మెయన్ ఫీచర్

‘ముసుగు’ను తొలగించిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెన్న వంటి భరతజాతి
వెన్నున నిప్పంటించిన
దెవ్వరు? నువ్వేనా??
కొవ్వెక్కిన నవ చైనా!
ఎదరొమ్మున బాకు రువ్వి
యేమెరుగనిలా దిక్కులు
చూచు నంగనాచీ
ఛీఛీ విష వీచీ..
సామ్యవాద మనుపేరిట
సామ్రాజ్య పిపాస దీర్చ
నెంచు కుటిల జాతీ!
ఇదా రాజనీతి??’’
అని ఆచార్య సి.నారాయణ రెడ్డి క్రీస్తుశకం 1962వ సంవత్సరంలో చైనాను నిలదీశారు. అప్పుడు చైనా మనదేశంపై దురాక్రమణ జరిపింది. ఇలా నిలదీయడం ఇప్పటికీ కూడ సమన్వయ వౌతున్న వాస్తవం. ఎందుకంటె చైనా దురాక్రమణ కొసాగుతోంది. అప్పుడు చైనా భౌతిక దురాక్రమణకు పాల్పడింది. 1962 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మన దేశంలోకి చొచ్చుకొని వచ్చింది. ఈ దురాక్రమణ ఇప్పుడు బహు రూపాలను సంతరించుకొని ఉంది..వాణిజ్య దురాక్రమణ, దౌత్య దురాక్రమణ, వ్యూహాత్మక దురాక్రమణ, చివరిది ప్రచ్ఛన్న దురాక్రమణ!! మన ఎఱ్ఱచందనం వృక్షాలను తెగనరికి కలపను తరలించుకొని పోతున్న దొంగలను చైనా ప్రభుత్వం మనపైకి ఉసిగొల్పడం ఈ ప్రచ్ఛన్న దురాక్రమణలో భాగం. వందలాది మన పులులను చైనా దొంగచాటుగా ఇదివరకే భోంచేసింది. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ బీభత్సకారులకు చైనా ప్రభుత్వం రహస్యంగా సకల విధ సహాయ సహకారాలను అందించింది... అయితే ఈ చాటుమాటు వ్యవహారానికి చైనా ప్రభుత్వం ఇప్పుడు తెర దించింది...ముసుగు తొలగించింది. తన బీభత్సపు ముఖాన్ని వికృతంగా ప్రదర్శిస్తోంది. మసూద్ అఝార్ అనే జిహాదీ బీభత్సకారుడిని చంకనెత్తుకొని ఐక్యరాజ్య సమితి వేదికపై చైనా నిలబడి ఉండటం తొలగిన ముసుగునకు నిదర్శనం. పాకిస్తాన్ ప్రభుత్వపు పెంపుడు బిడ్డ అయిన మసూద్ అఝార్ ఇప్పుడు చైనాకు దత్తపుత్రుడు! గతంలో అనేక బీభత్స కృత్యాలకు ఈ జిహాదీ దుండగుడు, పంజాబ్ లోని పఠాన్‌కోట వైమానిక స్థావరంపై దాడి చేసిన వారి నాయకుడు. జాయిష్ ఏ మహమ్మద్ ముఠాలోని మొద టి హంతకుడైన మసూద్ అఝూర్ చైనా చంకనెక్కి మన ప్రభుత్వాన్ని ఎక్కిరిస్తుండడం ప్రస్తుతం ఆవిష్కృతమవుతున్న అంతర్జాతీయ దృశ్యం..!
