మెయిన్ ఫీచర్

అక్కరకు రాని అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- బాబ్జీ, సినీ దర్శకుడు

ఏ అవార్డయినా సకాలంలో వచ్చినప్పుడే దానికి విలువ ఉంటుంది. తోచినప్పుడో.. లేదా వీలు కుదిరినప్పుడో అవార్డులను ఇవ్వడం వల్ల వాటి ద్వారా ఉద్దేశిత ప్రయోజనం నిర్వీర్యమవుతుంది. సకాలంలో వైద్యం చేస్తేనే రోగం కుదిరినట్టు.. సరైన సమయంలో మన సినిమా ప్రతిభను గుర్తిస్తూ అవార్డులిచ్చినప్పుడే ఆరోగ్యకర, సమాజానికి మేలే చేసే సినిమాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంతేగానీ, మూడు, నాలుగేళ్లకోసారి గంపగుత్తగా అవార్డులు యిచ్చేసి చేతులు దులుపుకోవడం ధోరణినే ప్రభుత్వం అవలంబిస్తోంది. ఇలా ఎప్పుడో వేడి చల్లారినప్పుడు అవార్డులు ఇచ్చినందువలన ఆ అవార్డులను, షీల్డులను, సన్మాన పత్రాలను తీసుకెళ్లి అలమరాల్లో పెట్టుకోవడానికి, షోకేసుల్లో పెట్టుకోవడానికే తప్ప ఫలితమేమి కనిపించడంలేదు! నిర్ణీత కాల వ్యవధిలో ఇలాంటి అవార్డులు ఇవ్వడం వల్ల కచ్చితంగా ఉపయోగం ఉంటుంది. వీటిని అందుకున్న వారిలో తమ ప్రతిభకు పదునుపెట్టుకోవడానికి..రాని వారిలో తమ సినిమాల్లో ఉన్న లోపాలేమిటో తెలుసుకోవడానికి వీలుంటుంది. దయచేసి రుూ వాస్తవాన్ని ప్రభుత్వం గ్రహించాలి! పరిశ్రమ పెద్దలైనా ప్రభుత్వానికి అర్థమయ్యేలా వివరించాలి! అలా చేయలేనప్పుడు ఈ అవార్డుల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మానేసి అవార్డులనే రద్దుచేయాలి!
--

చాలాకాలంగా రుూ తంతు నడుస్తుంది. ఇలాంటి తప్పు జరిగినప్పుడల్లా ‘‘సారీ.. సారీ..ఇకముందు యిలా జరక్కుండా చర్యలు తీసుకుంటాం అనడం, మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడం ప్రభుత్వానికి చర్విత చరణం అయిపోయింది. ఆ క్రమంలో యిప్పుడు కూడా అదే జరిగింది. 2011 నుంచి ఇయ్యవలసిన అవార్డులను పెండింగ్ ఫైల్స్ జాబితాలో జతగూర్చేసారు. 2011, 2012, 2013, 2014, 2015 సంల అవార్డులన్నీ యింతవరకు ఇవ్వలేదు! ఇలా ఇంకెన్ని సంవత్సరాలు పేరబెడతారో అర్థం కావడంలేదు.
ఆంధ్రప్రదేశ్ ఒక్కటిగా వున్నప్పటి అవార్డులు ఎవరివ్వాలి, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాతి అవార్డులు ఎవరివ్వాలి.. అని ప్రభుత్వాలు, అసలు యిస్తారా లేదా అని సినీ పరిశ్రమ మీనమేషాలు లెక్కించుకుంటూ కూర్చోవడం తప్ప ఎవరూ ఏ అడుగు ముందుకు వేయడం లేదు. ఇదో నవ్వులాటలా మారిపోయేలా వుంది! ఇప్పటికే పరిశ్రమలో చాలామందికి ప్రభుత్వ అవార్డులపై ఆసక్తి చచ్చిపోయి చాలా కేలండర్‌లుగా మారిపోయాయి.
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంది అవార్డుల పేరిట అవార్డులు ఇచ్చేది! ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి ‘నంది అవార్డు’ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వదిలేసి కొత్తగా ఏర్పడిన తమ తెలంగాణా రాష్ట్రానికి కొత్త పేరు పెట్టుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకుగాను ‘పాల పిట్ట అవార్డ్స్, ఏకశిల అవార్డ్స్, రామప్ప అవార్డ్స్, కాకతీయ అవార్డ్స్’ వంటి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వీటిలో తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట పేరుతో ‘పాలపిట్ట అవార్డ్స్’ని అందజేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే అవార్డులకు పేరు నిర్ణయించేందుకు గాను విశ్రాంత ఐ.ఏ.ఎస్ అధికారి రమణాచారిగారితో ఒక కమిటీ కూడా వేశారు!
