మెయిన్ ఫీచర్

ఫస్టాఫ్.. ఏదో అలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది సినిమాల విషయంలో కొత్త హంగామా హల్‌చల్ చేస్తోంది.. విడుదలకు ముందే సినిమాను మార్కెట్ చేయడమే కాదు, దానికి ప్రేక్షకుల్లో క్రేజ్ తీసుకురావడాన్ని దర్శక నిర్మాతలు బాగా ఫాలో అవుతున్నారు. ఫస్ట్‌లుక్ నుంచే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడం ఒక వంతైతే, టీజర్ విడుదలైతే చాలు, ఇన్ని లక్షల లైక్స్ వచ్చాయంటూ హంగామా చేయడం మరో వంతు. ఆ తరువాత అసలు ఫలితం అందుతోంది. స్క్రీన్ మీద పడిన సినిమా హంగామా క్రియేట్ చేయడంలో విఫలమవుతోంది.
మొత్తానికి ఈ ఏడాదిలో ఆరు నెలలు గడిచిపోయాయి. సినిమా ఫలితం ఏమిటీ అంటే, నాలుగైదు సినిమాలు వినా పరిశ్రమకు అందిన గొప్ప ఫలితాలంటూ ఏమీ లేవు. తెలుగు సినిమా గొప్పగా చెప్పుకోడానికి ఈ ఏడాది విడుదలైన బాహుబలి తప్ప, మరేంలేవని చెప్పేయొచ్చు. రాజవౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదు చేసింది. ఈ సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ విస్తృతమై, ఇప్పుడంతా టాలీవుడ్ వైపు ఆసక్తిగా చూసేలా చేసింది. బాహుబలి వినా టాలీవుడ్‌లో ఎప్పటిలాగే ఎన్నో సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ సక్సెస్ రేటు ఎక్కడిదక్కడే ఉంది.
తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాకు ఎప్పుడూ పట్ట్భాషేకం చేస్తారన్న విషయం ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదీ నిరూపితమైంది. కాకపోతే కాస్త కొత్తతరహా సినిమాలతో ప్రేక్షకులను రిఫ్రెష్ చేసే ప్రయత్నం మాత్రం ఫలించింది. మరి ఆరు నెలల్లో ఎవరు విజయం అందుకున్నారు, పరిశ్రమలో ఎన్ని విజయాలు నమోదయ్యాయి, ఆరు నెలల కాలం పరిశ్రమకు ఎలాంటి ఉత్సాహాన్నిచ్చిందో చూద్దాం.
ఈ ఏడాది ప్రథమార్థంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా ప్రత్యేకత చాటుకున్న సీనియర్లు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఏడాది జనవరిలో ఎప్పటిలాగే చిన్న సినిమాలతో ప్రారంభమైనా కూడా, ఏ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. జనవరి 6న విడుదలైన ‘ఇంకేంటి నువ్వే చెప్పు’, ‘ఎవ్వరో తానెవ్వరో’, ‘పడమటి సంధ్యారాగం’ లాంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. ఆకట్టుకునే టైటిల్స్‌తో వచ్చినా, సినిమాలో సరుకులేదన్న అపవాదు మూటగట్టుకున్నాయి. పెద్ద పండుగ సెంటిమెంట్‌ను ఇంకా ఫాలో అవుతున్న వెటరన్ హీరోలు, సంక్రాంతి బరిలో దిగారు. తొమ్మిదేళ్ళ తరువాత రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ‘ఖైదీ నెం 150’తో మంచి విజయానే్న అందుకున్నాడు. మెగాస్టార్ క్రేజ్‌కు మచ్చరాకుండా జాగ్రత్తపడ్డాడు. తమిళ సూపర్‌హిట్ కత్తి చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబట్టింది. పోటీకి దిగిన నందమూరి బాలకృష్ణ, క్రిష్ డైరెక్షన్‌లో చరిత్రలో నిలిచిపోయే సినిమాతో వచ్చాడు. తెలుగు చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథతో భారీ ప్రయత్నం చేశాడు. తెలుగు ప్రజలకు తెలియని కథను చూపించిన ప్రయత్నం ఫలించింది. బాలకృష్ణ అభినయం, క్రిష్ దర్శకత్వ ప్రతిభ మంచి ఫలితాలే ఇచ్చాయి. భారీ బడ్జెట్‌తోపాటు భారీ అంచనాలతో విడుదలైన చిత్రం, కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోవడం గమనార్హం. చాలాకాలం తరువాత విప్లవ సినిమాల హీరో ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ వచ్చి వెళ్లిపోయాడు. జయసుధ, నారాయణమూర్తి జంటపై ఆసక్తి కనిపించినా, సినిమాలో విషయం లేక చతికిలపడింది. విడుదల సమయంలోనూ సినిమాకు కష్టాలు తప్పలేదు. గత ఏడాది సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ యువ హీరో శర్వానంద్ ‘శతమానంభవతి’ అంటూ వచ్చాడు. దిల్‌రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చిన చక్కటి కుటుంబ కథా చిత్రంగా మన్ననలు అందుకోవడమే కాదు, ఏకంగా జాతీయ చిత్రంగా అవార్డూ అందుకుంది. జనవరి చివరలో మంచు విష్ణు ‘లక్కున్నోడు’గా వచ్చాడు. గీతాంజలి లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన రాజ్‌కిరణ్ దర్శకత్వంలో విష్ణు తన లక్ పరీక్షించుకున్నా, కిక్కురాలేదు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.