మసూద్ అఝార్‌కు మద్దతు ఎందుకు ఇస్తున్నారు? అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఛీని మన విదేశీ వ్యవహారాల మం త్రిణి సుషమా స్వరాజ్ రష్యా రాజధాని మాస్కోలో ఏప్రిల్ 18వ తేదీన ప్రశ్నించింది. ఇలా ప్రశ్నించడానికి రెండు రోజుల ముందే చైనా ప్రభుత్వం పదహారవ తేదీనే సమాధానం చెప్పేసింది. అందువల్ల మన సుషమక్కకు వాంగ్ ఛీ కొత్తగా మాస్కో లో చెప్పిందేమీ లేదు. ‘‘తొడ గిల్లి తొట్టెలను ఊపడం’’ అమెరికావారు మన పట్ల అనుసరిస్తున్న విధానం. ‘‘తొడగిల్లిన తరువాత తొట్టెలను ఊపకపోవడం’’ చైనా వారు మన పట్ల అనుసరిస్తున్న విధానమన్నది మసూద్ అఝార్ ఉదంతం వల్ల మరోసారి స్పష్టమైంది. అందువల్ల గిల్లించుకున్న పసి బాలుడు ఎలుగెత్తి ఏడ్చినట్టుగా మన ప్రభుత్వం దాదాపు మూడు వారాలుగా నిరసన ధ్వనులను నిగిడిస్తూనే ఉంది. ‘‘మసూద్‌కు మద్దతు నివ్వడం సరైన చర్య’’ అని పదే పదే చెప్పడం మినహా చైనా ప్రభుత్వం ఇచ్చిన కొత్త వివరణ లేదు. ఒక జిహాదీ హంతకుడిని బహిరంగంగా అంతర్జాతీయ వేదికపై బలపరచడం సరైన చర్య అన్నది చైనా మనకు చెప్పిన దౌత్యపాఠం. పఠాన్‌కోటపై దాడి చేసిన వారిని ఉసిగొల్పిన మసూద్ అఝార్‌ను నిషిద్ధ వ్యక్తిగా ప్రకటించాలని, అతని జిహాదీ ముఠా జాయిష్ ఏ మహమ్మద్‌ను నిషిద్ధ సంస్థగా ప్రకటించాలని మన ప్రభుత్వం ఫిబ్రవరిలో ఐక్యరాజ్య సమితికి ఉత్తరం వ్రాసింది. మన మాటలను అన్ని దేశాల వారు విశ్వసించారు. అఝార్‌ను నిషేధించడానకి తీర్మానం సిద్ధమైంది. కానీ చైనా ప్రభుత్వం వారి సైంధవ యత్నం కారణంగా మార్చి 31న సమితి తీర్మానం రద్దయిపోయింది. సర్వ ప్రతినిధి సభా సంఘంలోకాని భద్రతా మండలిలో కాని తీర్మానం చర్చకు రాకముందే చైనా ఇలా అడ్డుకోవడం మనదేశం పట్ల బహిరంగ శత్రుత్వ ప్రదర్శనకు సరికొత్త ఉదాహరణ. ఇలా శత్రుత్వం ప్రదర్శించిన చైనాను గట్టిగా నిరసించకపోవడం మన ప్రభుత్వం అనుసరిస్తున్న మెతక విధానంలో భాగం. ‘టెర్రరిస్టు’ను సమర్థించిన చైనాను బీభత్స వ్యవస్థ-టెర్రరిస్టు రిజీమ్-గా ప్రకటించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితిలో మన ప్రభుత్వం మరో తీర్మానం ప్రతిపాదించి ఉండాలి. ఆ తీర్మానం నెగ్గుతుందా? వీగిపోతుందా? అన్నది వేరే విషయం. కానీ మనదేశ భద్రతకు గండికొట్టిన చైనాను ప్రతిఘటించగల దౌత్య పటిమ, నైతిక బలం మనకున్నదని అంతర్జాతీయ సమాజానికి తెలిసివచ్చేది. తన పుట్టలో వేలు పెట్టే వారిని చిట్టి చీమ కూడ ప్రతిఘటించగలదన్నది భారతీయ జీవన విధానం. మన ప్రభుత్వం మాత్రం ‘‘నంగి నంగి’’గా చైనాతో ముచ్చ ట్లు జరుపుతూనే ఉంది..మన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తన చైనా పర్యటనను రద్దుచేసుకొని ఉండాలి...చేసుకోలేదు. 17వ, 18వ తేదీలోల ఆయన చైనాలో పర్యటించాడు..
