మెయన్ ఫీచర్

‘మత్తు’ దిగితేనే యువతకు భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం ఎప్పుడూ ఒకేరకంగా ‘నల్లేరు మీది బండి నడకలా’ సాఫీగా సాగిపోతే- అది జీవితం ఎందుకవుతుంది..? ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు జీవన యానంలో ఎవరికైనా తప్పవు. మనిషిలో ఉండే మంచి చెడులు, బలాలు బలహీనతలు, స్వయంకృత దోషాలు ఇవే చాలా వరకు బతుకు బండి దశ, దిశను నిర్దేశిస్తూ వుంటాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగానో, విధివశానో సంభవించే కష్టనష్టాలకు మనం బాధ్యులం కాము. కానీ చేతులారా చేసుకునే తప్పులకు, పొరపాట్లకు, తెలివితక్కువ చర్యలకు పూర్తిగా మనదే బాధ్యత అవుతుంది. అంతేకాదు.. మన ప్రమేయం లేకుండా ముంచుకొచ్చే ఆపదలకు సాటి మనుషుల సానుభూతి, సహకారం వుంటుందేమో గానీ చెడు వ్యసనాలకు లొంగిపోయే బలహీన మనస్కులకు అది కూడా దొరకదు. అందరూ తప్పులను వేలెత్తి చూపిస్తారు. నిందిస్తారు.
బాల్యం, యవ్వనం, కౌమార ప్రాయాల్లో కౌమార దశ అత్యంత కీలకమైనది. ప్రతి అడుగూ ఆచి తూచి వెయ్యాల్సిన వయసు అది. నాలుగు బజార్ల కూడలిలో నిల్చుని ఎటు వెళ్లాలో తోచక ఎవరైనా మార్గనిర్దేశం చేస్తే బాగని ఎదురుచూసే విలువైన సమయం అది. అలాంటి స్థితిలో తప్పటడుగో.. తప్పుటడుగో పడితే..? ప్రస్తుతం మన హైదరాబాద్ నగరంలో చాలామంది యువత పరిస్థితి అలాగే వుంది. మొన్నీమధ్యనే ఓ పెద్ద డ్రగ్ మాఫియా అసాంఘిక కార్యకలాపాలు రట్టు కావడంతో నగరంలో అల్లకల్లోల వాతావరణం, భయనక పరిస్థితులు నెలకొన్నాయి. స్కూలులో చదువుకుంటున్న ఓ అమ్మాయి తన సెల్‌ఫోన్‌లోని వాట్సాప్ గ్రూపులోని ఒక వ్యక్తికి ‘డ్రగ్స్ తీసుకుంటే చాలా బాగుందనీ.. ఇంకా కావాలని’ కాల్ చేయటంతో ఈ డ్రగ్ మాఫియా గుట్టు రట్టయి తీగ లాగితే డొంకంతా కదిలి వచ్చినట్టు చెబుతున్నారు. ఇంతకుముందు ఒకటో, రెండో డ్రగ్ కేసులు తగిలినా నిందితులను శిక్షించకుండా చూసీ చూడనట్టు వ్యవహరించి ఉన్న పోలీసులు ఇప్పుడు పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడటంతో మీడియా వాళ్లకి ఆ విషయం తెలిసి రచ్చ రచ్చ కావడంతో మొత్తం పోలీసు యంత్రాంగాన్ని కార్యోన్ముఖులను చేయక తప్పలేదు! దాంతో ఒక్కొక్కటిగా డ్రగ్ ఎడిక్ట్ కేసులు, డ్రగ్స్ సప్లయ్ చేసే ముఠాల చీకటి దందాలు బయటికి వస్తూ కొండవీటి చాంతాడంత పెద్ద లిస్టు ఇప్పటికే తయారైపోయింది.. ఇంకా తయారవుతోంది. అందులో అందరూ సెలబ్రిటీలు, సినిమా రంగంలోని వాళ్ళు, హైక్లాస్ మనుషులేనట! వాళ్ళ పుత్రరత్నాలు.. పుత్రికామణులు కూడా ఉన్నారట.
