ఎడిట్ పేజీ

ర్యాంకుల పంటలు.. ఎవరి కోసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోటీ, నాణ్యత ఉత్పత్తికి, మార్కెట్‌కు సంబంధించిన మాటలు. మానవీయత, నిజాయితీ, నిబద్ధత, జవాబుదారీతనం, హేతుబద్ధత, మానవ వనరులకు సంబంధించిన పారిభాషిక పదాలు. ఈ రెండు ఒకదానికొకటి సంబంధించినవి కాకపోగా, సమాంతరాలు కూడా కావు. పెట్టుబడి అనే ఆర్థిక పదం మానవ వనరులను ఉత్పత్తికి సంబంధించిన అంశంగా మార్చివేసింది. విద్యారంగాన్ని పూర్తిగా విషపూరితం చేసింది. ఆహ్లాదకరంగా, స్వేచ్ఛాపూరితంగా, స్నేహపూరితంగా చలనశీలతను కలిగి వుండాల్సిన విద్యా రంగం పోటీ అనే ఉచ్చులో ఇరుక్కుపోయింది. ఓ క్రీడగా రూపాంతరం చెందింది. భావి తరాలు ఆరోగ్యకరంగా ఎదిగేందుకు ఉపకరించాల్సిన విద్యా రంగం కుతంత్రంతో, కుయుక్తులతో, పాలనుంచి నెయ్యిని మాత్రమే రాబట్టాలనే భావనతో పనిచేస్తున్నది.
పోటీ, ఓ వ్యక్తిని నలుగురిలో నిలబెట్టవచ్చుగాని, ఆ నలుగురి మధ్య ఇమడ్చలేరు. పైగా దూరాన్ని పెంచుతుంది. ఈనాడు దేశవ్యాపితంగా విద్యారంగం చేస్తున్న పని ఇదే! లక్షలాదిమంది విద్యార్థుల్ని ఫణంగా పెట్టి, శకున్ని పోషించినట్లు ఒకరిద్దరిని భుజాన ఎత్తుకుంటున్నది. పాఠశాల పోటీశాలగా మారింది. బోధకుడు బోధించేవాడిగా, బాధింపబడేవాడే నేర్పరిగా ఆచరించబడుతున్నది. పోటీలో తట్టుకొని శిఖరాగ్రాన నిలిస్తేనే అసలు, సిసలు విద్యార్జనుడని, మిగతావారంతా పనికిమాలిన వారని భావిస్తున్నది. నిజానికి ఈ పనికిమాలిన వర్గమే సంపదల సృష్టిలో, సమాజ గమనంలో భాగస్వామ్యవౌతున్నది. యావత్ దేశాన్ని పోషిస్తున్నది. ప్రతీ సంవత్సరం పదవ, ఇంటర్, సిబియస్‌ఇ, సివిల్స్, జెఇఇ లాంటి పరీక్షల పలితాల సందర్భంగా, ప్రవేశ పరీక్షల సందర్భంగా నిశితంగా పరిశీలిస్తే ఈ ఆత్మఘోష అవగతవౌతుంది. ఆయా పబ్లిక్ పరీక్షల్లో, ఎంట్రెన్స్‌లల్లో పైస్థాయిలో మార్కులు సాధించినవారి అంతరంగాన్ని చూస్తే, వారి మేధోమధనం కన్నా, వారు సాధించినదానికి పడిన సంఘర్షణనే ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితాలు వెలువడిన సందర్భంగా మీడియా ముందు వారు మాట్లాడిన తీరే దీనికి ప్రతీకలు. వీరే దేశ దశ, దిశను మార్చేవారుగా, సక్రమ మార్గంలో నడిపేవారిగా కనపడుతారు. అందరు సమాజ సేవకు కంకణబద్ధులమంటూ సెలవిస్తారు. దర్జీ సూది కథలా, తర్వాతి కాలంలో వీరేమి చేస్తారో, ఎలాంటి సేవలందిస్తారో, గతంలో ఇలాగే మాట్లాడినవారు ఇప్పుడేం చేస్తున్నారో ఎవరికి తెలియదు. వీరిని ఉదాహరణగా తీసుకొని మరికొంతమంది వీరి బాటన నడవడానికి, ఇదే చదువుల సారమని భ్రమించడానికి వీరి మాటలు బాగా పనిచేస్తాయి, చేస్తున్నాయి.
