మెయిన్ ఫీచర్

నాన్నా... నీ మనసు వెన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్నంటే కుటుంబానికి చుక్కాని. బాధ్యతలు మోసే పెద్దాయన. మార్గదర్శి. అన్నప్రాశన, అక్షరాభ్యాసం స్కూల్లో చేర్పించటం వంటి పనులు చేస్తూ, తాను పడ్డ కష్టాలని మరచిపోతాడు. పిల్లలు ప్రయోజకులైతే అతడి ఆనందానికి అవధులు ఉండవు. ‘నాన్నా’ అని పిలిస్తే చాలు మంచులా కరిగిపోయి సంబరపడిపోతాడు. వసుదేవ సుతుడు, పాండునందనులు, శ్రవణుడి వృత్తాంతాలు మనకు తండ్రీ కొడుకుల పాత్రలను గుర్తుచేస్తాయి. నిజానికి ప్రాణమిచ్చి పోషించే తండ్రికి హృదయమివ్వాలి. మనలో జీవాన్ని నింపి, అల్లారు ముద్దుగా పెంచి మనలోని లోపాలను సరిచేస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ, మనకు గమ్యాన్ని చూపేది నాన్న. తండ్రి చిటికెన వేలు పిల్లలకు ప్రపంచాన్ని చూపిస్తుంది. కంసుడి బారినుండి తన బిడ్డ కన్నయ్యను కాపాడుకొనటానికి వసుదేవుడు పడిన కష్టాలు మనకు తెలిసినవే.
నిరంతర శ్రామికుడు..
నాన్న అంటే నడకలు నేర్పేవాడు. తప్పులు చేస్తే సరిదిద్దేవాడు. మన ఎదుగుదలకోసం నిరంతరం శ్రమించేవాడు. తల్లి భూదేవి అయితే తండ్రి ఆకాశమంతటివాడు. మనల్ని కంటికి రెప్పలా కాపాడేవాడు. జీవితంలో మన మొదటి హీరో నాన్నయే. అలాంటి నాన్న ప్రేమను తలచుకోవడానికి పాశ్చాత్యులు ఏర్పాటుచేసుకున్న రోజే ఫాదర్స్ డే. దీనికి స్ఫూర్తి మాతృదినోత్సవమే. కోపమొస్తే ఉరిమే నాన్న తాపమొస్తే కరిగిపోతాడు. తానెక్కలేని అందలాలు పిల్లలకు దక్కాలని పరితపించేవాడు నాన్న. పూర్వకాలంలో ఏది కావాలన్నా అమ్మనే అడిగేవారు. కానీ గతకొన్ని దశాబ్దాల కాలంగా ఆ విధానంలో మార్పు వచ్చింది. నాన్న తాను ఏది కావాలంటే అది నిముషాల్లో సమకూర్చగలడనే నమ్మకం ఇటీవల ఏర్పడుతుంది. నాన్న అంటే జీవిత చుక్కాని అని అంటారు. అందుకే కన్నవారే కనిపించే దైవాలని భారతీయ సంస్కృతి తెలియజేస్తుంది.
నాన్న మనసే వెన్న
తల్లి, తండ్రి సంతానమనే శక్తివంతమైన పునాదులమీద నిర్మాణమయింది మన సనాతన వ్యవస్థ. తల్లి, తండ్రి, గురువు, అతిథులను ప్రత్యక్ష దైవాలుగా భావించే సంస్కృతి మనది. మన జీవితాన్ని ప్రభావితం చేయగల వారు తల్లిదండ్రులే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని అంటారు. మనం జీవితంలో ఎత్తుగా ఎదగాలంటే తల్లిదండ్రుల స్థానం ఎంతో గొప్పది. తండ్రులపట్ల మరచిపోయిన మన కర్తవ్యాన్ని గుర్తుచేయడానికి పాశ్చాత్యులు ఏర్పాటుచేసుకున్న దినాలలో తండ్రుల దినోత్సవం ఒకటి. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి. పేగు అమ్మదైతే పేరు నాన్నది. అమ్మ లాలిపాట ఎలాగో నాన్న నీతి పాటలు జీవితంలో అలాగ పనికివస్తాయి. లోకంలో ఏ నాయనకైనా కన్నబిడ్డతోడిదే లోకం. తనకన్నా మిన్నగా బిడ్డ ఎదగాలని కలలు కనేది ఒక్క

