మెయన్ ఫీచర్

పాక్ కట్టడికే మోదీ జైత్రయాత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను, ఇజ్రాయిల్ అధినేతను కలియటంలో ఉద్దేశం ఏమిటి? వివిధ దేశాధినేతలు పరస్పర సహకార సూచకంగా ఇలా కలిసి సంప్రదింపులు జరుపుకోవడం, ద్వైపాక్షిక ఒప్పందాలు ఉభయతారకంగా చేసుకోవడం మామూలే. ఐతే, ప్రస్తుత తరుణంలో మోదీ పర్యటన విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ముందుగా ఇజ్రాయిల్ గురించి ఆలోచిస్తే అదొక శక్తిమంతమైన దేశం. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన జాతులలో ‘యూదు’ జాతి ఒకటి. వీరి చరిత్ర బైబిలులోని ‘ఓల్డ్ టెస్టిమెంట్’లో చూడవచ్చు. వందలాది సంవత్సరాలుగా తమకంటూ ఒక స్వతంత్ర దేశం లేని జాతి 1948లో టెల్ అవీవ్ రాజధానిగా ఇజ్రాయిల్ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. తమ ప్రాచీన హిబ్రూ భాషను, సంస్కృతిని పునర్నిర్మించుకున్నారు. ఇజ్రాయిలీలకు ఇంతటి ప్రాధాన్యం ఉండటానికి కా రణం ఏమంటే జీసస్ క్రైస్ట్ ఈ జాతిలో జన్మించటమే. పాలస్తీనా విమోచనా సంస్థ నాయకుడు యాసిన్ అరాఫత్‌తో భారత్ సాన్నిహిత్యాన్ని పెంచుకున్నది. ఇది నెహ్రూ, ఇందిర కాలంలోనే జరిగింది. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య. మన దేశంలోని మైనారిటీ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఇజ్రాయిల్‌ను నిర్లక్ష్యం చేశారు. అసలు గుర్తింపునే ఇవ్వలేదు. 1971లో బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించిన ఇందిరాగాంధీ ఇజ్రాయిల్‌ను గుర్తించడానికి వెనుకాడటానికి కారణం రాజకీయ ప్రయోజనాలే.
మోదీ ప్రస్తుత ఇజ్రాయిల్ పర్యటనను ఈ అంతర్జాతీయ రాజకీయ వ్యూహంలో భాగంగా చూడవలసి ఉంటుంది. ఇజ్రాయిల్ చుట్టూ తోడేళ్ల వలె అరబ్ దేశాలున్నాయి. వాటి నుండి స్వీయ రక్షణ కోసం ఇజ్రాయిల్ నిరంతరం పరిశ్రమిస్తూనే ఉంది. ఒంటి కంటి వీరుడు మోషే డయ్యన్ రోజుల నుండి గోల్టామేయర్ నెతిన్యాహుల వరకు ఇజ్రాయిల్ జరిపే ఎదురుదాడికి అరబ్బు ప్రపంచం అబ్బురపడిపోతున్నది. ‘ఇజ్రాయిల్‌కు ఇంతటి శక్తి ఎక్కడిది?’ అని ఆలోచిస్తే వారి అస్తిత్వానికి స్ఫూర్తినిస్తున్నది ఇజ్రాయిలీ జాతీయవాదం. మోదీ విజయ రహస్యం కూడా భారత జాతీయవాదం. అంటే ఇజ్రాయిల్ వెనుక మోసెస్, జీసస్‌లు ఉన్నట్లే మోదీ వెనుక వ్యాసుడు, వాల్మీకి, వివేకానందుడు ఉన్నారు. ఇజ్రాయిల్ అణుసంపత్తి గల దేశం. ఒక గంట పిలుపులో రైతులు నాగళ్లను వదిలి తుపాకీలు పట్టుకోగలరు. అంటే ఆ దేశ ప్రజలంతా సైన్యమే. అదే లేకపోతే యూదు జాతి ఇప్పటికి అంతరించిపోయి ఉండేది. ఈ విధంగా