ఎడిట్ పేజీ

రాజకీయ చదరంగంలో రైతులే పావులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ దక్షిణాది ఆంగ్ల దినపత్రిక తన మొదటి పేజీ ప తాక శీర్షికలో అరచి గగ్గోలు పెట్టింది- ‘మధ్యప్రదేశ్‌లో రెండు రోజుల్లో ఇద్దరు కర్షకుల ఆత్మహత్య’ చేసుకున్నారని! హైదరాబాద్‌లోని మిగతా ఆంగ్ల దినపత్రికల్లో ఆ రోజు ఈ వార్తే కనిపించలేదు. ఏ వార్తకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆ పత్రికల స్వేచ్ఛకు సంబంధించిన అంశమే. అయితే, అది తప్పుడు వార్త అయినపుడు దాని వెనుక ఉ న్న ‘ఉద్దేశాల’ గురించి ఎవరికైనా అనుమానాలు తలెత్తడం సహజం. ఆ దక్షిణాది పత్రిక ఘనంగా ప్రచురించిన వార్తా కథనం ప్రకారం- ఆ ఇద్దరు రైతులు రుణబాధలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఓ రైతు బ్యాం కువారికి నాలుగు లక్షలు, వడ్డీ వ్యాపారికి రెండు లక్షలు బాకీ పడ్డాడు. మరోరైతు ఏడు లక్షల రూపాయలు బాకీ ఉండగా, గతంలోనే ఏడెకరాల భూమిని అమ్మేశాడు.
ఇలాంటి ఘటనలు అనేక ప్రాంతాల్లో జరుగుతున్నా, ఈ ఆత్మహత్యలకు పూర్తిగా వ్యవసాయ సంక్షోభమే కారణమని స్పష్టంగా చెప్పలేం. రుణబాధలకు తాళలేక కొందరు రైతులు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విషయాన్ని కాదనలేం. రైతుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ గాని, అసలు వాస్తవాలను వెలికి తీసేందుకు గాని ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. రుణబాధల వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నట్లు భారీగా ప్రచారం జరుగుతోందే తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులను, రైతుల వ్యక్తిగత జీవనశైలి గురించి ఎవరూ దృష్టి సారించడం లేదు. ఆత్మహత్యలకు సంబంధించి ఏదోలా ప్రయోజనం పొందాలన్నదే రాజకీయ పార్టీల తపన. అందుకే రాజకీయ చదరంగంలో నేతలు రైతన్నను ‘పావులు’గా వాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
రైతుల ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. రుతుపవనాల వైఫల్యం, అధిక వడ్డీలకు రుణాలు, ప్రభుత్వ విధానాలు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ పరిస్థితులు.. ఇవన్నీ రైతులపై ప్రభావం చూపుతాయి. ప్రతి ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలేమిటో క్షుణ్ణంగా తెలుసుకోకుండా, గణాంకాల కోసమే అన్నట్టుగా రైతుల ఆత్మహత్యలను అదేపనిగా లెక్కబెట్టడం సరికాదు.
మధ్యప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న ఆ ఇద్దరు రైతులకు ఆరు లక్షలు, ఏడు లక్షలు దాకా బాకీలు ఎందుకు పేరుకుపోయాయి? ఇంతమొత్తం అప్పు చేసిన వీరిని సన్నకారు, మధ్యతరహా రైతులని అం దా మా? ఇంత భారీ మొ త్తంలో అప్పులు చేయడానికి వారిని పురికొల్పిన కారణాలేమిటి? వారికి వ్యక్తిగత సమస్యలేమైనా ఉన్నాయా? ఈ విషయం మిగతా ప్రపంచానికి తెలియదు. ప్రభుత్వం కాని, మీడియా కాని వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాయా? ఏ కారణంతోనైనా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కర్షక కుటుంబానికి చెందినవాడైతే చాలు- ఆ చావును ‘రైతుల ఆత్మహత్యల ఖాతా’లో నమోదు చేసేస్తున్నారు.
దేశవ్యాప్తంగా 2004లో 18,214 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, 2014లో ఆ సంఖ్య 5650కి తగ్గింది. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సిఆర్‌బి) సమాచారం మేరకు ప్రతి లక్షమంది రైతుల్లో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య 1.4 నుంచి 1.8 లోపు ఉంటోంది. దేశంలో మొత్తం ఆత్మహత్యల్లో రైతుల ఆత్మహత్యలు 11.2 శాతంగా నమోదైంది. ఏ ఆత్మహత్యకైనా ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఆత్మహత్యకు సగటున మూడు అంతకంటే ఎక్కువ కారణాలుండవచ్చు. మొత్తం ఆత్మహత్యల్లో 11.2 శాతం వ్యవసాయ సంక్షోభం వల్లే అయితే- మిగతా 88.8 శాతం ఆత్మహత్యలు ఎవరు చేసుకుంటున్నారు? నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులు, దీర్ఘరోగాలతో బాధపడేవారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలను ఎవరూ కలిపి లెక్కవేయరు. రైతు ఆత్మహత్యల గణాంకాలను మాత్రం కుప్పగా పోసి లెక్కించడం మన నేతలకు అలవాటైంది. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం రైతుల ఆత్మహత్యల గణాంగాలన్నీ ఓ గారడీ లాంటిది. రైతుల జనాభా గురించి ఎవరికి నచ్చినట్లు వారు గణాంకాలు వల్లెవేస్తారు. జనాభాలో రైతులు 50 శాతం అని, 60 శాతం అని, కాదు 70 శాతమని.. ఇలా భిన్నమైన గణాంకాలు చెబుతుంటారు.
