మెయన్ ఫీచర్

భద్రతా వైఫల్యం వల్లే ‘అమర్‌నాథ్’ విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమర్‌నాథ్ సుప్రసిద్ధ శైవక్షేత్రం. ఇక్కడ లింగాకారంలో మంచు ఉంటుంది. ఇక్కడ శివ దర్శనానికి ఏటా దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇటీవల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల భయం ఎక్కువ కావడంతో యాత్రికులకు భద్రతాదళాల రక్షణ కల్పించారు. కొద్ది రోజుల క్రితం యాత్రికుల బస్సుపై ‘లష్కరే తోయిబా’కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేసి నిరాయుధులైన భక్తులను చంపారు. ఇలా మరణించిన వారిలో గుజరాత్‌లోని సూరత్ ప్రాంతానికి చెందిన స్ర్తిలు ఉన్నారు. గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం, జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు మోదీకి సవాలు విసిరారని అర్థం. ‘అమాయకులైన, నిరాయుధులైన తీర్థయాత్రికులపై మీరెందుకు దాడి చేశారు?’ అని ఉగ్రవాద సంస్థలను ప్రశ్నిస్తే వారు చెప్పిన సమాధానం- ‘ఈ యాత్రికులు హిందూ కాఫిర్లు. కాబట్టి దాడి చేశాం’ అని. అంటే ఇక్కడ కాశ్మీరు సమస్య కాదు, సామాజిక ఆర్థిక సమస్యలూ లేవు. ఇది కేవలం హిందూ జాతిని నిర్మూలించాలని పాకిస్తాన్ చేస్తున్న కుట్రలో అంతర్భాగమేనని గుర్తించాలి. 1947లో పాకిస్తాన్ అవతరణకు కూడా అదే కారణం. ఆనాడు పాకిస్తాన్ ఆవిర్భావానికి మహమ్మద్ అలీ జిన్నాకు కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు మద్దతునిచ్చారు. ఇప్పుడు అమర్‌నాథ్ యాత్రికులపై దాడి జరిగినపుడు ‘అవార్డు వాపసీ బ్రిగ్రేడ్’ సభ్యులు- మీగడ తిన్న పిల్లుల వలె తమకేమీ సంబంధం లేనట్లు మిన్నకుండిపోయారు. ఇది కుహనా లౌకికవాద ద్వంద్వ ప్రమాణాలకు తిరుగులేని ఉదాహరణ.
కాశ్మీరు అనాదిగా భారతదేశంలో అంతర్భాగం. అక్కడి ‘బారాముల్లా’ అనే పదం ‘వరాహ క్షేత్రం’ అనే సంస్కృత పదానికి వర్తమాన వ్యావహారిక రూపం. పూర్వం జయాపీడుడు అనే రాజు కాశ్మీరాన్ని పరిపాలించాడు. ఆయన ఆస్థానంలో ఉద్భటుడు అనే శైవ సిద్ధాంత దార్శనికుడు ఉండేవాడు. ఈయనకు సంబంధించిన వివరాలను తెలుగులో తెనాలి రామకృష్ణుడు ‘ఉద్భటాచార్య చరిత్ర’ పేరుతో ఒక పద్యకావంగా రచించారు. ఇలాంటి వివరాలకు కల్హణుడు రచించిన ‘రాజు తరంగిణి’ సంస్కృత గ్రంథం చూడవచ్చు.
ఇస్లాం మతోన్మాద ఉగ్రవాదులు నిరాయుధులైన అమర్‌నాథ్ యాత్రికులపై దాడి చేసినప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యం’ అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించాడు. సరే? అలాగే ఒప్పుకుందాం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ‘ఇది పిరికిపందల చర్య’ అని రొటీన్ డైలాగును పత్రికా ప్రకటన రూపంలో విడుదల చేసింది. వాస్తవానికి ఉగ్రవాదులు పిరికిపందలు కారు. వారిని ఎదుర్కోలేని కేంద్ర ప్రభుత్వానే్న ‘పిరికిపందల గుంపు’ అనాలేమో! ఐతే- ఇది ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వానికి వర్తించదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అరవై సంవత్సరాలు పిరికిపందలు పాలించారు. వీరికి దేశ రక్షణ పట్టదు. కాశ్మీరు నుండి ఆరు లక్షల మంది హిందూ పండిట్లను 1990వ దశకంలో కట్టుబట్టలతో తరిమివేస్తే ‘ఇది తమకు సంబంధం లేని విషయం’ అన్నట్లు అకర్మణ్యతతో నాటి ప్రభుత్వాలు ప్రవర్తించాయి. ఈ నిర్లక్ష్యానికి పరాకాష్టయే అమర్‌నాథ్ యాత్రికులపై నేటి దాడి.
