మెయన్ ఫీచర్

ఆర్థిక వ్యవస్థకు గోమాత ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా దృష్టిలో ఒక గోవుని చంపడమంటే ఒక మనిషిని హత్య చేసినంత పాపం చేయడమే.. స్వరాజ్య ఉద్యమం కన్నా గోరక్షా ఉద్యమమే నాకు అత్యంత ప్రధానమైనది..’ అని స్వాతంత్య్ర సంగ్రామ కాలంలోనే జాతిపిత గాంధీజీ అన్నారు.
గోవధ విషయంలో మన దేశంలో దశాబ్దాల తరబడి ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. సుప్రీం కోర్టు సూచనల మేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పశు విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను కొందరు తప్పు పట్టగా, మరికొందరు స్వాగతించారు. ఇదే సమయంలో రాజస్థాన్ హైకోర్టు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని సూచించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గోవధకు పాల్పడే వారికి యావజ్జీవ శిక్ష విధించాలని, గోరక్షణ బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్‌దేనని కూడా హైకోర్టు ప్రకటించింది. మన దేశంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించడం, గోరక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం అన్నది గోప్రేమికుల మనోభీష్టం కూడా. కాగా, ఈ విషయంలో కొన్ని రాష్ట్రాలు భిన్నవైఖరిని అవలంబిస్తున్నాయి.
‘జాతీయ జంతువు’గా ప్రకటించి గోరక్షణకి అవసరమైన ప్రభుత్వ పరమైన చట్టాలు చేస్తేసరిపోతుందా? అంతకుమించి మన సమాజంలో గోవుకు మరే విధమైన ప్రాధాన్యత లేదా? కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నవారు ఈ దిశగా ఆలోచించాలి.
అనాదిగా మన సమాజంలోని అన్ని అంశాలతోను గోపోషణ ముడివడి ఉంది. కేవలం పాలిచ్చే జంతువుగానే కాకుండా ఒక ప్రధాన ఆర్థిక వనరుగా , సాంస్కృతిక ప్రాధాన్యత కలదిగా ఆవుమన జాతి జీవనంలో పెనవేసుకుపోయింది.
నిజానికి ‘గోవధ-గోసంరక్షణ’ అన్నది కొత్తగా ఇప్పుడు మోదీ ప్రభుత్వ హయాంలో తెరమీదకి వచ్చిన అంశం కాదు. ఇది చాలా సున్నితమైన విషయం. స్వాతంత్రోద్యమ కాలం నుంచి దీనిపై చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. మన దేశానికి స్వా తంత్య్రం వచ్చాక ఈ విషయమై పలు రాజ్యాంగపరమైన చర్చలు జరిగాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గోవధను నిషేధించాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు గోవధను నిషేధించాయి. అయినా మన దేశంలో పెద్ద సంఖ్యలో గోవులు శుష్కించి క్రమంగా అంతరించిపోతున్నాయి. ఇందుకు కారణం వీటి పోషణ రైతులకు తలకు మించిన భారం కావడం. వీటివలన వారికి ఎలాంటి ప్రయోజనం లేకపోవడం.
‘గోవులు లేదా గోజాతికి చెందిన పశువుల పేడ నుండి ఏడాదికి వంద మిలియన్ టన్నుల పిడకలు తయారవుతున్నాయి. వీటి విలువ ఐదు వేల కోట్ల రూపాయలని ఓ అంచనా. వీటిని వంట చెరకుగా ఉపయోగించవచ్చు. దానివల్ల 50 మిలియన్ టన్నుల వంట చెరకు ఆదా అవుతుంది. అంటే పెద్ద సంఖ్యలో చెట్లు నరికేయకుండా, పర్యావరణ విధ్వంసం జరగకుండా మనం నివారింవచ్చు. ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయం కోసం ఉపయోగంలో వున్న 73 మిలియన్ పశువులను పక్కన పెట్టేస్తే వాటి స్థానంలో 7.3 మిలియన్ ట్రాక్టర్లు అవసరమవుతాయి. ఒక్కొక్క ట్రాక్టర్ ధర కనీసం రెండున్నర లక్షలు. అవన్నీ కొనాలంటే లక్షా 80 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి భారం మనపై పడుతుంది. ఈ ట్రాక్టర్లను నడపాలంటే 2 కోట్ల 37 లక్షల 550 వేల టన్నుల డీజిల్ అవసరమవుతుంది. ఇందుకు అదనంగా 57 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. దీన్నిబట్టి పశుసంరక్షణ వల్ల ఎంత ఆదా అవుతుందో మనకు అర్థమవుతుందిగా! పశువులను చంపివేయడం వలన మనం ఎంతో నష్టపోతున్నామని కేంద్ర స్ర్తి,శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ స్పష్టం చేస్తున్నారు.