ఈమధ్య తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధి అజెండాగా రెండుసార్లు పరిశ్రమ పెద్దలతో జరిపిన సమావేశంలో ప్రభుత్వ అవార్డులను గురించి చర్చ వచ్చినపుడు ఇప్పటివరకు అనగా 2011 నుంచి 2015 వరకు ఇవ్వవలసిన అవార్డులను రెండు తెలుగు ప్రభుత్వాలు కలిసి చేస్తే బాగుంటుంది అని పరిశ్రమ పెద్దలు కోరడం, ప్రభుత్వం ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 2016 ఉగాదికి అవార్డులు ఇస్తామని ప్రకటించడమూ జరిగింది. కానీ మళ్లీ షరా మామూలేలాగా ఆ ఊసే లేదు. ఉగాది వచ్చింది వెళ్లిపోయింది. ప్రభుత్వ అవార్డుల ఊసే లేదు.
ప్రామాణికత ఎక్కడుంది?
అవార్డులు ఇవ్వడంలో కూడా ప్రామాణికత,నిజమైన కొలమానం ఉండడం లేదు. పార్ట్ వన్ పేరిట రిలీజయిన ‘సగం సినిమా’కే జాతీయ అవార్డు యిచ్చేస్తారు! వ్యక్తిత్వం లేని హీరో హీరోయిన్‌ల పాత్రలకు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులిచ్చేస్తారు? ప్రజలకు ఏ సందేశం యివ్వని చిత్రాలకు అవార్డులిచ్చేస్తారు? నిబంధనలు అస్సలు పాటించరు? సినిమా వాళ్ళకు అవార్డులు యిచ్చే సినిమా ఫంక్షన్‌లకు సినిమా వాళ్ళను పిలవరు!
ఉదాహరణకు 1996లో నంది అవార్డుల జ్యూరీకి అధ్యక్షుడిగా స్వర్గీయ గుమ్మడి గారు వ్యవహరించినపుడు తమ పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోలేని ఆర్టిస్టులకు అవార్డులు ఇవ్వరాదు, అలాగే ఇతర భాషల నుంచి రీమేక్ లేదా ఫ్రీమేక్ చేసిన చిత్రాలకు అవార్డులు ఇవ్వరాదు అనే నిబంధనలను నంది అవార్డుల నియమావళిలో చేర్చారు! ఆ మేరకు ఆ ఏడాది ఉత్తమ నటి కేటగిరికి ‘శుభసంకల్పం’ చిత్రంనుంచి ఆమని.., ‘సొగసు చూడతరమా’ చిత్రం నుంచి ఇంద్రజలు పోటాపోటీగా నిలవగా, ఆ ఇద్దరిలో ‘శుభసంకల్పం’లో ఆమని తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నదనే పాయింట్‌ను ప్లస్‌గా తీసుకొని ఆమెను ఆ ఏడాదికి ఉత్తమ నటిగా ప్రకటించారు! దానితో ఎలాగైనా నంది అవార్డును పొందాలనే లక్ష్యంతో ‘ఇంద్రజ’ కష్టపడి తెలుగు భాష నేర్చుకొని ‘నల్లపూసలు’ అనే చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది..! ఆ క్రమంలో ఆ తదుపరి 1997 సంవత్సరంలో ‘పవిత్రబంధం’ చిత్రం నుంచి సౌందర్య, ‘నల్లపూసలు’ చిత్రం నుంచి ఇంద్రజ ఉత్తమ నటి కేటగిరికి పోటీపడగా, ఆ క్రిందటి సంవత్సరమే రాసుకున్న నియమ నిబంధనలను తుంగలో తొక్కి తన పాత్రకు ఎవరితోనో డబ్బింగ్ చెప్పించుకున్న ‘సౌందర్య’కు ఉత్తమ నటి అవార్డును అందజేసి, స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న ఇంద్రజకు అవార్డు ఇవ్వలేదు. కనీసం జ్యూరీ అవార్డు కూడా ఇవ్వలేదు!