రైతు ఆత్మహత్యలు కేవలం భారత్‌కే సంబంధించిన సమ స్యా? కానే కాదు. శ్రీలంక, అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాయి. వ్యవసాయం అనేది అధిక ఒత్తిడితో, అధిక ఆత్మహత్యలకు అవకాశం ఉండే రంగంగా ముద్ర పడింది. పరిశ్రమలు, ఇతర రంగాల కంటే వ్యవసాయంలో ఒత్తిడి పెరగడంతో అనేక దేశాల్లో రైతులు తీవ్ర మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్‌లో మిగతా జనాభా కంటే రైతుల్లోనే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని గుర్తించారు.
ప్రస్తుత సంక్షోభానికి రైతుల రుణాలను మాఫీ చేయడమే ఏకైక పరిష్కారమా? వ్యక్తిగత సమస్యలను చూడకుండా సామూహికంగా రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలా? రుణమాఫీ చేయాలని రాజకీయ పక్షాలు పట్టుబడుతుంటే- చాలామంది రైతులు ఉద్దేశ పూర్వకంగానే రుణాలను తిరిగి చెల్లించడం లేదు. ఓట్ల దాహంతో అల్లాడిపోతున్న రాజకీయ నేతలు రుణమాఫీ కోసం రైతులను రెచ్చగొట్టేందుకు సైతం సిద్ధపడుతున్నారు. రుణమాఫీ అన్నది ఎప్పుడైనా అసాధారణ పరిస్థితుల్లో పరిమితులకు లోబడి ఒకసారి చేయాలే తప్ప, ఏటా దీనిని ఓ కసరత్తుగా చేయడం వల్ల రైతులు రుణాలు చెల్లించేందుకు సుముఖత చూపడం లేదు. 2014-15లో వ్యవసాయానికి బ్యాంకులు 8.4 లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వగా, 2016-17 నాటికి అది 9.1 లక్షల కోట్లకు చేరింది. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మాదిరి రుణాలను మాఫీ చేస్తుంటే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊహించని నష్టం జరుగుతుంది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా మన నేతలకు ఈ విషయం పట్టదు. రుణమాఫీ కోసం ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టించేందుకు వారు వెనుకాడరు. ఎన్నికల్లో లబ్ది కోసమే వారు ఇదంతా చేస్తున్నారని అందరికీ తెలుసు. ఈ పరిస్థితితో తమ మనుగడ ప్రమాదంలో పడుతోందని బ్యాంకర్లు గోల పెడుతున్నా వినేవారు ఎవరు? బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు వేల కోట్ల రూపాయలు బ్యాం కులకు ఎగ్గొడుతుండగా తమకు రుణమాఫీ ఎందుకు చేయరని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఏడాది దేశంలోని చాలా ప్రాంతాల్లో పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది. అయితే, రైతుల్లో అదే తీరులో అశాంతి నెలకొంది. పాలను, కూరగాయలను, ఇతర ఉత్పత్తులను రోడ్లపై పారవేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. నష్టాల్లో ఉన్న ఏ ఒక్క రైతు కూడా వ్యక్తిగతంగా ఇలా నిరసనకు దిగడం జరగదు. రాజకీయ నేతల ప్రోద్బలంతోనే రైతులు సామూహికంగా రోడ్డెక్కి రుణమాఫీ కోసం ఆందోళనలు చేస్తున్నారు. రైతులు ఏనాడూ పెట్రోలు బంకులపై, పోలీసు స్టేషన్లపై, వాహనాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించరు. రాజకీయ కారణాలతో కొన్ని రైతు సంఘాలు రెచ్చగొట్టడం వల్లే హింస చోటుచేసుకుంటోంది. సంక్షోభం అన్నది వ్యవసాయ రంగానికే పరిమితం కాదు. వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు వారి సమస్యలపై సమ్మెలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైతే ఎన్నికల ముందు సమ్మె నోటీసులిస్తుంటారు. భారీ వాహనాల యజమానులు సైతం ఆందోళనలకు దిగుతుంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇలాంటి నిరసనలు మామూలే. అయితే- ఆందోళనకారులను రాజకీయ నా యకులు రెచ్చగొట్టడం అన్నది భారత్‌లోనే ఎక్కువ.
ఏది ఎలా ఉన్నా, కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిందే. అయితే, వీరి సమస్యలను పునాదిగా చేసుకుని ఎదగాలని రాజకీయ నేతలు భావించరాదు. దేశ ఆర్థికవ్యవస్థను సంక్షోభంలోకి నెట్టడం సబబు కాదు. రైతు సమస్యలను పరిష్కరించే బాధ్యతను ఆర్థిక నిపుణులకు అప్పగించాలే తప్ప, వీధుల్లో హింసాకాండ జరుపుతూ ఓట్ల దాహం తీర్చుకోవాలన్న రాజకీయ నేతలకు కాదు.
*

ఎస్‌ఆర్‌ రామానుజం, సెల్ : 80083 22206