కన్నతండ్రే. తల్లిదండ్రుల ప్రేమగుర్తులే పిల్లలు. తల్లి ఇల్లు, పిల్లల బాధ్యత తీసుకుంటే, తండ్రి సంతానం కోసం సంపాదించే బాధ్యత తీసుకుంటాడు.
ఫాదర్స్ డే సృష్టికర్త ఓ మహిళయే
తొలిసారిగా ‘్ఫదర్స్ డే’ వాషింగ్టన్‌లో ప్రారంభమయ్యిందని చెబుతారు. ‘సోనాల్ స్మార్టా’ అనే మహిళకు ఓ కొత్త ఆలోచన వచ్చిందట. ఆమె తండ్రికి అయిదుగురు సంతానమట. స్మార్టా తల్లి చనిపోయినప్పటికీ వారి తండ్రి మరో పెళ్లి చేసుకోకుండా తానే తల్లి అయి ఈ అయిదుమందిని పిల్లల్ని చక్కగా పోషించాడట. అందుకే తల్లి ప్రేమను స్మరించుకున్నట్లే తండ్రి ప్రేమను తలచుకోవడానికి ఒక రోజుంటే బాగుంటుందనీ. ఎందుకంటే ఆమె తండ్రి దగ్గరే పెరిగింది. వారి నాన్న విలియమ్స్. వారినెంతో ప్రేమగా చూసేవాడు. సోనాలా స్మార్ట్ తన ఆలోచనలు తమ చర్చి ఫాదర్‌తో చెప్పిందట. ఆయనకు అదీ బాగా నచ్చిందట. మరి ఎప్పుడు నిర్వహించాలి అన్నప్పుడు తమ నాన్న జన్మదినమైన జూన్ 5న జరపాలని చెప్పింది. కానీ అప్పుడు తగు సమయం లేకపోవడంతో 1910లో జూన్ 19 మూడవ ఆదివారాన్ని ‘్ఫదర్స్ డే’ తొలిసారి నిర్వహించాం. ఇది అప్పటి అమెరికా ప్రభుత్వానికి నచ్చింది. 1916లో అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ‘్ఫదర్స్ డే’ను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులిచ్చాడు. దీనివల్ల తండ్రులతో వాళ్ల పిల్లలకు అనుబంధం కూడా బలపడుతుంది. 1972లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఆ దేశ జాతీయ పండుగగా దీనిని నిర్వహించాలనీ, ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాడు. అప్పటినుండి ఫాదర్స్‌డే క్రమక్రమంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. తల్లిలేని లోటును తీర్చి తండ్రులే బిడ్డల్ని పెంచి పోషిస్తాడో కూడా ఈ రోజు అందరూ గమనించాలి.
కానీ కన్నవారి కంటిలో చివరిక్షణం దాకా నీటి చుక్క ఊరకుండా చూడాల్సిన బాధ్యత కూడా నేటి పిల్లలపై ఉంది. తండ్రులను నిర్లక్ష్యంగా వృద్ధాశ్రమంలో వదిలిపెడుతున్నారు తమ స్వార్థం కోసం. కానీ తండ్రి పర్యవేక్షణలో పెరిగిన పిల్లలు తెలివైనవారిగా ఎదుగుతారని ఒక సర్వేలో తేలింది. తన కలల రూపాలైన పిల్లలకోసం తల్లిలా మారిపోయి వారి లాలన పాలనా చూసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు నేటి తండ్రులు.
నాన్న ఓర్పుకు మారుపేరు, మార్పుకి మార్గదర్శి, నీతికి నిదర్శనం మన ప్రగతి
సోపానం అని గ్రహించాలి. అందుకే నాన్నకి మించిన దైవం లేదు. నాన్నను అర్థం చేసుకుందాం. నాన్నను ఆప్యాయతతో చూసుకుందాం.
తండ్రి సానపెట్టిన భారతరత్నమే..
1965లో తండ్రులు తమ పిల్లలతో కేవలం 16 నిమిషాలు కూడా గడిపేవారు కాదు. అదే 2012 వచ్చేసరికి వీరు రోజుకు 59 నిమిషాలు తమ పిల్లలతో గడుపుతున్నట్లు వెల్లడైంది. వీరంతా విద్యావంతులు. కాలేజీ చదువులు చదివిన తండ్రులయితే రోజుకు 74 నిమిషాలు గడుపుతున్నట్లు వెల్లడైంది. అలాగే చదువుకోనివారు కేవలం 2012 దశకంలో 50 నిమిషాలు గడిపినట్లు వెల్లడైంది. తల్లులతో సమానంగా తండ్రులు కూడా పిల్లల డైపర్స్ మారుస్తున్నారు. వారికి స్నానం చేయిస్తున్నారు. అర్థరాత్రి లేచి ఏడిస్తే వారిని సముదాయిస్తున్నారు. అలాగే వారికి ఎలాంటి అనారోగ్యం సంభవించినా ఆసుపత్రికి తీసుకువెళుతున్నారు. వారితో చదువుతున్నారు. ఆడుతున్నారు. ఇది శుభపరిణామం.