ఒకప్పుడు పల్లెల్లో ఊరవతల పచ్చిక బయళ్లలోకి పశువులను మేపడానికి తోలుకువెళ్లేవారు. అందుకు ప్రతిగా పాలు, పశు విసర్జన ఉచితంగా వచ్చేవి. పశు విసర్జనాలను ఎరువులుగా పంట భూముల్లో ఉపయోగించేవారు. పశువుల ఆధారంగా సాగిపోయే ఈ గ్రామీణ వ్యవస్థ నేడు లేదు. అసలు పశువులను మేపుదామంటే పచ్చిక బయళ్లే లేవుగా! ఇవన్నీ రకరకాల వ్యాపార ప్రయోజనాల కోసం అక్రమించబడ్డాయి. పర్యవసానంగా పశువులకు మేత దొరకడమే కష్టమైపోతోంది. ఈ నేపథ్యంలో క్రమంగా పల్లెల్లో పశు సంపద అంతరించిపోతోంది. ఇక సహజ ఎరువులు ఎలా లభ్యమవుతాయి? ఈ పరిస్థితులలో గత్యంతరం లేక రైతులు రసాయన ఎరువులపై ఆధారపడాల్సి వస్తున్నది. ఒక పక్క పశువులకు తగినంతగా మేత దొరక్కపోవడం, మరోపక్క రసాయన ఎరువుల వాడకం పెరగడం వలన సగటు రైతు క్రమేపీ ఆవులు, ఎద్దులు వంటి పశువులపై ఆధారపడడం తగ్గించేస్తున్నాడు.
రసాయన ఎరువులను కొనడానికి ప్రభుత్వాలు రైతులకు ఎన్నో సబ్సిడీలు ఇస్తున్నా అవి ఏమూలకూ సరిపోవడం లేదు. నిజానికి మన దేశంలో 1960లలో కరువుకాటకాలు సంభవించినపుడు అత్యవసరమైన సబ్సిడీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తరువాతి కాలంలో మన నేతలు రాజకీయ లాభాపేక్షతో అయిన దానికీ, కాని దానికీ సబ్సిడీలను ప్రకటించడం మొదలుపెట్టారు. సబ్సిడీల రూపంలో తేరగా వచ్చే డబ్బంటే ఎవరికి చేదు? అందుకే సబ్సిడీల రూపంలో వచ్చే డబ్బుల కోసం రైతులు రసాయన ఎరువుల వెంట పడ్డారు. ఫలితంగా మనదేశంలో పెద్దమొత్తంలో పశువులు రైతుల నిర్లక్ష్యానికి గురయ్యాయి. దాంతో మన దేశంలో సహజ ఎరువులు కూడా తగ్గిపోయాయి. సహజ ఎరువులు భూసారాన్ని పెంచుతాయి. పండే పంట కూడా పోషక విలువలు కలిగి ఉంటుంది. రసాయన ఎరువులు భూసారాన్ని హరించివేస్తాయి.