కాశ్మీరులో నేడు మెహబూబా ముఫ్తీ సరుూద్ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈమె పాకిస్తాన్ ఏజెంటు అని అందరికీ తెలుసు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే- బిజెపి, మెహబూబాతో కలసి మంత్రివర్గం ఏర్పాటు చేయటం. ‘ఆరు లక్షలమంది కాశ్మీరు పండిట్లు తిరిగి కాశ్మీరుకు తిరిగిరండి’ అని ముఖ్యమంత్రి మెహబూబా పిలుపునిచ్చింది. ఐతే- కాశ్మీరుకు తిరిగి వెళ్లినవారు ఎందరో తెలుసా? కేవలం ఇద్దరు దంపతులు. మరి తక్కినవారు ఎందుకు వెళ్లలేదు? అంటే, వారి మాన ప్రాణాలకు అక్కడ రక్షణ లేదు కాబట్టి. ఇదీ కాశ్మీరు వర్తమాన ముఖచిత్రం. 1947లో మహాత్మాగాంధీని భయపెట్టి మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్‌ను స్థాపించుకున్నట్లే ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని బెదిరించి ‘స్వతంత్ర కాశ్మీరు రాజ్యాన్ని’ నిర్మించాలని ప్రయత్నం జోరుగా సాగుతోంది. దీనికి చైనా బహిరంగంగా మద్దతునిస్తున్నది. సౌదీ అరేబియా లాంటి కొన్ని ముస్లిం దేశాలు తీవ్రవాదులకు నిలయమైన పాకిస్తాన్‌కు సహాయం చేస్తున్నాయి. ‘అసలు ఈ యాత్రికులను అమర్‌నాథ్‌కు ఎవరు వెళ్లమన్నారు? ఇంట్లో కూర్చొని భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు కదా’- ఇదొక వాదం. ‘అమర్‌నాథ్ క్షేత్రంలో భగవంతుడు లేడు. అది కేవలం లింగాకారంలో కన్పించే ఒక మంచుముద్ద. దానిని చూడడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోవటం ఏమిటి? ప్రజలకు కావలసింది కూడు-గుడ్డ-నీడ-విద్య - వైద్యం- ఉపాధి. ఇవేవీ లేకుండా అమరనాథ యాత్రలేమిటి? ఈ యుద్ధాలేమిటి?’- ఇది సామ్యవాదుల వాదం. నిజమే కదా! యుద్ధం ఎవరికీ ఇష్టం కాదు. కానీ- దేశరక్షణ మాటేమిటి? తాజాగా రష్యా తన దేశ రక్షణ దృష్ట్యా ముప్ఫయి మంది అమెరికా దౌత్య సిబ్బందిపై నిషేధం విధించింది.
చైనా భూటాన్‌లోకి ప్రవేశించి ‘డోక్లామ్ ప్రాంతం మాది, ఇండియా జోక్యం చేసుకుంటే ఖబడ్దార్’ అని బెదిరించింది. అంతేకాదు, పెషావర్ సమీపంలోని కొండలలో పాకిస్తాన్ అణ్వాయుధాలను నిర్మిస్తున్న చిత్రపటాలు ఉపగ్రహానికి అందాయి. చైనా న్యూక్లియర్ సబ్‌మెరిన్ గడ్వార్ కరాచీ పోర్టులో పొంచి ఉంది. ‘హార్స్ ఆఫ్ ఆఫ్రికా’లోని జిటౌటీ వద్ద చైనా భారీ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఇదంతా కూడు,గూడు, గుడ్డ, విద్య, వైద్యం, ఉద్యోగాల కోసమా? లేక ప్రపంచ వ్యాప్తంగా తన సామ్రాజ్యవాద విస్తరణ కోసమా? దీనికి ములాయం సింగ్, మణిశంకర అయ్యర్, మనీష్ తివారీ, ఘనశ్యామ్ తివారీ వంటి లౌకికవాదులు ఏం సమాధానం చెపుతారు?
ఈ నెల 11వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మన దేశంలో చైనా రాయబారితో రహస్య సంభాషణలు జరిపి వచ్చాడు. మరుసటి రోజున ఈ వార్త ‘లీక్’ అయింది. ‘అలాంటి సమావేశం జరుగలేదు. అంతా అబద్ధం’ అని ఉదయం ఆరు గంటలకు ఒక పత్రికా ప్రకటన వెలువడింది. ఐతే మీడియా ఇందుకు తగిన సాక్ష్యాధారాలు చూపించింది. స్వయంగా చైనా రాయబార కార్యాలయం నుండి అలాంటి సమావేశం జరిగినట్లు ఒక ప్రకటన వెలువడింది. దీంతో అదేరోజు సాయంత్రం రణజిత్ సర్జీవాలా అనే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ- ‘నిజమే! చైనా దౌత్యవేత్తను రాహుల్ గాంధీ కలిశాడు. ఐతే ఏమిటిట?’ అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక్కడ గమనించవలసిన ఒక అంశం ఉంది. భూటాన్‌ను రక్షించే బాధ్యతను ఇండియా ఒక ఒప్పందం ద్వారా తన మీద వేసుకున్నది. చైనా సైన్యం ఇప్పుడు భూటాన్‌లో ప్రవేశించింది. ఈ దశలో చైనా దౌత్యవేత్తతో రహస్య సంభాషణలు దేనికోసం? దీనిని ‘దేశద్రోహం’ అంటారు. మణిశంకర అయ్యర్ పాకిస్తాన్‌కు వెళ్లి- ‘మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే మీరు ససైన్యంగా రావలసిందే’ అని కరాచీలోని దునియా టీవికి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాడు. మరి ఈయనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి?
