మెయిన్ ఫీచర్

స్క్రిప్ట్ మంత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలమెప్పుడూ ఒక తీరుగా ఉండదు. అది -తెలుగు సినిమాలా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. రోజులన్నీ ఒక్కలాగే గడుస్తున్నట్టు ఉంటాయి. కానీ -ఏ రోజూ ఒక్కలా అనిపించదు. తెలుగు సినిమా కూడా అంతే. సినిమాలన్నీ ఒక్కలాగే ఉంటున్నాయని ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నా -ప్రతి సినిమా వైవిధ్యమేనని నాయినా నాయికలు, దర్శక నిర్మాతలు చెబుతూనే ఉంటారు. ప్రేక్షకుడు వింటూనే ఉన్నాడు.

ఇప్పుడిక ప్రేక్షకుడు ఇలాంటి ప్రకటనలు వినే పరిస్థితిలో లేడు. విన్నా సహించడానికి సిద్ధంగా లేడు. వైవిధ్యం అనిపిస్తే -ఓకే అంటున్నాడు. లేదంటే సినిమాని తిప్పికొడుతున్నాడు. స్టార్ హీరోలకైనా.. స్టార్ దర్శకులకైనా కొద్దికాలంగా ఇదే ఎదురవుతోంది. సో.. మళ్లీ కథ వెనక్కి వచ్చిందన్న మాట. కొంతకాలం క్రితం హీరోగా నిలబడిన కథే.. మళ్లీ ఇప్పుడు హీరో అయ్యింది. చేసిన సినిమానే మళ్లీ చేస్తానంటే స్టార్ హీరోకైనా పరాభవం తప్పదు కనుక -హీరోలూ కాస్త కిందకు ఒదిగి ‘స్క్రిప్ట్’నే హీరో చేద్దామంటున్నారు. మంచి స్క్రిప్ట్ చర్చకు వచ్చినా.. మంచి కథతో దర్శకుడు కలిసినా -ఓకే చెప్పేస్తున్నారు. ఆ దర్శకుడిని ‘క్యూ’లో పెడుతున్నారు. ఇప్పుడు తెలుగు సినిమాకు మంచి కథలు కావాలి. అది చిన్న దర్శకుడి దగ్గరున్నా -పెద్ద సినిమా పడినట్టే. పంట పండినట్టే.
***
ఒకప్పటి తెలుగు హీరోలు వరుసపెట్టి సినిమాలు చేసేసేవారు. అందుకే -వెటరన్ హీరోల సినిమా ఖాతాలు చూస్తే వందలు దాటేసి ఉంటాయి. తరువాతి హీరోలు సినిమాల జోరు తగ్గించారు. ఆచితూచి సినిమాలు చేయడం మొదలెట్టారు. క్రమంగా స్టార్ హీరోల సినిమాలు తగ్గాయి. శత సంఖ్యకు చేరడానికి ఏళ్లూ పూళ్లూ పట్టేసే పరిస్థితి వచ్చేసింది. ఈ తరం హీరోలు మొన్నటి వరకూ సినిమాలను మరీ తగ్గించేశారు. ఏడాదికి ఒక్క సినిమాతో రావడమే గగనమైంది. వెనక్కి తిరిగి చూస్తే -పాతిక సినిమాలు చేయడానికి పాతికేళ్ల కాలం పట్టేసిన పరిస్థితి కనిపించడంతో ఇప్పుడు వేగం పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. కారణం -మంచి స్క్రిప్ట్ దొరకడమే గగనమవుతుంది. సో.. మంచి కథ వినిపించినపుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం బెటరన్న ఆలోచన ఇప్పటి హీరోల్లో కనిపిస్తోంది. అందుకే -రెండు మూడు ప్రాజెక్టులకు ఒకేసారి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. హీరోలు కొత్త స్ట్రాటజీ ప్రదర్శిస్తుండటంతో -దర్శకుల్లోనూ వేడి పుట్టింది. ఒక సినిమా చేస్తున్న హీరోను అప్రోచ్ అయి కథ ఓకే అనిపించుకుంటే -ఏళ్ల తరబడి ఆగాలేమోనన్న భయాలు ఇప్పుడు లేదు. మంచి కథతో హీరోని ఒప్పిస్తే -చేతిలోవున్న ప్రాజెక్టులు పక్కన పెట్టయినా సినిమాను తెరకెక్కించే అవకాశం రావొచ్చన్న ఆశలతో వైవిధ్యమైన స్క్రిప్ట్‌లపై దృష్టిపెడుతున్నారు. దీంతో దర్శకులకు పని పెరిగింది. హిట్టుకొట్టి ప్రాజెక్టుల వేగం పెంచిన వాళ్లు కొందరైతే, ఫ్లాప్‌ల కారణంగా చాలారోజుల పాటు సెట్స్‌కి దూరమైన దర్శకులూ స్క్రిప్ట్‌పై బిజీ అయిపోతున్నారు. మంచి స్క్రిప్ట్‌లతో హీరోలను కలిసేందుకు మరికొందరు ఉవ్విళ్లూరుతున్నారు.
