మెయన్ ఫీచర్

కాలక్షేపం ‘కమిషన్లు’.. తీరుమారని చదువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ బలమైన రాజకీయ పార్టీ సహేతుక సిద్ధాంతంతో రాసుకున్న ఎజెండాను అమలు చేయడానికి క్యాడర్‌ను, దానిని నడిపించే ఓ నాయకుణ్ణి ఎదిగించి పాలన సాగిస్తుంది. కానీ, సిద్ధాంత రాహిత్యంతో నాయకుడు బలంగా వుండి, పార్టీ బలహీనంగా వుంటే నాయకుడే అన్నీ తానవుతాడు. వీరు రెండు రకాల ఎజెండాను కలిగి వుంటారు. ఊహాజనితమైన ఎజెండా పార్టీపరంగా కనబడితే, అదృశ్య శక్తులు రూపొందించే మరో ఎ జెండాను ఓ ఏజెంటుగా ఈ నాయకుడు ముందుకు తెస్తూ వుంటాడు. ఇలా పార్టీ ఎజెండాల కన్నా, అతీతశక్తుల ఎజెండానే ప్రామాణికంగా మారుతుంది. గత ఏడు దశాబ్దాలుగా ఈ దేశంలో ఇలాంటి వారసత్వమే కనపడుతున్నది. నెహ్రూ కాలంలో కొంతమేరకు, జనతా పార్టీ హయాంలో కొంత మెరుగ్గా పార్టీల ప్రాధాన్యత కనపడినా, ప్రస్తుతం పార్టీల కన్నా వ్యక్తులే ప్రధానంగా మారిపోయారు. ఇలా పార్టీయే వ్యక్తి చుట్టూ తిరగడం ప్రారంభమైంది. దీంతో ఏ సమస్య కూడా సమూలంగా పరిష్కరించబడక పోగా, మరికొన్ని జటిలమయ్యాయి. విద్యారంగమే దీనికి చక్కని ఉదాహరణ. నేటికి విద్యారంగంపై ఏ రాజకీయ పార్టీకి ఓ స్పష్టమైన దృక్పథం లేకుండా పోయింది.
1960 ప్రాంతంలో ఈ ప్రయత్నం కొంత సాగినా, తర్వాతి కా లంలో వివిధ కమిషన్లు ఇచ్చిన నివేదికలకు విలువ లేకుండా పోయింది. కమిషన్ల నివేదిక అమలుకై మరో కమిటీని వేసి కాలయాపన చేయడం మొదలైంది. 1964 నాటి విద్యా కమిటీ నివేదిక ఆచరణ వైఫల్యాల్ని, 1968 నాటి నూతన విద్యా విధాన డ్రాఫ్టు అమలు లోపాల్ని ఎత్తిచూపిన 1986 నాటి విద్యా విధానం సమూల విద్యారంగ మార్పులకు శ్రీకారం చుట్టింది. కాని రాజీవ్‌గాంధీ హత్య అనంతరం అవి అర్ధంతరంగా ఆగిపోవడం, తర్వాతి వచ్చిన ప్రధానమంత్రులు నిలదొక్కుకోకపోవడం, 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రపంచాన్ని ఓ పలుపు తిప్పడం, దీనికనుకూలమైన ఆర్థిక విధానాలే రూపొందడంతో, విద్యారంగాన్ని కూ డా ప్రపంచీకరణ నేపథ్యంతో తిరగ రాయడానికై తిరిగి 1992లో రామ్మూర్తి కమిటీని ఏర్పాటు చేశారు.
తొలిసారి ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్యారంగాన్ని సమూలంగా మార్చాలని ప్రయత్నం మొదలుపెట్టినా, అదీ ఓ కొలిక్కి రాలేదు. తిరిగి యుపిఎ ప్రభుత్వం రావడం, రెండు దఫాలు పాలించినా విద్యారంగాన్ని పట్టించుకోక పోగా, విద్యను మార్కెట్ సరకుగా మార్చివేసింది. ప్రైవేటీకరణకు ఊతమిచ్చింది. విద్యారంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరించింది. ప్రభుత్వం కనుసన్నల్లో నడవాల్సిన విద్యారంగం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీనిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల విధానాల్ని శిరోధార్యంగా భావించడం మొదలైంది. బండి కార్పొరేట్లదైతే గుర్రంలా ప్రభుత్వం బండిని లాగడం ప్రారంభించింది. దీంతో ఏ విద్యా కమిషన్ గాని, కమిటీ గాని ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించే సూచనల్ని చేయకపోగా, ప్రైవేట్ విద్యాలయాలకు, విశ్వవిద్యాలయాలకు తావిచ్చేవిధంగా నివేదికల్ని రూపొందించడం మొదలైంది. కొన్ని జనరంజక సూచనల్ని కమిషన్లు చేసినా, అవి కార్యాచరణకు నోచుకోలేదు.
