనంతరం వందలాది పాటలకు, దశాబ్దాల అనుబంధానికి నాంది పలికింది. అప్పటికే సినారే ‘కర్పూర వసంతరాయలు’ చదివిన ఎన్టీయార్ ఆయన్ని సినిమా పాటల పట్ల ఆసక్తి ఉందా? అని అడగడం ‘ఒక్కటైతే రాయను.. అన్నీ రాయమంటేనే రాస్తాను’ అంటూ ‘విశ్వంభరుడు’ చెప్పడం సినీ జగత్తులో ఓ సువర్ణ శకానికి బీజాన్ని వేసింది. మబ్బులో ఏముంది అంటూ సినారే అప్పటికప్పుడే తన అలవోకగా తన సాహితీ సృజనను ఆవిష్కరించడంతో తన్మయమైన ఎన్టీయార్ చెన్నై వెళ్లిన వెంటనే ఆయన్ని పిలిపించారు. గులేబకావళి కథలో అన్నీ పాటలూ రాయించడమే కాకుండా తన ఇంట్లోనే అతిధిగా ఉండమన్నారు. ఇదంతా ఎందుకంటే.. ఓ బీజం వట వృక్షం కావాలంటే నారు, నీరూ పోయాలి. అందుకు అన్ని విధాలుగా అవకాశాలూ అందిరావాలి. ఎన్టీఆర్ పరిచయంతో తెలుగు సినిమా సింహద్వారం గుండా అడుగిడిన సినారే తన కలం దాటి ఏమిటో.. తన మాటల పదునేమిటో.. తన సృజన సత్తా ఏమిటో చూపించారు. ఎలాంటి పాటనైనా అలవోకగా రాయగలగడం సినారె అద్భుత ప్రతిభకు నిదర్శనం. మానవ జీవితంలో ఎన్ని భావాలు, పార్వ్శాలు ఉంటాయో వాటన్నింటినీ తన ఐదున్నర దశాబ్దాల సినీ పయనంలో ఆయన పండించారు. అరవైయవ దశకం నుంచి నిన్నటి అరుంధతి వరకూ సినారె సాహితీ గుబాళింపులు తెలుగు నేలను పరవశింపజేశాయి. పండిత, పామరులు సైతం ఔరా అనిపించే అద్భుతమైన సినీ గేయ సాహిత్యంతో సినారె విరాజిల్లారు. భావం, స్పష్టత, సరళత ఆయన ప్రతిపాటలోనూ కనిపిస్తుంది. సందర్భాన్ని భావగాఢతలోతుల్లోకీ తీసుకెళ్లే ఘనుడు సినారె.. ‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం..’ అని ఎవరు రాయగలరు జీవితాన్ని ఔపోసన పడితే తప్ప. అది తాతామనవడు సినిమాలోని సందర్భోచిత గీతమే అయినప్పటికీ బలమైన, బరువైన పదాలతో తోతైన భావాన్ని అందించడమంటే మామూలు విషయం కాదు. పాట ఎలాగైనా రాయొచ్చు.. కానీ ఇలాగే రాయాలి, ఇలాగే ఉండాలని నిర్వచించుకున్న సినారె ఆ నిర్వచన పరిధిని దాటలేదు. అందుకే ఎన్నో, ఎనె్నన్నో అద్భుతమైన భావస్ఫోరకమైన గీతాలను ఆయన అందించగలిగారు. తన సాహితీ ముద్రను బలంగా వేయగలిగారు. సినారెకు ముందువరకూ సాహిత్యానికి బాణీలు కట్టే పరిస్థితి ఉండేది. జంఝామారుతంగా సినీ సీమలో అడుగిడిన సినారె సరికొత్త ఒరవడిని సృష్టించారు. బాణీకి అణుగుణంగా పాటలు రాయడం ద్వారా తన ఖ్యాతిని, సృజనాత్మక పదునును మరింత పెంచుకోగలిగారు. చిట్టిచెల్లెలులోని ‘ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది’ అన్న మధుర గీతాన్ని ఎవరు మరచిపోగలరు. ఆ పాటను రాజేశ్వరరావు బాణీ చెబితే రాశారు. ఎందుకంటే ఆ పాటను అప్పటికప్పుడే రికార్డు చేయాల్సిన పరిస్థితి. నిర్మాతల నుంచి వత్తిడి. అలాంటప్పుడు సినారె లాంటి సృజనాదురంధరుడు దొరికితే సంగీత దర్శకులకు పండగే. క్షణాల్లో పాట అయిపోయింది. సుశీల, ఎస్పీ సుమధురంగా పాడేశారు. నలుగురు ఉద్దండుల కలయికతతో వెలుగు చూసిన ఆ పాట