నిజానికి పెద్ద హీరోలు ఎప్పుడూ ఖాళీగా ఉండరు. దీనికితోడు కొత్త కథలను ఓకే చేసుకుని దర్శకులను లైన్లో పెడుతున్న స్ట్రాటజీయే. అలా చాన్స్ దక్కిన శేఖర్ కమ్ముల, బాబీ, బివిఎస్ రవిలాంటి దర్శకులు హీరోలతో ఇప్పటికే ఎంగేజై ఉన్నారు. మిగిలిన వాళ్లపైనే ఇండస్ట్రీ ఆసక్తి కనబరుస్తోంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా పేరు తెచ్చుకున్న కొందరు డైరెక్టర్లు తరువాతి ప్రాజెక్టు ఏం చేయబోతున్నారోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో ఉంది. ఒకపక్క బాహుబలి, ఖైదీ నెంబర్ 150 లాంటి హిట్లు ఇచ్చిన దర్శకులు రాజవౌళి, వివి వినాయక్‌లాంటి వాళ్లే కాదు, చిన్న సినిమాతో పెద్ద హిట్టు అందుకున్న దర్శకులూ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన అంశం.
ఖైదీ నెంబర్ 150తో సూపర్ హిట్టు అందుకున్న వివి వినాయక్, ఇంతవరకూ తదుపరి ప్రాజెక్టు అనౌన్స్ చేయలేదు. ఏ హీరోతోనూ ఎంగేజ్ కాలేదు కూడా. వినాయక్ తదుపరి స్టెప్‌పైనా ఆసక్తి కనబడుతోంది. అఖిల్ ప్రాజెక్టుతో అడుగుతడబడిన వినాయక్, ఖైదీ 150తో మంచి ఊపుమీదే ఉన్నాడు. మళ్లీ అలాంటి హిట్టుకొట్టే కథతోనే సినిమా చేయాలన్న ఆలోచనతో ఆచితూచి అడుగులేస్తున్నాడు. మంచి స్క్రిప్ట్ సిద్ధమైన తరువాతే, అందుకు సూటయ్యే హీరోను కలిసే అవకాశం ఉంది. ఆ హీరో ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్‌లాంటి వాళ్లు అయి ఉండొచ్చు.
బాహుబలి సీక్వెల్స్‌తో రాజవౌళి తన స్టామినా చూపించాడు. అంతకు ముందువరకూ రాజవౌళి తీసిన సినిమాలు ఒకఎత్తయితే, బాహుబలి తరువాత తీయబోయే సినిమా మరొక ఎత్తు అన్నంత ఆసక్తి కనబడుతోంది ఇండస్ట్రీలో. మహాభారతాన్ని భుజానికెత్తుకుంటాడని కొంతకాలం ప్రచారం సాగినా -ఆ ప్రాజెక్టును మరొకరు ప్రకటించడంతో ఊహాగానాలకు తెరపడ్డాయి. రాజవౌళి తరువాతి స్టెప్ -బాలీవుడ్‌కేనన్న అంచనాలూ వెలువడ్డాయి. రాజవౌళితో ప్రాజెక్టు అంటే -బాలీవుడ్‌లోని టాప్ హీరోలు సైతం నో చెప్పకపోవచ్చు. కానీ, ఇంతవరకూ జక్కన్న నుంచి అలాంటి ప్రయత్నాలు కనిపించడం లేదు. బాహుబలిని ‘టు థౌజండ్’ మార్క్‌కు తీసుకెళ్లే ప్రయత్నాల్లోనే నిమగ్నమై ఉన్నాడు. ఇంకొన్ని దేశాల్లో బాహుబలి విడుదల కావాల్సి ఉంది కనుక, ఆయా దేశాల్లోని ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. అడపాదడపా తరువాతి ప్రాజెక్టు గురించి చర్చ వచ్చినా, మదిలోమాట మాత్రం ఇంతవరకూ బయటకు చెప్పలేదు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసే కథతోనే ప్రాజెక్టు చేస్తాడా? లేక కొత్త స్కీం ఏమైనా తెరపైకి తెస్తాడా? అన్న మీమాంశ ఉంది. తెలుగు నిర్మాతలతో సినిమాలు చేస్తానని జక్కన్న నర్మగర్భంగా చెప్పడం వెనుక -స్టార్ హీరోలతో సినిమా చేసే ఆలోచన ఉందన్న అంచనాలూ లేకపోలేదు. హీరో మహేష్‌తో కథ చేయొచ్చన్న వాదన వినిపించినా -మహేష్ బిజీగా ఉండటంతో రాజవౌళి ఎదురు చూస్తాడా? అన్నదే ప్రశ్న. మహేష్ ‘స్పైడర్’ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. వెంటనే కొరటాల శివతో ‘్భరత్ అను నేను’ ప్రాజెక్టుతో ఎంగేజయ్యాడు. అది పూర్తయ్యేసరికి వంశీ పైడిపల్లి ప్రాజెక్టు రెడీగా ఉంది. అప్పటి వరకూ రాజవౌళి ఆగే సమస్యే ఉండదు. సో.. తెలుగు సినిమా చేస్తే ఎన్టీఆర్‌తో ప్రాజెక్టుపై దృష్టి పెట్టొచ్చని సన్నిహితుల మాట.
ముందు ప్రాజెక్టులతో ఫ్లాపులు అందుకున్న దర్శకులూ కొత్త వాతావరణంలో జోరు చూపించే ప్రయత్నాలతో ముందుకెళ్తున్నారు. ఒక్క స్క్రిప్ట్ కెరీర్‌నే మార్చేస్తుందన్న ఆశతో వైవిధ్యమైన కథలను సిద్ధం చేసుకునే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. వరుస డిజాస్టర్లతో దాదాపు రేసులో వెనక్కిపోయిన శీను వైట్ల, ఓకే డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని, శ్రీకాంత్ అడ్డాల, వాసువర్మ, కిషోర్ పార్ధసాని, సంతోష్ శ్రీనివాస్, బొమ్మరిల్లు భాస్కర్, దశరథ్, వీరుపోట్లలాంటి దర్శకులూ హిట్టుకోసం తాపత్రయపడుతున్నారు. పెద్ద హీరోల నుంచి పిలుపు లేకపోవడంతో చిన్న హీరోతోనైనా హిట్టందుకుని, మళ్లీ ఫాంలోకి రావాలన్న ప్రయత్నాల్లో దర్శకులున్నట్టు కనిపిస్తోంది.
ఇక ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లాంటి భారీ సినిమా చేసిన తరువాత దర్శకుడు క్రిష్ తెలుగు సినిమా ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. వైవిధ్యమైన కథతోనే మళ్లీ సినిమా చేయాలన్న ఆయన ప్రయత్నాలు సాంకేతికంగా ఫలించకపోవడంతో -బాలీవుడ్‌పై దృష్టి పెట్టాడు. అటు వెంకటేష్, ఇటు మహేష్‌తో ప్రాజెక్టు ప్రయత్నాలు ముందుకెళ్లక పోవడంతో, బాలీవుడ్‌లో ఎప్పుడో అనుకున్న ‘మణికర్ణిక’ను తెరపైకి తెచ్చాడు. క్విన్ కంగనారనౌత్‌తో ఇప్పటికే ప్రాజెక్టు మొదలైంది. అంటే, తెలుగులో క్రిష్ సినిమా పట్టాలెక్కాలంటే -చేతిలోని ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉంది. అప్పటికి తెలుగు హీరోలతో ప్రయత్నాలు వర్కవుటైతే -క్రిష్ కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టొచ్చు. ముందు చిత్రాలతో హిట్లు అందుకున్న చంశ్రేఖర్ యేలేటి, నందిని రెడ్డి, నక్కిన త్రినాథరావు, సంకల్ప్‌రెడ్డిలాంటి దర్శకులు, హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా పెద్ద చిత్రాలపైనే దృష్టిపెట్టే గుణశేఖర్ లాంటి దర్శకులు తరువాతి ప్రాజెక్టులను ఇంతవరకూ ప్రకటించనే లేదు. రేసులో నిలబడగలిగే వైవిధ్యమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్న తరువాతే స్క్రీన్ మీదకు వచ్చే ఆలోచనతో కనిపిస్తున్నారు.
సరైన స్క్రిప్ట్ దొరికితే, అది పెద్ద హీరోతో వర్కవుటైతే -ఒక్కరోజులోనే మళ్లీ స్టార్ డైరెక్టర్ హోదా అందుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటున్న హీరోలను, మంచి కథతో ఒప్పించడమే ఇప్పుడు దర్శకుల ముందున్న టాస్క్. హీరోని ఒప్పించగలిగితే నిర్మాతలకు కొదువ లేదు. సో.. -వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకోవడం దర్శకుడి వంతు. చిన్న, పెద్ద సినిమాలతో పేరు తెచ్చుకున్న తెలుగు దర్శకులు ఇప్పుడు అదే పనిలో పడ్డారు. హిట్లు అందుకున్నవాళ్లూ, ఫ్లాపుల్ని మూటగట్టుకున్న దర్శకులూ -సరైన స్క్రిప్ట్‌ను వండి వార్చే పనిలో నిమగ్నమయ్యారు.

చిత్రాలు.. సంతోష్ శ్రీనివాస్ * శీను వైట్ల *దశరథ్ *గోపీచంద్ మలినేని *బొమ్మరిల్లు భాస్కర్ * డాలీ * వాసూ వర్మ