మెయిన్ ఫీచర్

మత్తులో ఘాటెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌ప్లేలో యాక్షన్ ఎపిసోడ్ మొదలు కాబోతోంది. రేపటి నుంచి వరుసగా ‘డ్రగ్గర్ల’ నిగ్గు తేలుస్తామంటూ -సిట్ హీరోలు సీన్ షెడ్యూల్‌ను ముందే ప్రకటించారు. మత్తు వాడకం దారులకు కౌన్సిలింగ్ ఇస్తామంటూ -విచారణకు సంబంధించి క్లూ కూడా ఇచ్చేశారు. అంటే -ప్రీ క్లైమాక్స్‌కు చేరిన ‘మత్తు’ వ్యవహారంలో అధికారుల విచారణా విధానానే్న బట్టే క్లైమాక్స్ ఉండబోతోందన్న మాట. ఇప్పుడిక క్లైమాక్స్‌ను అంచనా వేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
***
క్రైంని బిజినెస్ చేస్తామంటూ తెరపై భారీ డైలాగులు పలికించిన టాలీవుడ్ -అకస్మా‘త్తు’ ఉపద్రవంతో అదిరిపోయినట్టు కనిపించడం లేదు. అందుకు -ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. భయపడిపోతున్నట్టు ఓపెన్ స్క్రీన్‌పై ఎక్స్‌ప్రెషన్స్ పలికించడం తప్ప, డ్రగ్గర్లంతా ధీమాగానే ఉన్నారు. వన్యప్రాణుల్ని వేంటాడిన కేసుల్లోనే సినీ హీరోలను చట్టాలేమీ చేయలేకపోయాయి. ఉగ్రవాద కార్యకలాపాల అభియోగాలు ఎదుర్కొన్న వాళ్లనూ ఏమీ చేయలేక చేతులెత్తేశాయి. అలాంటిది, ఆఫ్ట్రాల్ ఒకింత మత్తును ముక్కున పెట్టుకుంటే -ఏమైనా చేయగలుతుందా? అన్నది మత్తుగాళ్ల లెక్క.

ఏతావాతా టెన్షనంతా -సినీ అభిమానులు, మీడియాలోనే కనిపిస్తోంది. -అబ్కారీ ఆఫీస్ ఐదో అంతస్తులో ‘హీరో’లకు, కోరినచోట విచారణ జరిపేందుకు ‘హీరోయిన్ల’కు ఆఫర్ అందింది కనుక -విచారణ తరువాత ఎలాంటి సమాచారం బయటకు వస్తుందోనన్న చిన్న ఆసక్తి మాత్రమే ఇప్పుడుంది. మత్తువెనుక మహామహులున్నా తాట తీయండంటూ సర్కారు సైతం భయపెట్టే హెచ్చరికలు గుప్పించినా -చట్టాన్ని అతిక్రమించి చర్య తీసుకునే అవకాశం లేదు కనుక.. ‘డ్రగ్గర్ల’కు ఎలాంటి శిక్షలు పడతాయన్నదే అసలు ప్రశ్న. చట్టం తన పని తాను చేసుకుపోతే -మత్తును రుచి చూసిన వాళ్లకు మహా అయితే కౌనె్సలింగ్.. కాదంటే వార్నింగ్.. లేదంటే ఫైన్? ఇంతేగా అంటున్నవాళ్లూ లేకపోలేదు. ఏం జరిగిందో అందరికీ తెలిసిందే కనుక, ఏం జరుగుతుంది? ఏం జరగబోతోంది? అనేది వెండితెరపైనే చూడాలి.
***
భళ్లున బ్రహ్మాండం బద్ధలైనట్టు -తెలుగు సినిమా ఒక్కసారిగా ఆకాశం నుంచి కిందికి పడింది. పరిశ్రమలోని పలువురి డ్రగ్స్ వ్యవహారాల సంగతి పదిమందికీ తెలిసిపోయింది. మాదకద్రవ్యాల వినియోగంలోనూ మన ‘హీరో’లు ముందువరుసలో ఉన్నారన్న విషయం తెలిసి -తెలుగు సినీ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారే తప్ప, పరిశ్రమలోని వాళ్లు కాదు. ఇప్పటివరకూ ‘సెలబ్రిటీ’లుగా ఆరాధించిన తారలు -చీకటి తెరల చాటున ఘోరమైన తప్పిదాలు చేస్తున్నారని తెలిసి అవాక్కవుతున్నది జనమే. దర్శకుల నుంచి హీరోలు, హీరోయిన్లు అనేకమంది ‘మత్తు’ మహారాజులేనంటూ వస్తోన్న వార్తలతో ఇండస్ట్రీవైపు మరో దృష్టితో చూస్తున్నారు.
