మెయన్ ఫీచర్

యోగతో ఆధ్యాత్మిక కుశలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా తమ లోపలి భావాలను అనుభవించడానికి మించిన అనుభూతి మరొకటి ఉండదు. అందుకు దగ్గర దారి ‘యోగ’. యోగ అనేది మతం కాదు. విజ్ఞాన శాస్త్రం, మానవత్వంతో కూడిన లాభదాయకమైన శారీరక సాధన. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ తెలివైన విజ్ఞాన శాస్త్రంలోకి ప్రవేశించింది. భారతదేశం యోగ, ధ్యానం, తత్త్వశాస్త్రం, జ్ఞానం, సంస్కృతి, ఆధ్యాత్మికత కలిగిన ప్రాంతంగా పాశ్చాత్యదేశాలు ఎన్నడూ పరిగణించలేదు. ఈ మాట కాస్త కఠినంగా ఉన్నా, ఇది నమ్మశక్యం కాని నిజం. అలాంటి దేశాలు ఇపుడు భారతదేశ సంపద అయిన ధ్యానం, యోగ వైపు దృష్టి సారించాయి. యూరప్ దేశాలు అన్నీ ఇపుడు అదే బాటలో పయనిస్తున్నాయి, చివరికి వారి జైళ్లలో కూడా యోగ ఇపుడో ప్రధాన భాగం అయిపోతోంది. ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక ప్ర యాణం వైపు దృష్టి పెట్టాయి. కోస్టారికా, నికరుగువ, పెరు, బ్రెజిల్, హూండురస్, గ్వాటిమల, మెక్సికో, ఈక్విడార్, చిలీ వంటి దేశాలు యోగ ఔత్సాహికులకు గమ్యస్థానంగా మారాయి.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా చెప్పుకునే యోగను ప్రపంచం అంతా గుర్తించి అమలుచేసే రోజు జూన్ 21. ఏటా ఈ తేదీన ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి గతంలోనే నిర్ణయించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషితో యోగ విధానాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఐదువేల ఏళ్లుగా భారతదేశంలో యోగ విధానం అమలులో ఉంది. అన్ని రకాల మతవిశ్వాసాలున్న వారు కూడా ఆచరణీయ పద్ధతుల్లో యోగ ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 21న ‘అంతర్జాతీయ యోగ దినోత్సవా’న్ని నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్‌లో జరిగిన ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదించారు. భారతదేశం ప్రతిపాదించిన ఈ తీర్మానానికి ఐరాస సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ఆనాటికి 193 సభ్యదేశాలున్న ఐరాసలో రికార్డు స్థాయిలో 177 దేశాలు యోగ దినోత్సవానికి మద్దతు ప్రకటించాయి. ఐరాస నిర్ణయం తర్వాత ఈ ఏడాది తృతీయ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని విశ్వవ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఐరాస సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం ఇదే తొలిసారి. అలాగే ఐరాసలో కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఒక ప్రతిపాదన తీర్మానంగా రూపుదిద్దుకోవడం కూడా ఇదే ప్రథమం. జూన్ 21న సుదీర్ఘమైన పగటి రోజు ఉండటంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ తేదీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 2014 సెప్టెంబర్‌లో ఐరాసలో ప్రసంగం అనంతరం భారత ప్రధాని దీనికోసం ఒక వెబ్ పోర్టల్‌ను కూడా ప్రారంభించారు.