టిఆర్‌ఎస్ సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక ఈ కోవకు చెందిందే! కనీసం చర్చకు కూడా నోచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా దాన్ని అటకెక్కించారు. ఇందుకు కారణాల్ని బయట పెట్టని మోదీ ప్రభుత్వం వెనువెంటనే మరో కమిటీని పురమాయించింది. క మిటీ నివేదిక ఆచరణ సాధ్యం కాదని భావిస్తే కొన్ని మార్పులతో లేదా ఆచరణ సాధ్యమైన వాటినే అమలుచేసి, మిగతా విధి విధానాలపై మరో కమిటీని వేయడం ఆనవాయితీ. కానీ, కేంద్ర ప్ర భుత్వం దీనికి తావివ్వకుండా ఏడాదిపాటు అయిదుగురు కమిటీ సభ్యులపై ఇతర యంత్రాంగంపై, నిర్వహణపై కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును ఖర్చుపెట్టి, పనికిరాకుండా చేసింది. దీనికి ఎవరు జవాబుదారీ అనేది ఈ వ్యవస్థలో ఏనాటికీ తేలని అంశమే! సుబ్రహ్మణ్య కమిటీ నివేదికలో అభిశంసించాల్సిన అంశాలేంటో ప్రభుత్వం వివరించలేదు. పైగా అందులో కొత్తగా చేర్చిన వింతలు లేవు. గత కమిటీలు ప్రస్తావించినట్లే నర్మగర్భితంగా నొప్పించక, తప్పుకునే విధంగానే వివిధ అంశాల్ని చర్విత చరణంగా ప్రస్తావించడం జరిగింది. నిర్భయ కేసులో వర్మ కమిటీ- యూనిఫాంలో వున్నవారు కూడా (మిలటరీ / పోలీసులు) నేరం చేసినట్టు రుజువైతే సాధారణ నేరస్తుల్లాగానే పరిగణించాలని సిఫారసు చేసినట్లు కూడా విద్యా కమిషన్లు చేయడం లేదు. కారణం, కమిటీ సభ్యులందరూ ప్రభుత్వ అనుకూలురే కావడం! వీరంతా అస్పష్ట పదజాలాన్ని వాడుతూ- ‘అలా చేయవచ్చు, ఇలా చూడవచ్చు’ అంటూ ప్రభుత్వానికి అనుకూల నివేదికల్ని ఇవ్వడం జరుగుతోంది. 1993లో యశ్‌పాల్ నివేదిక తర్వాత జనబాహుళ్య నివేదికలు నేటివరకూ ఒక్కటి కూడా రాలేదు. వచ్చిన నివేదికలన్నీ ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థల ఆదేశాల్నే నివేదికలో పేర్కొన్నాయి. అందుకే ఉన్నత విద్యారంగం నిస్సత్తువగా మారి, వ్యాపారీకరణకు గురై కనీస ప్రమాణాలు లేకుండా దిగజారింది. ప్రపంచ స్థాయి 300 విశ్వవిద్యాలయాల్లో మన దేశం విద్యాలయం ఒక్కటి కూడా లెక్కలోకి రాలేదు.