మనిషికి డబ్బుయావ, డబ్బు పిచ్చి ఎప్పుడైతే పట్టుకుంటుందో అప్పుడే అతని పతనం ప్రారంభమై.. అథఃపాతాళానికి లాక్కెళుతుంది. అందులోనూ డబ్బు ఉన్నవాడికి ఇంకా ఇంకా సంపాదించాలన్న అత్యాశ..! ఆ అత్యాశ దురాశగా మారాక కోట్లకు కోట్లు (ఉన్నవి చాలవన్నట్లు) అక్రమ మార్గంలోనైనా సంపాదించటానికి పూనుకుంటాడు. ఒక పక్క సమాజంలో లేనివాడు తినడానికి తిండికి కూడా లేక ‘అన్నమో రామచంద్రా’ అని ఏడుస్తుంటే.. సగటు మనిషి చాలీ చాలని జీతం రాళ్ళతో ఆర్థిక సమస్యలతో అల్లాడుతుంటే.. కోట్లు కూడబెట్టినవాడు మాత్రం మరిన్ని కోట్లు దండుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతూ వున్నాడు. లెక్కాపత్రం లేకుండా అంతగా సంపాదించిన అక్రమార్జనతో పిల్లలకు స్పోర్ట్స్ బైకులు, విలాసవంతమైన కార్లూ కొనిచ్చి.. జేబుల నిండా డబ్బు కుక్కి.. అచ్చోసి సమాజం మీదికి వదిలేయటం వల్లనే కదా.. వారు డ్రగ్ ఎడిక్టులుగా, డ్రగ్ సప్లయర్స్‌గా, మాఫియా గ్యాంగ్ సభ్యులుగా పోలీసులకు పట్టుబడుతున్నారు. వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడమే గాక మిగతా యువత జీవితాలను కూడా బుగ్గిపాలు చేస్తున్నారు.
డ్రగ్ ఎడిక్షన్ అనేది భయంకరమైన ఒక మహమ్మారి లాంటిది. అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి ఈ అలవాటు అంటువ్యాధిలా వ్యాపించిపోతుంది. హుక్కా సెంటర్లలో ‘దమ్ మారో దమ్’ అంటూ గంజాయి దమ్ముతో మొదలయ్యే ఈ అలవాటు హెరాయిన్, కొకెయిన్, బ్రౌన్ షుగర్- ఇలా రకరకాల మత్తుమందుల ఉపయోగానికి దారితీస్తుంది. చిన్నపిల్లలు తినే చాక్లెట్‌లలో కూడా నల్లమందు పెట్టి అమ్ముతున్నారంటే పరిస్థితి తీవ్రతను మనం అంచనా వేయవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే బిళ్లలు, పౌడర్లు, నరాలకు చేసుకునే ఇంజక్షన్లు- ఇలా రకరకాల రూపంలో డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. పిల్లల జీవితాలను సర్వనాశనం చేసేటంత దుష్ఫలితాలు వీటివల్ల ఉంటాయి. ఎక్కువగా ఇవి విదేశాల నుంచి సరఫరా కావటం.. ఇక్కడ జోరుగా డ్రగ్స్ వ్యాపారం నడవటం ప్రస్తుతం నడుస్తున్న దుష్టచరిత్ర. దీనికి వెంటనే చెక్ పెట్టకపోతే ముందు ముందు ముందు చాలా ప్రమాదం.
ఇలాంటి ‘వ్యసనపరుల సమాజాన్ని’ చూసి ఆలోచనా శక్తి, వివేకం ఉన్న ప్రతి మనిషీ భయంతో వణికిపోతున్నాడు. రేపటి నా దేశ పౌరులు ఇలా మత్తులో జోగుతూ.. డ్రగ్ మాఫియా చేతుల్లో జీవితాన్ని యవ్వన ప్రాయంలోనే బుగ్గి చేసుకుంటే ఇక దేశానికి ముందు ముందు దిక్కెవరు? అని దేశ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. అందులోనూ అది మామూలు మత్తా..? వంటిమీద అస్సలు సోయి లేకుండా చేసే మత్తు! మళ్లీ మళ్లీ ఆ మత్తు మందు దొరకకపోతే భయంకరంగా, రాక్షసంగా ప్రవర్తనను మార్చేసే.. నరాలమీద తీవ్ర ప్రభావం చూపించి చివరకు మృత్యువును కౌగిలించుకునేలా చేసే మత్తు! ఒక్కసారి పిల్లలు దాని బారిన పడ్డారంటే ఇక వాళ్ల జీవితాలు నరకప్రాయమే.. తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇలా మొత్తం కుటుంబం మీద దాని ప్రభావం కచ్చితంగా పడిపోతుంది. మొదటి దశలో గుర్తించి రిహాబిటేషన్ ట్రీట్‌మెంట్ ఇప్పిస్తే.. ఏదైనా కొంత ప్రయోజనం ఉంటుందేమో గానీ ఆ దశ దాటిపోతే ఆ తరువాత ఇంక ఏం చేసినా ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే’ అవుతుంది! ఒక బ్రిలియంట్ స్టూడెంట్‌ని, ఒక టాలెంటెడ్ యంగ్ చాప్‌ని, ఒక రీసెర్చి స్కాలర్‌ని, ఒక మేధావిని డ్రగ్ మాఫియా గ్యాంగ్‌లు టార్గెట్ చేసి వాళ్ళను ‘మత్తుకు బానిసలు’గా మారిస్తే- అది ఈ దేశానికే తీరని నష్టమే! మత్తుమందు కారణంగా మన యువశక్తి నిర్వీర్యం కాడవమో, నాశనం కావడమో జరిగితే.. దేశం బలహీనపడిపోతుంది.. ఎంతో నష్టపోతుంది.