ప్రాచీన ఆధ్యాత్మిక కళ అయిన యోగ ‘మనుషులంతా ఒక్కటే’ అన్న సమభావనను పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుంది. యోగ శారీరక మానసిక అభివృద్ధికి, సమాజ శాంతికి దోహదం చేస్తుంది. దేశాభివృద్ధికి, మానసిక వికాసానికి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం అంటే ఒక వ్యాధి లేదా వైకల్యం లేకపోవడమే కాదు, శారీరక, మానసిక, సాంఘిక ఆధ్యాత్మిక కుశలతే ఆరోగ్యం. ఒక వ్యక్తి తన సామర్ధ్యాన్ని తెలుసుకుని ఉండటం, జీవితంలో సంభవించే సాధారణ శ్రమ, ఒత్తిడిని తట్టుకోవడం, ఉత్పాదక శక్తితో పనిచేయడం, జాతికి తన వంతు తోడ్పడడాన్ని మానసిక ఆరోగ్యంగానూ, మనో కుశలతగానూ పరిగణిస్తాం. ప్రపంచం మరోమారు భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఇతిహాస జీవన విధానంలో అంతర్భాగమైన ఆరోగ్యసాధనం ‘యోగ’ వైపు చూస్తోంది. యోగ వ్యాయామ సాధనాల సమాహారమే ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ ఆధ్యాత్మిక సాధనాల్లో ఒక భాగం. మోక్ష సాధనలో భాగమైన ధ్యానం అంత:దృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక పరమైన సాధనాలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్లను మనం ‘యోగులు’ అంటాం. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా ఆశ్రమ జీవితం గడిపేవారు. కాని రోజులు మారాయి. యోగ చేసేందుకు అరణ్యాలకు వెళ్లనవసరం లేదు, ఇళ్లలో కూర్చుని అభ్యాసం చేసుకునే వీలు కలిగింది. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగంలో భాగమైన ఆసనాలు శరీర ఆరోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహదారుఢ్యాన్ని, ముఖవర్చస్సును ఇనుమడింపచేస్తుంది. బౌద్ధమతం, జైనమతం, సిక్కుమతంలోనూ ఇతర ఆధ్యాత్మిక సాధనాల్లో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగ అభ్యాసానికి ఆద్యుడు పంతంజలి. శాస్ర్తియంగా యోగ పద్ధతులను క్రోడీకరించాడు. క్రీస్తు పూర్వం 100వ శకం నుండి 500వ శకం మధ్యలో ఇందుకు సంబంధించిన రచన జరిగినట్టు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలోనూ యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వాటిని ‘పతంజలి యోగ సూత్రాలు’గా అందించాడు. కర్మయోగం, జ్ఞాన యోగం, రాజయోగం, భక్తియోగం మొదలైనవి హిందూతత్వంలో భాగాలు. వ్యాసుడు రాసిన భగవద్గీతలో యోగాసనాలు 18 భాగాలుగా విభజించి వివరించాడు.
యోగం అంటే ఇంద్రియాలను వశపరచుకుని, చిత్తమును ఈశ్వరుడి యందు లయం చేయడమే. మానసిక శక్తులు అన్నింటినీ ఏకం చేసి సామాన్యతను చేకూర్చడమే యోగ. ఇలా ఏకాగ్రత సాధించడం వల్ల ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజశక్తిని సాధిస్తుంది. ఈశ్వరుడు తపస్సు చేసినపుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్టు పురాణాల్లో వర్ణించారు. ఇప్పుడిపుడే పాశ్చాత్య దేశాల్లో యోగకు విపరీతమైన ప్రచారం దక్కుతోంది. ఆదరణ పెరిగింది, విశేషమైన మక్కువతో అక్కడి వారు కూడా ఆకర్షితులవుతున్నారు. యోగకు ఉన్న సమగ్రత, సంపూర్ణత్వం మరే ఇతర సాధారణ వ్యాయామాలకు ఉండదనేది నిర్వివాదాంశం. శారీరక వ్యాయామానికి మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా ఇపుడు యోగ పట్ల మోహం పెంచుకుంటోంది. యోగాసనాలతో రక్తప్రసరణ మెరుగవుతుంది. భారతీయ సంప్రదాయక యోగ తరగతులను అనేక దేశాల్లో నేడు నిర్వహిస్తున్నారు. ఇంతటి ఆదరణకు కారణం లేకపోలేదు. ప్రతి ఒక్కరిలో పెరిగిపోతున్న ఒత్తిడే ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2020 నాటికి ఒత్తిడి అనేది అతి పెద్ద తీవ్రమైన వ్యాధిగా ప్రపంచం మోయాల్సిన పరిస్థితి వస్తుందని తేల్చింది (ముర్రె అండ్ లోపెజ్ -1996) . ఈ మానసిక దౌర్బల్యం అభివృద్ధి చెందిన దేశాలనే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలను కూడా చుట్టిముట్టింది. చికిత్సకు అందనంత వీలుకాని స్థాయికి చేరుకుంది. మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం, ఇది మానవప్రవర్తనతో ముడిపడి ఉంటుంది. శారీరక ఆరోగ్యానికి, నాణ్యమైన జీవన శైలికి మానసిక ఆరోగ్యం ప్రాథమికాంశం. నాడీ సంబంధ ప్రసరణ వ్యవస్థ, జన్యుశాస్త్రం, అంటురోగాలు, మెదడులో లోపాలు లేదా గాయం మానసిక రుగ్మతలకు కారణం అవుతుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి యోగ ఒక బృహత్తరమైన సాధనం అవుతుంది. జీవన శైలిలో గందరగోళం తొలగించి సమతుల్యతను సాధించేందుకు యోగ ఎంతో తోడ్పాటునిస్తుంది.
యోగ పట్ల అంతర్జాతీయ అవగాహనను పెంపొందించడానికి అన్ని రకాల చర్యలు మొదలయ్యాయి. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని యోగ ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇందుకు కార్పొరేట్ సంస్థలు కూడా దోహదం చేస్తున్నాయి. మొబైల్ అప్లికేషన్లు, సోషల్ మీడియా వంటి ఇతర డిజిటల్ టెక్నాలజీలను కూడా దీనికి అనుసంధానం చేస్తున్నారు. ఇపుడు ఎక్కడ చూసినా యోగ పైనే చర్చ జరుగుతోంది. భారతదేశంతో పాటు 180కి పైగా దేశాలు 21న యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు తమదైన శైలిలో ఏర్పాట్లు చేసుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ 21న లక్నోలో జరిగే యోగా దినోత్సవంలో స్వయంగా పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి యుపికి చెందిన నేతలు అంతా హాజరవుతున్నారు. భారీ పోస్టర్లు, హోర్డింగ్‌లతో యోగాప్రాధాన్యతను వివరిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రసిద్ధి చెందిన కారాగారాల్లోనూ యోగ దినోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. తమిళనాడు ఇషా కేంద్రంలో భారీ యోగాభ్యాసం జరగబోతోంది. డెహ్రాడూన్‌లో ‘సైనిక్ యోగ’ పేరుతో మరో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దిల్లీలో దౌత్యవేత్తలు అంతా కలిసి యోగాభ్యాసం చేస్తుండగా, చైనాలోని ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ వద్ద ప్రజలు గుమిగూడి యోగ చేస్తున్నారు. చైనాలో యోగా క్లబ్‌లు వెలిశాయి. ఆస్ట్రేలియాలో యోగా సందడి పెల్లుబుకుతోంది. సింగపూర్‌లో 70 ప్రాంగణాల్లో యోగ నిర్వహించారు. కెన్యా, పెరు, సోమాలియా దేశాల్లోనూ, జపాన్‌లోనూ, అమెరికాలోనూ యోగాదినోత్సవ సంబరాలు మొదలయ్యాయి. భారత్‌లో ఒక కుటుంబంలో ఎన్ని తరాల వారున్నా, వారంతా కలసి యోగ నిర్వహించి వాటి ఫోటోలను ప్రధాని నరేంద్ర మోదీ ‘యాప్’లో అప్‌లోడ్ చేయాలని మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ సూచించారు. ప్రభుత్వం దీన్ని ఓ జాతీయ అంశంగా పరిగణించడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

- బివి ప్రసాద్