మెయిన్ ఫీచర్

సెల్‌ఫోన్లూ, కంప్యూటర్లూ పిల్లలకి అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటి జబ్బుల్లో ప్రధానమైన ‘మయోపియా’ (‘షార్ట్ సైటెడ్‌నెస్’- హ్రస్వదృష్టి) 3-5 ఏళ్ళ చిన్నపిల్లల్లోనే ఎందుకొస్తోంది? తమ వద్దకొస్తూన్న కంటి రోగుల్లో 25 శాతంమంది వీళ్లే ఎందుకవుతున్నారు? కంటి డాక్టర్లే ఈ ప్రశ్నలు వేసుకొని తామే సమాధానం చెప్పుకుంటున్నారు. దీనిక్కారణాలు రెండు.
ఒకటి పిల్లల తల్లులు, రెండు ప్రభుత్వం.
ముందర ప్రభుత్వా ల్ని తీసుకుందాం. ప్రభుత్వాలు పిల్లల ఆరోగ్యం విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టటంలేదు. పిల్లలు గడిపేది స్కూల్లో. ఆ స్కూళ్లలో 65 శాతం సూర్యకాంతి సరిగ్గా సోకనివే. 70 శాతం స్కూళ్లు పిల్లలు ఆడుకునే ఏర్పాట్లు చెయ్యవు. మా చిన్నతనంలో స్కూలు ఆటస్థలంలో గేమ్సు టీచరు మా అందరికీ హాజరు తీసుకునేవాడు. ప్రతివాడూ ఏదో ఒక ఆట ఆడాల్సిందే. కనీసం కుస్తీపట్టు అయినా పట్టాలి. ఇదంతా సాయంకాల సూర్యకాంతిలో జరిగేది. ఇందుకోసం ఆటస్థలం ఉండేది. టైమ్‌టేబిల్‌లో వారానికి మూడు రోజులు ఆఖరి పీరియడు ఆటల పిరియడు అని ఉండేది. మిగతా మూడు రోజుల్లో మోరల్ క్లాసు క్రాఫ్టు ఉండేవి. మాలోంచి ఇల్లా వచ్చినవాళ్లే (తెలుగు మీడియంలోనే) ప్రిన్సిపాళ్లూ, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, ఎయిర్‌ఫోర్సు ఆఫీసర్లూ వగైరా అయ్యారు. మాలో ఇంచుమించు ఎవరికీ ఈ ‘మయోపియా’ రోగం లేదు. అసలు స్కూలు గదులే అగ్గిపెట్టెల్లాగా రెండో అంతస్థులోనో మూడో అంతస్థులోనో గాలీ వెలుతురూ లేకుండా ఉండటమే. లేదా ఆవులూ పందులూ తిరిగే గల్లీల్లో చెత్త కుప్పలమధ్య మంత్రిగారి కంట్రాక్టరు బావమరిది కట్టిన స్లాబులోంచి నీళ్లు కారే బిల్డింగుల్లో ఉండడమే. గవర్నమెంటు స్కూళ్ళు ఎంత అధ్వాన్నంగా ఉంటున్నాయో, అది పోలికగా తీసుకొని ప్రైవేటు స్కూళ్లు కూడా అంతే అధ్వాన్నంగా ఉంటున్నాయి. ప్రైవేటు స్కూళ్ళు డబ్బు పిండటంలో మాత్రం అమోఘమైన నైపుణ్యం కలవి. ‘బొట్టులేనిపాడు’ అనే గ్రామం ఒకటుందనుకుందాం (కొల్లేరులో ‘చెట్టున్నపాడు’ ఉంది). అందులోని ‘ఇంటర్నేషనల్ స్పెషల్ ఐ.ఐ.టి టెక్నోఎలిగెంట్ పబ్లిక్ స్కూలు’ అని ఒకటి వస్తుంది. వాళ్ళు డబ్బు బాగా పిండి పిల్లల్ని మొదటిరోజునే కంప్యూటర్ ముందు కూర్చోబెడతారు. ఆటలుండవు, సూర్యకాంతి ఉండదు. కనుక ఆ పిల్లలికి రెండు కళ్లకూ మయోపియా ఖాయం. ‘ఇదేమిటంటీ?’ అని అడిగితే, ‘ఏం మీ పిల్లాడు అమెరికా వెళ్ళక్కర్లేదా? కడుపులో పడగానే బుక్ చేసుకున్నారు గదాని కనె్సషన్‌తో సీటిచ్చాం. కాదంటే తీసుకుపోండి’ అని సమాధానం.