***
కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడు వచ్చిన అవకాశాలకు కాల్షీట్లు అందించలేక, మూడు షిప్ట్‌లు పనిచేస్తూ రిలాక్సేషన్ కోసం డ్రగ్స్‌కు అలవాటుపడ్డారన్న విషయం -వింటోన్న కథనాలను బట్టి అర్థమవుతూనే ఉంది. అవకాశాలు తగ్గుముఖం పట్టినపుడు మానసిక స్థయిర్యాన్ని కోల్పోయి డ్రగ్స్‌కు బానిసలైనట్టూ వివరాణాత్మక కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. ఒక్క సినిమాలో నటిస్తే వచ్చిపడే ఆదాయాన్ని ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిలో డ్రగ్స్ వైపు మళ్లుతున్నారన్నది మరోచోట వినిపిస్తోన్న కథనం. పరిశ్రమలో కొందరు ‘తాత్కాలిక శృంగార పటుత్వం’ కోసమూ మాదక ద్రవ్యాలను ముక్కున వేస్తున్నారన్నది మరో కథనం. ఏ కథలోనైనా, కథనంలోనైనా -డ్రగ్స్ మాత్రం కామన్‌గా కనిపిస్తోంది. మరికొందరు తారలు మూడు షిఫ్ట్‌లు పని చేసి -ముఖంలో కాంతి కోల్పోతే వర్చస్సు కోసమూ వాడుతున్నారన్న వాదనా వినిపిస్తోంది. దాదాపుగా సుఖాన్ని అందించే ఎలాంటి వస్తువునైనాసరే ఆస్వాదించి, తరువాత ఇక ఆస్వాదించటానికి ఏదీ లేనపుడు డ్రగ్స్ వైపు మళ్లుతున్నారనీ అర్థమవుతోంది. పోలీసు అధికారులు కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ -డ్రగ్స్‌ను ఉపయోగించిన సినిమావాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తామని, అలాకాకుండా మత్తుతో వ్యాపారం చేస్తోన్న వాళ్లకు మాత్రం తగిన దండన తప్పదని స్పష్టం చేస్తున్నారు. ఈరకంగా చూస్తే సినీ నటులెవరూ ఆ వ్యాపారం చేస్తున్నట్టుగా ఆధారాలు దొరక్కపోవచ్చు.
గతంలో అభిషేక్ అనే వర్థమాన నటుడు డ్రగ్స్‌ను అమ్ముతూ పట్టుబట్టాడు. అప్పటినుంచే ఈ జాఢ్యం సినీ పరిశ్రమలో వేళ్లూనుకుందన్నది జాగ్రత్తగా గమనిస్తే అర్థమయ్యే విషయం. అప్పట్లో ఆ విషయాన్ని ఉదాసీనంగా వదిలేయడంతో -ఇప్పుడదే వటవృక్షమైంది. కొకైన్, ఎఫిడ్రిన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డి, చెరస్, మాండాక్స్, మార్జువానా, ఆశిష్‌ఆయిల్ లాంటి ‘మత్తు’లు సినీ పరిశ్రమతో గమ్మత్తుగా పెనవేసుకుపోయాయి. 2004లో దాదాపు వందకోట్ల విలువైన డ్రగ్స్‌ను జీడిమెట్ల ప్రైవేట్ ఫాంలో తయారు చేస్తుండగా పట్టుకున్నారు. దాదాపు ఏడెనిమిదేళ్ళ నుంచి డ్రగ్స్ కల్చర్ టాలీవుడ్‌లో అడపాదడపా కనిపిస్తోంది. అయితే ఎవరూ నోరెత్తలేదు. మనకు సంబంధం లేదులే అన్నట్టే.. బాధ్యతారహితంగా వ్యవహరించటంతో అదే ఇప్పుడు తలవంచుకునే పరిస్థితి తెచ్చింది.