చాపకింద నీరులా ఎప్పటినుంచో మెల్ల మెల్లగా ఈ హైదరాబాద్ నగరంలోని యువత జీవితాల్లోకి మెల్లగా పాకి, వరదై విజృంభించి తాజాగా బయటపడిన ఈ డ్రగ్ మాఫియా గురించి పరిశోధన చేసి.. దోషులను శిక్షించి.. మత్తు మందుల సరఫరాను కూకటివేళ్ళతో పెకిలించి అవతల పారేయకపోతే ముందు ముందు ఆ విషం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పాకి దేశంలోని యువతనంతా కబళించే ప్రమాదం ఉంది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు ఇంతవరకూ పిల్లలు డ్రగ్స్ బారిన పడటానికి పరోక్షంగా కారకులైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ప్రభుత్వాలు ఇలా అందరూ ఆత్మవిమర్శ చేసుకుని.. చేసిన తప్పుకు చింతిస్తూనే ముందు జాగ్రత్తలు ఇకనైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తల్లిదండ్రులు తమ పిల్లలమీద ఒక కనే్నసి ఉంచడం, అవసరాన్ని మించి డబ్బు వారికి అందుబాటులో ఉంచకపోవడం, పబ్బులకు, క్లబ్బులకు, రేవ్ పార్టీలకు పంపకపోవడం వంటివి చేయాలి. ఉపాధ్యాయులు పిల్లలు క్లాసులో మత్తుగా ఉండటాన్ని, చురుకుదనం, తెలివి లోపించడాన్ని గమనిస్తే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్ శాఖలు బాధ్యతగా పనిచేసి సాంఘిక అరాచక శక్తులను సమాజం నుంచి తరిమి తరిమి కొట్టగలగాలి. డ్రగ్ మాఫియా వ్యాపారాన్ని కూకటివేళ్ళతో పెకళించగలగాలి. ఇలా భారీ ఎత్తున ఏ పనైనా చేయాలంటే.. సంఘ విద్రోహులతో తలపడాలంటే అది సామాన్యుల వల్ల అయ్యే పనికాదు. ప్రభుత్వమే తన యంత్రాంగంతో ఆ పనికి పూనుకోవాలి. తెలంగాణలో బయటపడిన డ్రగ్ మాఫియాలను వెంటనే అణచేయకపోతే ‘బంగారు తెలంగాణ’ కల నెరవేరటం చాలా కష్టం అని మన పాలకులు తెలుసుకోవాలి. రాష్ట్రానికి వెనె్నముక లాంటి యువత మత్తులో జోగుతూ వంటిమీద సోయి లేకుండా ఇలాగే ఉంటే ఇంకెక్కడి రాష్ట్భ్రావృద్ధి? కానీ, జరగదనే మనం ఆశించాలి. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా స్ట్రిక్ట్..! ఏ ఎంఎల్‌ఏ, ఏ మంత్రి చిన్న తప్పు చేసినా వెంటనే మందలించి క్లాస్ తీసుకునే ఆయన ఇంత పెద్ద మాఫియా గ్యాంగ్ అంతు చూడకుండా వదిలిపెట్టరు. ఆ గ్యాంగ్ లీడర్స్‌కి సింహస్వప్నంగా మారి తీరుతారు. దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం ఆయన ఆశయం మరి! మన అందరి ఆశయం కూడా ‘డ్రగ్ ఫ్రీ సిటీ’నే!

- డా. కొఠారి వాణిచలపతిరావు