ఐఐటియన్ కానివాడు బతకలేడా? మోదీగారు ఐఐటియన్నా? అక్షరాలే రాని కుర్రాడి కళ్లముందు కంప్యూటర్ పెట్టి వాడి కళ్లు పోగొడుతూన్న ఈ స్కూళ్లమీద గవర్నమెంటు కఠినంగా ఎందుకు వ్యవహరించదు? కాగా అసలు గవర్నమెంటే తన స్కూళ్ళని పిల్లల్ని ఆకర్షించే విధంగా, వాళ్ళ కళ్ళు, ఇతర ఆరోగ్యాలు పాడవ్వని పద్ధతిలో ఎందుకు నడపదో అర్థం కాదు.
ఇంక తల్లుల విషయం. మా చిన్నతనంలో స్కూల్లో ఆటలు ఆడి ఆడి అలసి సొలిసిపోయి ఇంటికెళ్లగానే వేన్నీళ్ల స్నానం చేసేవాళ్లం. ఆప్యాయంగా అమ్మ దగ్గర కూర్చొని పెట్టిన అన్నం తిని ఒక గంట చదువుకొనేవాళ్లం. అక్కతోనో, తమ్ముళ్లతోనో ‘నీకేం రాదంటే నీకేం రాదు’ అని వాదించుకొని జయించి (లేక ఓడిపోయి) గాఢంగా నిద్రపోయేవాళ్లం.
ఇవ్వాళ ఏ ఒక్క ఇంట్లో అయినా ఈ దృశ్యం ఉందా? పిల్లలకు ఆకళ్లూ,
నిద్రలూ ఉన్నాయా?
కుర్రాడు ఇంటికెళ్లి తన బాగోగులు తను చూసుకోవలసిందే. తల్లి వాడితో, ‘‘టేబిల్‌మీద అన్నం ఉంది, పెట్టుకు తినరా’’ అంటుంది. ఎందుకంటే ఆవిడ
తన సెల్‌ఫోన్‌తో బిజీ. అసలు అమ్మే ఇంట్లో ఉండ దు. ఎందుకంటే ఆవిడ ఉద్యోగస్తురాలు. అక్కా తమ్ముళ్లూ అందరూ ఎవరి సెల్‌ఫోన్లలో వాళ్లు బిజీ. ఏ ఇద్దరిమధ్యా మాటలుండవు- ఆప్యాయతలూ, వాదించుకోవటాలూ, అనుభూతులూ అన్నీ హుష్ కాకియే. ఆవిరైపోయాయి!
ఫోన్ వాడటం తెలీని కుర్రాడు టీవీ రిమోట్ పట్టుకుని టీవీకి కళ్లు ఆనించి టామ్ అండ్ జెర్రీ చూస్తూ కూర్చుంటాడు. వాడి అక్క, తండ్రి కంప్యూటర్ ముందు కూర్చొని ప్లేస్టేషన్ ఆడుతూంటుంది- టీవీకి దగ్గరగా మొహం పెట్టి. ఇద్దరికీ ఏ ఆటలూ లేవు. ఇరుగుపొరుగుల్తో కలిసికట్టుతనం లేదు. ఎవడు ఎవడో!
తల్లి షాపింగ్‌కు వెళ్లబోతూ ఉంటుంది.
బిడ్డ తనూ వస్తానని పేచీ పెడుతుంది. వెంటనే తల్లి తన రెండో స్మార్ట్ ఫోను లేదా లాప్‌టాప్ దానికిచ్చి ‘‘చూసుకుంటూ ఉండు. నేను గంటలో వచ్చేస్తా’’
అని వెళ్లిపోతుంది. ఇది మంచిది కాదు. ఇక పిల్ల వాటితోనే కాలక్షేపంలోకి దిగుతుందని గ్రహించాలి.
తల్లి అన్నానికి పిలిచినా ఇద్దరు పిల్లలూ రెండు స్మార్ట్ఫోన్లతోనూ
బిజీగా ఉంటారు. తల్లి అరుస్తుంది. ‘‘నేను బయటికెళ్లాలి, మీరు రాకపోతే నేను వైఫై పాస్‌వర్డ్ మార్చేస్తా’’ అని బెదిరిస్తే సరిపోదు. దానికి అలవాటు పడకుండా తల్లి చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆదివారంనాడు పిల్లలూ వైఫై పాస్‌వార్డ్ మార్చేసుకుని గదిలో తలుపేసుకుని కూర్చుని ఫోన్లు మొహాల దగ్గర పెట్టుకుని ఎవరి ఫోను లోకంలో వాళ్లుంటారు. ఇవ్వాళ ఆరేళ్ల పిల్లలకి కూడా ఫోన్లు, లాప్‌టాప్‌లూ, కంప్యూటర్లూ తెలుసు. ఈ విషయంలో తల్లులే వాళ్లలో ఆసక్తి కలిగించకుండా, అదే లోకం అని జీవించకుండా పెంచాల్సిన అవసరం ఉంది.
కళ్ల జబ్బులు రాకుండా ఎల్లా ఉంటాయి?