2011లోనే ఫారిన్‌లో చదువుకుని, సినిమా అవకాశాల కోసం టాలీవుడ్‌కు వచ్చిన వర్థమాన హీరోలు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారంటూ కథనాలు వచ్చాయి. అప్పట్లో కొందరి పేర్లు బయటకు వచ్చినా -పరిశ్రమలో పెద్ద కదలిక లేదు. ఆ అలవాటు అలా అలా విస్తరించి పరిశ్రమలో పదిమందికీ అంటుకోవడంతో -అదే ఇప్పుడు పెద్ద కుదుపైంది. ఒక కొత్తలోకం, అనూహ్యమైన ఆనందం, ఎక్కడికెక్కడికో తీసుకెళ్లి తేల్చిపారేసే చిటికెడి చిట్కా -డ్రగ్. తెలిసి తెలిసి మహాతెలివైన సినిమావాళ్లు, అద్భుతమైన సృజనాత్మక రంగంలోవున్న దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ సాలెగూటి మాయలో పడటమే అత్యంత బాధాకరమైన విషయం. ఒక్కసారి రుచి చూస్తే వదలలేని జాఢ్యమిది. చిత్ర పరిశ్రమ బలహీనతను ఆసరా చేసుకుని డ్రగ్గర్ కెల్విన్ కోట్లు సంపాదించేశాడు. సినిమా పరిశ్రమమీద వున్న కసినంతా తీర్చేసుకున్నాడు. చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ ప్రేక్షకులకు దేవుళ్లుగా మారిన తారలను చూశాం. ఇప్పుడు మత్తులో చితె్తైపోతున్నవారిని, సంఘానికి ఎటువంటి సందేశం ఇవ్వలేని వారిని చూస్తూవుంటే పరిశ్రమ భిన్నమైన కోణంలో ప్రస్తుత చిత్రం కనిపిస్తోంది. పాత తారలుకాకుండా కొత్తగా సెలబ్రిటీలుగా మారిన వారంతా దాదాపు ఇదే మోజులో జోగుతున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. పాశ్చాత్య నాగరికత పరిశ్రమలోకి సంగీతం ద్వారాకాని, కథలపరంగాగాని వచ్చేసినపుడే ఈ నయా కల్చర్ కూడా ప్రవేశించింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ మత్తుమందుల వ్యవహారం భవిష్యత్‌లో పెను తుపానులనే సృష్టించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కూకటివేళ్ళతో పెకలించాలన్న కృతనిశ్చయంతో ఉన్నా, ఎంతవరకూ సాధ్యమన్నదీ అనుమానాస్పదమైంది. ఒకవైపు పేజ్ 3 సెలబ్రిటీలుగా వెలుగుతోన్న తారలనుంచి అనేక కోణాల్లో వస్తున్న వత్తిళ్లు, మరోపక్క చట్టంలోని లొసుగుల కారణంగా -ఎన్ని కేసులు నిలబడతాయి. మత్తుకు బానిసలైన ఎంతమంది శిక్షార్హులవుతారు అన్నది ప్రశ్నార్థకంగానే మారింది.
మత్తు వ్యవహారానికి సంబంధించి ఆబ్కారీ అధికారులు అరెస్టుల పరంపర కొనసాగించడానికే ఉద్యుక్తులవుతున్నారు. సూత్రధారి కెల్విన్ ఫోన్ డేటా ఆధారంగా మరికొందరి కీలకమైన వ్యక్తుల పేర్లూ బయటకు రాబోతున్నాయి. వెల్లడికానున్న జాబితాలో పరిశ్రమలో శక్తివంతమైన వ్యక్తులు, వారి సంతానం ఉండటంతో -కేసు ఎటుతిరిగి ఎక్కడ నీరుగారి పోతుందోనన్న అనుమానాలూ లేకపోలేదు. రెండు మూడు రోజుల క్రితం వరకూ మాదక ద్రవ్యాల మొత్తం వినియోగదారుల పరిశ్రమలో 27మంది వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. అదికాస్తా ఇప్పుడు దాదాపు 50కి చేరుతోంది. ఏదేమైనా తప్పుకి సరైన శిక్ష పడుతుందా? లేక చట్టంలోని వెసులుబాట్లతో తప్పించుకునే అవకాశం ఉంటుందా? అన్నదే చర్చనీయాంశంగా మారుతోంది.