ఇక ఈ కమిటీలకు ఎంపిక అయినవారంతా నిష్ణాతులని, ఆయా రంగాల్లో ఆరితేరారని, విద్యారంగం దశను తూర్పు నుంచి పడమరకు మార్చేస్తారని, ఇక నుంచి సూర్యుడు పడమరకే ఉదయిస్తాడన్నా చందంగా ప్రచారాన్ని సాగిస్తారు. బాధాకర విషయమేమిటంటే ముదిలియార్ కమిషన్ నుంచి రామ్మూర్తి కమిషన్ దాకా ఏ ఒక్కరూ కూడా పాఠశాల విద్యతో, తరగతి గదితో సంబంధం లేని వారే! వీరిలో కొంతమంది విశ్వవిద్యాలయ స్థాయిలో పనిచేసిన వారైతే, మరికొందరు ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లు కావడం గమనార్హం! వీరు నిజాయితీపరులు, కొన్ని విషయాల్లో నిష్ణాతులు కావచ్చుగాని ఆరితేరిన పెడాగాజిస్టులు మాత్రం కారు. చాలా నివేదికలు పూర్వ ప్రాథమిక విద్య నుంచి మొదలుకొని, విశ్వవిద్యాలయ స్థాయి విద్యదాకా ఒకే నివేదికలో పొందుపర్చడం జరిగింది. ఈ విధంగా విద్యారంగాన్ని ఒకే గాటిన చూడడంతో, నిర్వహణ ఆర్థిక అంశాలు భారంగా కనపడుతున్నాయి. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖలు మోకాలడ్డడం జరుగుతోంది. పాలకులకు, విద్యా మంత్రిత్వ శాఖాధిపతులకు కూడా పాఠశాల విద్యపట్ల కనీస అవగాహన లేకపోవడం కొట్టచ్చే లోపం. దీంతో ఏ నివేదిక కూడా తరగతిని, సమస్యల్ని, ఉపాధ్యాయ సాధికారతను ప్రతిబింబించ లేకపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులుగా వందల సంఖ్యలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పురస్కారాల్ని అందుకున్నప్పటికీ, వారిలో ఏ ఒక్క ఉపాధ్యాయుణ్ణి ఓ కమిటీలో సభ్యునిగా వేయని దీనస్థితి ఉంది. ఈ అవార్డు గ్రహీతలంతా నిష్ణాతులని భావిస్తే కమిటీలో స్థానం కల్పిస్తే విద్యారంగ వౌలిక సమస్యలు నిజంగా బయటకు వస్తాయి. పైగా పురస్కారాలు పొందిన వారెవరికీ విద్యారంగ దీనావస్థ పట్టడం లేదు. దీనికి తగ్గట్టుగా భారతీయ సామాజిక వ్యవస్థ దేనినీ తీవ్రంగా పరిగణించదు. కాబట్టే పాలకుల మాటలు, చేష్టలు ఎల్లవేళలా చెల్లుబాటు అవుతున్నాయి. పైగా ఈ నాయకులకు ప్రజల ఉడతాభక్తే మెండు. ఏనాడూ ఎన్నికల హామీలు ఈ దేశంలో తిరిగి ప్రస్తావనకు రావు. పైగా అన్నవన్ని సాధ్యమా? అని జనాలే వత్తాసు పలుకుతూ ఉంటారు. ఇలా రాజీపడడం భారతీయుల రక్తంలో భాగమైంది.
ఇంతకీ సుబ్రహ్మణ్యం కమిటీ తవ్వి తీసిందేంటో, సిఫారసు చేసిందేంటో చూస్తే ‘ఓహో!’ అనిపిస్తుంది. మొత్తంగా ఉన్న అయిదు అధ్యాయాల్లో మొదటి మూడు అధ్యాయాలు ఉపోద్ఘాతం, విద్యా వవస్థలోని లోపాలు, విజన్, మిషన్, విద్యారంగం లక్ష్యాలు, ఆశయాల వివరణకు పరిమితం కాగా, చివరి అధ్యాయం ఆచారణాత్మక పర్యవేక్షణకు కేటాయించారు. ఇక నాలుగో అధ్యాయంలో మాత్రమే పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య, పరిశోధన, ఉపాధ్యాయ విద్యలతో ఉన్నత విద్య, అంతర్జాతీయకరణ అనే ఓ కొత్త అంశాన్ని పొందుపర్చడం జరిగింది. ప్రారంభంలోనే పాత నివేదికల్లో మిగిలిపోయిన అంశాల్ని పూర్తిచేయాలని, వర్తమాన సవాళ్ళను ఎదుర్కొనే విధంగా నూతన విద్యా విధాన రూపకల్పన జరగాలని ప్రస్తావించడం గమనార్హం!
ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన వుండాలంటూనే ఆంగ్ల ప్రాధాన్యతను ఎత్తి చూపడం జరిగింది. గిరిజనుల పిల్లలకు ప్రాంతీయ భాషతోపాటు విభిన్న భాషల విధానంతో బోధన జరగాలని సూచించారే గాని, వారి మాతృభాషలో బోధన చేయాలనే సూచన చేయలేకపోయారు. కొఠారీ కమిషన్ ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తిరిగి ప్రస్తావించడంలో ఔన్నత్యమేంటో తెలియలేదు. అదనంగా సంస్కృత ప్రాధాన్యతను గుర్తు చేయడం గమనించాలి. విద్యా హక్కు చట్టంలోని 12(1) (సి)ని ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు కూడా వర్తింప చేయాలని, సూచించడం ప్రైవేటీకరణను ప్రోత్సహించడానికే అవుతుంది. ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను బలహీన వర్గాల పిల్లలకు ఇవ్వాలన్న సూచననే తప్పుపట్టాల్సింది పోయి, ఎయిడెడ్ పాఠశాలలకు కూడా వర్తింప చేయాలనడం శోచనీయం. ఇదంతా ప్రభుత్వ రంగ విద్య ఉనికికే ప్రమాదకరమని కమిటీ గుర్తించ లేకపోయింది. ఇక పాఠశాలలకు కళాశాలల్లాగా ఎక్రిడిటేషన్ ఇవ్వాలనేది ఓ కొత్త సూచన కాగా, ప్రతి మూడు సంవత్సరాల కొకసారి ఉపాధ్యాయులకు ఇన్‌సర్వీస్ శిక్షణ ఇవ్వాలని, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉపాధ్యాయ విషయ, వృత్తి నైపుణ్యత పరీక్షల్ని నిర్వహించి వారి శక్తి సామర్థ్యాల్ని అంచనా వేసి ప్రమోషన్లను, ఇంక్రింమెంట్లను ఇవ్వాలనేది మరో సూచన. దీన్ని ప్రైవేటు స్కూళ్ళకు కూడా వర్తింప చేయాలనడం గమనార్హం! అలాగే ఉపాధ్యాయుల హాజరును సెల్‌ఫోన్ల ద్వారా, బయోమెట్రిక్ ద్వారా నియంత్రించాలని కోరడం జరిగింది. ప్రాంతీయ విద్యా కళాశాలల్ని విశ్వవిద్యాలయాలుగా మార్చాలంటూనే, ఓ స్వతంత్ర ఉపాధ్యాయ నియామక కమిషన్ ఆధ్వర్యంలో పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయుల ఎంపిక చేయాలనే సూచన అస్పష్టంగా వుండడం గమనించదగ్గ అంశం.
ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల్ని నేరుగా నియామకం చేస్తుండగా, డిఎస్సీ లాంటి ప్రక్రియతో ఎంపిక చేసే విధానం మరికొన్ని రాష్ట్రాల్లో వుంది. బోధనాపరమైన నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం ఉపాధ్యాయుల్లో కనీస స్థాయిలో లేవని భావించిన జాతీయ ఉపాధ్యాయ సంస్థ (ఎఐసిటిఇ) ఓ అర్హత పరీక్ష నిర్వహించి నియామకాలను చేయాలని ఆయా రాష్ట్రాలకు 2010లో సూచిస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్పీకి తోడు టెట్‌ను కూడా ప్రవేశపెట్టడం అనవసరమని, ఈ కమిటీ గుర్తించ లేకపోయింది. పైగా నియామకం ఏ విధంగా వుండాలనే విషయంలో స్పష్టత కొరవడింది. మెరిట్ ఆధారంగా అన్నప్పుడు, డిగ్రీకి తోడు శిక్షణ అనే అర్థమే వస్తుంది. నిజానికిది ఓ ఆరోగ్యకరమైన విధానం. కాలయాపన లేకుండా, ఉపాధ్యాయ ఖాళీలను వెనువెంటనే భర్తీ చేసినపుడు పాఠశాలలు సాఫీగా జరుగుతాయి. డిఎస్సీలను, టెట్‌లను అడ్డుపెట్టుకుని గత ఐదు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో నియామకాలు లేకపోవడంతో పాఠశాల విద్య కుంటుపడింది. దీంతో విద్యార్థులు రాకపోవడం, విద్యార్థులు లేరని బడులను మూసివేయడం ప్రభుత్వ విధానంగా మారిపోయింది. ఉపాధ్యాయుల గైర్హాజరుపై నియంత్రణ పాఠశాల యాజమాన్య కమిటీలకు అప్ప జెప్పాలనే సూచన మరొకటి.
ఐదో తరగతి నుంచి డిజిటల్ క్లాసుల్ని, ఆరో తరగతి నుంచి ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని (ఐసిటి)ని ప్రవేశపెట్టాలనే ఒకటి రెండు సూచనలు తప్ప ప్రతిపాదించిన 21 అంశాల్లో కొత్తవేమి లేకపోగా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలేవి సుబ్రహ్మణ్యం కమిటీలో లేవు. అయినా నివేదికను పక్కనపెట్టిన ప్రభుత్వం జరిగిన నష్టానికి జవాబుదారీతనం వహిస్తుందా..? ఏనాటికీ అది జరగని పని. అలాంటప్పుడు ఇలాంటి కమిషన్లను వేయడం ఎందుకు? ఏదో చేస్తున్నామనే భ్రమల్ని కలిగించడానికే తప్ప మరొకటి కాదు.
*

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162