లోగడ కేంద్రంలోను, పలు రాష్ట్రాల్లోను సంకీర్ణ ప్రభుత్వాలుండేవి. అవి డిఎంకె, సిపిఎం వంటి పార్టీల మద్దతుతో నడిచాయి. ప్రస్తుతం కేంద్రంలో బిజెపికి స్పష్టమైన మెజారిటీ ఉంది. అలాంటప్పుడు మణిశంకర అయ్యర్, అజాం ఖాన్ వంటి నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దీనికి కేంద్ర ప్రభుత్వం 125 కోట్ల భారత ప్రజలకు సమాధానం చెప్పాలి. పాకిస్తాన్ సైనికులు కిడ్నాప్ చేసిన భారతీయుడు కులభూషణ జాదవ్‌ను విడిపించవలసిందిగా అంతర్జాతీయ కోర్టు తీర్పు నిచ్చింది. మరి కులభూషణ్ ఏమైనాడు? ఇప్పటికే అతనిని పాకిస్తాన్ వారు చంపివేశారని అనధికార వార్తలు వస్తున్నాయి. ఇక, ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని బిజెపి తన ఎన్నికల మానిఫెస్టోలో గొప్పగా ప్రకటించింది. మూడేండ్ల పుణ్యకాలం హరించుకొనిపోయింది. 370వ అధికరణాన్ని ఎందుకు రద్దు చేయలేదు? ఎగువ సభలో కూడా ఇప్పుడు అధికార పార్టీకి క్లియర్ మెజారిటీ వస్తున్నది కదా- ఇక సాకులు చెప్పి కేంద్రం తప్పించుకోజాలదు. అలనాడు శ్యాంప్రసాద్ ముఖర్జీ నుండి నేడు అమర్‌నాధ్ యాత్రికుల వరకు ఎందరో ‘్భరత జాతి సమగ్రత’ కోసం బలిదానాలు చేశారు. ఈ త్యాగాలన్నీ నిష్ఫలమేనా? కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా ఇకనైనా కొన్ని సత్వర చర్యలు తీసుకోవాలి.
ఆరు లక్షల మంది కాశ్మీరీ పండిట్లకు కాశ్మీరులో పునరావాసం కల్పించాలి. అందుకు మెహబూబా ప్రభుత్వం అంగీకరించకపోతే ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. తాత్కాలికంగా రాష్టప్రతి పాలన విధించాలి. ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. చైనా నుండి భారతదేశానికి ఏటా రెండు లక్షల కోట్ల విలువైన సరుకు దిగుమతి అవుతున్నది. దీనిని వెంటనే ఆపివేయాలి. ఇండియాలో పాకిస్తాన్ దౌత్య కార్యాలయాలన్నీ మూసివేయాలి. కాశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదులకు సహకరిస్తున్న హురియత్ కాన్ఫరెన్స్ వంటి వేర్పాటువాద సంస్థపై నిషేధం విధించాలి. దేశ వ్యితిరేక వ్యాఖ్యలు చేస్తూ సమగ్రతను దెబ్బతీస్తున్న నేతలపై కేసులు పెట్టాలి.
ఇజ్రాయిల్ వెళ్లి వచ్చిన ప్రధాని మోదీ ఆ దేశం నుండి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాలి. హిందూ జాతి ప్రస్తుతం యూదు జాతిని ఆదర్శంగా తీసుకోవాలి. పాకిస్తాన్‌తో స్వల్పకాలిక యుద్ధానికి (షార్ట్ టర్మ్ వార్) భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనే వార్తలు లీక్ అయినాయి. అది జరగడానికి ముందు ఇత్తెహాదుల్ మజ్లిస్, సిమీ, ముస్లిం లీగ్ వంటి ఉగ్రవాద సంస్థలను కట్టడి చేసి దేశంలో అంతర్గత భద్రతను పెంచాలి. ఇలాంటి కఠోర నిర్ణయాలు లేకుండా కేవలం మొక్కుబడి ప్రకటనల వల్ల ఈ దేశానికి భద్రత అసాధ్యం.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్