పశువులను మేపడానికి పచ్చిక బయళ్లకు తోలుకెళ్లే కూలీల వేతనాలు పెరిగాయి. అంతేకాదు, ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ ప్రకారం వ్యవసాయ కూలీల వేతనాలను కూడా పెంచాల్సి వచ్చింది. బాల కార్మికుల చట్టం ప్రకారం పిల్లలను బడికి పంపి చదివించాలన్న అవగాహన పల్లెల్లో పెరగడం వలన పశువులను మేతకు తోలుకెళ్లడానికి పాలేర్లు దొరకడం కష్టమైపోతోంది. మరోపక్క దేశీయ ఆవులకు బదులు జెర్సీ ఆవులు మన పల్లెల్లో ఎక్కువవుతున్నాయి. వీటిని మేపడానికి ఎక్కువ గడ్డి అవసరం. అందువల్ల దేశీయ ఆవుల పోషణలో రైతులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి.
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని వైవిధ్య భరితమైన పశు సంపద భారతదేశానికి అనాదిగా ఉంది. మన సంప్రదాయక పశు సంపదలో 30 జాతులకు చెందిన ఆవులు, 20 జాతులకు చెందిన మేకలు, 40 జాతులకు చెందిన గొర్రెలు, 12 జాతులకు చెందిన గేదెలు, 8 జాతులకు చెందిన గుర్రాలు, 6 జాతులకు చెందిన ఒంటెలు ఇంకా ఎన్నో రకాల గాడిదలు, కంచర గాడిదలు వున్నాయి. ప్రపంచ పశుసంపదలో మన వాటా 15 శాతంపైనే. కానీ వాటికోసం అందుబాటులో ఉన్న భూమి కేవలం 2.2 శాతమే. మన దేశానికి చెందిన ‘జెబూ’ జాతి ఆవులకు (వీపున మూపురం ఉంటుంది) 70 దేశాలలో చాలా గిరాకీ ఉంది. ఇవి మేలురకం జాతి ఆవులుగా చాలా దేశాల్లో ప్రసిద్ధి పొందాయి. వీటి పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి. ఈ ఆవుపాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. అధిక ఉష్ణ, శీతల వాతావరణాన్ని ఈ ఆవులు తట్టుకుని నిలబడగలవు.
ట్రాక్టర్ల వలన రైతులకు తక్కువ కాలంలోనే ఎక్కువ భూమిలో సాగు చేసుకునే అవకాశం కలిగింది. వ్యవసాయానికి ట్రాక్టర్ల వినిమయం నానాటికీ పెరగడంతో ఎద్దుల అవసరమే లేకుండా పోయింది. క్రమేపీ ఎద్దుల సంఖ్య తగ్గిపోతుండడంతో మన దేశంలో గోసంతతి కూడా తగ్గిపోతూ వస్తోంది. మన దేశంలో ఆవుపాలల్లో 5.5 శాతం, గేదె పాలల్లో 7.6 శాతం కొవ్వు వుంటుంది. అదే విదేశీయ ఆవుపాలల్లో అయితే సగటున 3.6 శాతమే కొవ్వు వుంటుంది. గేదెపాలల్లో కంటే ఆవుపాలల్లో కొవ్వులేని ఘనపదార్ధాలు ((Solid Non Fats-SNFs)) ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో మానసిక ఎదుగుదలకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఈ విషయం తెలియక చాలామంది పాలు కావాలని అడుగుతారు కానీ ఆవుపాలు కావాలని అడగరు. అందువల్ల ఆవుపాల వల్ల కలిగే లాభాల గురించి ఎక్కువ మందిలో అవగాహన కలిగించాలి. ఇది జరిగితే గోపోషణ వల్ల కలిగే లాభాలను గుర్తించి రైతులు గోసంపదను వృద్ధి చేసుకోవడంపై శ్రద్ధ పెడతారు.
గోవును జాతీయ జంతువుగా ప్రకటించి, గోవధను నిషేధిస్తూ మన ప్రభుత్వాలు చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదు. పశుపోషణకు, గోఆధారిత లేదా పశు ఆధారిత ఆర్థికాభివృద్ధికి అనుగుణమైన విధానాల రూపకల్పనపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. అప్పుడే మన ఆర్థిక ప్రగతిలో గోవులు, ఇతర పశువుల అర్థవంతమైన భాగస్వామ్యాన్ని మనం చూడగలం.

-దుగ్గిరాల రాజకిశోర్ సెల్: 80082 64690