ఈమధ్య విడుదలైన సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షల ఫలితాల్ని, సివిల్స్ పరీక్షల్లో ఇంటర్వ్యూలో తట్టుకొని నిలబడ్డవారి అంతరంగాన్ని, ప్రతిష్ఠాత్మకమైన ఐఐటి లాంటిసంస్థలకు జెఇఇ ద్వారా పొందిన ర్యాంకు హోల్డర్ల మనోగతాన్ని చూస్తే, ఈచదువులెంత కఠినతరమైనవో, లక్ష్యసాధనకై ఎంత నికుంఠిత దీక్షతో చదవాలో, దీనికోసం విద్యార్థి దశలోనే ఎన్ని త్యాగాలు చేయాల్నో బోధపడుతుంది. ముందుగా సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాల్ని చూద్దాం! 2016-17 విద్యా సంవత్సరంలో దేశ వ్యాపితంగా గల 10,673 సిబిఎస్‌ఇ అనుబంధ పాఠశాలల్లో చదివినవారి సంఖ్య 10,20,762. ఇందులో పరీక్ష రాసి పాసరైన వారు 8,37,229మంది (82 శాతం). వీరిలో 95 శాతానికి పైగా వచ్చినవారు 10,091 మంది కాగా, 90 శాతానికి పైగా వచ్చినవారు 63,247మంది. అంటే 7.5 శాతం అన్నమాట! పరీక్షలు రాసి తప్పినవారు 18శాతం. అంటే 90 శాతంకన్నా తక్కువ వచ్చిన 92.5 శాతం గూర్చి, ఫెయిల్ అయిన 18 శాతం గూర్చి ఈ విద్యా వ్యవస్థలో ఏనాడు చర్చకు రాని వైనం. కాని, జాతీయ స్థాయిలో, దేశ వ్యాపితంగా గత 10 జోన్ల స్థాయిల్లో, వివిధ రాష్ట్రాల స్థాయిలో పదిలోపు ర్యాంకులు వచ్చిన వారి గూర్చి మీడియా కథనాలు రాస్తే, సంబంధిత విద్యా సంస్థలు ఈ ఘనతకు తామే కారణమని ప్రకటనల్ని గుప్పిస్తూంటాయి. నిజంగా ఇది వాస్తవమని భావిస్తే ఫెయిల్ అయినవారికి, తక్కువగా మార్కులు (గ్రేడ్లు) వచ్చినవారికి ఎవరు జవాబుదారీతనం వహించాలో ఏనాడు చర్చ లేదు. ఈ అశాస్ర్తియ కొలతకి, తూకానికి అబ్బురపడే తల్లిదండ్రులు ర్యాంకుల్ని స్వంతం చేసుకున్నామని భ్రమిస్తున్న పాఠశాలల చుట్టూ ప్రదక్షిణ చేయడం పరిపాటిగా మారింది. దీన్ని అవకాశంగా తీసుకున్న సదరు పాఠశాలలు సొమ్ము చేసుకోవడం అందరికీ తెలిసిందే! ఇక కొన్ని మీడియాలైతే అందెవేసిన చెయ్యే! టాపర్లను ఇంటర్వ్యూ చేయడం, వారు ఉన్నవి, లేనివి కల్పించి చెపితే, మరింత మసాలా దట్టించి కథలు, కథలుగా రాయడం చూస్తూనే ఉన్నాం. అత్యున్నత స్థాయి సాధించిన వారిలో అప్పుడప్పుడు బడుగు, బలహీన కూలీ నాలి, రైతుల బిడ్డలు కూడా కనిపిస్తూ వుంటారు. వీరి గూర్చి రాసే కథనాలు పాఠకుల్ని మరో లోకంలోకి తీసుకెళుతాయి. ఇలాంటి కుటుంబాల పిల్లలు తెగిన చుక్కల్లా మెరవడమేంటనే ప్రశ్నలు జనించేలా వార్తా కథనాలుంటాయి. తమలాగా తమ పిల్లలు తాము చేసే పనులు (కూలి, వ్యవసాయం, కుల వృత్తులు మొ) చేయకూడదనే తమ పిల్లల్ని చదివించామని గరీబ్ ర్యాంకర్ల తల్లిదండ్రులు సెలవిస్తూ వుంటారు.