చూచినప్పుడు- ‘శత్రువుకు శత్రువు మన మిత్రుడు’ అనే చాణక్య రాజనీతి సూత్రం మోదీ పాటిస్తున్నాడు. పాకిస్తాన్ మనకు బద్ధశత్రువు. కాశ్మీర్‌ను కాదు సరికాదా మొత్తం భారతదేశాన్ని వెండిపళ్లెంలో పెట్టి ములాయం సింగ్ యాదవ్, మణిశంకర్ అయ్యర్‌లు పాకిస్తాన్‌కు సమర్పించినా వారితో మనకు శత్రుత్వం తగ్గదు. ఎందుకంటే భూమిపైన యూదులకు, హిందువులకు జీవించే అర్హత లేదని జీ హాదీలు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇండో-ఇజ్రాయిల్ మైత్రీ బంధానికి విశేష ప్రాధాన్యం ఉంది. అంటే ఈ రెండు జాతులూ తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. మోదీ, డోనాల్డ్ ట్రంప్‌ను కలియటంలో ఆంతర్యం ఏమిటి? ట్రంప్ ప్రత్యక్షంగానే ఇండో-ఇజ్రాయిల్ మైత్రిని బలపరుస్తున్నాడు. ఇంతకాలం ఇజ్రాయిల్ బతికి బట్టకట్టకలిగిందంటే అందుకు అమెరికా ప్రత్యక్ష సహకారమే కారణం. లేకుంటే ఈ ‘గొర్రె పిల్ల’ను ‘అరబ్ తోడేళ్లు’ ఎప్పుడో కబళించి ఉండేవి. ఇప్పుడు ట్రంప్-మోదీల మధ్య ప్రధానంగా పాకిస్తాన్ సమస్య చర్చనీయాంశమైంది.
ప్రపంచంలో అమెరికా, రష్యాల తరువాత అత్యధిక న్యూక్లియర్ సమృద్ధి గల దేశం భారత్ మాత్రమేనని ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధనా శాఖ వెల్లడించింది. అంటే ‘అణ్వస్త్ర సరఫరాల కూటమి’ (ఎన్.ఎస్.జి)లో ఇండియా సభ్యత్వం పొందడానికి అర్హతలున్నప్పటికీ చైనా నిరోధించడానికి, ‘వీటో’ ప్రయోగించడానికి కారణం ఆసియాపై తన ఆధిపత్యం సాధించాలనే తపనే. అమెరికా, ఇండియా, ఇజ్రాయిల్ ఒకవైపు- చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా మరొక వైపు మోహరించి ఉన్నాయి. చైనా పాకిస్తాన్ ద్వారా యురేనియమ్‌ను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్తర కొరియాకు చేర్చింది. దక్షిణ కొరియాను నిర్మూలించాలనే కోరికతో ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణులను (ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్)ను ప్రయోగించింది. తత్ఫలితంగా ఉత్తర కొరియాపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించి ప్రత్యక్ష యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నది. ఉత్తర కొరియాపై అమెరికా సైనిక చర్య తీసుకుంటే అప్పుడు చైనా రంగంలోకి దిగవలసి వస్తుంది. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఉత్తర కొరియా చైనా కబంధ హస్తాలలోకి వెళ్లగా, దక్షిణ కొరియా, జపాన్‌లు అమెరికా ధృతరాష్ట్ర కౌగిలిలో ఉన్నాయి. ఈ దశలో ఇండియా స్వీయ రక్షణ కోసం అమెరికా కూటమిని బలపరుస్తున్నది.