అందువల్ల ప్రసిద్ధ రచయిత స్వర్గీయ చిట్టా దామోదర శాస్ర్తీ చెప్పిన చీమ చరిత్రను మన పాలకులూ, మనమూ మరోసారి గుర్తు చేసుకోవడం ఔచిత్యవంతం. చిట్టి దేశమైన ఇజ్రాయిల్‌కు చీమ కథ తెలుసునో తెలియదో మనకు తెలీదు. కానీ చీమ కథలోని ఆదర్శాన్ని ఇజ్రాయిల్ ఆచరించి ప్రదర్శిస్తోంది. మనదేశానికి చెందిన ఈ కథ తరతరాలుగా ప్రసిద్ధం. కానీ మనతరంలో మాత్రం ఈ కథ ధ్యాస అధికాధికులకు లేదు. అందువల్లనే బహుశా దామోదర శాస్ర్తీ ఈ కథను విడమరచి చెప్పవలసి వచ్చింది. ఏదో వినోదాత్మకంగా కనిపించే కథలో నిహితమై ఉన్న జాతీయ సమగ్రతా పరిరక్షక ప్రవృత్తిని ఈ మహనీయుడు ఆవిష్కరించాడు. రాజుగారి ఏడుగురు కొడుకులు వేటకు వెళ్లడంతో కథ మొదలైంది. ఏడుమందీ తలా ఒకటి చొప్పున ఏడు చేపలు పట్టుకొచ్చారట. చేపలను ఎండబెట్టారు. ఒక చేప మాత్రం ఎండలేదట. ‘‘చేపా చేపా ఎందుకెండలేదు?’’ అని రాజు కొడుకు అడిగాడు. ‘‘గడ్డిమోపు అడ్డం వచ్చింది..’’ అని చేప చెప్పిందట. ‘‘గడ్డిమోపా, గడ్డిమోపా ఎందుకు అడ్డం వచ్చావు..?’’ అని మళ్లీ ప్రశ్న! ‘‘నన్ను ఆవు తినలేదు..’’ అని గడ్డిమోపు చెప్పిందట. ‘‘ఆవా, ఆవా ఎందుకు తినలేదు..?’’ ‘‘కాపరి మేపలేదు..’’ అని ఆవు వివరించింది. ‘‘అలకాపరీ, అలకాపరీ ఆవును ఎందుకు మేపలేదు?’’ ‘‘అవ్వ నాకు బువ్వ పెట్టలేదు..’’ అని కాపరి ముక్తాయించాడు. ‘‘కాపరికి ఎందుకు అన్నం పెట్టలేదు అవ్వా?’’ అని ఆమెను ప్రశ్నించాడు రాజపుత్రుడు. ‘‘పిల్లవాడు ఏడ్చినాడు..’’ అని అవ్వ చెప్పింది. ‘‘పిల్లవాడా, పిల్లవాడా ఎందుకు ఏడ్చావు’’, ‘‘చీమ కుట్టింది..’’అని పిల్లవాడు మళ్లీ ఏడ్చాడు. ‘‘చీమా, చీమా పిల్లవాడిని ఎందుకు కుట్టినావు..?’’ అని చీమను సంజాయిషీ కోరాడు రాజు కొడుకు. ‘‘నా బంగారు పుట్టలో వేలుపెడితే నేను కుట్టనా?’’ అని చీమ ఎదురు ప్రశ్న వేసింది.