సినారే భావుకతకు చుక్కాని. కొత్త జంట మనోభావాలను ఎంత అద్వితీయంగా ఒలికించడంతో పాటు జీవితాన్నీ మూడుముక్కల్లో చెప్పేశారు. ‘ఈ రేయి తీయనిది అంటూ మొదలెట్టి.. ఈ చిరుగాలి మనసైనదంటూ మైమరిపిస్తూ ఈ హాయి మాయనిదే అంటూ మరింత ఉడికిస్తూ... ఇంతకు మించి ఏమున్నదంటూ.. సర్వాన్నీ చెప్పేయడం ఎంత అద్భుతమైన భావన. సందర్భోచితంగా పాటలు రాయడం.. వాటికి తన వ్యక్తిగత అనుభవాన్నీ రంగరించడం కూడా సినారెకే చెల్లింది. గులేబకావళి కథ సినిమా పాటలు రాయడం అయిపోయింది. ఇక ఎన్టీఆర్ ఇంటి నుంచి తన ఇంటికి వచ్చేయాలి. అప్పటికే ఆయనతో అనిర్వచనీయమైన ఆత్మీయత పెనవేసుకుంది. అలాంటి సమయంలో ‘రెడ్డిగారు ఇంకో పాట రాయాలి.. అంటూ ఎన్టీఆర్ సందర్భం చెప్పారు. ఇంకేముంది సినారేలో కవి విజృంభించాడు. ‘ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమని పోనూ..’ అంటూ అటు సినిమా సన్నివేశానికీ ఇటు తన వ్యక్తిగత పరిస్థితికీ ముడిపెడుతూ పాటను తేలికపాటి పదాలతో రాసేశారు. ఆ పాట ఇప్పుడు ఉన్నా.. ఓ అద్భుతమే. గుండెలోని బాధను బలంగా చెప్పగలగడం గొప్ప కళ. అది సినారె వంటి కలం యోధుడికే సాధ్యం. బాధను ఎంత బలంగా వ్యక్తం చేయగలుగతారో శృంగారాన్నీ అంతే హృద్యంగా మధురమైన పదాలతో ఒలికించడం సినారె సొంతం. నన్ను దోచుకుందువటే -అంటూ మొదలైన ఈ భావ స్ఫోరక గీతాల పరంపర అనన్యంగానే సాగింది. ‘చెలికాడు నినే్న రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా’ అంటూ ప్రేమికుడి తొందరని చెప్పిన ఆయన అదే క్రమంలో ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా అంటూ కట్టడీ చేస్తాడు. ఇలాంటి యుగళ గీతాలెన్నో ఎనె్నన్నో. ఘంటసాల, సుశీల సుమధుర గళం సినారె పాటలకు సరికొత్త భావాలంకారాన్ని అందించాయి. ‘పువ్వయి విరిసిన పున్నమి వేళ.. బిడియము నీకేలా బేలా’ అన్న మధుర భావన ఎవరికి సాధ్యం. తెలుగు మాటలోని మాధుర్యాన్ని, పరిమళాన్ని వంటబట్టించుకుంటే తప్ప అలాంటి మధుర భావాలు ఒలికి పడవు. అలాగే ‘మధుర భావాల సుమబాల మనసులో పూచే ఈ వేళ’అనడమూ సినారేకే సాధ్యమేమో! మానవ జీవన భిన్న స్రవంతులను తన భావజాలంతో మీటిన సినారె పాషాణంలో దాగిన భావాల్నీ ఒలికించారు. రాయిని గుండెతో పోలుస్తూ ఆ రాతి మాటున దాగిన భావాలనూ సినారే కలం వదల్లేదు ‘ఈ నల్లని రాలలో..’ అంటూ ఆయన రాసిన పాట అజరామరం. ఒక కవి దేన్నుంచైనా స్ఫూర్తి పొందుతాడనడానికి.. ఎంతటి కాఠిన్యంలోనైనా కారుణ్యాన్ని కురిపిస్తాడనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏమి కావాలి. ఆ పాటను సినిమాకోసం రాసుకోని సినారే ‘అమరశిల్పి జక్కన్న’ కోసం ఇచ్చేశారు. ఆ పాట సృష్టించిన భావ ప్రకంపనలు అన్నీ ఇన్నీకావు. ఘంటసాల నోట అద్భుతంగా పలికిన ఆ పాట సృజనాత్మక భావజాలానికి, ఓ కవికి ఉండాల్సిన భావానే్వషణా స్ఫూర్తికి తార్కాణంగా నిలిచేదే. ఎన్టీఆర్ అంటే జాన పదాలు. జానపదాల్లో పాటలంటే సినారే విరచితాలే అన్న భావం అరవైయవ దశకంలో బలంగా నాటుకుపోయింది. అగ్గి పిడుగు, పిడుగురాముడు, అగ్గిరాముడు, అగ్గిబరాటా, చిక్కడు, దొరకడు, రాజకోట రహస్యం ఎన్టీఆర్ చిత్రాలన్నింటికీ సినారేనే గీత రచయిత. వారి కలయిక మామూలు కలయిక కాదు. మధుర భావాల ప్రవాహం. అద్భుత సాహితీ సృజనకు తార్కాణం. ‘ఈ రేయి నీవు నేనూ ఎలాగైన కలవాలి..