అలాగే రీమేక్ చిత్రాలకు అవార్డు ఇవ్వరాదు! కానీ అదే సంవత్సరం విడుదలైన హాలీవుడ్ రీమేక్ చిత్రం ‘గన్‌షాట్’కు అవార్డు ఇచ్చేశారు. అదే 1997 సంవత్సరం ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నూతన దర్శకుడు అవార్డులను ఒక్కరికే ఇచ్చారు. ఉత్తమ దర్శకుడు అనే స్థాయి అవార్డు ఇచ్చాక ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు అతనికే ఇవ్వకుండా మరో దర్శకుడికి ఇచ్చివుంటే ఇద్దరిని ప్రోత్సహించినట్లు ఉండేది..!
అలాగే అవార్డులు ఇవ్వడంలో కూడా ఒక తప్పు జరుగుతుంది! అవార్డుల కేటగిరిలో ‘ఉత్తమనటుడు’ అనే కేటగిరికి ఆయా సినిమాలలో హీరోలుగా నటించిన వారినే లెక్కలోకి తీసుకొని వారిలో ఒకరిని ఉత్తమ నటుడిగా ఎన్నుకుంటున్నారు. అంటే ఉత్తమ నటుడంటే కేవలం హీరో మాత్రమేనా? ఉత్తమనటి అంటే కేవలం హీరోయిన్ మాత్రమేనా? కాదు, ఒక చిత్రంలోని ఇతర పాత్రధారులు కూడా ఉత్తమంగా, అద్భుతంగా నటించి వుంటారు. అందుకే ఒక చిత్రంలో వివిధ పాత్రలు ధరించిన అందరినీ, అందరి నటనను కొలమానంగా తీసుకొని వారినుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ నటీమణిలనుఎన్నుకోవాలి. అంతేగానీ
కేవలం హీరో, హీరోయిన్‌ల నుంచే కాదు. హీరో హీరోయిన్‌లకు అవార్డులు ఇవ్వాలనుకున్నపుడు ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ కథానాయికల పేరిట అవార్డులు ఇవ్వాలి! ఉత్తమ నటుడు వేరు ఉత్తమ కథానాయకుడు వేరు!
అలాగే ఉత్తమ చిత్రాలకు ఇచ్చే ప్రోత్సాహక పారితోషికం కనీసం 20 లక్షలు ఉండేలా పెంచాలి. కనీసం 15 లక్షలన్నా యివ్వాలి. అవసరమైతే రుూ డబ్బును స్పాన్సర్‌షిప్ ద్వారా పొందవచ్చు. ఇలా పెంచితే సినిమాలో నష్టం వచ్చిన నిర్మాతలకు ఆ డబ్బు కొత్త ఊపిరిపోస్తుంది! మరో మంచి సినిమా తీయడానికి ధైర్యం చేసే పరిస్థితి వుంటుంది. అవార్డు సినిమాలకు షీల్డులు, శాలువలు తప్ప మరేమీ రావనే ఆలోచనతో ఆ వైపు అడుగులు వేయడానికే భయపడే నిర్మాతలు మంచి సినిమాలవైపు పరుగులెత్తి వస్తారు. ఇటీవల ఓ పసిపాప తెలంగాణ గురించిన చరిత్రంతా ఎక్కడా తడబడకుండా టకటకా చెప్పేయడంతో ఆనందపడిపోయిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఆ పాపకు 10 లక్షల నూట పదహార్లు బహుమతిగా యిచ్చిన చరిత్ర మన కళ్ళముందు వుంది! అలాంటి హృదయంగల ముఖ్యమంత్రి కోట్లు పెట్టి తీసే మంచి సందేశాత్మక ఉత్తమ చిత్రాలకు ఓ 20 లక్షలు ఇవ్వాలనుకుంటే అది ఆయనకో లెక్క కాదు. ఐతే ఆయనకు ఆ ఆలోచన రావాలి! అలాంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి లభిస్తే అద్భుతమైన చిత్రాలు రూపొంది మన తెలుగు రాష్ట్రాల కీర్తి పతాకం సినీ ప్రపంచంలో రెపరెపలాడుతోంది. దానికి తగ్గట్టుగానే ఆదాయం కూడా కలిసి వస్తుంది. రెండు రాష్ట్రాలలో సినీ పరిశ్రమ దిగ్విజయంగా వర్థిల్లుతుంది. ఈ విషయంలో ఫ్రాన్స్, హాంకాంగ్, చైనా వంటి దేశాలను మన రాష్ట్రాలు, మన ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటారని ఆశిద్దాం.