మెయన్ ఫీచర్

అవినీతిని నిలదీస్తే అభాండాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా డెల్టాకు సకాలంలో నీరందించడంలో వరుసగా మూడో సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభ్వుం విఫలమైందనేది కాదనలేని కఠోర వాస్తవం. మూడేళ్లుగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాలో లక్షలాది ఎకరాల్లో పంటలను కాపాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహా అధికార తెదేపా నాయకులు వాస్తవాలను తొక్కిపట్టి విపరీత ప్రచారం చేస్తున్నారు. పనిలో పనిగా తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏమీ చేయలేదంటూ బురద జల్లుతున్నారు. రైతుల పక్షాన ఉన్నవారెవరూ ఈ వైఖరిని సహించరు. పులిచింతల ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలో పూర్తి చేయలేదా? పులిచింతలే లేకుంటే కృష్ణా డెల్టా బతికేదా?
పట్టిసీమ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణానదికి అనుసంధానం చేశామని, కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు నీరిస్తున్నామని అవాస్తవాలు చెబుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పడిపోతోందన్న సంగతిని అధికార పార్టీ నేతలు గ్రహించాలి. 2013-14లో ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనలతో పాలన కుంటుపడిన మాట వాస్తవం. చివరిలో రాష్టప్రతి పాలన వచ్చింది. అంతటి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ 13 జిల్లాల ఏపిలో ఖరీఫ్, రబీ సీజన్లలో 25.23 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. ఆ తర్వాత తెదేపా అధికారంలోకి వచ్చిన గత మూడేళ్ళలో ఆ స్థాయిలో వరి పండలేదు. తొలి ఏడాది (2014) రాష్ట్రం మొత్తం మీద రెండు సీజన్లూ కలుపుకొని 23.94 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. నూతన రాష్ట్రం, కొత్త ప్రభుత్వం గాడిన పడేసరికి ఖరీఫ్ గడిచిపోయిందని తప్పించుకున్నారు. రెండో ఏడాది 2015-16లో 21.61 లక్షల హెక్టార్లకు, 2016-17లో 20.37 లక్షల హెక్టార్లకు వరి సాగు విస్తీర్ణం తగ్గింది. కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా నీరు అందించి ఖరీఫ్ పంటలు కాపాడామని ఎంతగా ప్రచారం చేసినా వాస్తవానికి ఆయకట్టు చివరి భూముల్లో వరి సాగు కాలేదు. కొన్ని చోట్ల వరి చేలు ఎండిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో వరికి బదులు మినుములు, కందులు, పెసలు తదితర అపరాల పంటలు సాగుచేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి నీరివ్వలేకపోవడంతో అసలు సేద్యమే సాధ్యం కాలేదు. ‘హంద్రీ-నీవా’ అన్నా అతీ గతీ లేదు. ఖరీఫ్‌లో నీటికి కటకట ఏర్పడటంతో ఇక రబీలో కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్, కెసి కెనాల్‌లో ఆయకట్టులో వరి సాగు చేయనే లేదు. నెల్లూరులో నిరుడు దుర్భర కరువు ఏర్పడటం, సోమశిల ప్రాజెక్టులోకి పెద్దగా నీరు చేరకపోవడంతో పెన్నా డెల్టాలోనూ వరి సాగు తగ్గింది. ఇందులో నిజం లేదని అధికార పార్టీ నేతలు చెప్పగలరా?
పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరివ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టడం లేదు. కానీ, 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పక్షంలో ఈ వ్యవధిలో అత్యంత వ్యయంతో కూడిన పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకనేదే మా ప్రశ్న? ‘గోరంత లాభానికి కొండంత ఖర్చు’ అవసరమా? పైగా ఇది తాత్కాలిక పథకం. చుక్క నీటిని నిల్వ చేసేందుకు అవకాశం లేదు. అధికారంలో ఉన్నవారు ఎంత కాదన్నా- పులిచింతలే లేకుంటే కృష్ణా డెల్టా ఏమైపోయేదో రైతులకు ఎవరూ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పట్టిసీమ ప్రాజెక్టుపై 1,600 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఇందులో అసలు ప్రా జెక్టు వ్యయం కన్నా అవినీతే ఎక్కువ జరిగిందని, ప్రజాధనం దుర్వినియోగమైందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కుండబద్దలు కొట్టింది. పట్టిసీమ అవినీతి పుట్టుకను ‘కాగ్’ బయటపెట్టింది. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే దీన్ని నిర్మించారని, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని నివేదిక ఇచ్చింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనుల అంచనా విలువ టెండర్లలో పేర్కొన్న ప్రకారం రూ.1,170 కోట్లు. జీవో నెంబర్ 94 ప్రకారం ఐదు శాతానికి మించి అదనపుధరకు పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించకూడదు. కానీ, 21శాతం అదనపుధరతోప్రైవేట్ సంస్థ టెండర్ షెడ్యూలు దాఖలు చేసింది. ఐదు శాతం అదనపు ధరకు- ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తే 16 శాతం బోనస్ ఇచ్చేలా నిబంధనలు సడలించి ఆ సంస్థకే ప్రభుత్వం పనులు అప్పగించిందని, దీనివల్ల అంచనా వ్యయం పెరిగిందని ‘కాగ్’ తేల్చింది. పట్టిసీమ ఎత్తిపోతలకు సంప్రదాయ పద్ధతుల్లో రూ.147 కోట్లతో పంప్ హౌస్ నిర్మించాలని అంచనాల్లో ఉన్నప్పటికీ డయాఫ్రమ్ వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో పంప్ హౌస్ నిర్మాణానికి అనుమతించడం వల్ల అంచనా వ్యయం రూ.253.17 కోట్లకు పెరిగిందని, ఇది కూడా కాంట్రాక్టర్‌కు నిధులను దోచిపెట్టే చర్యగా ‘కాగ్’ పేర్కొంది. ప్రాజెక్టులో కాంట్రాక్టర్‌కు రూ.272.02 కోట్ల మేర అనుచితంగా లబ్ధి చేకూర్చిందని స్పష్టం చేసింది. పట్టిసీమ 20 ఏళ్ళు పనిచేస్తుందని ప్రభుత్వం చెప్పడంపైనా ‘కాగ్’ మండిపడింది. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పట్టిసీమ ఎందుకూ పనికిరాదని కూడా తేల్చి చెప్పింది. ఇదంతా అనవసర వ్యయంగా తేల్చిపారేసింది కూడా. దీనిని పాలకులు అంగీకరించారా? మరోపక్క పట్టిసీమ నుండి తరలించే నీటిలో తమ వాటా సంగతి ఏమిటని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. దీనిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది కూడా. ఇక పట్టిసీమ ప్రాజెక్టును పనిచేయించడానికి విద్యుత్, ఇతర నిర్వహణ ఖర్చులు కోట్లలోనే ఉంటున్నాయి. ఇందులో కనీసం 10 శాతం నిధులను తెలంగాణలోని పులిచింతల నిర్వాసిత గ్రామాలకు పరిహారంగా ఇచ్చి ఉన్నట్లయితే దాదాపు 50 టిఎంసిల వరకు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేది కాదా? అవినీతి సంగతిని పక్కన పెడదాం. పట్టిసీమ ద్వారా అద్భుతాలు జరుగుతున్నట్లు భావిస్తున్నట్లయితే- తెదేపా ప్రభుత్వం అధికారం చేపట్టాక పట్టిసీమ నిర్మాణం, నిర్వహణ, దాని నుంచి తరలించిన నీరు ఎంత? దానికైన వ్యయం, ఒనగూరిన ప్రయోజనం ఏమిటి? అన్న విషయమై వాస్తవాలతో శే్వతపత్రం ప్రకటించాలి.