కొమ్మల్లో పాల పిట్ట కూత కూసిందో..చినదాన వనెదానా ఓ చిలిపి కనుల దానా వంటి పిడుగు రాముడు పాటలు ఎంత జనరంజకమో చెప్పలేం. ఆ పాటల్లో సినారే వాడిన పదాలు అనంతర కాలంలో ఇతర రచయితలూ అందిపుచ్చుకున్నారు. నను వలచిన చెలివని తెలుసు..నీ మదిలోన ఏముందో అది నీకు తెలుసు అంటూ రాజకోట రహస్యంలోని యుగళ గీతం ఎన్నిసార్లు విన్నా తనివితీరనిదే. కారణం ఇందులో సినారే చేసిన ప్రయోగం. ప్రియుడి మదిలోని భావాలను ప్రేయసి చెబితే..తన గురించి ప్రియురాలు ఏమనుకుంటోందో ప్రియుడు చెప్పడం. అప్పట్లో ఇదో భిన్నమైన సినీ సాహితీ ప్రక్రియే. ఎన్టీఆర్ జానపద సినిమాలన్నీ జనరంజకం కావడానికి సినారే పాటలు ఎంతగా దోహదం చేశాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పదబంధనాలతో కూడుకున్న పాటల్ని రాయడంలోనూ సినారే దిట్ట. అనిర్వచనీయ భావాన్ని ఎంత హృద్యంగా ఒలికిస్తారో..‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన..’అంటూ పదబంధనాలతో కూడిన పాటనూ అంతగానూ రక్తికట్టించగలరు. చెల్లెలి కాపురం చిత్రంలోని ఆ పాట సినారే భావ పరంపరకు, పదాలపై ఆయనకు ఉన్న పట్టుకు నిదర్శనం. అలాగే ‘సంగీత సాహిత్య సమలంకృతే..’అంటూ సంగీతం, సాహిత్యం సరస్వతికి రెండు పార్శ్వాలంటూ ఆయన రాసిన పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపించేదే. అమలిన శృంగారాన్ని రసరమ్యంగా అవిష్కరించిన సినారే ‘మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం అంటూ ఓ చారిత్రక పట్టణ వైశిష్ట్యాన్ని కళ్లకు కట్టారు. బాలరాజు కధ చిత్రంలోని ఈ పాట అప్పట్లో ప్రతివారి నోట నానినదే. మహాగాయని ఎస్ జానకి ఆ పాటను ఎంత అద్భుతంగా పాడారో చెప్పడానికి మాటల్లేవు. అలాగే అదే సినిమాలో..సినారే రాసిన మరోపాట ‘గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి’అన్నది. ఆ పాటలోని ఆర్ద్రతను తన పదాల ద్వారా సినారే ఎంత బలంగా పలికించారో జానకి అంతగానూ గుండెలోతుల్లోంచి ఆలపించారు. కొత్త ప్రయోగాలు చేయడంలో సినారే దిట్ట. ‘అటు పానుపు ఇటు నువ్వు’అన్న అద్భుత గీతం ఇందుకు నిదర్శనం. భిన్నంగా పాట రాస్తానని సి పుల్లయ్యను కలిసి సినారే ఒప్పించారు. ఘంటసాల, సుశీల గళ మాధుర్యం ఆ పాటను అద్భుతమైన రసగుళికగానే మార్చింది. అలాగే దుర్యోధనుడికి పాట. ‘చిత్రం భళారే విచిత్రం అంటూ సాగే ఆ పాటలో ‘సదమదవౌమామదిలో’అన్న మాట ఉంటుంది. ఇదేమిటని అడిగితే ‘సతమతానికి రాజరికరూపం’అంటూ సినారే జవాబిచ్చారు. దానవీర శూరకర్ణలోని ఆ పాట గురించి చెప్పేదేముంటుంది. అదే సినిమాలో ‘ఏ తల్లి నినుకన్నదో నేను నీతల్లినైనానురా’అంటూ కర్ణుడి గురించి అద్భుతంగానే ఆ తల్లి మనోభావాలను సినారే పండించారు. తన కొడుకును ఓ తల్లి ఎలా చూడాలనుకుంటుందో మనోహరంగా చెప్పారు. అంతకు ముందు శివాజీ గణేశన్ ‘కర్ణ’చిత్రంలోనూ సినారే రాసిన మరపురాని గీతం ‘గాలికి కులమేది..’