ఇక సివిల్స్ విషయంగా చూసినపుడు ఈసారి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన కె.ఆర్.నందిని 2014లోనే 849 ర్యాంకును సాధించి కస్టమ్స్‌లో పనిచేస్తున్నది. తిరిగి 2015లోను రాసినా సరియైన ర్యాంకు రాకపోవడంతో ఈసారి రాయగా, ఏకంగా మొదటి ర్యాంకు వచ్చింది. ఇలా నాల్గోసారికి మొదటి ర్యాంకు సాధించిన నందిని, మీడియా అడిగిన ప్రశ్నలకు తాను విద్యారంగ అభివృద్ధికై ఐఎఎస్ సేవలందిస్తానని చెప్పింది. ఓ ఐఎఎస్‌గా ఆమెకు కోరుకున్న రాష్ట్రం (స్వంత) దొరికే అవకాశం వుంటుందిగాని, ఇష్టమైన విభాగంలో పనిచేసే అవకాశం వుండదు. ఒకవేళ ఆమెదైన శైలిలో పనిచేస్తే, ప్రభుత్వ అనుకూలంగానే వుండాలిగాని, వ్యతిరేకంగా వున్నా, ఇబ్బంది కలిగినా బదిలీ వేటు తప్పదు. తమిళనాట ఈరోడు జిల్లా కలెక్టర్, కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలో వేసినందుకుగాను బదిలీ వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పూనం మాలకొండయ్య ఇలాంటి ఇబ్బందుల్ని అనేకసార్లు ఎదుర్కొన్న విషయం తెలిసిందే! ఇలా నెగ్గినవారు సెలవిచ్చే మరో సమాధానం గంటల తరబడి (దాదాపు 18 గం) చదివామంటారు. ఇలా పదే పదే పరీక్షలు రాసేవారు, అప్పటికే ఏదో ఉద్యోగం చేయడం చూస్తూ ఉంటాం. నందిని కూడా కస్టమ్స్‌లో పనిచేస్తున్నది. శ్రీకాకుళం నుంచి మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ 2006లోనే ఉపాధ్యాయుడిగా ఎంపికైనట్లు, పనిచేస్తున్నట్లు తెలిపాడు. గత పదకొండు సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా ఈయన ఎలాంటి సేవలందించాడో చర్చలేదు. పోనీ, ఈయన శిక్షణంతా వేసవిల్లోనే అంటే, ఉపాధ్యాయులకు ఇచ్చే ఇన్‌సర్వీస్ శిక్షణలన్నీ అత్యధికంగా వేసవిలోనే ఉన్నప్పుడు, ఈయన వాటికి హాజరుకానట్టే లెక్క. అటు ఉపాధ్యాయుడిగా నిజమైన సేవలందిస్తూ, ఇటు మూడుసార్లు ఐఎఎస్‌కు సిద్ధపడడం ఎలా సాధ్యమనేది ఎవరూ వేసుకోని ప్రశ్న! వేసుకోకూడని ప్రశ్న! దీన్ని బట్టి ఆయన వృత్త్ధిర్మం ఎలా నెరవేర్చాడో తెలియదు. వృత్త్ధిర్మానికన్నా, వ్యక్తి ధర్మమే ప్రధానంగా సాగినట్టు అవగతవౌతోంది. ఇలాంటి సంఘటనలు విద్యా శాఖలో కోకొల్లలు. ఉన్నత విద్యలు అభ్యసించి, ఉపాధ్యాయ శిక్షణపొంది, డిఎస్సీల ద్వారా ఎంపికై, అప్పటికే పలుమార్లు కోచింగ్ తీసుకుంటారు కాబట్టి, గ్రూప్స్‌కు, సివిల్స్‌కు వీరెప్పుడు సంసిద్ధంగా ఉంటారు. పనిచేసే పాఠశాలలకు ఎగనామం పెట్టడం, లేదా సెలవులపై సెలవులు పెట్టి కోచింగ్‌లు తీసుకోవడం జరుగుతూ వుంటుంది. వీరి భవిష్యత్ నిర్మాణంకై విద్యార్థుల ఆశల సౌధాన్ని కూల్చడం జరుగుతుంది. ఇలాంటివారు ఓ మెరుపు మెరిసి, కలెక్టర్లు కాగానే, తిరిగి ఉపాధ్యాయులకే ఉపదేశాలు ఇస్తూ వుంటారు.
మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, గోపాలకృష్ణకు కోచింగ్ ఇచ్చిన మల్లవరపు బాలలతకు 2004-05లోనే 355వ ర్యాంకు సాధించింది. కలెక్టర్ స్థాయి ఉద్యోగాన్ని చేస్తూనే కోచింగ్ ఇవ్వడం ఈమె హాబి. ప్రతీసారి ఐఎఎస్ రాయడం ఆమెకు సరదా. ఈసారి రాయగా 167 ర్యాంకు రావడం, అయినా ఆమె కలెక్టరుకన్నా కోచింగ్ ఇవ్వడమే మిన్న అని తెలపడం గమనార్హం. ఈ రెండు ఉదాహరణల్ని చూసినపుడు, ఈ సమాజానికి ఐఎఎస్ అవసరమా, ఓ మంచి ఉపాధ్యాయుడు అవసరమా అనేది తేల్చుకోలేని ప్రశ్న. స్వేచ్ఛగా, తలెత్తుకొని పనిచేసే ఉపాధ్యాయ వృత్తికన్నా, రాజకీయ నాయకుల ముందు (సిఎం నుంచి- ఎంఎల్‌ఎదాకా) తలదించుకొని పనిచేసే కలెక్టర్ పదవి కూడా ఓ రాజకీయ పదవిగా మారడం, ఆర్జించుకునే అవకాశాలు దండిగా వుండడం, కడుపులో చల్ల కదలకుండా పనిచేయవచ్చనే ఓ అభిప్రాయం ఇటువైపుగా మొగ్గేలా చేస్తున్నది. సర్వశక్తుల్ని ధారపోసి వీటిని సాధించడానికే సమయాన్నంతా వెచ్చించడం జరుగుతున్నది. 22వ ర్యాంకును సాధించిన కోత్వాలు కొడుకు ముజమ్మలిఖాన్ కూడా, బిట్స్ పిలాని నుంచి ఇంజనీర్ పట్టా పొందినా, ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఐఎఎస్‌ను అయిదవసారికి జయించడం, ఆయన కూడా విద్యారంగానికే సేవలందిస్తానని సెలవివ్వడం గమనార్హం!
ప్రతీ సంవత్సరం, ఇలా ఎంపికైన వారంతా దేశానికి సేవలందిస్తామని సెలవిస్తూ వుంటారు. విశ్వసుందరీలు కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతూ వుంటారు. సంవత్సరానికి వెయ్యిమంది చొప్పున ఈ సివిల్స్‌కు ఎంపిక కావడం, ఇందులో రోస్టర్ కోటాతో కలుపుకుంటే 180 మంది ఐఎఎస్‌కు ఎంపిక కావడం జరుగుతుంది. వీరందరూ పైవారిలానే అనడం తెలిసిందే! దశాబ్దానికి ఇలాంటి వారు 2000గా లెక్కించినా, దేశ వ్యాపితంగా వేలల్లో వుంటారు. వీరంతా కలెక్టర్లుగా, ఆపై స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తూ వుంటారు. నిజంగా వృత్తి నిబద్ధతతో పనిచేస్తే, ఈ రాజకీయ వ్యవహార శైలిలు ఇలా వుంటాయా అనేది ప్రశ్న! వ్యక్తిత్వాన్ని మరిచి, పాలకుల కోసం పనిచేసే వ్యవస్థ ఈ ఐఎఎస్‌లది. ఓ బి.ఆర్.శర్మ, ఎస్.ఆర్.శంకరన్ లాంటివారు అరుదుగా కనపడతారు.
ప్రతీ సంవత్సరం వెయ్యిమందిని (ఈసారి 1099) ఎంపిక చేసే ఈ ప్రక్రియకు దేశవ్యాపితంగా లక్షలమంది కోట్లాది రూపాయల్ని కుమ్మరిస్తూ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్ని చూసినప్పుడు, ఈసారి 99,555మంది సివిల్స్ పరీక్షకు నమోదు చేసుకోగా, రాసింది 39,925 మాత్రమే! ఇందులో మెయిన్స్‌కు అర్హత పొందినవారు 900కాగా, 100మందికి వౌఖిక పరీక్షకు అవకాశం లభించింది. ఇందులో నుంచి ఎంపికైనవారు 80 మందికాగా, వందలోపు ర్యాంకులు వచ్చినవారు కేవలం ఐదుగురే! వీరి చుట్టే ప్రసార సాధనాలు ప్రచార సాధనాలుగా మారి హోరెత్తిస్తుంటే, కోచింగ్ సెంటర్లు ఈ ఘనతంతా తమదేనని ఢంకాభజాయిస్తున్నాయి. ఈ ఐఎఎస్ కోచింగ్‌లకై జనాలు ఎగబడడానికి ఈ ప్రచారమే కారణం. జనాల జేబులకు చిల్లులు పడినా దీనికోసం ఎగబడుతున్నారంటే, నిజంగా వీరందరికి సమాజ సేవ చేయాలనేదేనా అనే అనుమానం రావాల్సిందే! వేరే రంగంలో చేసే అవకాశం లేదా అంటే దొరకంది సమాధానమే! ఏది లాభసాటి అయితే దానివైపు మొగ్గే వ్యవస్థ, ప్రచార సాధనాలు, పాలకులు ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం బట్టకట్టకపోగా, భ్రష్టుపడుతుంది. ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే కాదా..?

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162