పోలవరం ప్రాజెక్టుపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదని తెదేపా నేతలు అభాండాలు వేయడం హాస్యాస్పదం. ఏనాడో మరుగునపడిన పోలవరం సాకారమైంది ఎవరి వల్ల? కాంగ్రెస్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి వల్ల కాదా? ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చింది ఎవరు? ఆనాడు ప్రాజెక్టుకు అనుమతులతో సంబంధం లేకుండా ముందుగానే కాలువలు తవ్వించారు. నీరు లేకుండా, అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని అప్పట్లో తెలుగుదేశం నాయకులు అవహేళన చేశారు, అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టారు. చివరకు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బంద్‌లకు పిలుపునిచ్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి రాయలసీమకు నీళ్లందిస్తే- కృష్ణా డెల్టాకు అన్యాయం చేస్తున్నారని పాదయాత్రలు, ఆందోళనలు చేశారు. ఇప్పుడు ఆ కాలువలనే వినియోగించుకుని పట్టిసీమ ద్వారా ఇటు కృష్ణా డెల్టాను, అటు రాయలసీమను సైతం సస్యశ్యామలం చేశామంటూ ప్రస్తుత పాలకులు ప్రజలకు చెబుతున్నారు. కృష్ణా డెల్టాకు 80 టిఎంసిల పైచిలుకు నికర జలాలు ఉన్న విషయాన్ని మరిచిపోయారు. కృష్ణాకు వచ్చిన వరదనీటిని శ్రీశైలం రిజర్వాయర్‌లోకి రాకమునుపే జూరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఎత్తిపోతల పథకం ద్వారా తరలించుకుపోతుంటే చోద్యం చూస్తున్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులను నిర్మిస్తూ తెలంగాణ సర్కారు ఏపీకి వచ్చే కృష్ణా జలాలకు గండి కొడుతుంటే మిన్నకుండిపోయారు. ఇలా చేష్టలుడిగిన తెదేపా నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం తగునా? గుజరాత్‌లో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం- ఈ విజయం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వాలు, ప్రధానమంత్రి కృషి వుందని అన్నారు. కానీ, కాంగ్రెస్ హయాంలో చుక్కనీరు పారనట్లు, గత మూడేళ్లలోనే అద్భుతాలు సాధించినట్టు తెదేపా వారు మాట్లాడటం సబబు కాదు. సాగునీటి ప్రాజెక్టుల సాకారానికి, పురోగతికి కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని అంగీకరించి తీరాలి.
పోలవరం ప్రాజెక్టును 2018కే పూర్తిచేసే పక్షంలో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు అవసరమా? ఈ వ్యయంతో పోలవరం హెడ్ వాటర్ వర్క్స్ నిర్మాణం పూర్తిచేసుకోవచ్చు కదా? ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.40 వేల కోట్లకు పెంచేశారు. ఇందులో పదహారువేల కోట్ల రూపాయల మేరకే కేంద్రం నిధులు సమకూరుస్తామని చెప్పింది. ఏడాదికి రూ.పదివేల కోట్లు ఖర్చుచేసినా వచ్చే ఏడాదికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాదు. తాజాగా మొదటి దశలో- కాఫర్ డామ్ అని చెబుతున్నారు. దీని ద్వారా గోదావరికి వరద వచ్చినపుడు కాలువలకు నీటిని మళ్లిస్తామంటున్నారు. పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టి కాఫర్ డ్యాం (మట్టి ఆనకట్ట) నిర్మిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇది కూడా మరో పట్టిసీమ అవుతుందని, తాత్కాలికంగా ఏదో చేశామని చెప్పడానికి పోలవరాన్ని పక్కన పెడుతున్నారా? ప్రభుత్వ జల విధానం ఏమిటో ఇప్పటికీ రైతులకు అర్థం కావడం లేదు. ఒక పక్క అన్నీ ఇచ్చాం.. పంటలు వేసుకోండి, భారీగా దిగుబడులు సాధించండి అంటున్నారు. మరోపక్క ఆరుతడి పంటలకే పరిమితం అవ్వండి అంటూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 45 రోజులు గడిచినా కాలువలకు నీటి విడుదలపై ప్రభుత్వం నుంచి భరోసా లేదు. మరోపక్క కాలువల ఆధునీకరణపై నిర్లక్ష్యం ఫలితంగా ప్రకాశం బ్యారేజి నుంచి వదులుతున్న నీరు శివారు భూములకు అందని పరిస్థితి నెలకొంది. బ్రాంచి కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు ఎక్కడికక్కడే చెత్తతో పేరుకుపోయి నీటి ప్రవాహం ముందుకు కదలని పరిస్థితి ఉంది. ప్రస్తుతం కోస్తా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు చేరుతోంది. తెలంగాణలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పులిచింతలలో నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే గోదావరి నుంచి వరద నీరు భారీగా సముద్రంలోకి వెళుతోంది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రా, తెలంగాణలోని కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రకాశం బ్యారేజి నుంచి కూడా కృష్ణా జలాలలను సముద్రంలోకి నీరు వదలాల్సిన పరిస్థితి రావచ్చు. ఇప్పటికైనా రైతులకు నీటి లభ్యతపై దిశానిర్దేశం చేయాలని, నీటిపారుదల సక్రమంగా జరిగేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

-కొలనుకొండ శివాజీ సెల్: 98662 00463