గాత్రంలో వారసురాలిగా..

సంగీత కళను చిత్తశుద్ధితో అభ్యసించాలంటే విలువలతో కూడిన జీవితాన్ని గడపాలి. ఇలాంటి విలువల పాఠాలను తండ్రి ఉస్తాద్ రషీద్ ఖాన్ నుంచి అలవర్చుకున్నా. మా వంశంలో ఎంతో మంది సంగీత కళాకారులు ఉన్నారు. వారి ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తా. తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి.
-గాయని సుహాఖాన్

ఇంత కంటే ఏమి కావాలి...

జమిందారీ వంశంలో పుట్టిన స్వామి వివేకానంద జీవితంలో తండ్రి నేర్పిన పాఠాలు ఆయనను నిండైన ఆత్మవిశ్వాసం తొణికసలాడే ఆధ్యాత్మిక శిఖరంగా తీర్చిదిద్దగలిగాయి. వివేకానందుడ్ని చిన్నతనంలో నరేంద్రుడు అని పిలిచేవారు. నరేంద్రుడి తండ్రి విశ్వనాథ్‌దత్తా అడిగినవారికి లేదంటూ దానధర్మాలు చేసేవారు. ఆయన దానధర్మాలను చూసి తల్లి భువనేశ్వరి ఎంతో కలతచెందేది. పిల్లలకు ఏమైనా మిగులుతుందా అని మదనపడేది. తల్లి ఆవేదనను అర్థంచేసుకున్న నరేంద్రుడు తండ్రి వద్దకు వెళ్లి మాకేమి ఆస్తులు మిగిల్చారని అడిగాడు. విశ్వనాథ్‌దత్తా నరేంద్రుడ్ని చూసి.. ‘పోయి అద్దంలో చూసుకో’ అని అన్నారు. వెంటనే నరేంద్రుడు నిలువుటద్దంలో తననితాను చూసుకున్నారు. తొణకిసలాడే ఆత్మవిశ్వాసం, తేజోవంతమైన రూపాన్ని చూసుకుని ఇంతకంటే ఇంకేమి కావాలి, ఏదైనా సాధిస్తానని ఆనాడు వివేకానందుడు తన తండ్రి అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు. ఆ విశ్వాసమే ప్రపంచాన్ని తనవైపు తిప్పుకునే ఆధ్యాత్మిక శక్తిని ఆయనకు ప్రసాదించింది.
నా గురువు తండ్రే..
ప్రపంచం మెచ్చే సితార కళాకారుడిగా ఎదిగానంటే తండ్రి చలవే. సంగీతంలో సరిగమలను తండ్రి పండిట్ కత్రిక్ కుమార్ వద్దనే నేర్చుకున్నా. తండ్రే నా గురువు. సంగీత పాఠాలతో పాటు జీవిత పాఠాలను కూడా ఆయనే వద్దనే నేర్చుకున్నా.
-నీలాద్రి కుమార్, సితార సంగీతకారుడు

పిల్లలతో ఎక్కువ సమయం
గడుపుతున్నారు
ప్రస్తుత బిజీ సమయంలోనూ తల్లిదండ్రులు పిల్లల కోసం ఎక్కువ సమయానే్న కేటాయిస్తున్నారు. అమెరికాకు చెందిన కాలిఫోర్నియా యూనివర్శిటీవారు జరిపిన సర్వేలో ఈ విషయ వెల్లడి కావటం శుభపరిణామం. 1965నాటి పరిస్థితుల కంటే ఇపుడు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఆనాడు తల్లిదండ్రులు ఎక్కువ చదువుకోలేదు. కాని నేడు తల్లిదండ్రులు విద్యావంతులు కావటంతో పిల్లల పెంపకం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 1965-2012కు చెందిన 1,22,271మంది తల్లిదండ్రులపై ఈ యూనివర్శిటీవారు సర్వే నిర్వహించారు. ఇందులో 68,532మంది తల్లులు, 53,739మంది తండ్రులు పాల్గొన్నారు.

-కె.రామ్మోహన్‌రావు