తక్కువ కాంతిలోనో, దగ్గరనుండో ఈ పనిముట్లను చూస్తూ ఉండటంవల్ల కంటి గుడ్డు పెరుగుదలలో మార్పు వుంటుంది. ఆ మార్పువల్ల మెల్లకన్ను వచ్చే ప్రమాదం కూడా ఉంది. తమ పిల్లలకి ఈ రకమైన కంటి రోగాలు రావాలని తల్లులు కోరుకుంటున్నారా? లేదా, వచ్చినా ఫర్వాలేదు, వారు (లేక అది) ఇండియా ప్రెసిడెంటో అమెరికా ప్రెసిడెంటో అయితే చాలని అనుకుంటున్నారా? రాజస్థాన్ బి.జె.పి మంత్రి ఒకాయన ‘‘ఆడపిల్లలకి స్మార్ట్ఫోన్లు ఇవ్వ కూడదు’’ అన్నాడు. ఎందుకంటే స్మార్ట్ఫోన్ల వల్ల ఆడపిల్లలకు తలెత్తుతున్న ఇబ్బందులను గమనించి ఆయన అని ఉంటారనుకుంటా. గాడ్జెట్లు వాడకంలో డిగ్రీలోపల ఉన్న పిల్లలని తల్లిదండ్రులు తప్పక అదుపు చేయాలి! ముఖ్యంగా స్కూలు పిల్లలని అదుపు చేసి తీరాలి!
తమ పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలని కోరుకునే తల్లులు వాళ్ల ఎదుట విరివిగా తాము ఫోన్లు వాడటం మానేయాలి. డిగ్రీలో చేరాక అవసరమనిపించే లాప్‌టాపులు, కంప్యూటర్లు పద్ధెనిమిదేళ్ల వయస్సులోపల వాళ్లకి తల్లులెందుకివ్వాలి?.. ఇంకా రోజుకు రెండు గంటలైనా ఎండలో ఉండేట్టుగా ఆటలాడించే స్కూల్లో వాళ్లని చేర్పించాలి. ఆటలాడించని స్కూల్లో చేర్పించకూడదు. ‘ఐ.ఐ.టి స్కూలు’ అన్నదాంట్లో అసలు చేర్పించకూడదు. అది పిల్లల్ని ఐఐటియన్ చేయటం దేవుడెరుగు, గుడ్డివాళ్లను చెయ్యటం మాత్రం ఖాయం! ఇరుగుపొరుగుల్తో స్నేహ సంబంధాలను పెంచే ఇళ్లమధ్యనే తాము కాపురం ఉండాలి. ‘కోటి పెట్టి కొన్నాం కాబట్టి దూరంగా ఉండాల్సొచ్చింది’ అని అనటం తమ పిల్లల భవిష్యత్తుకు నష్టం కలిగించటమే. స్మార్ట్ఫోను వాడటంలోనూ, ఉద్యోగం చేసే మహిళలు తమ పిల్లల పెంపకంపట్ల శ్రద్ధ చూపాలి. ఎందుకంటే తల్లి చూస్తుందికదా అని పిల్లలూ స్మార్ట్ఫోన్ చూడటంలో మునిగిపోతారు.

మరివ్వాళ 3-5 ఏళ్ల పిల్లలే స్కూల్లో చేరిన రోజునే బోర్డుమీద టీచరు వేస్తూన్న బొమ్మను చూడలేకపోతున్నారేమిటి? చేత్తో పట్టుకున్న పుస్తకాన్ని కళ్లకి ఆనించి పెట్టుకుని చూస్తున్నారేమిటి?..కొంతమంది పిల్లలికి మైనస్ మూడు పవరు ఉంటోందిట! ఐదేళ్ల కుర్రాడికి ఇంత తీవ్రమైన పవరా! వాడి తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోకపోతే ‘యాంబ్లియోపియా’ (అసలు కళ్ళు చాలావరకు కనిపించకపోవటం) రావటం ఖాయం. దీనికంతకీ కారణం ఏమిటి?- సూర్యకాంతి పిల్లల కళ్లకీ ఒంటికీ తగలకపోవటమే. ఆటస్థలంలో వాళ్లు తిరగకపోవటమే. అంటే బడులకు ఆటస్థలాలు లేకపోవటమే.

జరుగుతున్నదేమిటి? గవర్నమెంటులే తమ స్కూళ్లని పట్టించుకోవటంలేదు. అసలు మూసేసే దశకు చేరుకున్నాయి కూడా. కర్నాటక ప్రభుత్వం తన స్కూళ్లను మూసేస్తుందట. ఎందుకంటే పిల్లలు చేరటంలేదట! రేపో మాపో మన ప్రభుత్వం కూడా ఆ పని చేస్తే మనం ఆశ్చర్యపోనక్కరలేదు. ఎలాగూ తెలుగు మీడియంకు తట్ట తగలేయబడింది కదా!

- గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు 9885798556