అన్నది. అందులో తాను కులహీనుడినన్న భావనను కర్ణుడిలో తొలగించేందుకు అన్వయింపుల సమన్వయంగా సాగే ఆ పాట సినారే ఏమిటో చెప్పేదే. గాలికి, నీటికి, నింగికీ కులమేది అంటూ సినారే తన భావ విశ్వరూపానే్న ప్రదర్శించారు. ఏకవీర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందులోని మాట, పాట సినారేదే. ‘తోటలో నారాజు తొంగి చూసెను నాడు..నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు’అంటూ అన్నది వినూత్మ భావ శోభిత గీతం. మదిని కదిలించే మనోరంజితం. స్నేహం గురించీ సినారే భావ పరంపర పరుగులే పెట్టింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ మంచి మిత్రుల భిన్న నేపథ్యాన్ని ఆవిష్కరించిన సినారే ‘నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదంటూ’ బలమైన భావానే్న సంధిస్తాడు. అలాగే ‘మంచిని పెంచిన మనిషినీ ఏ వంచన ఏమీ చేయదంటూ’మంచితనానికి ఉన్న గొప్పతనాన్ని చెబుతాడు. అలాగే ‘స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం’అంటూ స్నేహం పవిత్రనూ అద్భుతంగానే చాటిచెప్పారు. చరిత్రను తన పాటల ద్వారా ఆవిష్కరించడంలోనూ సినారే తనదైన మార్కు వేసుకున్నారు. ‘ఆడవే జలకమ్ములాడవే..’తుంగభద్రతానది గొప్పతనాన్ని నాటి రాజుల రాజసాన్నీ సింహావలోకనం చేస్తారు. సత్యభామ కృష్ణుల యుగళం అంటే సినారే రాయాల్సిందేనన్నట్టుగా ఆయన తన ముద్ర వేసుకున్నారు. శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ తులాభారం ఇందుకు మచ్చుతునకలు. ‘అలిగితివా చెలీ సఖీ అలుక మానవా..’అంటూ సాగే ఆ పాట ఓ మనోహర దృశ్యమే. తెలిసిందిలే తెలిసిందిలే అంటూ కవ్వించినా..నీ మది చల్లగా స్వామి నిదురపో అంటూ లాలించినా..వస్తాడు నా రాజు ఈ రోజు అంటూ ఎదురుచూపుల ఆశను కళ్లకు కట్టినా..తోటలోకి రాకురా తుంటరి తుమ్మెద అంటూ సున్నితంగా తిరస్కరించినా, కంటేనే అమ్మ అని అంటే ఎలా అంటూ అమ్మతనంలోని మాధుర్యాన్ని ఒలికించినా సినారేకె చెల్లింది. సినారే సినీ కల లాస్యం వేయి భావాల శిఖర సమానం. అన్నింటా అందెవేసిన కలం ఆయనది. ఆయన చూడని సినీ సాహితీ పార్శ్వం లేదు. ఆయన భావానికి అందని బాధ, ఆవేదనా, హాస్యం లేదు లాస్యం లేదు. అందుకే ‘నీటి లోన నీడలోన నేనె ఉన్నాను’లే అంటూ నిత్యం ఆయన పాటలు మనల్ని అలరిస్తూనే ఉంటాయి, సినీ సాహిత్య విశ్వంభరుడికి ఇవే అక్షర నివాళులు..

చిత్రాలు.. సినారె, మహానటుడు ఎన్టీఆర్‌తో ముచ్చటిస్తూ..

బి. రాజేశ్వర ప్రసాద్