కథ ఇక్కడ ముగిసిపోలేదు. కథ ఇక్కడ మొదలైంది. చీమ ఇల్లు మట్టిపుట్ట..అది బంగారపు ఇల్లు ఎలా అయింది-అన్నది కథ విన్నవారి సందేహం. ‘‘అది మట్టి ఇల్లే..కాని అది చీమ సొంతం. అది కష్టపడి కట్టుకొంది. అందుకే అది బంగారం. దాని ఇంట్లో పరాయివాడు ఎందుకు వేలుంచాలి?’’ అన్నది దామోదర శాస్ర్తీ వివరించిన సారాంశం. భారత జాతీయ గృహాన్ని అనాదిగా నిర్మించుకున్న వారు ఈ ఇంటిలో వేలు పెట్టిన వారిని ఎందుకని కుట్టలేదు. చైనా వేలు మాత్రమే కాదు, కాలు కూడ పెట్టింది. కోరలు చాచి మన సరిహద్దులను కుళ్లగించింది. మన ఇంటి గోడ అయిన హిమాలయాలలో తిష్ఠ వేసింది. మన కైలాసాన్ని మన మానస సరోవరాన్ని మనమే చైనాకు అప్పగించేశాము. కమ్యూనిస్టు చైనాకు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కల్పించడం కోసం 1964 వరకు మన ప్రధానిగా పనిచేసిన జవహర్‌లాల్ నెహ్రూ జీవన పర్యంతం కృషి చేశాడు. సభ్యత్వం మాత్రమేకాదు, శాశ్వత సభ్యత్వాన్ని, నిర్ణయాత్మక నిరోధక అధికారాన్ని-వీటోపవర్-పొందిన చైనా దశాబ్దులుగా మనకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. మన ప్రభుత్వాలు చీమ వలె ప్రతిఘటించడానికి యత్నించడం లేదు. మనపై దురాక్రమణను సాగిస్తున్న చైనాకు మనం ‘‘వాణిజ్య లోటు’’ రూపంలో ఏటా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విదేశీయ వినిమయ ద్రవ్యాన్ని -్ఫరెన్ ఎక్స్ఛేంజ్ కరెన్సీని- అప్పగిస్తున్నాము. మన రక్షణ వ్యయం కంటె చైనా సైనిక వ్యయం నాలుగు రెట్లు అధికంగా ఉంది. మన రక్షణ వ్యయం రెండు లక్షల నలబయి ఏడువేల కోట్లు. చైనా గత ఏడాది తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా సైనిక వ్యయం చేసింది. మనం గత ఏడాది కంటె ఈ ఏడాది పదకొండు శాతం అధికంగా రక్షణ వ్యయం చేస్తున్నాము. చైనా గత ఏడాది కంటె ఈ సంవత్సరం ఇరవై శాతం అధికంగా సైనిక వ్యయం చేస్తోంది. మనది ప్రజాస్వామ్యం, చైనాలో కమ్యూనిస్టుల ఏకపక్ష నియంతృత్వం కొనసాగుతోంది. అందువల్ల ప్రభుత్వం పని తీరులో విధానంలో పారదర్శకత లేదు. అధికారిక సైనిక వ్యయం కంటె చాలా ఎక్కువగా చైనా ప్రభుత్వం సైనికులపై ఖర్చు చేస్తోందని పాశ్చాత్య దేశలలో ప్రచారవౌతోంది. మనదేశం చైనాతో వాణిజ్యాన్ని రద్దు చేసుకుంటే మన సగటున రెండు లక్షల కోట్ల వార్షిక ఆదాయం పెరుగుతుంది. దీన్ని రక్షణకు వినియోగిచినట్టయితే మన సరిహద్దుల భద్రత పెంపొందుతుంది. ‘‘చీమ నా గురువు’’ అన్న ది దామోదర శాస్ర్తీ వ్రాసిన కథ పేరు. చీమను మన ప్రభుత్వం గురువుగా భావించాలి. మనకందరికీ దేశ రక్షణలో చీమ ఆదర్శం.. చిట్టి చీమ ఆదర్శాన్ని చిన్న ఇజ్రాయిల్ నిలబెట్టింది. పెద్ద భారత్ ఎందుకు నిలబెట్టలేదు?
హర్కత్ ఉల్ అన్సర్ ముఠాకు చెందిన మసూద్ అఝార్‌ను 1994లో కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో అరెస్టు చేశారు. 1999 డిసెంబర్‌లో జిహాదీ మన విమానాన్ని అపహరించుకొని ఆఫ్ఘనిస్తాన్‌లో దించాడు. విమాన ప్రయాణికులను విడిపించుకోవడానికై మన ప్రభుత్వం మసూద్ అఝార్‌ను నిర్బంధం నుంచి వదలి పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మసూద్ భయంకర బీభత్సకాండను కొనసాగిస్తున్నాడు. కర్తా కారయితా చైవ ప్రేరకాశ్చ అనుమోదకః..’’ చేసేవాడు, చేయించేవాడు, ప్రేరేపించేవాడు, ఆమోదించేవాడు- ఈ నలుగురు మంచి పనిలోను, చెడ్డపనిలోను సమాన భాగస్వాములు. మసూద్ చర్యలను చైనా ప్రభుత్వం ఆమోదించింది.