ఫిబ్రవరిలో ‘నేను లోకల్’ అంటూ వచ్చాడు హీరో నాని. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన సినిమా సంచలన విజయం అందుకుంది. క్లాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న నాని, మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ సినిమా నానిని కెరీర్ బెస్ట్ హిట్ హీరోగా నిలబెట్టింది. దర్శకేంద్రడు కె రాఘవేంద్రరావు -నాగార్జున కలయికలో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. అయితే ఈమధ్య ఈ కాంబినేషన్‌లో భక్తి సినిమాలకు బీజం పడింది. అన్నమయ్యతో మొదలైన ప్రస్థానం శ్రీరామదాసు, షిరిడిసాయి లాంటి చిత్రాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఫిబ్రవరిలో వచ్చిన చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ తుస్సుమనిపించింది. ఇంతవరకూ తెలుగు ప్రేక్షకుడికి తెలీని హథీరాం బాబా పాత్ర చేసి నాగ్ ఆకట్టుకోలేకపోయాడు. ఇక హీరో రానా ఇండో-చైనా యద్ధకాలంనాటి ఘటనల నేపథ్యంలో చేసి ఘాజి మంచి పేరు తెచ్చుకుంది. సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రానాకు హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టింది.
మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన విన్నర్, టైటిలంత గొప్పగా సక్సెస్ కాలేకపోయాడు. యాంకర్ అనసూయతో ఐటెంసాంగ్ చేయించినా ప్రాజెక్టుకు ఫలితం అందలే. ఇక పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రెండో చిత్రం ద్వారక. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా పరాజయాన్ని అందుకుంది. ఇదే రోజు మరో యువ హీరో రాజ్‌తరుణ్ కుక్కల కిడ్నాపర్‌గా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాతో వచ్చాడు. వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాతో రాజ్‌తరుణ్ కమర్షియల్ సక్సెస్‌ని అందుకోలేకపోయాడు. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇదేరోజు హీరో మంచు మనోజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గుంటూరోడుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సనిమా మనోజ్ ఖాతాలో మరో మైనస్‌నే మిగిల్చింది తప్ప, ఏమాత్రం ప్లస్ కాలేదు.