ఒక్క తెలుగు పరిశ్రమలోనే ఈ జాఢ్యం ఉందా? అంటే, కాదు దేశమంతా ఉందన్నది అందరికీ తెలిసిందే. బాలీవుడ్ నుండే దాదాపుగా డ్రగ్స్ బానిసత్వం నటులకు అలవాటైంది. దేశంలోని అన్ని భాషలకు సంబంధించిన సినీ పరిశ్రమల్లో ఈ డ్రగ్స్ వ్యవహారం సాగుతూనే వుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కట్టడి చేస్తే సరిపోదు. ఓవైపు అన్ని భాషల సినీ పరిశ్రమలతోపాటు, విద్యార్థులకూ ఈ జాఢ్యం విశృంఖలంగా పాకింది. ఈ పరిస్థితిని సమర్థంగా తప్పికొట్టాలంటే -రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా కేంద్రం కూడా చట్టాలను మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మాదకద్రవ్యాల వినియోగం కేసులో పట్టుబడితే శిక్షలు కేవలం నగదు చెల్లించి బయటపడేలా ఉంటే పరిస్థితిలో ఎప్పటికీ మార్పు రాదన్నది నిజం. అంతర్జాతీయ స్థాయిలో సాగే డ్రగ్స్ వ్యవహారాన్ని కట్టడి చేయాలంటే శిక్షలు ఎంతో కఠినంగా ఉంటే తప్ప సాధ్యం కాదు.
***
ఇదిలావుంటే -సినిమా పరిశ్రమకు సంబంధించి నోటీసులు అందుకున్నవారంతా తామెలాంటి తప్పు చేయలేదని ఇప్పటినుంచే మొదలుపెట్టారు. కెల్విన్ కాల్ లిస్ట్ నుంచి లాగిన కూపీతో పరిశ్రమకు మంటపెట్టిన తరువాత, బయటకు పేర్లు పొక్కిన వాళ్లందరి స్టేట్‌మెంట్ ఒక్కటే -నేనింత వరకూ డ్రగ్స్ ఎలా ఉంటాయో చూడలేదని. కనీసం అల్లోపతి మందులు కూడా వాడిన పాపాన పోలేదని, డ్రగ్స్ ఎలా వాడగలమన్న చిత్రమైన ప్రశ్నల్ని అధికారులకే సంధిస్తుండటం విడ్డూరాన్ని కలిగిస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే, కెల్విన్ చాలా మంచి వ్యక్తి అని, అతనికి ఏ పాపమూ తెలియదని, అతని సంబంధీకులు ఇటీవల ప్రకటించిన విషయం చూస్తుంటే ఎన్ని తప్పులు చేసినా ఒప్పుకోకపోవడం అనే ఓ కళ కూడా తెలిసి ఉండాలని అర్థమవుతోంది. ఇంతకన్నా మరో వింత -డ్రగ్స్ కేసులో బయటికి వచ్చిన ఓ నటుడు మిగతా వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నంలో -ఇప్పుడు వినిపిస్తున్న పేర్లల్లో ఎవరికీ డ్రగ్స్ వాడాల్సిన అవసరం లేదని తేల్చిపారేశాడు. షూటింగ్ అయిపోయాక ఎవరి మానాన వాళ్లు ఎక్కడో అక్కడ ఫామ్‌హౌసుల్లోకో, పబ్బుల్లోకో, బారుల్లోకో పరిగెత్తే మిగతా నటీనటుల అందరిపై ఆయన నిఘా పెట్టినట్టుగానే చెప్పాడు మరి. ఆశ్చర్యం కదూ! ఎన్ని ఆధారాలు చూపించినా ఒప్పుకోకపోతే ఏం చేయాలి?
ఏదేమైనా టాలీవుడ్ వ్యవహారం మిగతా అన్ని సినిమా వుడ్‌లకు ఓ ప్రశ్నలాంటిది. ఓ అనుభవం లాంటిది. ఓ ఉదాహరణ లాంటిది. కనుక సుఖాలకోసం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే సినిమా పరిశ్రమ ఎక్కడ ఉన్నా సరే అక్కడ కెల్విన్‌లు పుట్టుకొస్తూనే ఉంటారు. అందుకే -పరిశ్రమకు వచ్చిన ప్రతి సాంకేతిక నిపుణుడికి, నటీనటులకు ముందు నైతిక విలువలపై అవగాహన కల్పించాలి. సంఘంపై వారికి గురుతరమైన బాధ్యత ఉందని, సంఘానికి చీడపురుగులా మారకూడదని శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-సరయు శేఖర్