మరొక ముఖ్యాంశం ఏమిటంటే- ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా గుర్తించింది. ప్రపంచంలోని అన్ని ఉగ్రవాద సంస్థలకు మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి. ఒక్క ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) లోనే రెండు వందల ఉగ్రవాద శిక్షణ కేంద్రాలైన మదర్‌సాలు ఉన్నాయి. పిఒకెలో ఒకప్పుడు శృంగేరి జగద్గురువుల శారదాపీఠం ఉండేది. అక్కడి సరస్వతీ దేవాలయం నామరూపాలు లేకుండా ధ్వంసం అయ్యింది. మోదీ-ట్రంప్ చర్చలల్లో పాకిస్తాన్‌ను అధికారికంగా ఉగ్రవాద దేశంగా ప్రకటించి యుఎన్‌ఒ సభ్యత్వాన్ని రద్దుచేయాలనే ప్రతిపాదన రావచ్చు. దీనిని చైనా అంగీకరించదు. ఐతే కొద్ది రోజుల క్రితం చైనా సైనికులను పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు చంపారు. దానిని చైనా జీర్ణించుకోలేకపోతున్నది. అంటే ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ సామెత ఇక్కడ వర్తిస్తుంది. పాకిస్తాన్‌ను వలస రాజ్యంగా చైనా మార్చుకున్న తరువాత పాక్ ఉగ్రవాదులు చైనా నెత్తిమీద కూడా ‘్భస్మాసుర హస్తం’ పెట్టడానికి వెనుకాడటం లేదు.
చైనా గొడ్డు మాంసాన్ని అమెరికా నుండి దిగుమతి చేసుకునేందుకు ఒక ఒప్పందంపై మొన్ననే అంగీకారం కుదుర్చుకున్నది. దీనివల్ల చైనా అమెరికాతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నదా? అంటే సందేహమే. ఏ దేశమైనా తన స్వీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే రాజనీతిని రూపొందించుకుంటుందనేది సుస్పష్టం. ట్రంప్‌ను అమెరికాలో ‘లూజ్ కానన్’ అంటారు. అంటే ‘పిచ్చివాడి చేతిలో రాయి’ అని అర్థం. అతడు ఏ క్షణంలోనైనా ఉత్తర కొరియామీద రాయిని విసరవచ్చు. సరిగ్గా సద్దాం హుస్సేన్‌పై జార్జిబుష్ జరిపిన సైనిక చర్యలాంటిదే కొరియాపై అమెరికా జరిపితే అపుడు ఏమవుతుంది? దాని ప్రభావం మొత్తం ఆసియాపైనా, భారత ఉపఖండంపైనా స్పష్టంగా పడుతుంది.
మోదీ ఇప్పటికే బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, శ్రీలంకల మద్దతు కూడగట్టుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయిల్, అమెరికాలను సన్నిహితం చేసుకోవటం ద్వారా పాకిస్తాన్‌ను ఏకాకిగా చేయాలనేది బిజెపి వ్యూహం. ఐతే ఇందుకు మోదీ అంతర్గత ప్రతిఘటనను ఎదుర్కోవలసి వస్తుంది. మణిశంకర అయ్యర్ పాకిస్తాన్‌కు వెళ్లి ‘ఇండియాపై దాడిచేసి మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపండి’ అని దునియా టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూను మనం మరచిపోకూడదు. ‘్భరత్ నుంచి విడిపోయి మేము స్వతంత్ర తమిళనాడు దేశం స్థాపించుకుంటాం’- అంటూ ఉదయకుమార్ అనే తమిళ ఉగ్రవాది ప్రకటన చేయడం, ఆయనను దేశద్రోహ నేరంపై అరెస్టు చేయడం అందరికీ తెలిసిందే. తెలియని విషయం ఏమంటే- ఉదయకుమార్‌కు అమెరికా నుండి నిధులు రావటం. రచయిత్రి అరుంధతీ రాయ్ అమెరికా వెళ్లి ఇండియాలో మానవ హక్కులను కాలరాస్తున్నారని ప్రచారం చేసి వచ్చింది. అంటే ఇండో-అమెరికన్ మైత్రిని భగ్నం చేసే వర్గాలు ఇంటాబయటా సక్రియాత్మకంగా ఉన్నాయనేది సారాంశం. మోదీ ఇప్పుడీ సవాలును ఎలా ఎదుర్కోబోతున్నారు? శతాబ్దాలుగా బ్రిటన్ భారత్‌ను వలసవాద దేశంగా వాడుకున్నమాట వాస్తవమే అయినా, మొన్న జిహాదీల వరుసదాడులతో బెంబేలెత్తిన బ్రిటన్, ఇప్పుడు భారత్‌తో రాజకీయ మైత్రికి సుముఖంగా ఉంది. బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయిల్‌లను కూడగట్టుకొని ఇండియా ఒక అద్భుతశక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నది. అప్పుడు రష్యా ఇండియాకే మద్దతునివ్వవలసి వస్తుంది. అంటే- మోదీ పాకిస్తాన్‌పై దౌత్య యుద్ధంలో విజయం సాధించాడని ఒప్పుకోవలసి ఉం టుంది. ఇక ప్రత్యక్ష యుద్ధం నామమాత్రం. అది తుపాకులతో చేయనక్కరలేదు. బెలూచిస్తాన్, గిల్గిత్‌స్థాన్‌లను పాక్ నుండి విడదీసి స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటిస్తే పాకిస్తాన్ విచ్ఛిన్నమైపోతుంది. అందుకు మోదీ పర్యటనలు ఎంతవరకు దోహదం చేస్తాయో మరికొంతకాలం వేచి చూడవలసిందే!
ఇండో-ఇజ్రాయిల్ సంబంధాలు బలపడడానికి కొన్ని సహజ కారణాలున్నాయి. అమెరికా విషయంలో మార్పు ఎలా వచ్చింది? నిక్సన్ కాలంలో పాకిస్తాన్ అమెరికాకు వలస దేశం. ఇందిర-వాజపేయి ఇద్దరూ అమెరికాను ధిక్కరించి పోఖ్రాన్‌లో అణ్వస్త్ర పాటవ పరీక్షలు జరిపినవారే. ఐతే ఇపుడు ట్రంప్‌కు ఇంటిపోరు ఎక్కువ అయింది. ఈ దశలో ఆసియాలో ఆయనకు నమ్మకమైన మిత్రుడు అవసరం. అందువల్ల ‘ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు’ అనే అంశం ఆధారంగా సమష్టి మైత్రీబంధం నెలకొంటున్నది. ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై డోనాల్డ్ ట్రంప్ బాంబుల వర్షం కురిపించడాన్ని భారత్ స్వాగతించగా పాకిస్తాన్ అంగీకరించలేకపోతున్నది. చైనా అయితే తన అనుయాయులతో భారత్‌ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నది. సూడో సెక్యులరిస్టులు ‘హైపర్ నేషనలిజం’ అనే పదబంధం సృష్టించి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. మోదీ రచ్చ గెలిచి ఇంట కూడా గెలవాల్సిన తరుణం ఇది!
ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం బెలూచిస్తాన్‌లోని పానిగర్ ప్రాంతంలో ఒక ఇరానియన్ ద్రోన్ విమానాన్ని పాకిస్తాన్ జెట్ కూల్చివేసింది. తత్ఫలితంగా ఇరాన్-పాకిస్తాన్ సంబంధాలు తీవ్రంగా సంకటంలో పడ్డాయని అర్థం. భారత్ విదేశాంగ నీతిలో ఇప్పుడు ‘శత్రువుకు శత్రువు మన మిత్రుడు’ అనే నీతిని ఉపయోగించుకొని అమెరికా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, బ్రిటన్, శ్రీలంకలతోబాటు ఇరాన్‌ను కూడా సన్నిహితం చేసుకునే సమయం వచ్చింది. నిజానికి ఇరాన్ అనే పదం సంస్కృతంలోని ‘ఆర్యన్’ అనే పదం నుండి పుట్టిందే కదా!

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 27425668