తెలుగు భామ అంజలి హీరోయిన్‌గా హర్రర్ ఎంటర్‌టైనర్ చిత్రాంగద కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకోలేదు. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహించిన సినిమా భారీ పరాజయం చవిచూసింది. అంతేకాదు, మరో హీరోయిన్ మంచులక్ష్మి లీడ్ రోల్‌లో నటించిన లక్ష్మి బాంబు సినిమా కూడా సరిగ్గా పేలలేదు. సాయిరామ్ శంకర్ ‘నేనోరకం’, నటుడు ఉత్తేజ్ కూమార్తెను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ రూపొందిన ‘పిచ్చిగా నచ్చావ్’ సినిమాతో వచ్చినా ప్రేక్షకులకు నచ్చలేదని చెప్పించుకుంది. ఇక పవర్‌స్టార్ కళ్యాణ్ హీరోగా డాలి దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన కాటమరాయుడు సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలను పెంచింది. కానీ సినిమా విడుదలై ఆ రేంజ్ విజయాన్ని అందుకోలేదు. గబ్బర్‌సింగ్ జోడిగా శృతిహాసన్‌ను హీరోయిన్‌గా పెట్టినా ఫలితం మాత్రం యావరేజ్‌గానే మిగిలింది. ఇక మరో సీనియర్ హీరో వెంకటేష్ ఈసారి గురుగా కొత్త ప్రయత్నాన్ని చేశాడు. హిందీలో సూపర్‌హిట్ అయిన సాలఖుద్దూస్ సినిమా రీమేక్‌లో నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని హిట్‌గా నిలిచింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ కొత్త హీరోని పరిచయం చేస్తూ తెరకెక్కించిన రోగ్ భారీ పరాజయాన్ని అందుకుంది.
సాయిధరమ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమా భారీ అంచనాలతో విడుదలైనా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మాజీ హీరోయిన్ రాశి కీలక పాత్రలో నటించిన ‘లంక’ సినిమా కూడా పరాజయాన్ని అందుకుంది. ఇక భారీ అంచనాలతో రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా బాహుబలి-2 విడుదలైంది. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అనే ఆసక్తికర ప్రశ్నతో భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై దుమ్ము రేపే విజయాన్ని అందుకుంది. బాహుబలి సినిమా ఏకంగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసి 1700 కోట్ల వసూళ్ళతో మొదటి స్థానంలో నిలబడింది. అటు బాలీవుడ్ చిత్రాలను తలదన్ని టాప్‌గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన అవసరాల శ్రీనివాస్ ‘బాబు బాగా బిజీ’, శర్వానంద్ ‘రాధ’ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ చాలా గ్యాప్ తరువాత హీరోగా నటించిన ‘వెంకటాపురం’ ఫర్వాలేదనిపించుకుంది. నిఖిల్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కేశవ’ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. యాక్షన్ ఇమేజ్ కోసం నిఖిల్ చేసిన ప్రయత్నం సోసోగా నిలిచింది. అక్కినేని నాగచైతన్య, కళ్యాణకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అంటూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వచ్చారు. విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా విడుదల తరువాత ఆ రేంజ్ విజయాన్ని అందుకోలేక యావరేజ్‌గా మిగిలింది. మరో యువ హీరో రాజ్‌తరుణ్ నటించిన అంధగాడు సినిమాతో వచ్చాడు. రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా మారుతూ తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్‌తరుణ్ అంధుడుగా కనిపించి ప్రయోగం చేయాలని అనుకున్న ఆ ప్రయోగం పెద్దగా వర్కవుట్ కాలేదు.
సీనియర్ వంశీ దర్శకత్వంలో యువ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా అప్పట్లో సంచలన విజయం సాధించిన లేడీస్ టైలర్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘్ఫ్యషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ సినిమా విడుదలకు ముందు క్రియేట్ చేసుకున్న హంగామా, సినిమా విడుదల తరువాత లేదు. అవసరాల శ్రీనివాస్, అడవి శేష్‌లతో ఇంద్రగంటి మోహనకృష్ణ ‘అమీతుమీ’ అంటూ చేసిన కామెడీ ప్రయత్నం బెడిసికొట్టింది. స్టయిలిష్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం ఈనెల 23న విడుదలైంది. డిజెగా ప్రారంభం నుండి హంగామా క్రియేట్ చేసిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. అల్లు అర్జున్ కొత్త గెటప్‌తో చేసిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ మధ్య భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అల్లు అర్జున్ డాన్స్, స్టయిల్ ప్రేక్షకులకు కొత్త క్రేజ్‌ని క్రియేట్ చేస్తుంది. మొత్తానికి జనవరి నుండి జూన్ వరకు విడుదలైన సినిమాలను చూసుకుంటే కమర్షియల్‌గా విజయాలు సాధించిన చిత్రాలను వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. ఎప్పటిలాగే ఈ ఆరు నెలలు కూడా సినిమాల విజయంలో రేటింగ్స్ ఏ మాత్రం పెరగలేదని చెప్పాలి.
*

-శ్రీనివాస్